సర్వతోభద్ర మండలవిధిః
సాధకుడు దేవాలయాదులలో మంత్ర సాధన చేయ వలెను. తూర్పు గృహము నందు శుద్ధమైన భూమిపై, మండలము నందు, ప్రభువైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రముమీద మండలాదులను వ్రాయ వలెను. రెండు వందల ఏబదియారు కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయ వలెను. ముప్పది ఆరు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దాని నుండి రెండింటి చేత వీథియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను.
వెనుకచెప్పిన పద్మ క్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధము నందు ద్వాదశ భాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయ వలెను.
మొదటిది కర్ణికయొక్క క్షేత్రము. రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దల సంధుల క్షేత్రము. నాల్గవదిదలాగ్రముల క్షేత్రము.
కోణ స్థానములనుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్య భాగము వరకును దారములాగి, కేసరముల అగ్రములందుంచి దళములసంధులను గుర్తింప వలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దళముల పద్మమును గీయ వలెను. దళముల సంధుల మధ్యము నందు ఎంత ఎడముండునో అంత ఎడము నందు అగ్రభాగమున, దళాగ్రములను గీయ వలెను. వాటి మధ్య మానమును వాటి పార్శ్వము నందుంచి బాహ్యక్రమమున ఒక్కొక్కదళముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మ యొక్క సామన్య లక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడు చున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్ప దిక్కు వైపు దారముంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్ప వలెను. దాని పార్శ్వము నందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండుమత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశ దళ కమల మేర్పడును.
పంచదళాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్య చిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ రేఖకు బైటనున్న పీఠ భాగము నందలి కోష్ఠములను తుడిచి వేయవలెను. పీఠ భాగము యొక్క నాలుగుకోణములలో మూడేసి కోష్ఠకము లను ఆ పీఠము యొక్క నాలుగు పాదాలుగా కల్పింప వలెను.నాలుగు దిక్కు లందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయ వలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచి వేసి వీథి ఏర్పరుప వలెను.పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.
విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగము లందు ఎనిమిది శోభా స్థానములను, వాటి పార్శ్వ భాగములందు ఉపశోభా స్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును. ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణములని పేరు. పిమ్మట నాలుగుదిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్య పంక్తి లోని, మధ్య కోష్ఠములను ద్వార నిర్మాణమునకై ఉపమోగింప వలెను. వాటినన్నింటిని కలిపి తుడిచి వేయగా నాలుగు ద్వారములేర్పడును. ద్వారము యొక్క రెండుపార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభా నిర్మాణార్థమై తుడిచి వేయవలెను. శోభాపార్శ్వ భాగము నందు ఇందులకు విపరీతముగా చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపలనున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపలనున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయ వలెను.
ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండు వందల ఏబది ఆరు కోష్ఠములు గల మండలము వర్ణింప బడినది.ఇతర మండల నిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. పండ్రెండేసి కోష్ఠములచే నూట నలభై నాలుగుకోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడు మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమల మేర్పడును. దీనిలో వీథి ఉండదు. ఒక పంక్తి పీఠమునకై ఏర్పరుప బడును. మిగిలినరెండు పంక్తులచే, వెనుక చెప్పిన విధమున, ద్వార శోభలు కల్పింపబడును. ఒక హస్తముప్రమాణము గల మండలము నందు కమల క్షేత్రము పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును.రెండు హస్తములు ప్రమాణము గల మండలము నందు కమల స్థానము ఒక హస్తము వెడల్పు, పొడవులతోనుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండల నిర్మాణము చేయ వలెను.రెండు హస్తముల ప్రమాణము గల పీఠ రహితమగు చతురస్ర మండలము నందు చక్రాకార కమలమును నిర్మించ వలెను. పద్మార్థము తొమ్మిది అంగుళములుండును. నాభి మూడు అంగుళములు.ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళములనేమి ఏర్పరుపవలెను. క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలి నుండి ఒక్కొక్క దానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచి వేసి వాటిపై ఆకులు నిర్మింప వలెను.ఈ ఆకులు ఇందీవరదళాకారములో గాని, మాతులింగ ఫలాకారములో గాని, కమల దళాకారములో గాని ఉండ వచ్చును. లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయ వచ్చును. ఆకుల సంధుల మధ్య దారముంచి, దానిని వెలుపల నున్న నేమి (చక్రాంతము) వరకులాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను. ఆకు యొక్కసంధి యందు దారము నుంచి దాని మూల భాగమును త్రిప్ప వలెను. ఆకు మధ్య స్థానమునందు దారము ఉంచి ఆ మధ్య భాగము నలు వైపులకును సమముగా దారము త్రిప్ప వలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగాకారము గల ఆకు లేర్పడును.
పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింప వలెను. లేదా తూర్పు నుండి పశ్చిమము వరకును, ఉత్తరము నుండి దక్షిణము వరకును పదునైదేసి సమాన రేఖలు గీయ వలెను. ఇట్లు చేయుటచే నూట తొంబదియారు కోష్ఠములేర్పడును. వీటిలో మధ్య నున్న నాలుగు కోష్ఠములచే భద్ర మండలము ఏర్పరుప వలెను. దానినాలుగు వైపుల వీథి కొరకై స్థానము విడువ వలెను. మరల అన్ని దిక్కులందును కమలములు గీయ వలెను. ఆ కమలములు నాల్గువైపులందును వీథి కొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచి వేయవలెను. పిమ్మట, మధ్య నున్న రెండేసి కోష్ఠములను కంఠభాగము కొరకై తుడిచి వేయ వలెను. పిమ్మట వెలుపల నున్న నాలుగేసి కోష్టములలో మూడు మూడు కోష్ఠములను తుడిచి వేయవలెను. వెలుపల నున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠ స్థాన పార్శ్వమునందు మిగల్చ వలెను. దానికి ద్వారశోభయని పేరు. వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచి వేయ వలెను. దానికి ‘’నవ నాలము’’ లేదా “నవ నాభ మండలము” అని పేరు. దాని తొమ్మిది నాభుల యందు, నవ వ్యూహ రూపుడైన శ్రీహరిని పూజింప వలెను.ఇరువది ఐదు వ్యూహముల మండలము విశ్వవ్యాపియైనది. ముప్పది రెండు హస్తముల క్షేత్రమును, ముప్పది రెండు చేతనే సమముగా విభజింపవలెను. అనగా పైనుంచి క్రిందికి ముప్పది మూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పది మూడు రేఖలు గీయ వలెను. ఈ విధముగ ఒక వెయ్యిఇరువది నాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకము లతో “భద్ర మండలము”ను నిర్మింప వలెను. మరల నాలుగు ప్రక్కల నున్న ఒక్కొక్క పంక్తిని విడువ వలెను. పిమ్మట ఎనిమిది దిక్కు లందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్ర మండలములు ఏర్పరుప వలెను. దీనికి “భద్రాష్టకము” అని పేరు.
దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్ర మండలములు వ్రాయ వలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపి వేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింప వలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచి వేసి మధ్యభాగము యొక్క పార్శ్వభాగము లందలి నాలిగింటిని తుడిచి వేయ వలెను. మరల, శోభా నిర్మాణమునకై లోపల నున్న నాలుగుకోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచి వేయ వలెను. పిమ్మట ఉప ద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపల నున్న ఐదు కోష్ఠము లను తుడిచి వేయ వలెను.పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింప వలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచి వేయ వలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహ మండలములోపల నున్న కమల కర్ణికపై పరమాత్మను పూజింప వలెను. మరల తూర్పు మొదలైన దిక్కులలోనున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయ వలెను. పిమ్మట తూర్పుననున్న కమలముపై భగవంతుడగు వరహ మూర్తిని పూజించి క్రమముగా ఇరువది ఐదు వ్యూహముల పూజ చేయవలెను. ఇరువది ఆరవ తత్త్వమైన పరమాత్ముని పూజ సంపన్నమగు వరకును ఈ క్రమము జరుగవలెను.ఒకే మండలముపై అన్ని వ్యూహముల పూజను క్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తి భేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వమునందు భేద మేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరు వేరుగా చేయవలెను. నలుబది హస్తముల మండలమును అడ్డ గీతలు గీసి క్రమముగా విభజింప వలెను. మొదట ఒక్కొక్క దానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్క దానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈవిధముగ ఒక వెయ్యి ఏడు వందల అరువది నాలుగు కోష్ఠకము ఏర్పడును.మధ్యనున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింప వలెను. పార్శ్వ భాగమున వీథి నిర్మించ వలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింప వలెను. పిమ్మట పదునారు దళములు కమలమును వీథిని నిర్మింపవలెను. పిమ్మట క్రమముగ ఇరువది నాలుగు దళముల కమలము, వీథి, ముప్పది రెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథినిర్మింప వలెను. పిమ్మట మిగిలిన మూడు పంక్తులచే ద్వారములు, శోభలు ఉప శోభలు, నిర్మింపవలెను. సర్వ దిశల మధ్య భాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచి వేయ వలెను. దాని బాహ్యభాగము నందు శోభా ఉప ద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచి వేయ వలెను. ద్వారముల పార్శ్వము లందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచి వేయవలెను. మధ్య నున్న రెండు రెండుకోష్ఠములు కూడ తుడిచి వేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలోఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువ వలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగాకావలసిన సుందరమైన మండల మేర్పడును.
అగ్నేయ మహాపురాణము నందు సర్వతోభద్రమండల ఆది విధి యను ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹