ఆది గదాధర మాహాత్మ్యం
గయలో మరికొన్ని తీర్థాలనూ వాటి మహిమలనూ వినిపిస్తాను. ఈ గయా తీర్థంలో ప్రేతశిలిగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస, ప్రేతకుండ, గయాసుర శీర్ష నామకములైన తీర్థాలతో విరాజిల్లుతోంది. ఈ శిల సర్వదేవమయి. దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించాడని విన్నాను. మానవుని మిత్ర, బంధు, బాంధవులలో నెవరికైనా ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికీ అతనికీ కూడా గొప్ప శుభాలు కలుగుతాయి. ఇక పితృజనులకిది మరింత శుభదాయకం. అందుకే మునులు, రాజులు, రాజపత్నులు మున్నగు వారిటకు వచ్చి శ్రాద్ధాది కర్మలను నిర్వహించి బ్రహ్మలోకానికి తమ పితరులను పంపించ గలుగుతారు. తామూ దేహాంతంలో బ్రహ్మ లోకాన్ని చేరుకుంటారు.
గయాసుర మండపానికి వెనుక నున్న శిలకు ముండపృష్ఠగిరి అని పేరు.ఇది సర్వదేవమయం. దీని పాద ప్రాంతంలో బ్రహ్మసరోవరాది అనేక తీర్థాలున్నాయి. వాటిలో అరవిందవనమును తీర్థమొకటి. దాని వలన ఆ పర్వతంలో నొక ప్రాంతానికి అరవింద గిరి అనే నామమేర్పడింది.అక్కడ క్రౌంచ పక్షుల పాదాల గుర్తులుంటాయి.
ఆ పర్వతభాగాన్ని క్రౌంచ పాదగిరి అంటారు. శ్రాద్ధాది కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకం ప్రాప్తింపజేసే ప్రాంతం ఇది.ఆదికాలము నుండే విష్ణుభగవానుడిక్కడ అవ్యక్త రూపంలోనూ, గదాధర శిలరూపంలోనూ నెలకొనివున్నాడు.
అందుచే ఈ శిల సర్వదేవమయమని చెప్పబడుతోంది. మత్స్య కూర్మాది విష్ణువు అవతార రూపాలకున్న ప్రాశస్త్యమే ఇక్కడి గదాధరరూపానికి వుంది. ఆదికాలం నుండే గదాధరరూపుడైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలందు కొంటున్నాడు. కాబట్టి మానవులంతా ఇక్కడికి వచ్చి, ఆగి, అర్ఘ్య, పాద్య, పుష్పాదిక ఉపహారాలతో ఆ స్వామిని పూజించాలి.
ఈ తీర్థంలో గదాధరునీ, ఇతరదేవులనీ పూజించి సర్వోపచారాలనూ సమర్పించి ముకుట, వస్త్ర, ఘంట, చామర, దర్పణ, అలంకారాలను తీర్థానికి సమకూర్చి పెట్టి పిండ, అన్నదానాలను కూడా చేసినవానికి తాను జీవించియున్నంత కాలమూ ధన, ధాన్య, ఆరోగ్య, ఐశ్వర్య, పుత్ర పౌత్ర లాభాలు అక్షయంగా వుంటాయి. ఆయువు పెరుగుతుంది.
శ్రేయ, విద్య, అర్ధ, అభీష్ట కామనల సాకారతలలో లోటుండదు. దేహాంతంలో భార్యాసమేతంగా స్వర్గాన్ని చేరుకుంటాడు. మరుజన్మలో రాజ్యసుఖాన్నీ, శత్రుసంహారక పరాక్రమాన్నీ, జయపరంపరనీ పొందికూడ వధ, బంధనాదులు నుండి ముక్తుడై చివరలో మోక్షానొందుతాడు. ఇక్కడ పిండం పెట్టినవారికీ అందుకున్నవారికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
వధ బంధ వినిర్ముక్తశ్చాంతే మోక్షమవాప్నుయాత్ |
శ్రాద్ధ పిండాది కర్తారః పితృర్భిః బ్రహ్మలోకగాః ||
ఇక్కడి పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ, సుభద్రా, బలరాములను పూజించినవారికి జ్ఞానం, లక్ష్మి, పుత్రులు మున్నగునవన్నీ కలిగి సుఖంగా వుండే జీవనం, మరియు దేహాంతంలో విష్ణుసాన్నిధ్యం కలుగుతాయి. అలాగే పురుషోత్తముడను పేర ఇక్కడ వెలసిన జగన్నాథుని సమక్షంలోనూ, సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోనూ పితరులకు పిండ దానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది.
ఈ క్షేత్రంలో వినాయకునీ, కపర్ది నామంతో వేంచేసియున్న పరమశివునీ నమస్కారంతో పూజించినవానికి అన్ని విఘ్నాలూ తొలగిపోతాయి. ఇక్కడే వెలసిన కార్తికేయ భగవానుని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ద్వాదశనామాలతో సూర్యదేవుని పూజించిన వారు సర్వరోగముక్తులవుతారు.
వైశ్వానర భగవానుడైన అగ్నిదేవుని విధివత్తుగా పూజించి ఉత్తమ కాంతిని పొందడానికీ, రేవంతుని ఆరాధించి ఉత్తమాశ్వాలను సంపాదించడానికీ, ఇంద్రదేవునారాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందడానికీ, గౌరీ దేవికి పూజలు చేసి అతులిత సౌభాగ్యాన్నందడానికీ, సరస్వతమ్మను పూజించి విద్యనూ, లక్ష్మీదేవిని పూజించి సర్వసంపదలనూ ఈ ఒక్కక్షేత్రంలోనే పొందవచ్చును. ఈ పురాణాధిపతియైన గరుత్మంతుని ఈ తీర్థంలో పూజించిన వారికి అన్ని విఘ్నాలూ ఎగిరిపోగా, బలమూ, వేగమూ వస్తాయి.
ఈ క్షేత్రపాలకుని పూజిస్తే గ్రహసమూహాల దోషాలన్నీ పోతాయి. ముండప్పృష్టమును పూజించిన వారికి అన్ని అభిలాషలూ నెరవేరుతాయి. ఇక్కడి అష్ట నాగదేవులను అర్చించిన వారిని పాము కాటు బాధింపదు. ఇక్కడ బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మలోక ప్రాప్తినొంద వచ్చును.
ఈ క్షేత్రంలో ఇంకా బలభద్రుని సమ్యక్ పూజ ద్వారా శక్తి, ఆరోగ్యాలనూ, సుభద్రా దేవ్యర్చన ద్వారా పరమ సౌభాగ్యాన్నీ, జగన్నాథ స్వామి పూజ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధినీ, శ్రీమన్నారాయణ పూజ ద్వారా రాజ్యాధికారాన్నీ, నృసింహదేవుని చరణ స్పర్శ, నమస్కృతుల ద్వారా సంగ్రామ విజయాన్నీ, వరాహ స్వామి పూజద్వారా పృథ్వీపై ఆధిపత్యాన్నీ, మాలాధర, విద్యాధరుల పూజ ద్వారా స్పర్శ ద్వారా విద్యాధర పదాన్నీ, ఆదిగదాధరుని ఆరాధన ద్వారా సమస్తాభీష్టసిద్ధినీ, సోమనాథుని పూజ ద్వారా శివలోక ప్రాప్తినీ, రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్టాపితులయ్యే భాగ్యాన్నీ భక్తులు పొందగలరు.
ఈ గయా క్షేత్రంలో వెలసిన ఆదిగదాధరస్వామి మహిమలను వర్ణించడం సామాన్యులకు అసాధ్యం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, కేదారనాథ, సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలసి భక్తులకు అన్నీ ఇస్తూ తాను మాత్రం ఆదిగదాధరుని దర్శించు కుంటూ వుంటాడు. రుద్రునితో బాటు ఆదిగదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే గాక వారి వంశాల్లో వందతరాలు ఉద్ధరింపబడతాయి.
గదాధర భగవానుని పూజించిన ధర్మార్థికి ధర్మమూ, ధనార్థికి ధనమూ, కామార్ధికి కామమూ, మోక్షార్ధికి మోక్షమూ అలవోకగా దొరుకుతాయి. అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్యపుత్రాదులు కూడా.
గదాధర మాహాత్మ్యమింకా ఇలా చెప్పబడింది.
శ్రాద్ధేన పిండ దానేన అన్నదానేన వారిదః |
బ్రహ్మలోక మవాప్నోతి సంపూజ్యాది గదాధరం ||
పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథాత్రేష్ఠా గయాపురీ |
తథాశిలాది రూపశ్చ శ్రేష్ఠ శ్చైవ గదాధరః ||
తస్మిన్ దృష్టే శిలాదృష్టా యతః సర్వం గదాధరః |
అరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹