Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – డెబ్బయ్యవ అధ్యాయము

చంద్రగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము

దక్షప్రజాపతి ఇంద్రుడి వైపు చూశాడు. “ఇంద్రా ! నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టం నాకు లేదు. సరస్వతీ నది సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే క్షయ తగ్గుముఖం పడుతుంది. చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది. ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు పక్షం రోజులు వృద్ధి చెందుతాడు. పక్షం రోజులు క్షీణిస్తూ ఉంటాడు. భార్యలందరినీ సమదృష్టితో చూసే సత్ప్రవర్తన సరస్వతీ సంగమ స్నానం ద్వారా సిద్ధించే వృద్ధికి మూలంగా ఉంటుంది.”

“మాతామహా ! అంటే చంద్రుడు ఒక మాసంలో పక్షం రోజులు తన ”కళ” పరంగా క్రమంగా వృద్ధి చెందుతూ పరిపూర్ణమైన కళతో ఆనందంగా ఉంటాడు. రెండవ పక్షం రోజులూ కళ క్షీణిస్తూ ఉంటుంది ! అంతే కదు !” అన్నాడు ఇంద్రుడు.

“చక్కగా గ్రహించావు ! మాసంలో సగం రోజులు వృద్ధి చంద్రుడుగా , సగం రోజులు క్షీణ చంద్రుడుగా ఉంటాడు !” దక్షుడు వివరించాడు. “ప్రతీ అమావాస్య నాడూ ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉండాలి !”

“చక్కటి పరిష్కారం. ఇది ఉభయతారకం !” నారదుడు మెచ్చుకున్నాడు.

చంద్రుడిని అక్కడే వదిలి పెట్టి , ఇంద్రాదులు వెళ్ళిపోయారు.

“మామగారూ ! నన్ను క్షమించండి !” చంద్రుడు దక్ష ప్రజాపతితో అన్నాడు.

“క్షమించాను గనుకనే శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించాను. అమావాస్య , అమావాస్యకూ సరస్వతీ సాగర సంగమ స్థానంలో పవిత్ర స్నానం చేస్తూ , నీ కళలను వృద్ధి చేసుకుంటూ ఉండు. నీ సప్తవింశతి సతీమణులనూ సమానంగా ఆదరించు !” దక్షుడు ప్రబోధించాడు.

చంద్రుడు అశ్వినీ , ఆమెలాగే తన మూలంగా క్షోభించిన ఆమె చెల్లెళ్ళనూ కలయజూస్తూ , గద్గద కంఠంతో క్షమాపణ అడిగాడు. చేసిన అపరాధానికి చింత వ్యక్తం చేసి , అత్తగారి ఆశీస్సులు అందుకున్నాడు. అందరి నుండి అనుమతి స్వీకరించి , సరస్వతీ సంగమ స్థానంలో స్నానం చేయడానికి వెళ్ళాడు.

పావన తీర్థంలో స్నానం చేయగానే చంద్రుడి శరీరాన్ని పీడిస్తూ వస్తున్న భయంకర వ్యాధి నిమ్మళించింది. ఆరోగ్యాన్ని పుంజుకుంటూ , వర్చస్సునూ , కళనూ పెంపొందించు కుంటూ పత్నులందరితోనూ అత్తవారింట కొంతకాలం విడిదిచేసి ఇరవై ఏడుగురు చక్కని చుక్కలనూ వెంటబెట్టుకుని తన మందిరం చేరుకున్నాడు చంద్రుడు.

ఆనాటి నుండి పత్నులందరినీ సమదృష్టితో ఆదరిస్తూ – ”బహు సతీవ్రతుడి”గా పేరు పొందాడు. చంద్రుడు కళాపూర్ణుడైన క్షణం నుంచీ ఔషధులకూ , వృక్షసంతతికీ , సస్యాలకూ ప్రాణాలు లేచి వచ్చాయి.

ప్రాణులకు ఆహారము , ఆరోగ్యం సంప్రాప్తించాయి. అన్ని లోకాలలోనూ ఆనందం వెల్లివిరిసింది.

చంద్ర మందిరం ఆనంద మందిరంగా మారింది.

“ఇదీ చంద్రుడి చరిత్ర !” కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.

“ఆలోచిస్తూ ఉంటే , చంద్రుడు సౌందర్యోపాసకుడనిపిస్తోంది. గురువుగారూ !”. విమలానందుడు నవ్వుతూ అన్నాడు. “వివాహానికి ముందు తారా ప్రణయం , వివాహానంతరం రోహిణీ పక్షపాతం !”

నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “స్థూల దృష్టికి కనిపించేది అదే ! ఇలాంటి విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి. అలా ఆలోచించేటప్పుడు ప్రస్తుతం మన ఆచారాలనూ , నియమ నిబంధనలనూ , కట్టుబాట్లనూ కొలబద్దలుగా తీసుకోరాదు. చంద్రుడు నవగ్రహాలలో ఒకడు. దైవస్వరూపుడాయన. దైవస్వరూపాల కార్యకలాపాలు లోకాల హితం కోసమే జరుగుతాయి. చంద్రుడు తారతో ప్రణయ యాత్ర సాగించాడు. దాని ఫలితంగా నవగ్రహాలలో మరొక గ్రహమైన బుధుడు ఆవిర్భవించాడు. ఇదే లోక హితం ! ఆ విషయంలో బృహస్పతి ఆలోచనా , స్పందనా సుస్పష్టమే. తన ధర్మపత్ని తార పాతివ్రత్యానికి భంగం కలిగిందని ఆయన అనుకోలేదు. స్త్రీ వ్యభిచార దోషం బహిష్టుతో ప్రక్షాళనమైపోతుందన్న నీతిని ప్రకటించిన శాసనకర్త ఆయన. తను అనుశాసన ధర్మానికి కట్టుబడే ప్రవర్తించాడు.”

“ఇక చంద్రుడి రోహిణీ పక్షపాతం – రోహిణిని ఇష్ట పత్నిగా నెత్తికెక్కించుకుని , ఇతర పత్నుల్ని కష్టపెట్టినందుకు ఆయన క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. పర్యవసానంగా నెలలో పక్షం రోజులు వృద్ధి చంద్రుడుగా , పక్షం రోజులు క్షీణ చంద్రుడుగా ఉండాల్సి వచ్చింది. సృష్టిలో – ఈ విశ్వంలో సాగుతూ వస్తున్న చంద్రుడి వృద్ధి , క్షీణత వల్ల వాతావరణానికి మేలే జరిగింది కదా ! లోకాలకు హితమే జరిగింది కదా ! అదే విధంగా అంతరాళంలో నెలకొన్న చంద్రుడి వల్లా , ఆయన పత్నులైన అశ్వినీ , భరణీ మొదలైన ఇరవై ఏడు నక్షత్రాల వల్ల కూడా జరిగిందీ , జరుగుతుందీ లోకహితమే !”

“బాగుంది గురువుగారూ ! మీ విశ్లేషణ మాలో కలిగిన అనుమానాలను నివృత్తి చేసింది !” శివానందుడు అన్నాడు.

“సంతోషం , నాయనా ! ఇప్పుడు నవగ్రహాలలో మూడవ గ్రహమైన కుజుడి చరిత్ర శ్రవణం చేయండి !” నిర్వికల్పానంద అన్నాడు. “కుజుడు పరమశివుడి స్వేదబిందువు నుంచి ఆవిర్భవించాడనీ , భూదేవి ఆ బాలుడిని తన బిడ్డగా స్వీకరించిందనీ చెప్పుకున్నాం. కదా ! పరమేశ్వరుడు సూచించిన విధంగా , భూమాత కుజుణ్ణి కన్నబిడ్డలా చూసుకుంటోంది. కుజుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు…”

రేపటి నుండి కుజగ్రహ చరిత్ర చదువుకుందాము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment