Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – యాబై రెండవ అధ్యాయం

పద్మరాగమణి – లక్షణాలు

పరీక్షావ మహాకాలదేవతల పాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధిపతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది.

రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరు గాంచాయి.

నారీరత్న సంచయ సంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా! ఆ నది యొక్క రెండు తటాలూ పోకచెట్లతో సుశోభాత్ శోభితాలై వుంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు.

అందులో బలాసురుని రుధిర గతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతిరాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకీ వెలుపలి నుండి నదిలోకి పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు.

ఇవి సౌగంధికాలు కూడ. వీటిలో కురువిందజ రత్నాల, స్ఫటిక రత్నాల ఉత్తమ, ప్రధాన గుణాలన్నీ వుంటాయి. వాటి స్వరూపం ఎఱ్ఱటి మెరుపుతో బంధూకపుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబహుటి కీటవర్ణాలు, పలాశ పుష్పవర్ణం – ఇలా లేతగా కనీ కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎఱ్ఱని నీడలలోనూ అనగా చాయలలోనూ వుంటుంది.

సిందూరం, నీలోత్పలం, రక్త కమలం, కుంకుమపూవు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం వుంటుంది. ఎంత చిక్కటి రంగులో నున్నా కాంతులు వెదజల్లుతూ వుంటుంది.

స్ఫటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్య కిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకు తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికింపు గొలుపుతాయి.

కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక, కంటకారి పుష్ప సమానకాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్టు పూలరంగులో కొన్ని కళకళలాడగా, మరికొన్ని చకోర, పుంస్కోకిల, సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తుంటాయి.

మొత్తానికి స్ఫటికోద్భూత పద్మ రాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే వుంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే వుంటాయి. సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీలకమలాల రంగులోనూ. ఎఱ్ఱ కలువల వర్ణంలోనూ వుంటాయి.

కురువిందాల నుండి వచ్చిన వాటికి స్పటి కోద్భూత పద్మరాగాలంత కాంతి వుండదు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపల్లోపలే వుంటుంది. అయినా ఆ రేఖా మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే. మనుజులను మైమరపించ గలుగుతోంది.

వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త – ఇవన్నీ శ్రేష్టమణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిపొడిగానూ, పరుషం గానూ, అక్కడక్కడ కన్నాలు పడి, వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో వుంటే అవి దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి.

అన్ని సద్గుణాలూ అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయునపుడు కలాశపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జాజ్వల్యమానా లైనప్పటికీ రావణగంగోత్పన్న పద్మరాగాలకంటే, తలవెంట్రుకవాసైనా, వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి.

మలినవర్ణం వల్ల కలశపుర పద్మరాగాలు, అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణ వర్ణపు కలిమిచే సింహళోత్పన్నాలూ, నీలవర్ణ, కాంతి విహీనతా వ్యాజానముక్త పాణి శ్రీ పూర్ణకీయ పద్మరాగాలూ స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి.

వెలితి లేని ఎఱ్ఱదనం అంటే గుంజబీజం (గురిగింజ)తో సమానమైన రంగుండే పద్మ రాగం అత్యుత్తమం. ఇది మెత్తగా వున్నట్లు చేతికి తగిలినపుడు అనిపిస్తుంది. కాని నొక్కి చూస్తే చాలా గట్టిగా వుంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒక వైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ళ మధ్య పెట్టుకొని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది.

రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవఱకు కోల్పోవచ్చు. చేతబట్టుకొని పైకెగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే కాని వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి. సాన కూడా పట్టించి. చూడాలి.

ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించినవాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వానిని రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితులు మధ్యలోనున్న వాడు కూడా ఆపదల పాలౌతాడు.

ఒకచోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి వుంటాయనుకోరాదు. పోలికలుంటాయి; కాని భేదాలూ వుంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికిచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్పప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు.

మహాగుణ సంపన్నములైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి. అనగా తులన, ఆకలన, చేయాలి.

యాబై రెండవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment