అథ వాసుదేవాది మంత్ర ప్రదర్శనము
నారద ఉవాచ
పూజ్యములైన వాసుదేవాది మంత్రముల లక్షణము చెప్పెదను. ఆది యందు “నమో భగవతే” అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి ఓంకారము ఆది యందు కలవి, ‘‘నమః’’ అనునది అంతమందు కలవి అయిన ‘‘వాసుదేవ’’, ‘’సంకర్షణ’’, ‘‘ప్రద్యుమ్న’’, ‘’అనిరుద్ధ’’ అను పదములచే “ఓం నమోభగవతే వాసుదేవాయ”, “ఓం నమో భగవతే సంకర్షణాయ”, “ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ”, “ఓం నమో భగవతే అనిరుద్దాయ” అను మంత్రములేర్పడును, పిమ్మట “ఓం నమో నారాయణాయ” అను మంత్రము.
“ఓం తత్సద్బ్రహ్మణే నమః”, “ఓం నమో విష్ణవే నమః”, “ఓం క్షౌ ఓం నమో భగవతే నరసింహాయ నమః”, “ఓం భూర్భగవతే వరాహాయ నమః” (ఇవి మంత్రములు). జపా పుష్పము వలె అరుణమైన రంగు పుసుపు వంటి రంగునీల, శ్యామల, లోహిత వర్ణములు, మేఘ,అగ్ని, మధువుల వంటి రంగులు, పింగ వర్ణముగల తొమ్మండుగురు నరాధిపులు వీటికి నాయకులు, తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వర రూపము లైన బీజాక్షరములకు ఆయా మంత్రములందలి నామములను చివర చేర్చి హృదయాద్యంగములను కల్పించ వలెను. వ్యంజనాదిబీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును.
‘‘నమః’’ అనునది అంతమునందు గల మంత్రముల మధ్య దీర్ఘస్వరములతో గూడియున్న వ్యంజనములు అంగములనియు, హ్రస్వ స్వరములతో కూడినవి ఉపాంగములనియు చెప్పబడును.
దీర్ఘ హ్రస్వములతో కూడినదియు, సాంగోపాంగ స్వరములతోకూడి నదియు, విభజింపబడిన నామాక్షరముల అంతము నందు ఉన్నదియు అగు బీజక్షరము ఉత్తమమైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమమిది, తన నామము అంతము నందు గల అంగ నామములచే విభక్తములై స్వబీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను.
హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును బీజముల అంగములు, హృదయము, శిరస్సు, శిఖ, హస్తములు, నేత్రములు, ఉదరము, పృష్ఠ భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు, పిక్కలు, పాదములుఈ పండ్రెండును మూలమునకు అంగములు, క్రమముగా వీటి అన్నింటిపై న్యాసము చేయ వలెను.
“కం టం పం శం వైనతేయాయ సమః”, “ఖం ఠం ఫం, షంగదానుజాయ నమః”, “గం డం బం సం పుష్టి మన్త్రాయ నమః”, “ఘం ఢం భం హం శ్రియై నమః”, “వం శం మం క్షం పాఞ్చజన్యాయ నమః”, “ఛం తం పం కౌస్తుభాయ నమః”, “జం ఖం వం సుదర్శనాయ నమః”, “సం వం దం చం లం శ్రీవత్సాయ నమః.”
“ఓం ధం వం వనమాలయైన నమః”, “మహానన్తాయ నమః”, బీజరహితము లైన పదములు గల మంత్రములకు పదముల చేతనే అంగములను కల్పింప వలెను.
నామ సంయుక్తములును, జత్యంతములును అగు పదములచే హృదయాది పంచక న్యాసమునుచేయ వలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి.
ముందుగా ప్రణవముచే హృదయమును, ‘’పరాయ’’ అని శిరస్సును, పేరుతో శిఖను, ఆత్మచేత కవచమును, నామాస్తముతో అస్త్రమును విన్యసించవలెను.
ఓంకారము ఆది యందు గల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలెను. ఏక వ్యూహము మొదలు ఇరువది ఆరవ వ్యూహము వరకును ఇది సమానము.
కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్యత్మా ద్విరూపము. “ఓం పరాయాగ్న్యత్మనే నమః” ఇది వ్యాపక మంత్రము. వసు, అర్క, అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసము చేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యందును, సవ్యా పసవ్య హస్తముల యందును, హృదయము నందును, మూర్తి యందును, తుర్యరూపమగు త్రివ్యూహమైన తనువు నందును వాయ్వర్కులను విన్యసించ వలెను.
వ్యాపకమైన ఋగ్వేదమును హస్తము నందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అర చేతులలో అథర్వమును శిరో హృదయ చరణముల యందు సామ వేదమును పంచ వ్యూహము నందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహమునందును అంగుళీ, శిరో, హృదయ, గుహ్య,పాదము లందును వాయ్వాదికమును పూర్వము చెప్పినట్లు న్యసించ వలెను.
వాయువు, అగ్ని, జలము, భూమి(ఆకాశము) వీటి సముదాయము పంచ వ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ,ఘ్రాణము వీటి సముదాయము షడ్వ్యూహము.
వ్యాపకమైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదు లందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్య ప్రదేశము, పాదములు, వీటి యందును న్యాసము చేయ వలెను. ఇది “పరమాత్మక వ్యూహ న్యాసము”. ఆది మూర్తి అగు జీవుడు సర్వ వ్యాపకుడు.
భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరము నందును, దేహమునందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను.
ఏడవది తలములందుండును. లోకేశుడైన దేవుడు దేహము నందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు వీటి యందు ఉండును.
అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్త రూపములు కలది.
ధీ, అహంకారము, మనస్సు, శబ్ధము, స్పర్శ, రూప, రసములు, గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరము నందును, దేహము నందును విన్యసించ వలెను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, సుఖము, హృదయము, నాభి, గుహ్య ప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్ట వ్యూహుడని చెప్ప బడినాడు.
జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్ధము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు నవాత్మకుడు. అంగష్ఠ ద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జని మొదలు వామప్రదేశిని వరకును విన్యసించ వలెను. దహముపై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను. దశాత్మకుడగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగష్ఠద్వయము నందును, తర్జన్యాదుల యందును, శిరోలలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదము లందును విన్యసించ వలెను. మనః శ్రోత్ర, చక్షుర్, జిహ్వా, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ రూపమున ఏకాదశాత్మరుడగు ఈ జీవుని శ్రోత్రము నందను, అంగుష్ఠ ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటి యందును, మిగిలిన తలద్వయము నందును విన్యసించ వలెను.మనస్సు వ్యాపకము. అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా(పిక్కలు) గుల్ఫ (చీల మండలు), పాదములపై విన్యసించవలెను.
విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందునిఅని ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్ఠాదు లందును, తలాదు లందును, పాదము నందును, జానువునందను, కటి యందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, పాదము మొదలైన వాటి యందును విన్యసించ వలెను. పంచవింశ వ్యూహములుకలవాడును, షడ్వింశ వ్యూహములు కలవాడును, ఎట్లనగా,
పురుష, ధీ,అహంకార, మనః, చిత్త, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా,నాసికా, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, భూ, జల, తేజన్, వాయు, అకాశములు పంచవింశతి వ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్ఠాదులందు, మిగిలిన వాటిని హస్తతలమునందును విన్యసించ వలెను. పిమ్మటశిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు వీటిపై క్రమముగా విన్యసించ వలెను. షడ్వింశ వ్యూహము నందు పురుషాత్మకు ముందు పర రూపము ఉండును. మిగిలిన దంతయు వెనుక చెప్పినట్లే.
పండితుడు ఒక మండలముపై ప్రకృతిని ధ్యానించి పూజింప వలెను. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశలందు హృదయాదులను పూజింప వలెను. అగ్య్నాది కోణము లందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వము నందు వలెనే పూజింప వలెను. త్రివ్యూహము నందు అగ్ని మధ్యమందుండును. పూర్వాది దిక్కులందు దలము లందున్న దేవతలలో కూడా రాజ్యాద్య లంకృతుడైకమల కర్ణిక యందు నభో రూపుడగు, మానస్మాత (అంతరాత్మ) ఉండును.
ఈ విధముగా సర్వ వ్యూహములతోను, గరుడాది పంచాంగములతోను, ఇంద్రాదుల తోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్య జయము కొరకును పూజింప వలెను.సమస్త కామములను పొందును. ఆకాశము నందున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతోపూజించ వలెను.
అగ్ని మహాపురాణములో వాసుదేవాది మంత్ర ప్రదర్శనరూపమగు ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹