ఇతర మణులు (పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్పటిక, విద్రుమ)
పుష్యరాగ (పుష్కరాగ) మణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటినుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం. సంపూర్ణ పీత, పాండుర వర్ణముల సుందరకాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత, పీతవర్ణాల కాంతులను వెలారుస్తుంటే కౌకంటకమని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీత వర్ణము సంయుక్తంగా వుండి మెరిసే పాషాణాలను ‘కాషాయక’ మణులంటారు.
ఈ మణుల పూర్వరూపమైన పుష్పరాగమణి వైదూర్యముతో సమానమైన మూల్యాన్నే కలిగి వుంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి నొందగలరు.
కర్కేతనమణి పరమపూజ్యతమం. బలాసురుని రత్నబీజ స్వరూపాలైన గోళ్ళను వాయుదేవుడు అత్యంతాదరంతో గొనివచ్చి ప్రసన్నతాపూర్వంగా కమల వన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథ్విపై కర్కేతన నామంతో జన్మించాయి. ఇవి రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేత వర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగుల్లో దొరకడానికి కారణం రత్నవ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా వుండడానికీ అదే కారణం.
సంతాప, వ్రణ వ్యాధులు రత్నాలకు కూడా వుంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గురుత్వ ధర్మాలతో నిండి, విచిత్ర వర్ణ కాంతులీను కర్కే తనమణి విశుద్ధ, పరమపవిత్ర మణిగా పూజలందుకుంటుంది.
స్వర్ణపాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధకర్కే తనమణి. ఇది సర్వరోగాలనూ నశింపజేయగలదు; కలిదోషాన్ని నివారించగలదు. కులవృద్ధినీ కలుగజేయగలదు; సుఖమునూ ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించినవారు పూజలందుకోగలరు,
ధనాఢ్యులు కాగలరు; బంధు బాంధవ సంపన్నులు, ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా చేస్తే, అంటే ధరిస్తే, సర్వ కష్టాలూ సంప్రాప్తిస్తాయి.
భీష్మకమణి మహారత్నదాతయైన బలాసురుని వీర్యం హిమాలయ పర్వతప్రాంతాల్లో పడగా నేర్పడిన రత్నాకరంలో సముద్భవించింది. అక్కడి భీష్మకమణి శంఖ, పద్మ సమాన, సముజ్జ్వలములూ, మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలూ వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా వుటుంది.
తమ కంఠంలో స్వర్ణసూత్రంలో ముడి పెట్టి ఈ విశుద్ధ భీష్మక మణిని ధరించినవారు సదా సుఖసమృద్ధితో సంపదల కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుత్నుపుడు ఆ మణిని దూరం నుండే చూసి సింహ వ్యాఘ్ర, శరభాది మహామృగాలూ, తోడేళ్ళవంటి హింసక జంతువులూ కూడా మరింత దూరం పారిపోతాయి. వారికి ఏ రకమైనా పీడా సోకదు; ఏ విధమైన భయమూ కలుగదు. మానవులు కూడా వారిని అపహాస్యం చేయడానికి గానీ నిందించడానికి గానీ జడుస్తారు.
ఈ భీష్మకమణిని పొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ళ దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల సర్ప, వృశ్చికాదుల విషప్రభావం మణిధారి వంటికి ఎక్కదు. జల, శత్రు, చోర భయముండదు. నాచు మరియు మబ్బు రంగులోనుండి కఠోరమై, పచ్చటి కాంతులను వెదజల్లుతూ, మలినద్యుతినీ వికృతవర్ణాన్నీ కలిగియుండే భీష్మకమణిని దూరం నుండే చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం.
పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బలాసురుని గోళ్ళ నుండి భుజాలదాకా గల శరీరాన్ని విధ్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదుల్లో, ఉత్తర దేశంలోనికొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు.
దశార్ణ, వాగదర, మేకల, కళింగాది దేశాల్లో ఈ ప్రకాశరూపియైన బీజం నుండి వచ్చిన పులకమణులు గుంజాఫల, అంజన, మధు, కమలనాళ వర్ణాలలో వుంటాయి. గంధర్వ, అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటిపండు రంగులో వుంటాయి.
ఈ వర్ణమణులన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిమలతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారాలలో వుంటాయి. వీటిని ఒక పద్దతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్నీ, శుభాల్నీ కలుగజేస్తాయి. ఐశ్వర్యాభివృద్ధినీ ప్రాప్తింపజేస్తాయి.
కొన్ని పులకమణులు మాత్రం మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుఱ్ఱం, గాడిద, తోడేలు, రూపాలతో నున్నవి, మాంసంతో రక్తంతో నున్న గ్రద్ద ముఖ సమాన వర్ణంలో నున్నవి మృత్యుదాయకాలే. శ్రేష్ఠ, ప్రశస్త ఏకపల మాత్ర భారమున్న పులకమణి ధర అయిదువందల ముద్రలు పలుకుతుంది.
రుధిరాక్షరత్నం అగ్నిదేవుని అనుకంప (దయ) వల్ల మనకు దక్కింది. దానవరాజు బలాసురుని శరీరంలోని కొన్ని అంశాలను నర్మదానదీ తీర ప్రాంతంలోనూ మరికొన్ని అంశాలను దానికి దిగువ భూములలోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్షరత్నం లభించడానికి కారకుడు. ఎఱ్ఱగా చిలకముక్కు రంగులోనూ, ఇంద్రగోప కీటవర్ణంలోనూ ఈ మణులు దొరుకుతున్నాయి. కొన్ని తెల్లగా నుండి మధ్య భాగంలో పాండుర వర్ణంతో అత్యంత విశుద్ధంగా వుంటాయి.
ఆ రుధిరాక్షలు ఇంద్రనీలమణితో సమానమైన శక్తులను కలిగి వుంటాయి. ఈ రత్నాలను ధరించేవారికి అన్ని ఐశ్వర్యాలూ, భృత్యాది అభివృద్ధులూ అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవ వజ్రంలా మెరుస్తుంది.
స్ఫటికరత్నం మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని మేధాభాగాన్నందు కొని కావేరి, వింధ్య, (నేటి చైనా), నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల స్ఫటిక అను పేరు గల రత్నాలు ఆయాప్రాంతాల్లో లభిస్తున్నాయి.
ఇవి తెల్లకలువ, శంఖ వర్ణాల్లో వుంటాయి. ఈ ధవళ వర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీన్ని ధరిస్తే అన్ని పాపాలూ నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలకట్టగలరు.
విద్రుమమణి ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బలాసురుని అంత్రభాగాన్ని గ్రహించి కేరళాది దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమ మణుల్లో కుందేలు రక్తం రంగులోనూ, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎఱ్ఱటి వర్ణంలోనూ వున్నవి. శ్రేష్ఠతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల, దేవక, రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడి విద్రుమమణులు చిక్కటి ఎరుపులో ప్రకాశిస్తుంటాయి. అన్యస్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి గాని అవి ప్రశస్తాలు కావు. శిల్పకళలో విశేషమైన నేర్పు గలవారే వీటికి వెల కట్టగలరు.
సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఎఱ్ఱగా వుండే ఈ మణులను ధరించేవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది; అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి” ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువూ, బ్రహ్మా మనకు ప్రసాదించారు.
యాబై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹