అథాది మూర్త్యాది పూజావిధి కథనము
నారద ఉవాచ
విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్య కామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌనము అవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తిక్ ఆసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు “యం” బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకల కల్మషములను శోషింప చేయవలెను.
హృదయపద్మమధ్యము నందువున్న తేజోనిధి యగు “క్షౌం” అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను.
ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయ వలెను. దాని నుండి స్రవించు చున్నదియు, సుఘమ్నా నాడి ద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృత ధారల చేత తన దేహమును నింపవలెను.
శోధనముచేసి తత్త్వనానము చేయవలెను. పిమ్మట కర శుద్ధి కొరకు అస్త్ర వ్యాపక ముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠము నుండి కరతలమువరకు న్యాసము చేయవలెను. దేహము నందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ, వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుకభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయ వలెనుముద్ర నిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశత జపము చేసి పూజింప వలెను.
జల కుంభమును ఎడమ వైపునను, పూజా ద్రవ్యములను కుడి వైపునను ఉంచ వలెను.అస్త్రముచే ప్రక్షాళన చేసి గంధ పుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. సర్వ వ్యాప్తము, జ్యోతి స్వరూపము అయిన చైతన్యములను “అస్త్రాయ ఫట్” అని అభి మంత్రించిన, ఉదరముచే యోగ బీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాది యోగ పీఠము నందు ధర్మమును.వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయ దిక్కు మొదలైన వాటిని, అధర్మము మొదలగు అంగములకు, పీఠము నందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసర స్థానమునందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్య నున్న దుద్దుయందున్న గ్రహణములను ముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనముచేసి అర్చించ వలెను. వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, అలంకార, గంధ, పుష్ప, ధూప,దీప, నైవేద్యము లను సమర్పింప వలెను. పూర్వాది దిక్కులందు అంగ దేవతలను పూజించ వలెను.తూర్పు, పడమర దిక్కులందు గరుత్మంతుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమ వైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమ వైపున అంబుల పొదులను, కుడి వైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచ వలెను. కుడి వైపునఅగ్ర భాగమున పుష్టిని ఉంచవలెను.
వన మాలను, శ్రీవత్సమును, కౌస్తుభమును కూడ ఉంచ వలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగ దేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించ వలెను. విష్ణు పూజ పూర్తియైన పిమ్మట అంగ దేవతలను వ్యస్త రూపమునను, నమస్తరూపమునను బీజాక్షర యుక్త మంత్రములతో పూజింప వలెను. జపించి, ప్రదక్షిణము చేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి “నేనే బ్రహ్మను, నేనే హరిని” అని ధ్యానము చేసి హృదయము నందు ఉంచుకొన వలెను.
అవాహనము చేయునపుడు ’’అగచ్ఛ’’ అనియు, ఉద్వాసనము చెప్పు నపుడు ‘’క్షమస్వ’’ అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును.
ఇంత వరకును ఏక మూర్త్యర్చనము చెప్ప బడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. అంగుష్ఠ ద్వయమునందును తర్జన్యాదు లందును వాసుదేవుని, బలాదులనున్యాసము చేయ వలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటి యందున్యాసము చేసి మధ్య యందు పూర్వాదిక పూజా చేయ వలెను. ఏక పీఠముపై. క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుకటి వలెనే పూజించ వలెను. నవాబ్జములందు నవ మూర్తులను ఆవాహనము చేసి నవ వ్యూహ పూజ వెనుకటి వలెనే చేయ వలెను. పద్మ మధ్యమునందు వాటియందున్న దేవతను, వాసుదేవుని పూజించ వలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹