Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – యాబై ఐదవ అధ్యాయం

గంగాది తీర్థాల మహిమ

సూతుడు శౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు.

“శౌనకాచార్యాదులారా! ఇపుడు మీకు మన సమస్త తీర్థాలనూ వాటి మహిమనూ వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగ. గంగానది సర్వత్రా సులభమైనా హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం.

సర్వత్రసులభాగంగా

త్రిషుస్థానేషు దుర్లభా గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే

మరణించేవానికి ముక్తినీ, బతికున్నవానికి భుక్తినీ కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు.

వారణాసి పరమతీర్థం. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ, మాధవులు నిత్యం నివసించి వుంటారు. కురుక్షేత్రం కూడా గొప్పతీర్ధం. ఇక్కడ దానాలు చేసినవారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠతీర్థం. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడుంటాడు.

ద్వారకా క్షేత్రమొక అత్యంత సుందరనగరం. ఇది భక్తిముక్తి ప్రదాయకం. తూర్పున నున్న సరస్వతీ తీర్థం సర్వ పుణ్యదాయిని. ఇలాగే సప్తసారస్వతాలూ పరమతీర్థాలు.

కేదారతీర్థం సర్వపాప వినాశకం. సంభలగ్రామం మరొక ఉత్తమ తీర్థం. బదరి కాశ్రమం భగవానులైన నరనారాయణులు తీర్థం, ముక్తిదాయకం.

శ్వేతద్వీపం, మాయాపురి (హరిద్వార్) నైమిషారణ్యం, పుష్కరం, అయోధ్య, చిత్రకూటం, గోమతి, వైనాయకం, రామగిర్యాశ్రమం, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలం, సేతుబంధరామేశ్వరం, కార్తికేయం, భృగుతుంగం, కామతీర్థం, అమరకంటకం, మహా కాళేశ్వరం (ఉజ్జయిని) కుబ్జకం (శ్రీధరహరి నివాసం) కుబ్జామ్రకం, కాలసర్పి, కామదం, మహాకేశి, కావేరి, చంద్రభాగ, విపాశ, ఏకామ్ర, బ్రహ్మేశ, దేవకోటకం, మధుర, మహానది (శోణం) జంబూసర నామకములైన మహాతీర్థాలలో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి హరి మున్నగు దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావించబడు స్నాన, దాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండదానాది కర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. ఇలాగే శాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తుల అన్ని కోరికలనూ తీర్చే పవిత్ర స్థలాలు.

కోకాముఖ, వారాహ, భాండీర, స్వామి తీర్థాలను మహా తీర్థాలంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడు నివసిస్తారు.

కామరూప మరొక మహాతీర్థం. ఇక్కడ కామాఖ్యాదేవి నిత్యం నివాసముంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠింపబడియున్నాడు. విరజ, శ్రీ పురుషోత్తమ, మహేంద్రపర్వతం, కావేరి, గోదావరి, పయోష్ఠి, వరద, వింధ్య, నర్మదాభేద నామక మహాతీర్థాలు సర్వ పాపవినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్రతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారియైన హరి నివాసముంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమతీర్థం. ఇది భక్తులకు సర్వప్రదాయిని. నందితీర్ధం ముక్తిదాయకం. కోటి తీర్థాల ఫలాన్ని ఇదొక్కటే ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి.

కృష్ణవేణి, భీమరథి, గండకి, ఇరావతి, విందుసర, విష్ణు పాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధ్యానం, ఇంద్రియ నిగ్రహం మహాతీర్థాలు. దమ, భావశుద్ధులు శ్రేష్టతీర్థాలు. జ్ఞానరూప సరోవరంలో ధ్యానరూప జలంలో, ప్రతి నిత్య ప్రతిక్షణం మానస స్నానం చేయగలిగే వారి అజ్ఞానమనెడి, రాగద్వేషాదులనెడి మలం పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారే ఈ మనస్తీర్థాలను, ఈ మానసిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి.

తీర్ధయాత్రలు చేయడం బహు పుణ్యప్రదం, మానసికానందకరం. పుణ్యమనేది తీర్థయాత్రలు వల్లనే రావాలని లేదు. ”సర్వం బ్రహ్మమయం” అనే భావనను స్వీకరించి నిత్యం అదే భావనలో వుండే వారెక్కడుంటే అదే తీర్థం. వారున్న చోటనే స్నాన, దాన, శ్రాద్ధ పిండప్రదానాది కర్మలకు మహాక్షేత్రాల్లో, తీర్థాల్లో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలూ, నదులూ, దేవతలూ, ఋషులూ, మునులూ, సంతులూ వుండే చోట్లు సర్వాలూ తీర్థాలే.

ఇదం తీర్థమిదంనేతి యేనరా భేదదర్శినః |

తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చయత్ ||

సర్వం బ్రహ్మేతియోవేత్తి నా తీర్థం తస్య కించన |

ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండమథాక్షయం ||

సర్వా నద్యః సర్వశైలాః తీర్థం దేవాదిసేవితం |

భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగ పట్టణం. తాప్తి ఒక శ్రేష్ఠమహానది. సప్తగోదావరి, కోణ గిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మియే నదీరూపంలో విరాజిల్లుతున్నది. సహ్యపర్వతంపై భగవానుడైన దేవదేవేశ్వరుడు ఏకవీర రూపంలోనూ మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తున్నారు.

గంగాద్వారం, కుశావర్తం, వింధ్య పర్వతం, నీలగిరి, కనఖల – ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన వారికి పునర్జన్మ వుండదు.

గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే ॥

స్నాత్వా కనఖలే తీర్థే (సభవేత్ న) సభవేన్న పునర్భవే ||

శ్రీహరి ద్వారా తీర్థ మాహాత్మ్యాన్ని తెలుసుకొని వచ్చిన బ్రహ్మ దక్ష ప్రజాపతి, వ్యాసమునీంద్రాదులకు గయ క్షేత్రాన్ని గూర్చి ఇలా వినిపించాడు.

యాబై ఏడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment