చంద్రగ్రహ చరిత్ర మూడవ భాగము
చంద్రుడు , రోహిణీ భోజనం చేసి రాత్రి వాహ్యాళికి వెళ్ళిపోయాక – అశ్వినీ , ఆమె ఇరవై అయిదుగురు చెల్లెళ్ళూ మౌనంగా , స్వల్పంగా ఆరగించారు.
అందరూ గుంపుగా తోటలోకి వెళ్ళారు. తోటంతా కలియదిరిగారు. కానీ రోహిణీ చంద్రులు లేరు !
“మనం భోజనాలలో ఉన్నప్పుడే ఉద్యానవనంలోంచి మందిరంలోకి వచ్చేశారేమో ! అంది అశ్విని.
“అంతే జరిగి ఉంటుందే ! పదండి… పతి దేవులు ఆగ్రహిస్తారు !” భరణి ఆదుర్దాగా అంది.
అందరూ మందిరం వైపు వేగంగా నడిచారు.
భర్త ఏకాంత శయనాగారం వైపు వెళ్తున్న అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ తటాలున ఆగారు. శయనాగారం లోంచి రోహిణీ చంద్రుల స్వరాలు వినిపిస్తున్నాయి.
“అక్కయ్యలు ఏమైనా అనుకుంటే ?” రోహిణి నవ్వుతూ అడుగుతోంది. “అనుకోవడానికి ఏముంది ? ఒక విషయం చెప్పు ! ఇవాళ విస్తరిలో వడ్డించిన పదార్థాలన్నీ తిన్నావా ? ఇష్టమైనవే తిన్నావా ?” చంద్రుడు నవ్వుతూ అన్నాడు.
“ఇష్టమైనవే” రోహిణి నవ్వింది.
“విస్తరిలో ఉన్నాయని అన్నీ ఆరగించలేం. మందిరంలో ఉన్నారని అందరితోనూ విహరించలేం. ఇష్టమైనదాన్ని ఆరగిస్తాం ; ఇష్టమైన వాళ్ళతో విహరిస్తాం !” చంద్రుడు నవ్వుతూ అంటున్నాడు.
రోహిణీ , చంద్రుడూ – ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కాదు – నవ్వుకుంటున్నారు.
అశ్విని బలహీనంగా వెనక్కి తిరిగింది. దూరంగా ఉన్న కక్ష్య వైపు అడుగులు వేసింది. ఆమె సోదరీమణులు మౌనంగా ఆమెనే అనుసరిస్తున్నారు.
అశ్విని నుండి రేవతి దాకా – రోహిణిని తప్పించి – ఇరవై ఆరుగురు దక్షపుత్రికలు , నవ వధువులు భర్త మందిరానికి వచ్చి చేరిన మొదటి రోజు … మొదటి రాత్రి… నేల మీద ఒకరి పక్కన ఒకరు అలా పడి ఉన్నారు.
“అశ్వినీ ! అల్లుడికి నువ్వు జ్యేష్ఠ పత్నివి ! పట్టమహిషివి ! మొదట చంద్రుడు నిన్నే చేరదీస్తాడు. ఆయనకు అనుకూలంగా ప్రవర్తించి , అలరించు. అలాగే నీ చెల్లెళ్ళు కూడా భర్తను అలరించేలా చూడు !” తల్లి ప్రసూతీదేవి మాటలు అశ్విని చెవుల్లో గింగురుమంటూ , తమ సమీపంలోనే ఉన్న ఆమె కళ్ళలోంచి అశ్రువులు కారేలా చేశాయి.
“అక్కా…ఏమిటిలా జరిగింది ?” కృత్తిక దీనంగా ప్రశ్నించింది అశ్వినిని. “మన పతిదేవుడు మొదట నిన్ను ఆదరించి , చేరదీస్తారని అమ్మ చెప్పిందే!!
“బహుశా , ఆయన … రోహిణి మనందరికన్నా పెద్ద వధువుగా అనుకున్నారేమో ! బాధపడకండి ! అన్నీ సర్దుకుంటాయి !” చెల్లెళ్ళను ఓదార్చే తన మాటలతో తనకు కూడా ఓదార్పును వెదుక్కుంది అశ్విని..
ఆ నవ వధువుల నిట్టూర్పులతో ఆ కక్ష్యలో గాలి వేడెక్కుతోంది.
అశ్విని ఆశ నిరాశగా , రోజులు గడిచే కొద్దీ పేరాశగా మారిపోయింది.
రోహిణి తప్పించి మిగిలిన దక్షపుత్రికలను చంద్రుడు కన్నెత్తి చూడడం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. భర్త దృష్టిని ఆకర్షించాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అంటిపెట్టుకుని ఉన్న మిగతా చెల్లెళ్ళనూ పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేశాయి.
వాళ్ళెవరికీ ఇప్పుడు భర్తకు ఆహారం అందించే అవకాశం కూడా లేదు. ఆయనకు రోహిణి మాత్రమే వడ్డించాలి. ఆయనతో బాటు , ఆయన పళ్ళెంలోనే ఆరగించాలి ! చంద్రుడి ప్రవర్తన కన్నా , రోహిణి ప్రవర్తన దక్షపుత్రికలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది.
పుట్టినప్పట్నుంచీ కలిసి మెలిసి ఆడి , పాడి వాళ్ళలో ఒక్కతెగా పెరిగిన రోహిణి , ఇప్పుడు వాళ్ళెవరో తనకి తెలియనట్టు ప్రవర్తిస్తోంది. ముగ్గురు అక్కలనూ , ఇరవై ముగ్గురు చెల్లెళ్ళనూ రోహిణి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వాళ్ళందరూ ఇప్పుడామెకు అపరిచిత యువతులు !
చంద్రుడి దృష్టిలో లాగే , ఆమె దృష్టిలో కూడా వాళ్లు మందిరంలో పరిచారికలు !
రోజులు వారాలుగా , వారాలు నెలలుగా ఎదుగుతున్నాయి. రోహిణి సోదరీ మణులకూ , ”ఆమె” భర్తకు మధ్య దూరం కూడా ఎదుగుతూనే ఉంది…
“ఈ రోజు ఏమైనా సరే ఆయనా రోహిణి జలక్రీడకూ , ఉద్యానవన విహారానికి వెళ్ళేటప్పుడు మనందరమూ వెళ్ళాలి ! వాళ్ళతో బాటు జలక్రీడలో పాల్గొనాలి” మృగశిర ఉద్రేకంగా అంది.
“ఆయన వద్దన్నా వినకుండా సరస్సులో దూకాలి” ఆర్ధ్ర ఆవేశంగా అంది. అందరూ మౌనంతో తమ అంగీకారం తెలిపారు.
చంద్రుడూ , రోహిణి చేతులు కలుపుకుని ఉల్లాసంగా మందిరంలోంచి ఉద్యానవన ద్వారం దాటి వచ్చారు. అక్కడే నిరీక్షిస్తున్న ఇతర చంద్ర పత్నులు వెంట అడుగులు వేశారు.
ద్వారం దాటి సోపానాలు దిగుతున్న చంద్రుడు ఆగి విసుగ్గా చూశాడు.
“ఆగండి ! మీరెక్కడికి ? వెళ్ళి మందిరంలో పనులు చూసుకోండి”, చంద్రుడు ఆజ్ఞాపించాడు.
మృగశిరా , ఆర్ధ్ర వినిపించుకోనట్టు మరొక మెట్టు దిగారు.
“ఆగు” చంద్రుడు అరిచాడు.
“నీ పేరేమిటి”
“మృగశిర…”
“మృగ… శిర… – అందుకే మృగంలాగా ప్రవర్తిస్తున్నావు. వెళ్ళండి మందిరంలోకి”
మృగశిర ముఖం చిన్నబుచ్చుకుని , వెనుదిరిగింది. ఆర్ద్ర ఆమెను అనుసరించింది. అందరూ తలలు వాల్చుకుని మందిరంలోకి నడుస్తున్నారు.
వెనక నుండి రోహిణీ చంద్రుల నవ్వులు వాళ్ళను వెంటాడి తరుముతున్నాయి..
అశ్విని ఆమె చెల్లెళ్ళు ఇరవై ఐదుగురూ ఒకే రకమైన మానసిక స్థితిలో ఉన్నారు…
పుట్టినింటికి దూరమయ్యారు. తల్లిదండ్రుల అనురాగానికి దూరమయ్యారు. తమ సర్వస్వంగా రూపొందుతాడనుకున్న భర్తకు దగ్గర కాలేక పోయారు. చేరువలో దూరాన్ని అనుభవిస్తున్నారు. భర్తను కొంగున ముడివేసుకున్న సోదరి మూలంగా నిరంతరావమానాన్ని చవిచూస్తున్నారు.
భర్త నిరాదరణా , రోహిణి నిర్లక్ష్య ప్రవర్తనా వాళ్ళందరినీ ఒక్కటిగా దగ్గర చేశాయి. వాళ్ళ విచారం సామూహిక విచారంగా మారింది. నిస్సహాయత సామూహిక నిస్సహాయతగా మారింది. అందరిలోనూ ఒకే విధమైన నిర్లిప్తత. ఒకే విధమైన నిరాసక్తత. ఒకే విధమైన నిస్సహాయత.
మౌనంగా గుంపుగా కూర్చున్న ఇరవై ఆరుగురు దక్షపుత్రికల ఆలోచనా ప్రవాహాలకు నారదుడి రాక , ఆయన చేసే నారాయణ నామస్మరణ ఆనకట్ట వేశాయి.
దక్షపుత్రికలు లేచి , మౌనంగా ఆయనకు చేతులు జోడించారు. నారదుడు వాళ్ళను ఎగాదిగా చూశాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం ప్రతిఫలిస్తోంది.
“అశ్వినీ ! ఏమిటిలా విచారంగా ఉన్నారు ? మీ పతిదేవుడు చంద్రుడు లేడా ?” “ఉన్నారు… ఎక్కడున్నారో తెలీదు స్వామీ” అశ్విని మెల్లగా అంది.
“అంటే…?”
“మా సోదరి రోహిణీ , ఆయనా ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు తెలీదు…” భరణి సన్నని కంఠంతో దీనంగా అంది.
నారదుడు విచారంతో నిండిన వాళ్ళందరి ముఖాలనూ కలయజూశాడు. అలంకరణ లేని శరీరాలు… అలంకరణ లేని శిరోజాలు… చెంపల మీద కరిగిన కాటుక చారికలు… కళ్ళల్లో దైన్యం… అందరి ముఖాల మీదా ఒకే రకమైన విచార ముద్ర.
“అశ్వినీ… మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభను మీ ముఖదర్పణాలు చూపిస్తున్నాయి. మీరందరూ చంద్రపత్నులై ఈ మందిరంలో ప్రవేశించిన శుభకార్యానికి సూత్రధారి నేనే ! మీ విచారానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ,” నారదుడు చెప్పి ఆగాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹