రుచి ప్రజాపతితో పితరుల సంవాదం
శౌనకాది మహామునులారా! మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి.
ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయా మోహమునుండి విడివడి, నిర్భయుడై, ఎక్కువ జపతపాలను చేస్తూ, కర్మలను గావిస్తూ, తక్కువ నిద్రిస్తూ, నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృథ్విపైనే గడపసాగాడు.
క్రమంగా అగ్ని హోత్రాన్నీ, గృహస్థాశ్రమాన్నీ పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృ దేవతలతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు.
”వత్సా! నీవింకా వివాహమెందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమనీ, అది స్వర్గ, మోక్షప్రాప్తికి మార్గమనీ నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు; సమస్త దేవతలనూ, పితరులనూ, ఋషులనూ, అతిథులనూ, యాచకులనూ భోజనం ద్వారా పూజాదానాదుల ద్వారా సంతృప్తిపఱచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు;”
దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధామంత్రాలతోనూ అతిథులనూ, భృత్యాదులనూ అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయక పోవడం వల్ల నీ పితృ, దేవ ఋణాలు తీరకుండా మిగిలిపోతాయి.
అలాగే మనుష్యులకూ, ఋషులకూ, అన్యజీవాలకూ కూడా నువ్వు ఋణపడి పోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరిదశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టుని కూడా చేరుకోని బతుకులెందుకు?
పుత్రా! ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి.
రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు. మహానుభావులారా! మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్నీ, పాప సంగ్రహాన్నీ, అనంతకాలం దాకా అధోగతినీ కలుగజేస్తుందనీ అందుచేత దేనినీ గ్రహించనివాడే ధన్యుడనీ విని యున్నాను.
అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గ లేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలనూ నాశనం చేసే శక్తి ఆశక్తి వుంది. అందుకే నేనేదీ ఆశించలేదు. విద్య ద్వారా, సదానోపార్జన రూపియైన జలం ద్వారా ”తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగినవాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు.”
విద్వాంసులెంతో మంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకు పోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు.
ఇంద్రియాలకి దాసోహమై పోయే మనిషే స్త్రీ వెంటా, వివాహం వైపూ పరుగులు పెడతాడని బోధించారు. ” నేను జితేంద్రియ పురుషుడనై, తత్త్వజ్ఞానమనే తేటనీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను.”
”నాయనా! నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు; సార్వజనీనమూ కాదు, లోక కల్యాణకారకమూ కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి.” పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవీ, ప్రారబ్ధకర్మఫలాలూ వుంటాయి. వాటిని బట్టి జన్మబంధాలేర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే.
ప్రారబ్ధ పాప పుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జనప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖదుఃఖ అనుభవముల ద్వారా జరిగిపోతుంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. “నీ వివేకంతో సంసారంలో వుండి కూడా ఆత్మను రక్షించుకోగలవు” అన్నారు పితరులు.
”హే పితృదేవతలారా! కర్మమార్గం ద్వారా అవిద్యా, మాయా బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా!” మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు’ అన్నాడు రుచి.
”నాయనా! కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కాని విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా! ” మాయను, అవిద్యనూ విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా! సజ్జను లెపుడూ శాస్త్ర ప్రతిపాదితములైన విహిత కర్మలను ఉల్లంఘింపరు.
వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చేయాలి. అలా చేయని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే కాని అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యం. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెనూ ఉద్దరించి, నీవూ ఉద్ధరింపబడుతున్నావు కదా!
వంశాన్ని అభివృద్ధి పఱచి, యజ్ఞయాగాదులను చేసి, దానధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి, వానికి నిజమైన తోడు, నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోక, వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు.
అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా! కాని ఆ విషం కూడా మానవునికెన్నో విధాల ఉపయోగపడుతోంది కదా! కొండొకచో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల అవిద్య, మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి పెళ్ళి చేసుకో.
” గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు” అని బోధపఱచారు పితృదేవులు.
మెత్తబడిన రుచి ”పితరులారా! మీ మాటను జవదాటలేను. కాని, నేను వృద్ధుడనై పోయాను. నాకిపుడు పిల్లనెవరిస్తారు? “ఐనా నేను అకించనుడిని. నాదంటూ ఏమీ లేనివాణ్ణి. ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం.
”నాయనా! నీవేం చేస్తావో ఎలా చేస్తావో కాని గృహస్థుని కాకపోతే నీ పితరులమైన మేమంతా పతనమై పోతాము. నీవు అధోగతి పాలౌతావు” అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా పెనుగాలికి ఆరిపోయిన దీపాలవలె కనిపించకుండా పోయారు.
అరవై మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹