రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష
“ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతనీ తన త్రైలోక్యాధిపత్యాన్నీ లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం వుండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామనీ బలిపశువు కోసం అతనిని యాచించడానికి వచ్చామనీ బలాసురుని బతిమాలుకున్నారు.
అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు “నువ్వే కావాలి” అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు.
బలాసురుని బలిదానం ఉత్తినేపోలేదు. లోకకల్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటక సంహారం, కాలుష్య నివారణం, నగరశాంతి వంటి లోకమంగళకర కార్యాలు జరుగుతాయి కదా, అలాంటిది ఇంద్రాదులంతటివారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితముంటుందా! ఒక లోకకల్యాణమేమి, త్రైలోక్య కల్యాణమే జరిగినది.
బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణతి చెందినది. సత్త్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములూ రత్నబీజములై ప్రపంచమునే సంపన్నము గావించినవి.
దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు, ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశమార్గంలో గొనిపో సాగినారు. యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి అక్కడక్కడ పడినది.
సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచమాత్రమైనా (అత్యల్పపరిమాణం) ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో, అక్కడక్కడ, రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికితీయబడిన రత్నాలకూ(వజ్రాలకూ) అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది.
రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్పటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి.
జ్ఞానపు ఆవలి ఒడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ రత్నాలకు ఆయా పేర్లను వాటి వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు.
ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలను అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా వుంటే అశుభాలు కలుగుతాయి..
ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించినవారికే గాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడ దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చేయాలి.
ఐశ్వర్యాన్ని కోరుకొనేవారు గాని ఇతరులు గాని బాగా పరీక్ష చేయబడిన, అత్యంత శుద్ధమైనవిగా ధ్రువీకరింపబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి వుంచాలి. కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి..
ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వ ప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి.
బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌవీర అను పేర్లు గల ఎనిమిది భూభాగాలు వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.
హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ వేణుకాతటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేతకాంతులలోనూ, సౌవీర దేశంలో లభిస్తున్నవి. నీలకమల, కృష్ణమేఘ వర్ణంలోనూ, సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్రవర్ణంలోనూ, కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగులను విరజిమ్ముతూ వుంటాయి.
ఈ కోవలోనే చెప్పుకోతగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపు పచ్చ కాగా పుండ్ర దేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ వుంటాయి.
ఒక కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం. జరుగుతుంది. అత్యంత క్షుద్ర వర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తుంటుంది గాని అది ఏ రంగో తెలియనంత లేత రంగు తొలి లక్షణం.
ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ, బిందు మాత్రం నలుపు” కాక పదక, త్రాసదోషరాహిత్యం, పరమాణువంత తీక్షమైన ధార ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి.
వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో వుంది. ఆకుపచ్చ తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్టితులై వుంటారు.
ఏయే వర్ణాల వారికేయే రంగుల వజ్రాలు (ధరించుటకు) ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద, లేదా స్ఫటిక సమానశుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం. క్షత్రియులు శశ (చంద్ర) వర్ణం లేదా బభ్రు భూర వర్ణాలు లేదా కనుపాపల రంగులో నుండు వజ్రాలను ధరించడం మంచిది.
వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో వున్న వజ్రాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో నున్న వజ్రాలు శ్రేష్ఠం.
విద్వాంసులు రాజులకు ముఖ్యంగా రెండు రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమనీ ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవనీ చెప్తారు. జవావర్ణం (ఎరుపులో ఒక రకం, పగడ సమానరక్తవర్ణం కలిపి వున్న వజ్రం లేదా మామిడిపండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం.
వర్ణసాంకర్యం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు. పైగా దుఃఖదాయిని. రంగును చూసి అంతమాత్రాననే తృప్తిపడిపోయి రత్న సంచయాన్ని చేయరాదు.
అంటే ఆబగా ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హానిని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికీ అందులోని వ్యక్తుల వంటికీ ఆరోగ్యాన్నీ ధనాన్నీ తేగలవు. వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులుగాని, కొమ్ముల వద్ద విరుగుగానీ, బీటలుగాని లేకుండా వుంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకొని తదుపరి గుణాలను పరీక్షించాలి..
కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి.అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడు చూసినా వుండాలి. మరకలుండకూడదు. ఒకవైపు గాని, మొనల్లో గాని దెబ్బతిని పోయి, పొడిరాలుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం మృత్యువు నోట పడిపోతాడు. మధ్యలో బిందు చిహ్నాలు, నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు.
ఖానిక అనగా గని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశకోణ, షట్పార్శ్య, పార్శ్వ, ద్వాదశపార్శ్వ, షడ్డారా, అష్టధారా, ద్వాదశధారా, ఉత్తుంగ, సమ, తీక్షాగ్ర వంటి గుణాలు వజ్రాల సహజగుణాలు.
షట్కోణ విశుద్ధ, నిర్మల, తీక్ష ధారగల, లఘు, సుందర పార్శ్వ భాగములున్న నిర్దోష (నిర్దుష్టమైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రమొకటి అంతరిక్షంలో నున్నదని, అది సర్వోత్కృష్టమని దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు తీక్ష, నిర్మల, దోషశూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవనపర్యంతమూ ప్రతిదినమూ స్త్రీతో భోగించగలడు;
సంపద, పుత్ర, ధన ధాన్య, పశుసంపదలు నిత్యం వృద్ధి చెందుతుండగా బహుకాలం సుఖంగా జీవిస్తాడు. వానిపై ఎవరైనా సర్ప, విష, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది ఆయుధాలను పంపినా, అభిచారమంత్రోచ్చాటనాది ప్రయోగాలను చేసినా అవి వానిని చూసి దూరం నుండే పారిపోతాయి. వానినేమీ చేయలేవు. కొన్ని ప్రత్యాగమితాలై పోతాయి. అంటే ప్రయోగించిన వాని పని పడతాయి.
ఏ దోషమూ లేకుండా, ఇరవై బియ్యపుగింజల బరువుండే వజ్రం మిగతా వజ్రాల కంటె రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులంటారు. ఆ పరిమాణం, మూడోవంతు, సగభాగం, నాలుగోవంతు, పదమూడవ వంతు, ముప్పదవ, అరువదవ, నూరవ, వెయ్యవ వంతున్న వజ్రాలు అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారమున్న వజ్రాలు కూడా వుంటాయి.
వాటి విలువ వాటి బరువును బట్టే వుంటుంది. ఇక్కడ బియ్యపుగింజ కూడా ప్రత్యేకమైనది వుంటుంది. దాని బరువు ఎనిమిది ఎఱ్ఱ ఆవగింజల బరువుతో సమానమై వుండాలి..
ఏ దోషము లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు, పైగా ఈతకొడుతున్నట్లుగా తేలుతూ ఆడుతుంది. అది రత్నాలన్నిటిలో సర్వశ్రేష్టము. దానిని ధరించుట శుభకరము.
దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంటుంది. వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి. రాజు వాటిని వెంటనే ధరించడం మానివేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదు కానీ ఆ వజ్రానికున్న శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి మంచిది కాదు.
పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్న శాస్త్రపారంగతుని మాత్రమే కాక తనకు అలవాటైన జాతకరత్నను కూడా సంప్రదించి ఆ పని చేయాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే దోషము. ఇక దాని వలన మంచి జరగాలనుకోవడం మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే.
వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలెక్కువ. కాబట్టి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరమౌతుంది. నకిలీలు ఎక్కువ మెరుపును కలిగి వుంటాయి. కాని ఆ మెరుపు ఎంతో కాలముండదు కాని అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది.
క్షారద్రవ్యం ద్వారా, శాస్త్రోల్లేఖిత పద్ధతుల ద్వారా, శాణ ప్రయోగంతో వజ్రాలను పరీక్షించాలి. ఈ భూమిపై నున్న అన్ని రత్నాలపై లోహాది ఇతర ధాతువులపై వజ్రం గీత పెట్టగలదు.
కాని వజ్రంపై గీతను పెట్టడం దేనికీ సాధ్యం కాదు, ఒక్క వజ్రానికి తప్ప పుష్ప రాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు.
కాని హీరకము, కురువిందము (మాణిక్యం) తమ జాతి రత్నాలనే గీయగలవు.
వజ్రాన్ని వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైపైకి అనగా ఆకాశదిశగా ప్రసరింపజేసే శక్తి వుంటుంది.
ఇంద్రాయుధ చిహ్నాంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా వుంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే… కోణాల వద్ద విరిగినా, బిందు, రేఖా చిహ్నదూషితాలైనా తమ శ్రేష్టతను పూజ్యతను నిలబెట్టుకొనే వుంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరుగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి.
మెరుపుతీగలలోని కాంతితో సముజ్జ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేకవీరుడై విలసిల్లగలదు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలముపాటు పుడమి నేలగలడు..
యాబయ్యవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹