Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – యాబై ఒకటవ అధ్యాయం

ముత్యాలు – వాటిలో రకాలు లక్షణాలు- పరీక్షణ విధి

శ్రేష్ఠమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు – వీటన్నిటి నుండీ ముత్యాలు వస్తాయి. అయినా శుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ ప్రసిద్ధాలు.

రత్నమనిపించుకొనే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికి ఉంటుందని ముక్తాశాస్త్రం వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనే పుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు.

వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్ననిర్ణాయక విద్వాంసులు ఎనిమిది రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు.

శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే వుండి బృహల్లోల ఫలం పరిమాణంలో వుంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపు రంగులో వుంటుంది. వీటి ప్రభావం ఏమీ వుండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే వుంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం.

వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే వుంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము.

వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్ళలాగ స్వచ్ఛ సముజ్జ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా వుంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్య, జనులను సేవించుకోవడానికి వారున్న చోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు.

సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో వుంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అదీ అత్యున్నత జాతి నాగుల వద్దనే. దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి వుంటుంది.

దీనిని ధరించేవాడు. అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియై తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు.

ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యంవుంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి, ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు.

మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. భేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవఱకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది.

సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికీ సమస్త శుభదాయకం. ఈ మణి వున్న చోటి నుండి నలుదిక్కులూ సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్ధమూ జరగదు.

దైత్యరాజు, మహాదాని బలాసురుని ముఖము నుండి రాలిన దంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే గాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు, రత్నగర్భయైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్ననిధానము.

అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన శుక్తులలో ఈ పలువరుస వంశాభివృద్ధి జరుగుతోంది.

ఈ ముత్యాలే సర్వశ్రేష్ఠములై మానవజాతిని సముద్ధరిస్తున్నవి. సాగర తీర దేశాలు, ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పాఠశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు (ఖజానాలు)గా పరిణతిచెందాయి.

ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ ఒక వేయీ మూడు వందల అయిదు ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో అయిదింట రెండవ భాగము (2/5) తక్కువ. మూడు మాశలు అధికంగా బరువుండే ముత్యము. రెండువేల ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు.

(ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువు గాని సూతుడు గాని చెప్పినది కాదు) పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో వున్న చిప్ప నుండి వచ్చిన ముత్యం పదమూడు వందల బంగారు కాసులు (సావెరిన్ల) ధర పలుకుతుంది. ఆరు బియ్యపు గింజల బరువున్నది. 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది, తొమ్మిది గింజల బరువున్న ముత్యం ధర రెండు వేల కాసులుంటుంది.

రెండున్నర గింజల బరువున్నది 1300 కాసులు, రెండు గింజల బరువున్నది 800 కాసులు విలువ చేస్తాయి. అరగింజ బరువే వుండి మూడువందల కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా వున్నాయి.

ఉత్తమస్థాయికి చెంది, 720 మిల్లిగ్రాముల బరువుండే ముత్యం వెల రెండు వందల కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ట ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లి గ్రాములు వెల 110 కాసులు. భావకమను పేరు గల ముత్యం 35 మిల్లిగ్రాములు, ధర 97 కాసులు. శిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి పాతిక మిల్లిగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లిగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్యా అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లిగ్రాముల బరువుండి తొమ్మిది లేదా పదకొండు కాసుల ధర పలుకుతుంది.

(కాసులనగా బంగారు కాసులైన సావెరిన్లే) విశుద్ధత కోసం ముత్యాలను సాధారణ అన్నపుకుండలలో జంబీర రసం నింపి, అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు.

దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్య పుట పాకమును జోడించి, అందులో ముత్యాలను ఉడికించాలి.

తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలో గాని నీటిలో గాని, మధు రసంలోగాని వేసి మరల వేడి చేస్తే అవి నున్నగా, మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది.

అపుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్నీ గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసేదాని కన్న నెక్కువగా వీటిని చేయాలి.(పాలిష్) వాటి మెరుపు రెండింతలు మూడింతలుగా పెరుగుతుంది. దోషాలన్నీ పోయి, గుణవంతమై సహజంగానే వుండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు, దయా మయుడు, లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు.

ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభ, సిద్ధి కారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవశరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్ఛమైన గాజులాగా మెరుస్తుంటుంది. స్వర్ణజటితమై వుంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగునూ అందాన్నీ శోభన ప్రతిపత్తినీ ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహళీయులదే సింహభాగం.

ఏదేనా ఒక ముత్యం మీద అనుమానము వస్తే దానిని స్నేహద్రవం (ముత్యానికి హాని చేయనిది) వేడిచేసి, దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటుచేసి తీసి చూస్తే ఆ ముత్య మాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచిముత్యమే.

ఇదివఱకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై, తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా వుండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం వచిస్తోంది. ముత్యం అమ్ముడు పోయినా, పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు కలుగుతూనే వుంటాయి.

సర్వసులక్షణ లక్షిత జాతయైన ముత్యము ఒక మారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనీయదు, బాధపడనివ్వదు, అనర్ధోత్పాదక శక్తులనతని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనివ్వదు. ఇదీ మంచి ముత్యము యొక్క మాహాత్మ్యము.

యాబై ఒకటవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment