విష్ణు భగవానుని అమృత ధ్యానస్వరూపం
“శౌనకాది మహామునులారా! స్వాయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతరం వ్రత, యమ, నియమ, పూజా, స్తుతి, జపసహితంగా నిరతులైవుండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు, దేహేంద్రియ, మనో బుద్ధ్యహంకార ములు లేనివాడు; రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్ధుడు. అతడే అన్ని ప్రాణులకూ స్వామిగా, అందరినీ బంధనాలలో వుంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొనివున్నాడు.
ఆయన చైతన్యరూపుడే కాని నిరాకారుడు. ఏ ఆసక్తి లేనివాడైనా అందరి ఆసక్తులనూ తెలిసికొనగలడు. అందరు దేవతల చేత పూజింపబడు మహేశ్వరుడూ ఆయనే. తేజః స్వరూపుడై సత్త్వరజస్తమోగుణ భిన్నుడై కర్తృత్యాది శూన్యుడై వెలుగొందువేల్పు విష్ణువు.
ఆయన వాసనారహితుడు, శుద్ధుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్జితుడు, శోకమోహాదులకు బహుదూరుడు. జరామరణాలు ఆయనకుండవు, మోహము ఆయననంటదు. సృష్టిగాని ప్రళయంగాని ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, జాగ్రత్ స్వప్నసుషుప్తిరహితుడు. అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాధిదేవుడు ఆయనే. జాగ్రదాది మన అన్ని అవస్థలలోనూ వుండేవాడు, నిత్యుడూ ఆయనే గాని ఆయన మాత్రం కార్యకారణరహితుడు.
అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్త స్వరూపుడు, సూక్ష్మతమ స్వరూపుడు. శ్రీహరి. అంటే కొండకంటే పెద్దవానిగానూ, చీముకంటె చిన్నవానిగానూ కనబడగలడు. జ్ఞానదృష్టి గల కర్ణేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానమూ దివ్యదృష్టి గలవారికి పరమానంద స్వరూపము ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు.
తురీయ అనగా అత్యుత్తమ జ్ఞానం వున్నవాడికి ఆయన పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణుల ఆత్మ స్వరూపుడూ, సాక్షాత్కల్యాణ స్వరూపుడూ, శివమునిచ్చువాడూ, వికారహీనుడూ, వేదాంతవేద్యుడూ, వేదాంతవేద్యుడూ, వేదరూపుడూ, ఇంద్రియాతీతుడూ, భూతేశ్వరుడూ, శబ్ద రూప రస స్పర్శ గంధాలనెడి పంచతన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మమూ ఆయనే.
ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి, పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో ”అహం బ్రహ్మస్మి” అనే భావానికి మూలమై పరిజ్ఞానమాత్రుడై వుంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని ”చూడ” గలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మ స్వరూపుడు కాగలడు.
”ఇక విష్ణుని అనగా నా యొక్క మూర్తధ్యాన స్వరూపమును వినిపిస్తాను” అంటూ విష్ణువిలా వినిపించాడని సూతమహర్షి శౌనకాది మహామునులకు చెప్పసాగినాడు.
విష్ణువు కోటి సూర్య ప్రభాసంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుందపుష్పగోదుగ్ధ సమాన ధవళ వర్ణుడు. మోక్షాన్ని కోరుకొనే మునీశ్వరులు ఇట్టి స్వరూపంలో నున్న శ్రీహరిని ధ్యానిస్తారు. ఆ స్వరూపం అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో, సహస్ర సూర్యప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం గల చక్రంతో, శాంత స్వభావం ప్రస్ఫుటమగుచున్న సుందరవదనంతో, రక్షణకే పుట్టినట్లుగా చేతిలో సిద్ధంగా నున్న గదతో విరాజిల్లే రూపమిది.
ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహుమూల్య కిరీటాన్ని ధరించి వుంటాడు. కమలాన్నీ ధరిస్తాడు. వనమాలాధారియై సమాన భుజస్కంధాలతో, స్వర్ణ భూషణాలతో, శుద్ధ వస్త్రధారియై, విశుద్ధ దేహం సుందరకాంతులీనుచుండగా వెలుగులను విరజిమ్ముతూ సర్వకల్యాణకారకమైన కమలంపై నిలబడివుంటాడు.
శ్రీ మహావిష్ణువు స్వర్ణమయశరీరుడై సుందర హారాలతో, శుభంకర భుజకీర్తులతో, రత్నకంకణ కేయూరాలతో, అలంకరింపబడి తన కాంతిలో అవి మెరుస్తుండగా, కౌస్తుభమణి ఒక వైపు, లక్ష్మీదేవి మరొకవైపు ఒదిగియుండగా శోభాయమాన నేత్రాలలో కరుణ తొణికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతుంటాడు.
అణిమాది గుణసహితుడై జగత్సృష్టి సంహారాలను కావిస్తుండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యానగమ్యుడు, అత్యంత సుందరుడు.
బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణివర్గం యొక్క హృదయాలలో శ్రీహరియే ప్రాణమై వెలుగుతుంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నిటినీ అందరినీ మించిన కృపాళువు,ప్రభువు, నారాయణుడు, దేవాధిదేవుడునైన శ్రీహరి మకరాకృతిలో నున్న కర్ణకుండలాలతో శోభిల్లుతుంటాడు.
ఆయనే దుఃఖవినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్టసంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు,సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు నైన భగవంతుండు.
ఆయన నఖాల నుండి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేళ్ళు వేణువాదకుని వేళ్ళ వలె మృదువుగా వెలుగ్గా వుంటాయి. జగత్తుకే శరణ స్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖము నిచ్చు సంకల్పం, శక్తి ఆయనకున్నవి. సమస్త అలంకారాలచే అలంకృతుడై, ఆ భూషణాలే తమ పుణ్యాన్ని చూసుకొని మురిసి మెరసి పోతుండగా, సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్నిస్తుండగా సౌమ్య రూపుడై, సర్వదేవసమన్వితుడై ”నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను” అనే భావనతో భాసించువాడు శ్రీ మహా విష్ణువు. అందరి భావనలలో వుండేది కూడా ఆ వాసుదేవుడే సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే.
ఇట్టి స్వరూపమున్న విష్ణుభగవానుని ధ్యానించు మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఈ విష్ణు స్వరూపాన్నే ధ్యానించి ధర్మోపదేశ కర్తృత్వార్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది.
అరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹