Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – అరవై రెండవ అధ్యాయం

సూర్యగ్రహ చరిత్ర ఐదవ భాగము

అల్లుడు సూర్యుడు చెప్పిందంతా విశ్వకర్మ ఆశ్చర్యంతో విన్నాడు.

“సంజ్ఞ కోరిన విధంగా నా ప్రకాశాన్నీ , తాపాన్నీ తగ్గించుకోవడానికి సిద్ధమై మీ వద్దకు వచ్చాను. నాలోంచి వెలువడే వెలుగునూ , వేడిమినీ తగ్గించే భారం మీదే !” అన్నాడు సూర్యుడు.

విశ్వకర్మ కాస్సేపు ఆలోచించి , అన్నాడు. “ఈ రూపంలో నీ దేహం నుండి వేడిమినీ , వెలుగును నియంత్రించడం అసంభవం. నీ మౌలిక రూపమూ , స్థూలమూ అయిన గోళాకారాన్ని నువ్వు ధరిస్తే , ”తరణి” అనే యంత్రం సాయంతో ఆ గోళాన్ని అరగదీస్తాను ! పరిమాణం తగ్గి , వేడిమి , వెలుతురూ కూడా సన్నగిల్లుతాయి !”

మామగారి ప్రతిపాదనను సూర్యుడు ఆమోదించాడు. యోగంలో ఆసీనుడై , సంకల్ప బలంతో సూర్యగోళాకారాన్ని ధరించాడు.

దేవశిల్పాచార్యుడైన విశ్వకర్మ మహానైపుణ్యంతో సూర్యగోళాన్ని యంత్రంతో అరగ దీయడం ప్రారంభించాడు. గోళంలో ఎనిమిదవ వంతుని తరణి సహాయంతో తగ్గించి వేశాడు. ఆ కార్యక్రమ ఫలితంగా సూర్యగోళం నుండి రజను దట్టంగా రాలిపడింది.

సూర్యుడు మామగారి అనుమతితో గోళాకారాన్ని విసర్జించి తన సహజ రూపాన్ని ధరించాడు. గోళాకారంలో ఉన్నప్పటి తన దేహం నుండి రాలి పడిన రజనును ఆశ్చర్యంగా చూశాడు. అల్లుడి ఆశ్చర్యాన్ని గమనించిన విశ్వకర్మ ఇలా అన్నాడు.

“ఈ ధూళి మహా శక్తివంతమైంది. వృధా చేయదగినది కాదు. నా నైపుణ్యాన్ని ఉపయోగించి , ”సుదర్శనం” అనే చక్రాయుధాన్నీ , మూడు మొనలతో ”త్రిశూలం” అనే ఆయుధాన్నీ , ఏకముఖంతో ”శక్తి” అనే ఆయుధాన్నీ రూపొందిస్తాను ! ఇంకా మిగలబోయే రజనుతో ”పుష్పకం” అనే ఆకాశగమన శక్తి కలిగిన దివ్య విమానాన్ని రూపొందిస్తాను !”

సూర్యుడు ఆశ్చర్యంగా చూశాడు. “మామగారూ ! సుదర్శన చక్రం , త్రిశూలం , శక్తి , పుష్పక విమానం – నాలుగూ నాలుగు దివ్య వస్తువులు ! ఆ అద్భుత వస్తువులను ఏం చేస్తారు ?”

“నాయనా ! గోళాకారంలో ఉండే నీలో వెలిగే శక్తి – విష్ణు తేజస్సు. ఈ ధూళి అంతా విష్ణు తేజస్సులో భాగమే. పుష్పక విమానాన్నీ , సుదర్శన చక్రాన్నీ , త్రిశూలాన్నీ , శక్త్యాయుధాన్నీ నా సేవలు అందుకునే బ్రహ్మ దేవుడికి సమర్పిస్తాను. ఏది ఎవరికి ఇవ్వాలో , ఎప్పుడు ఇవ్వాలో ఆ సృష్టికర్తే నిర్ణయిస్తారు !” విశ్వకర్మ వివరించాడు.

“మామగారూ ! ఇప్పుడు నాలోంచి వెలువడే వెలుగూ , వేడిమి క్షీణించాయా ?”

సూర్యుడు ముందు జాగ్రత్తతో ప్రశ్నించాడు. “అది చెప్పవలసింది నేను కాదు , సూర్యా ! నా కూతురు సంజ్ఞ !” విశ్వకర్మ నవ్వుతూ అన్నాడు.

సూర్యుడు మామగారికి ప్రణమిల్లి తన మందిరానికి ప్రయాణమయ్యాడు…

తాపాన్నీ , కాంతినీ క్షీణింపజేసుకుని , వచ్చిన సూర్యుడిని చూసి సంజ్ఞ సంతోషంతో. పొంగి పోయింది. భర్త సేవకూ , పిల్లల పోషణకూ ఆమె పునరంకితమైంది.

ధర్మాధర్మాలను గురించిన అవగాహనను సందర్భానుసారంగా వ్యక్తం చేస్తున్న యముడి వ్యక్తిత్వం సూర్యుడికి విలక్షణంగా తోచింది. భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అలంకరించే లక్షణాలు యముడిలో ఉన్నట్టు ఆయన గుర్తించాడు. ఒకరోజు యముడితో ఇలా అన్నాడు.

“నాయనా , యమా ! నీలో ఆధిపత్య లక్షణాలూ , విచక్షణా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నియమ నిష్ఠలతో తదేక దీక్షతో తపస్సు చేయి. ఆయన నీకు దిశా నిర్దేశం చేస్తాడు !”.

భర్త ప్రతిపాదనను సంజ్ఞ ఆమోదించింది. తల్లిదండ్రుల ఆశీస్సులను తోడుగా తీసుకుని యముడు తపస్సు చేయడానికి బయలుదేరాడు.

సంజ్ఞా సూర్యుల సంసారం సాగిపోతోంది.

“ఇవీ , సూర్యుని చరిత్రలోని ప్రధాన ఘట్టాలు !” కథనం ముగిస్తూ అన్నాడు. నిర్వికల్పానంద.

“గురువుగారూ ! చంద్రుడి చరిత్ర ప్రారంభించే ముందు ఒక సందేహం నివృత్తి చేయండి” విమలానందుడు అన్నాడు..

“ఏమిటది ? అడుగు , నాయనా !”

“విశ్వకర్మ సూర్యుడికి చెప్పిన విధంగా , విష్ణుతేజో రూపమైన సూర్య రజనుతో ఆయుధాలూ, విమానమూ…”. “రూపొందించాడు !” నిర్వికల్పానంద అద్దిస్తూ అన్నాడు. “సుదర్శన చక్రం విష్ణువు చేతి ఆయుధమనీ , త్రిశూలం పరమశివుడి ఆయుధమనీ , శక్తి కుమారస్వామి ఆయుధమనీ మనకు తెలిసిందే కద ! విశ్వకర్మ ఆ ఆయుధత్రయాన్నీ , పుష్పకవిమానాన్నీ , బ్రహ్మదేవుడికి సమర్పించాడు. ఆయన సుదర్శన చక్ర , త్రిశూల , శక్త్యాయుధాలను హరి , హర , సుబ్రహ్మణ్యులకు ఇచ్చివేశాడు ! పుష్పక విమానాన్ని ధనాధిపతి అయిన కుబేరుడికి ఇచ్చాడు ! దానిని ఆయన నుండి రావణాసురుడు లాక్కున్నాడు !”

“ఆ కథాంశాన్ని అలా వదిలేసి , చంద్రుడి చరిత్రను చెప్పుకుందాం ! తార బృహస్పతిని చేరుకుంది. ఆమెకూ , తనకూ జన్మించిన బాలుడు బుధుడు తన తండ్రి అత్రి మహర్షి పెంపకంలో ఉండిపోయాడు. తారతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ , మందిరంలో ఒంటరిగా నిస్సారమైన జీవితం గడుపుతున్నాడు చంద్రుడు. ఆ సందర్భంలో ఒకరోజు నారదుడు చంద్ర మందిరానికి వచ్చాడు !” నిర్వికల్పానంద తన కథనం కొనసాగించాడు…

రేపటి నుండి చంద్రగ్రహ చరిత్ర ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment