వర్ణధర్మ నిరూపణ
శౌనకాది మహామునులారా! పరమ శివుని ప్రార్థన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు.
యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలో నున్నపుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్థించారు. అన్ని వర్ణాలవారూ చేయవలసిన దానధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది బోధించినా లోకకల్యాణానికే ఉపయోగపడుతుంది.
జితేంద్రియుడైన యాజ్ఞవల్క్య మహాముని సర్వప్రథమంగా విష్ణుభగవానుని ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు.
‘మునులారా! ఏ దేశంలోనైతే కృష్ణసారమను పేరు గల మృగాలు తిరుగాడు తుంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం. (ఇదే నేటి భారతదేశం) ఆ దేశానికి చెందిన ధర్మాధిక విషయాలను వినిపిస్తాను.
పురాణాలూ, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందం, జ్యోతిషంతో బాటు నాలుగువేదాలూ ఇవే ఈ దేశంలోని పదునాలుగు విద్యలకూ ఆద్య స్థానాలు.
మనువులు, విష్ణువు, యముడు, అంగిరుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితుడు, హారీతుడు, అత్రి, అల్పజీవినైన నేను మేమంతా శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులమైనాము.
ధర్మమనగా పుణ్యమే. పుణ్యానికి ఉత్పత్తి హేతువులు. శాస్త్ర విహిత దేశంలో, శాస్త్ర విహిత కాలంలో, శాస్త్ర విహితమైన ఉపాయంతో, యోగ్యులైన పాత్రులకు అనగా విద్యచే తపముచే సమృద్ధులైన బ్రాహ్మణులకు చేయబడు దానములు, సర్వశాస్త్రోక్త కర్మలు. ఈ దానాలూ ఈ కర్మలే పుణ్యము యొక్క ప్రత్యేక, విభిన్న రూపాలని తెలుసుకోవాలి.
ధర్మ లేదా పుణ్యమునుత్పత్తి చేసే ఈ దాన, కర్మముల ముఖ్య ఫలం అనగా పరమ ధర్మం యోగం (చిత్త వృత్తి నిరోధం) ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మసాక్షాత్కారమే. ఈ సాక్షాత్కారానికి దేశ కాల నియమాలుండవు. అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలుగవచ్చును. అయితే దానాలకూ, కర్మలకూ దేశకాల పాత్రల ఆవశ్యక ముంటుంది. వీటిలో కొన్ని మార్పులు చేర్పుల విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మసభ తేల్చి చెప్పాలి.
ఈ ధర్మ పరిషత్తు వేద, ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన ముగ్గురు, నలుగురు సద్ బ్రాహ్మణులతో నేర్పడి వుంటుంది. ఇదే కాక జనవంద్యుడైన బ్రహ్మవేత్త, వేదశాస్త్ర జ్ఞాతయైన బ్రాహ్మణుని మాటకు కూడా విలువ వుంటుంది.
ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములను నాలుగు వర్ణాలున్నాయి. (ఇవి కులాలు కావు. ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణను బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే… అను. వీరిలో పై మూడు వర్ణాల వారినీ ద్విజులంటారు. గర్భాదానము నుండి శ్మశాన పర్యంతము వీరి సమస్త క్రియలనూ మంత్రాల ద్వారానే చేయాలి.
గర్భాదాన సంస్కారం ఋతుకాలంలోనే చేయాలి. గర్భస్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి. గర్భాదానానికి ఆరవ లేదా ఎనిమిదవ నెలలో సీమంతోన్నయన సంస్కారం చేస్తారు. సంతానోత్పత్తి తరువాత జాతకర్మ, పదకొండవ రోజున నామకరణ సంస్కారం విధాయకాలు. నాలుగవ నెలలో నిష్క్రమణ, ఆరవ నెలలో అన్నప్రాశన సంస్కారాలు గావించాలి. తరువాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి.
ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదికయుక్తంగా చేయడం వల్ల బీజ (శుక్ర), గర్భ (శోణిత) కారణోత్పన్నాలైన సర్వపాపాలూ నశిస్తాయి. స్త్రీలకు చేసే సంస్కారాలు (పేరంటాలు) వివాహం తప్ప అన్నీ సామాన్యంగా అమంత్రకాలే. అంటే మంత్రం అక్కరలేదు.
గర్భధారణ నుండిగాని జన్మగ్రహణ నుండి గాని లెక్కగట్టి ఎనిమిదవయేట బ్రాహ్మణునికీ, పదకొండవ వర్షంలో క్షత్రియునికీ, పన్నెండవ సంవత్సరంలో వైశ్యునికీ ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చేయాలి. దీన్ని గురువు చేత గాని, వంశాచారాన్ని బట్టి కాని చేయించాలి.
ఈ విధంగా ఉపనీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతి సహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చెయ్యాలి. అలాగే శౌచాచార శిక్షనీ ప్రదానం చెయ్యాలి.
ద్విజులు పొద్దున్న సాయంత్రవేళల్లో ఉత్తరం వైపు తిరిగీ, అదే రాత్రయితే దక్షిణాభిముఖంగానూ మల విసర్జనం చేయాలి. తరువాత మలమూత్రాలు వాసన పోయేదాక మట్టితో నీటితో కడుక్కోవాలి. ఈ పనిని జలాశయ మధ్యంలో చేయరాదు. నూతుల వంటి వాటి వద్ద క్రింద చష్టాలపై కానివ్వవచ్చును. తరువాత శుద్ధస్నానానికి పోయి ఇరుపాదాలనూ శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మోకాళ్ళపై చేతులనుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని ‘బ్రహ్మతీర్ధాచమనము చేయాలి.
కూప, తటాకాది శుద్ధజలాలతో మూడుమార్లు ఆచమనం చేసి అంగుష్ఠమూలంతో రెండుమార్లు పెదవులను స్పృశించాలి. స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినపుడు ద్విజులు నురగ, బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలనూ శుభ్రపఱచుకోవాలి. నదిలోగాని మరే జలాశయంలోగాని గుండెదాకా దిగి బ్రాహ్మణులూ, గొంతు దాకా దిగి క్షత్రియులూ, తాలువుకి కొంచెం కింది దాకా దిగి వైశ్యులూ ఆచమనం చేసి శుద్ధులౌతారు.
స్త్రీలూ, శూద్రులూ తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులౌతారు.
ప్రాతఃస్నానంలో జలదైవత మంత్రమైన ఓం ఆపోహిష్టా…ను పూర్తిగా పలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోవడాన్ని పూర్తిచేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ, సూర్యోపడ్డాన, గాయత్రి మంత్ర పఠనం అనే పనులను కూడా చేసుకోవాలి.
ఓం ఆపోజ్యోతీ… మున్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు. ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికీ ఒక్కొక్కమారు ప్రణవాన్ని జోడించి మూడు మహావ్యాహతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో ముక్కులో కదలుతుండే గాలిని నియంత్రించాలి.
సాయంకాలం ప్రాణాయామం చేసి మూడు జలదేవత మంత్రాలను చదివి నీటిని తలపై చిలకరించుకొని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్రదర్శనమయ్యే దాకా గాయత్రిని జపించాలి. ఇలాగే ఉదయసంధ్యలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చుని వుండాలి. ఈ రెండు సందెలలోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చేయాలి. తరువాత అగ్నిహోత్ర కార్యమును కూడా చేయాలి.
తరువాత ”నేను అమ్ముకుడను” (ఏమీ రానివాడను) అంటూ వృందజనులకు అనగా గురువులకూ, వృద్ధులకూ ప్రణామం చేయాలి. అటుపిమ్మట సంయమియైన బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై, (ఆలోచనలను అటూ ఇటూ కదలాడనీయకుండా) స్వాధ్యాయం చేసుకొని గురువుగారికి తనను తాను అధీనం చేసుకోవాలి.
ఆయన పిలిచినపుడు పోయి విద్య నేర్చుకోవాలే గాని ”నేర్పండి” అని అడగడం సరికాదు. అడగడమే అవిధేయత. భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి. మనసు, మాట, శరీరము ఈ మూడింటినీ ఎల్లపుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చేయాలి.
బ్రహ్మచారి దండము, మృగచర్మము, యజ్ఞోపవీతము, ముంజమేఖల అను వాటిని గౌరవంగా భావించాలి. అవే అతనికొక గుర్తింపునిస్తాయి.
ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా సున్నంతకాలం భిక్షాటనం చేయవలసినదే. బ్రాహ్మణుల గృహములకు పోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్థులు క్రమంగా భవతి భిక్షాందేహి, భిక్షాంభవతి దేహి, భిక్షాం దేహిభవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి. భవతి అనగా ”అమ్మా” అని ఆ ఇంటి స్త్రీమూర్తిని సంబోధించుట.
భిక్షాటనానంతరము ఆశ్రమానికి వచ్చి అగ్నికార్యం చేసుకొని గురువుగారి ఆజ్ఞ అయినాక ఆపోశన క్రియను పూర్తిచేసి సమానులతో కలిసి కూర్చుని వినయపూర్వకంగా ఆపో శన ”పట్టాలి. తరువాత భిక్షాన్నమును నిందించకుండా, ప్రీతి పురస్సరంగా తినాలి. మౌనంగా భోంచేయాలి. బ్రహ్మచర్య వ్రతంలో నున్నంత కాలం, కఱువు కాటకాలు లేని రోజుల్లో, రోజూ ఒకేచోట కాకుండా భిక్షాటన చేయాలి. బ్రహ్మచర్యాన్ని నియమ, నిష్ఠలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి. ఎవరైనా తద్దినం, శ్రాద్ధభోజనాలకి పిలిస్తే మాత్రం పోయి వారు పెట్టినవన్నీ తినాలి. ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణరూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి. ఆ వేళలో కూడా తేనె, మద్యం, మాంసం, ఎంగిలి పదార్ధాలను స్పృశించరాదు.
బ్రహ్మచారి చేత విధివిహిత క్రియలన్నిటినీ చక్కగా చేయించి, వానికి వేదమునందు శిక్షణ నిచ్చినవాడే ”గురు” శబ్దానికర్హుడు. యజ్ఞోపవీతధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పే వానిని ”ఆచార్యుడంటారు. వేదంలోని ఒక ”దేశా”న్ని మాత్రమే అధ్యయనం చేయించిన వానిని ”ఉపాధ్యాయుడు”అని వ్యవహరిస్తారు.
ఒక యజమానిచే ”వరించ” బడి అనగా గౌరవం మీరగా పూజింపబడి అతనిచే యజ్ఞమును సంపన్నము చేయించేవానిని ”ఋత్విక్” అంటారు. బ్రహ్మచారిగా నున్నవానికి, ఆ తరువాతి కాలంలో కూడా ఈ నలుగురూ యథాక్రమంగా పూజార్హులే. వీరందరికంటే పూజ్యురాలు తల్లి.
భోజనానికి ముందు ఒకసారి చివరనొకమారు నీటితో ఆచమనం చెయ్యడాన్ని ఆపోశన అంటారు. ఈ సమయంలో అమృతోపస్తరణమసి అనే వాక్యమును చదవాలి.
మంత్రమనీ బ్రాహ్మణమనీ వేదానికి రెండు రూపాలుంటాయి. ఇందులో ఒక రూపాన్ని గానీ ఆ రూపంలోని ఒక భాగాన్ని గానీ బోధించడాన్ని ”ఏకదేశాధ్యాపన” మంటారు.
నాలుగు వేదాలూ అధ్యయనం చేయదలచుకొన్నవారు ఒక్కొక్క వేదానికి పన్నెండేసి సంవత్సరాల చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతకాలం పాటు ఆశ్రమంలో నుండుట సాధ్యపడని వారు అతిశయధీమంతులు అయితే అయిదేసి ఏళ్ళకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు. కేశాంత సంస్కారము, పదహారవ, ఇరువది రెండవ, ఇరువది నాల్గవ యేట, క్రమంగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు చేయబడాలి.
ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యేనాటికి తప్పనిసరిగా చేయబడివుండాలి. లేకుంటే వారు పతితులై, సర్వధర్మాచ్యుతులై పోతారు. వ్రాత్యస్తోమమను క్రతువును చేసిన తరువాత, అదీ కొంతకాలం గడచిన తరువాతనే వారికి మరల యజ్ఞోపవీతధారణకు యోగ్యత కలుగుతుంది.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు. ద్వి..జ.. అనగా రెండుమార్లు పుట్టినవారని. తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా! అది కాక ఉపనయనమైనపుడు మరల పుడతారు. అది రెండవ జన్మ కింద లెక్క కాబట్టి వారు ద్విజులు.
శ్రాత-స్మార్త యజ్ఞాలనూ, తపశ్చర్య (చాంద్రాయణాది వ్రతాలు)నూ, శుభకర్మలనూ (ఉపనయనాది సంస్కారాలు) బోధించగలిగేది వేదమొక్కటే. ద్విజులకు, అందుకే, వేదమే పరమ కల్యాణ సాధనము. అలాగే వేదమూలకములగు స్మృతులు కూడ.
వేదాధ్యయనం చేయగనే సరికాదు. ప్రతిదినం ఋగ్వేదమునధ్యయనం చేసేవాడు. దేవతలను తేనెతోనూ పాలతోనూ, పితరులను తేనెతోనూ, నేతితోనూ తృప్తిపఱచాలి. అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు.
మిగతా మూడు వేదాలలో దేనిని ప్రతిదినం అధ్యయనం చేసే వారైనా నేతితో అమృతంతో పితరులనూ దేవతలనూ సంతోషపెట్టాలి. అలాగే ప్రతిదినం ”వాకోవాక్యం, పురాణం నారాశంసీ, ” గాథిక, ఇతిహాసాలు ” విద్యా… లను అధ్యయనం చేసే ద్విజుడు పితరులనూ దేవతలనూ, మాంసం (ఫలాలు)…, పాలు, అన్నములతో తృప్తి పఱచాలి.
ఈ దేవతలూ పితరులూ కూడా ఒకనివల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభ, అభీష్టాలనూ ప్రసాదిస్తారు. ఏయే యజ్ఞ ప్రతిపాదిత వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలను పొందుతాము. అంతేకాక భూమి, దాన, తపస్సు, స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలము.
నైష్ఠికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే వుండాలి. ఆయన లేకుంటే ఆ కుటుంబసభ్యుల వద్ద వుండాలి. వారంతా కలసి ఎక్కడికైనా పోయినపుడు తనచే ఉపాసింపబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో వుండాలి.
ఈ రకంగా భోగాలను వదలి, మెదడును పెంచి, శరీరాన్ని కృశింపజేసుకొని జితేంద్రియుడై బ్రహ్మ చర్యాశ్రమమున జీవించిన వానికి జన్మ చివర్లో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పునర్జన్మ వుండదు.
అరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹