Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 -68 వ అధ్యాయం

చంద్రగ్రహ చరిత్ర ఆరవ భాగము

“రోహిణీ ! నీలో ఇంత స్వార్థం దాగి ఉందని , మీ అమ్మా , నేనూ ఊహించలేకపోయాం. ఆశల పల్లకిలో ఊరేగుతూ భర్త మందిరంలో ప్రవేశించిన ఇరవై ఆరుగురు అక్కచెల్లెళ్ళ సౌభాగ్యాన్ని కొల్లగొట్టుతున్నావు. భావావేశంలో భర్త చేసే తప్పును దిద్దే బాధ్యత భార్యది. నీ ధర్మాన్ని విస్మరించావు. నువ్వు చంద్రుడి ప్రథమ పత్నివి కావు. చతుర్థ పత్నివి. దుర్మార్గంగా ప్రథమ స్థానాన్ని ఆక్రమించావు. ఆత్మ పరిశీలన చేసుకుని అక్కచెల్లెళ్ళకు క్షమాపణ చెప్పి , అందరితో కలిసి మెలసి జీవించు !”

“అలాగే నాన్నగారూ…” రోహిణి సన్నటి కంఠంతో అంది. “నేను వస్తాను. వాళ్ళకు అన్యాయం జరిగితే మళ్ళీ వస్తాను !” అంటూ దక్షప్రజాపతి ఆవలకి నడిచాడు.

రోహిణి నీరసంగా మంచం మీద వాలింది.

తండ్రిని వీడ్కొలిపి మందిరంలోకి వచ్చిన అశ్వినికీ , ఆమె చెల్లెళ్ళకూ మందిరాన్ని ఆవరించిన నిశ్శబ్దం స్వాగతం పలికింది. తండ్రి హితబోధ తమ పెనిమిటిలో పరివర్తన తెస్తుందని నమ్మిన దక్షపుత్రికలకు నిరాశ ఎదురైంది.

మామగారి మాటలకు భయపడి ఒక్కసారిగా వెంటనే మార్పుని వ్యక్తం చేయడానికి చంద్రుడికి భేషజం అడ్డువచ్చి ఉంటుందని చెల్లెళ్ళతో అంది అశ్విని. నెమ్మది నెమ్మదిగా తమను చేరదీస్తాడనీ అంది. తమకు తాత్కాలికంగా ఓదార్చును అందిస్తున్న అశ్విని విశ్లేషణను మిగిలిన దక్షపుత్రికలందరూ విశ్వసించారు.

ఆ రాత్రి ఏకాంతంలో తండ్రి హెచ్చరికను గుర్తు చేసుకుంటూ భయపడుతున్న రోహిణీని చూసి చంద్రుడు తేలికగా నవ్వాడు.

“మీ తండ్రిగారి హుంకరింపునకు నేను భయపడను. ఆయనకు తెలీదు నా మీద ఎవ్వరి శాపాలూ పనిచేయవు. దక్షప్రజాపతి బృహస్పతి కన్నా గొప్పవాడా ? మహేంద్రుడిని మించిన ప్రభావమా అయనది ? గురువు భార్యతో ప్రణయం సాగించాను. నన్ను పోలిన అందగాణ్ణి పుత్రుడిగా పొందాను. అంత జరిగినా ఆ బృహస్పతి నన్ను ఎందుకు శపించలేదు ? ఆయనను ఆదుకున్న ఇంద్రుడు ఎందుకు నన్ను శపించలేదు !” సగర్వంగా ఆంటూ ఆగి , సమాధానం చెప్పమన్నట్టు రోహిణి వైపు దూశాడు.

“ఎందుకు శపించలేదు స్వామీ ?” సమాధానంగా ప్రశ్న సంధించింది రోహిణి.

చంద్రుడు నవ్వాడు. ఆ నవ్వు అహంకారంతో పదునెక్కింది. “అనసూయా , అత్రి దంపతుల అనుంగుపుత్రుడైన నీ అందాల చంద్రుడి మీద అన్యుల శాపాలు ప్రభావం చూపవు!”

“అయితే నా ముగ్గురు అక్కలూ , ఇరవై ముగ్గురు చెల్లెళ్ళూ…” అంటూ ఏదో చెప్పబోయింది రోహిణి.

“ఆ సోదరీ బృందం అలా పడి ఉంటారు !” చంద్రుడు నిష్కర్షగా అన్నాడు. “ఈ చంద్రుడు రోహిణీ ప్రియుడు ! రోహిణీ దాసుడు ! రోహిణీ నాథుడు ! ఆ దక్షపుత్రికలు దక్షపుత్రికలుగానే ఉంటారు. చంద్రపత్నులు కారు , కాలేరు !”

“స్వామీ…”

చంద్రుడు పళ్ళు కొరికాడు. అతని బుగ్గలు అదిరాయి. “అనుమతి లేకుండా పుట్టినింటికి వెళ్ళి , నా మీద అభియోగాలు మోపి , దక్షప్రజాపతిని వెంట తీసుకు వచ్చి , బెదిరించాలని చూస్తారా ? ఈ చంద్రుడి నిర్ణయం రేపు తెలుస్తుంది వాళ్ళకు.”

రోహిణి చంద్రుడి దగ్గరగా వచ్చింది. ఆగ్రహం ప్రత్యక్షమవుతున్న అతని ముఖంలోకి ఆనందంగా చూసింది. నెమ్మదిగా తన చెంపను అతని వక్షభాగం మీద ఆన్చింది.

“స్వామీ…మీ ఆగ్రహం…”

“నీ తనువు తాకగానే అనురాగంగా మారి పోతుంది !” చంద్రుడు నవ్వుతూ రోహిణి చుట్టూ చేతుల్ని బిగించాడు.

తమ శయనాగారంలోకి వస్తున్న వ్యక్తిని చూడగానే ఇరవై ఆరుగురు దక్షపుత్రికలూ ఆశ్చర్యపోయారు. అప్రయత్నంగా అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు.

అందరిలోనూ ఒకటే ఆలోచన. ఒకే ఆశాభావం – తమ పతిదేవుడిలో మార్పు నెమ్మది , నెమ్మదిగా వస్తున్నట్టుంది.

“మీ కోసమే వచ్చాను ,” అందరినీ కలయజూస్తూ అన్నాడు చంద్రుడు. అతని మాట ఇరవై ఆరు ముఖాల మీద చిరు నవ్వును అద్దిన కుంచెలా పనిచేసింది.

“రోహిణిని స్వీకరించినట్టు మిమ్మల్ని… ఎవ్వర్నీ… నేను స్వీకరించను !” చంద్రుడి మాట ఈ సారి ఇరవై ఆరు ముఖాల మీద మెరిసిన చిరునవ్వును ఆశ్చర్యహస్తంలా తుడిచివేసింది.

“అనుమతి లేకుండా పుట్టినింటికి వెళ్ళారు. నా మీదా , రోహిణి మీదా అభియోగాలు మోపి , ఉన్నది ఒకటి , లేనివి రెండూ కలగపిలి , రెచ్చగొట్టి మీ తండ్రిని నా మీద యుద్ధానికి తీసుకువచ్చారు. అది మీ అవిధేయత. అది మీ అహంకారం !” చంద్రుడి మాటలకు అతనిలోంచి పొంగుతున్న కోపం పదునుపెడుతోంది.

“మీ తండ్రే కాదు, ఆయన తండ్రి వచ్చి హెచ్చరించినా ఈ చంద్రుడు లెక్కించడు. కోపాలకూ , శాపాలకు భయపడిపోయి పరిచారికలుగా పడి ఉన్న మిమ్మల్ని పడకటింటికి ఆహ్వానిస్తానని భ్రమపడవద్దు. నాకు రోహిణి ఇష్టభార్య. మీరందరూ మా ఇద్దరికీ పరిచారికలు. ఇది త్రికాల సత్యం !”

అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ నిర్ఘాంతపోయి ప్రతిమల్లా నిలుచున్నారు. వాళ్ళ శ్వాస చలనం కూడా కంటికి ఆనడం లేదు. వాళ్ళందరూ ప్రతిమలు కారనీ , సజీవ శిల్పాలనీ లిఖించి చూపుతున్నట్టు అందరి బుగ్గల మీదా కన్నీళ్ళు గీతలు గీస్తున్నాయి.

రోహిణి వచ్చి భర్త ప్రక్కన నిలుచుంది. నిదానించి తన సోదరీమణుల ముఖాలను తృప్తిగా చూస్తూ ఉండిపోయింది. ఆమె పెదవులు నవ్వుతున్నాయి. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి.

“విన్నారుగా ! ఇక్కడ మీ స్థానాలేమిటో తెలుసుకున్నారుగా. ఇప్పుడింక మీ శాశ్వత కర్తవ్యం నిర్ణయించుకోండి.” రోహిణి తుది తీర్పు ఇస్తున్నట్టు కటువుగా అంది.

ఆమె మాటనూ , మాటతీరునూ మెచ్చుకుంటూ చంద్రుడి చెయ్యి పామును పెనవేస్తున్న మరొక పాములా రోహిణి చేతిని అల్లుకుంది.

సోదరి మాటలు విన్న దక్షపుత్రికల కళ్ళు క్షణంలో ఎర్రబడ్డాయి. అందాకా జారిన అశ్రుధారల్ని ఆర్పివేయడానికి ఆవిర్భవించిన నిప్పుకణాల్లా ఉన్నాయి ఆ కళ్ళు !

“ఏమిటా చేతకాని మౌనం ? ఈ మందిరానికి మహారాణి చెప్పిందిగా , ఏం చేయాలో నిర్ణయించండి. పరిచారికలుగా ఉండటానికి ఇష్టపడితే , ఎవరెవరు ఏయే గృహకృత్యాలు చేయాలో రోహిణి వివరిస్తుంది !” చంద్రుడి మాటలలో నిర్దయ స్పష్టంగా ధ్వనించింది.

ప్రతిమల్లా ఉండిపోయిన దక్షపుత్రికలలో మొట్టమొదట అశ్వినికి చలనం వచ్చింది. ఆమె ద్వారం వైపు అడుగులు వేసింది. ఆ అడుగుల సవ్వడిలో నిర్ణయం ధ్వనిస్తోంది. చెల్లెళ్ళు ఆమె వెంటే నడిచారు. *”ఏమిటా అహంకారం ? ఎవరి పని ఏమిటో తెలుసుకోరా ?” రోహిణి గద్దించింది. వాళ్ళ వైపు తిరిగి చూస్తూ.

మందిర ముఖ ద్వారం వైపు గుంపుగా వెళుతున్న దక్షపుత్రికలను చంద్రుడు కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. రోహిణి అతని చేతిని పట్టుకొని నడుస్తోంది. అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ మందిర ముఖ ద్వారం దాటి దూరంగా వెళ్ళిపోతున్నారు.

ముఖద్వారం వద్ద జంటగా నిలబడి రోహిణీ చంద్రులు చిరునవ్వుతో వాళ్ళనే చూస్తున్నారు. చంద్రుడు తలతిప్పి , రోహిణి కళ్ళల్లోకి చూశాడు. “ఉద్వాసన చక్కగా చెప్పావు ! ఈ క్షణం నుంచి మందిరమూ , మందిరంలోని ఏకాంతమూ మనవే !”

“ఉద్వాసనకు ఊపిరి పోసిందెవరు ?” రోహిణి చిపిలిగా నవ్వుతూ చంద్రుడి ముందుకు జరిగింది. ఆమె తల వెనుక భాగం చంద్రుని ఎద మీద ఆనింది. ఆమె చేతులు రెండూ తీగల్లా పైకి లేచి , అతని మెడ చుట్టూ ‘కైదండ’గా మారాయి. చంద్రుడి చేతులు రెండూ రోహిణి సన్నటి నడుమును కొలత వేస్తున్నాయి.

దక్షపుత్రికలు మలుపు తిరిగి ఆ ఇద్దరి చూపులకు అందకుండా అంతర్ధానమయ్యారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment