గయా మాహాత్మ్యము – శ్రాద్ధాది కర్మల ఫలము
గయా మాహాత్మ్యాన్ని వింటే చాలు ”ఇక్కడ” భుక్తికీ ”అక్కడ” ముక్తికీ లోటుండదు. ఇది పరమ సారస్వరూపం.
పూర్వకాలంలో గయ నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోరతపము నాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువునాశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడై వచ్చి వానిని సంహరించాడు.
ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై విలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారియై అక్కడ నివసిస్తూ అక్కడికేతెంచిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ వుంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మనీ, అతని పేరిట తామే వెలయించిన గయనీ మరింత పవిత్రం చేశారు.
”ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో వుంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన, యజ్ఞ, శ్రాద్ధ, పిండ దానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు. పైగా స్వర్గం గాని బ్రహ్మలోకం గానీ చేరుకుంటారు” అని శ్రీ మహా విష్ణువు కట్టడి చేశాడు.
సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థం సర్వశ్రేష్ఠమనే జ్ఞానం కలిగి, ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు.
అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతియను తియ్యటి తేట నీటిని ప్రసాదించే నదినీ, లోతు దొరకని నూతినీ, మరిన్ని జలాశయాలను, భక్ష్య, భోజ్య, ఫలాదులనిచ్చే ప్రకృతినీ, మరొక కామధేనువునీ సృష్టించాడు. చివరగా తనచే పూజించబడిన విద్వద్ బ్రాహ్మణులకు అయిదు క్రోసుల వైశాల్యంలో వ్యాపించియున్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు.
(అయిదు క్రోసులంటే నేటి లెక్కలో 15 కిలోమీటర్లు) కాని ఆ బ్రాహ్మణులు అశ్రమగా వచ్చిన ధనాదుల వల్ల బద్దకస్తులై పోయి కర్మలను తగ్గించారు బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు, బ్రాహ్మణులారా! మీరు మీ కర్తవ్యాన్ని మఱచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేనువుండదు. మీ నుండి మూడవతరం నాటికి మీ వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేమీ మిగలవు.
ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి; భక్ష్య భోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి” అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తప్తులై వేడుకోగా ”ఈ క్షేత్రంతోబాటు మీరూ అభివృద్ధి చెందుతారు. ఇక్కడి కర్మల వల్ల కర్తలకూ మీకూ కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనం అవుతుంది’ అని దీవించాడు.
బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం గో గృహే మరణం తథా |
వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధా ||
సముద్రం నుండీ చిన్న చెలమ దాకా అన్ని తీర్థాలూ అదృశ్యం రూపంలో వచ్చి ఈ గయా క్షేత్రంలో స్నానం చేసి వెళతాయి. ఇక్కడ శ్రాద్ధకర్మలను ఆచరించేవారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నిగమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి.
బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వాంగనాగమః |
పాపం తత్సంగజం సర్వం గయాశ్రాద్ధ ద్వినశ్యతి ||
మృత్యువు తరువాతి సంస్కారాలు సమంగా జరుగని వారికీ, పాముకాటు వలన మరణించినవారికీ, పశు, చోరాదుల ద్వారా బలవన్మరణం చెందినవారికీ సామాన్యంగానైతే ఉత్తమ గతులుండవు. కానీ వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధన ముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది.
గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు వందకోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు కీకటదేశంలో గయ పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీజలాలతో తడిసేనీ పరమశ్రేష్టాలు.
గయకు తూర్పున ముండపృష్ట తీర్థమున్నది. అది నలుదిక్కులూ విస్తరించియున్నది. దాని విస్తృతి ఒకటిన్నర కోసులు. (ప్రస్తుత భాషలో నాలుగున్నర కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం అయిదు కోసులు) గయాశిరం ఒక కోసు పరిమాణంలో వున్నాయి. ఇక్కడ పిండ దానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నొందుతారు.
పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః |
తత్రపిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతీ ||
విష్ణు పర్వతం నుండి ఉత్తరమానసం దాకా గల భాగాన్ని గయా శిరమంటారు. దానినే ఫల్గు తీర్థమనీ వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకి వచ్చినంతనే వ్యక్తి పిత ఋణముక్తుడవుతాడు.
గయాగమన మాత్రేణ పితౄణా మనృణో భవేత్ ॥
ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు, జనార్దనుడునైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు ఋణత్రయ (దేవ, భూత, ఋషి) విముక్తులౌతారు. గయ సింహద్వారానికి నమస్కరించినా, రుద్ర కాళేశ్వర, కేదారనాథులను సందర్శించినా మనిషి భూత, అతిథి ఋణ విముక్తుడవుతాడు.
అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాపవిముక్తీ, ప్రపితామహుని దర్శిస్తే అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది.
అక్కడి మౌనాదిత్య, కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
మౌనధారణ ఇక్కడి పూజా నియమాలలో ఒకటి. ఇక్కడ ప్రాతఃకాలమే లేచి స్నానాదికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధివిధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలనూ చదివిన పుణ్యం లభిస్తుంది.
అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది. గయలో నొక పర్వతంపై పరమశివుడు వెలసియున్నాడు. ఆయనను దర్శించిన వారికి పిత ఋణ విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని ఋణాలూ తీరిపోతాయి.
అలాగే గృద్ధేశ్వర మహాదేవుని దర్శించినవారికి అన్ని బంధనాలూ తొలగిపోతాయి. ధేనువనం (గోప్రచార తీర్థం) అను పేరుగల మహా తీర్థంలో ధేను దర్శనంచేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి యున్న పరమశివుని దర్శించినవారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర, అశ్వమేధ తీర్థాలను దర్శించినవారికి ఋణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తకం.
ఇక్కడి ధర్మారణ్యంలో నున్న గదాలోల తీర్థాన్నీ అక్కడ కొలువున్న రామేశ్వర స్వామినీ దర్శించిన వారికి స్వర్గప్రాప్తి వుంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభిస్తుంది.
గయలోనే ముండపృష్ఠ తీర్ధంలో వెలసిన మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని వాంఛలూ నెరవేరుతాయి.
ఫల్గు తీర్ధంలో ఫల్గు స్వామి, చండి, గౌరి, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవానులు వెలసియున్నారు. వీరి దర్శనం పితౄణ భంజకం. అలాగే ఫల్గుతీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించినవారు పితరుల ఋణం నుండి విడివడతారు. భూమిపై నున్న అన్ని తీర్థాలూ సముద్రాలూ, సరోవరాలూ ప్రతిదినమూ వచ్చి ఫల్గు తీర్థాన్ని దర్శించి వెళతాయి. మొత్తం భూలోకంలో గయ, గయలో గయాశిరం, ఆ శిరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు.
పృథివ్యాలయాని తీర్థాని యే సముద్రాః సరాంసిచ |
ఫల్గు తీర్ధం గమిష్యంతి వారమేకందినే దినే ||
పృథివ్యాం చ గయా పుణ్యాగయాయాంచ గయాశిరః |
శ్రేష్ఠం తథా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్య హి ||
దీనికుత్తరాన కనకానది పారుతోంది. దాని మధ్య భాగంలో నున్న నాభి తీర్ధానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొనివుంది. అది తనలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసిన వారినిబ్రహ్మలోకానికి పంపగలదు.
ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థస్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి ఇంకా గోమక తీర్థం ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రాద్ధాలు పెట్టినవాడు తనతో బాటు తన ఇరువది యొక్క తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మ తీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ (సోమతీర్థ) రామహాదినీ తీర్థాలలో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మ లోకానికి వెళతారు.
ఉత్తరమానసీ తీర్థంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారికి పునర్జన్మ వుండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోకప్రదాయకం. స్వర్గ ద్వారా తీర్థమూ అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధ కర్మలను పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృద్ధేశ్వర తీర్థమునందు పెట్టబడు శ్రాద్ధం పితౄణ ముక్తిదం.
ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తిలధేనువును దానం చేసి మరల స్నానమాచరించి. అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించినవాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శ్రాద్ధానికీ అదే ఫలము. సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన నూటొక్క తరాల పితరులను బ్రహ్మ లోకానికి గొనిపోగలడు.
ఇక్కడి బ్రహ్మ యోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత గలది. ప్రశాంతమనస్కులై పితరులనే ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకూ దేవతలకూ తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ వుండదు.
కాకజంఘా తీర్థంలో తర్పణలందుకొన్న పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాపీ తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకూప, కూపతీర్థాలలో చేసే కర్మలకు పితౄణ విముక్తి కలుగుతుంది. ఇక్కడి శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి.
ప్రమాణం దేవతాః సంతు లోక పాలశ్చసాక్షిణః |
మయాగత్య మతంగే స్మిన్ పితౄణాం నిష్కృతిః కృతా ||
రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రాద్ధకార్యాలు చేసిన వాని పితరులు పరమానంద భరితులౌతారు. దీని వల్ల వాని నుండి ఇరువది యొక్క తరాలు ఉద్ధరింపబడతాయి. అలాగే ముండపృష్ణాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించినవారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను గొనిపోయే శక్తి కలుగుతుంది.
ఇంకా ఉంది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹