దీక్షా విధి | నారద ఉవాచ
అన్నిఫలములను ఇచ్చు దీక్షను చెప్పదను. మండలము నందలి పద్మము నందు హరిని పూజించ వలెను. దశమి యందు సమస్త మైన యాగ ద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, ’’ఫట్’’ అనునది అంతము నందు గల నారసింహామంత్రము చేత నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.
అచట సర్వాత్మికయు, ప్రాసాద రూపిణియు అగు శక్తిని నిలుపవలెను. సాధకుడు శుభ మైన పాత్ర యందు సమస్తౌషధుంను ఉంచి నూరు పర్యాయములు వాసుదేవ మంత్రముచే వికిరములను అభిమంత్రించ వలెను. పంచగవ్యమును నారాయణాన్తములైన ఐదు మూల మూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితం ఉంచబడిన హస్తముతో మూడుపర్యాయములు విసిరివేయ వలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించ వలెను.వర్ధనితో కూడిన కుంభము నందు అంగ సహితుడగు విష్ణువును పూజింప వలెను.
వర్ధనిని అస్త్రము చేతనే నూరు పర్యాయములు అభిమంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్య దిక్కు వరకును తీసికొనివెళ్ళవలెను.
కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిరములపై స్థాపించ వలెను. వికిరములను దర్భల చేతపోగుచేసి కుంభేశుని కర్కరిని పూజింపవలెను.
వస్త్రములతోడను పంచరత్నముల తోడను కూడిన విష్ణువును స్థండిలము పై పూజించ వలెను. అగ్ని యందుకూడ పూజించి, పూర్వము నందు వలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మముచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరము తోను నింపి, వాసుదేవ మంత్రముతో దానివైపు చూచి, పిమ్మట సంకర్షణ మంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసినతండులమును పోయవలెను.
వస్త్రములతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలము పై పూజించ వలెను. అగ్ని యందుకూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మముచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవ మంత్రముతోదానివైపు చూచి, పిమ్మట సంకర్షణ మంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులమును పోయ వలెను.
ఒక భాగముదేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయ వలెను.నాల్గవ భాగమును గురువు శిష్యులతో కూడా భుజించవలెను. క్షీర వృక్షము నుండి దంతకాష్ఠమును గ్రహించి, దానిని నారాయణమంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువ వలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయ వలెను. శుభమైన నరసింహ మంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.
“భక్తవత్సలుడవైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి ఉన్న పశువుల పాపములను తొలగించుటకు నీవొక్కడవే శరణము. ఓ దేవదేవా! ప్రాకృతములైన పాశబంధనములచే బద్ధులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలనవిముక్తులను చేసెదను. అనుజ్ఞ ఇమ్ము.” అని విష్ణువును ప్రార్థించ వలెను.
విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చేప్పినట్లు ధారణల చేతను, జ్వలనాదికము చేతను సంశోధనము చేసి సంస్కరించి, మూర్తితో కలిపి, నేత్రములను బంధించి చూపవలెను. అచట పుష్పములతో నిండిన దోసిళ్లను విసిరి, ఆపేర్లను చేర్చవలెను. అచట వెనుకటి వలె క్రమముగా మంత్ర రహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తిపై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను.
పాదాంగుష్ఠము మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును కన్య చేత భేదింప చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేని నుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావనచేయ వలెను.
ఆసూత్రముతో, ఎన్ని తత్త్వములున్నవో అన్ని ప్రాకృతిక పాశములను ముడివేసి, దానినిమూకుడులో అగ్ని కుండ పార్శ్వము నందుంచి, గురువు, ప్రకృతి మొదలు పృథివి వరకును ఉన్న ఆతత్త్వములను స్పష్టి క్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయ వలెను.
వికృతులక్రమము ప్రకారము నిఖిల మార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయా సూత్రమైన పశువు శరీరము నందు ఉపసంహరించి, తత్త్వ చింతకులు అచట ఐదు, పది, లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమున పర్వభేదముచే ఇవ్వవలెను.
తన ఇచ్ఛను అనుసరించి, సూత్రము నందును, దేహము నందును ప్రకృతి, లింగ శక్తి కర్త, బుద్ధి, మనస్సు తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు పంచ భూతములు వీటి నన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్ట్యను లోమ విలోమ క్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి ఇచ్చి, మూకుడులో సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెను .
ఈ విధముగ, శాస్త్రానుసారముగా, అధివాసితము చేసి, భక్తుడైన శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు, ఖటిక, ఇంకను ఉపయుక్తము లైన వస్తువులు, వీటి నన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగాఉంచి, మూల మంత్రముచే స్పృశించి, అదివాసితములు చేయ వలెను.
హరినిస్మరించుచు “నమో భూతేభ్యః” అని భూత బలిని కుశముల పై ఇవ్వ వలెను. పిదప వితానము (చందన) చేత, ఘటము చేత, లడ్డుల చేత మండలమును అలంకరించి, మండలముపై విష్ణువును పూజింపవలెను. పిమ్మట అగ్నిని పూజించి పద్మాసనము కట్టి కూర్చున్న శిష్యులను పిలచి వారికి దీక్ష ఇవ్వవలెను.
విష్ణువును హస్తముచే ప్రోక్షించి, శిరస్సును స్పృశించి, క్రమముగా ప్రకృతి మొదలు వికృతులు వరకును గల, అధిభూతాధి దైవతములతో కూడిన సృష్ణిని గూర్చి మనస్సులో భావన చేసి దానిని మరల క్రమముగా ఉపసంహరించి, ఆ సృష్టియంతయు తన్మాత్రలుగా అయి పోయినట్లును, జీవునితో సమాన మైననట్లును భావన చేయ వలెను.
పిమ్మట గురువు కుంభేశును ప్రార్థించి, సూత్రమును ప్రోగుచేసి, అగ్ని దగ్గరకు వచ్చి, దానిని అగ్ని పార్శ్వము నందుంచి, సృష్టికి అధిపతి యైన ఆ అగ్నిని మూల మంత్రముతోనూరు అహుతుల తోను, పిమ్మట పూర్ణాహుతి తోను పూజించవలెను. మూల మంత్రముతో నూరు సార్లు అభిమంత్రించిన తెల్లని రజస్సుతో హృదయ తాడనము చేయవలెను, వియోగపద సంయుక్తములను, పాదాదీంద్రియ ఘటితములును, బీజయుక్తములును అగు వాక్యములతో క్రమముగా పృథివ్యాది తత్త్వ విశ్లేషణము చేసి హోమము చేయవలెను.
పండితుడు అఖిల తత్త్వములకును నిలయమైన వహ్ని యందును, వ్యహృతుడగు హరి యందును సమస్త మైన అర్చనా మార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరింప వలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించిన, పూర్వోక్తమైన అగ్ని యందు హోమము చేయవలెను.
గర్భా ధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్ని యందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధ హోమము చేయ వలెను.
గురువు శుద్ధ తత్త్వమును గ్రహించి, దానిని అవ్యాకృతమువరకును క్రమముగ పూర్ణహుతిచే పర తత్త్వము నందు హోమము చేయవలెను.
పండితుడు, జ్ఞాన యోగము చేత ఆ పరమున పరమాత్మ యందువిలీనము చేసి, బంధ విముక్తడై జీవుడు సుద్ధము, జ్ఞాన స్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మ యందు ఆనందము పొందు చున్నట్లు భావింప వలెను. పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈవిధముగా దీక్ష పూర్తియగును.
దీక్షా, హోమ, విలయముల కుపయుక్తములగు ప్రయోగమంత్రము లను చెప్పెదను. “ఓం యం భూతానివిశుద్ధం హుం ఫట్” అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయ వలెను.
“ఓం యం భూతాన్యాపాతయేహమ్”
అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము,
“ఓంయం భూతాని పుంశ్చాహో”
అను నది ప్రయోజనమంత్రము.
హోమమంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమునుచెప్పెను,
“ఓం భూతాని సంహర స్వాహా”
అనునది హోమ మంత్రము “ఓం శ్రీం ఓం నమో భగవతే వాసుదేవాయ వౌషట్” అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్య నంతరముతత్త్వము నందు శిష్యుని సాధించ వలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వ తత్త్వసంశోధనము చేయ వలెను.
నమః అనునది అంతము నందు గల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వ సంశోధనము చేయ వలెను.
‘’ఓం వాం కర్మేన్ద్రియాణి నమః’’
‘’ఓం దేం బుద్ధీంద్రియాణి నమః’’
ఇత్యాది విధమున చేయ వలెను. తాడనాది ప్రయోగము ‘యం’ బీజముతో చేసి నట్లె చేయ వలెను.
“ఓంసుగన్ధతన్మాత్రే వియుఙ్క్ష్వ హుం ఫట్”,
“ఓం సంపాహి స్వాహా”
అనునది గంధ తన్మాత్రా వియోజన మంత్రము.
“ఓం స్వం స్వం యుఙ్క్ష్వ ప్రకృత్యా”
అనునది ప్రకృతి సంయోజన మంత్రము,
“ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా’
అనునది సంహార మంత్రము, పిమ్మట పూర్ణాహుతి చేయ వలెను. మిగిలిన వాటివిషయమున గూడ ఇట్లే చేయ వలెను.
“ఓంరస తన్మాత్రే”
మొదలు
“ఓం ఓం ప్రకృతౌ”
అనుదాని వరకును ఉన్న ఎనిమిది యుథత్తత్ర్పయోగాలలో ఉపయోగించు మంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్ప బడిన దీక్షా విధానము. నవ వ్యూహాదికము నందు కూడ ప్రయోగమిట్లే అని చెప్ప బడినది.
నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణము నందు చేర్చ వలెను. నరుడు ప్రకృతినిఅవికారుఢగు ఈశ్వరునితో చేర్చ వలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధ్యాఖ్యము లగుకర్మాంగములను, పిమ్మట తన్మాత్రలను, మనస్సును జ్ఞానమును, అహంకారమును శోధించ వలెను.
అంతమునందు లింగాత్మ శోధనము చేసి మరల ప్రకృతి శోదనము చేయవలెను. పరిశుద్ధుడును, ఈశ్వరధామమున నున్న వాడును, అన్ని భోగములను తన గోచరము చేసికొనిన వాడును, ముక్తి యందు స్థితి సంపాదించిన వాడును అగు ప్రాకృత పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము.
మంత్రాంగములచే ఆరాధన చేసి తత్త్వముల సముదాయమును సమముగానుండునట్లు చేసి ఈ విధముగ సక్రమముగా విశోధనము చేసి, అంతము నందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వ వలెను, ఇదిసాధకుడు చేయ వలసిన దీక్షా పద్ధతి.
ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్ధ్యము లేక పోయినచో లేదా తనకు శక్తి లేక పోయినచో, దేశికోత్తముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణ సహితుడగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశి యందు దీక్ష ఇవ్వవలెను.
భక్తుడును, వినయవంతుడును, సమస్తమైన శారీర గుణములు కలవాడును అగు విష్యుడు అధిక ధనవంతుడుకానిచో ఆతనికి స్థండి లాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వ వలెను.
గురువు, సమస్తమైన దైవ మార్గమును గాని, ఆధ్యాత్మికముగా బావన చేయబడిన భౌతికమార్గమును గాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలైన వారిని, క్రమముగ వారి వారి మంత్రములతో ఎనిమిదేసి ఆహుతుల చేత తృప్తి పరచి, విసర్జనము చేయవలెను.
పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేహముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వశోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయము చేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.
ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను,లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.
లేదాగురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్షయైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తనను ఆశ్రయించినపుడు స్థండిలము పై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండ బెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండ వలెను. స్వీయ పర్వములతో వికల్పితమైన సకలాధ్వమును శిష్యుని దేహముపై ధ్యానించి పిమ్మట ఆధి దైవిక పూజ చేయ వలెను.ధ్యాన యోగముచే చింతించి, వెనుకచెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలము పై నున్న హరి యందు సక లతత్త్వ సంశోధనము చేయవలెను.
పిమ్మట తాడనము చేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవ స్వరూపమున గ్రహించి, శుద్ధ భావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింప చేసి, ధ్యానయోగము నవలంబించి జ్ఞాన ముద్రతో శోధింప వలెను.
సర్వ తత్త్వములను శుద్ధము లైన పిమ్మట ప్రధానుడగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను (పాశములను) దహించి నిర్వాపితులను చేయవలెను. ఈశ్వర స్థానమున వారిని నియుక్తులను చేయ వలెను. లేదా దేశికోత్తముడు సాధకుని సిద్ధి మార్గమును పొందింపచేయ వలెను.
అధికారముగల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణ విషయమున అలసత్వము లేని వాడై, రాగము క్షీణించువరకును ఆత్మ శోధనము చేసికొనుచు ఉండవలెను.
తనకున్న రాగము క్షీణించినదను విషయము గుర్తించి, పాపములన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయమగు పాశమును దహింప చేసికొని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తము చేయక శరీర పాతమునకై (మరణమునకై) వేచి యుండ వలెను.
అగ్ని మహాపురాణములో సర్వదీక్షా కథనమను ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹