గృహస్థ ధర్మ నిరూపణం
యాజ్ఞవల్క్య మహర్షి ఇంకా ఇలా ప్రవచింపసాగాడు. యతవ్రతమునులారా! విద్యాధ్యయన సమాప్తి కాగానే బ్రహ్మచారి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆయన అనుమతితో స్నానం చేసి బ్రహ్మచర్య వ్రతానికి వీడ్కోలు పలకాలి.
తరువాత తల్లిదండ్రుల అనుమతితో గాని, గురువుగారి ఆదేశానుసారముగాని ఒక సులక్షణా, అత్యంతసుందరీ, మనోరమా, అసపిండా, వయసులో తనకన్న చిన్నదీ, అరోగా, భ్రాతృమతీ, భిన్న ప్రవర, గోత్రీకురాలూ నగు కన్యను వివాహం చేసుకోవాలి.
ఈ సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి సపిండ ఎవరో కూడా వివరించాడు. తల్లితో మొదలుపెట్టి ఆమె తండ్రి, తాత, ముత్తాత… అలా లెక్కపెడుతూ పోయి ఏడవతరం దాకా ఉండిన వారందరినీ సపిండ్యులుగా భావించాలి. ఈ మధ్యలో వరుని వంశంలో ఎక్కడ కలిసినా ఆమె సపిండ్యయే అవుతుంది. ఎక్కడా కలవనిదే అసపిండ కాగలదు. అసపిండనే పెళ్ళి చేసుకోవాలి.
అలాగే ఆమె మాతృ వంశంలోనూ పితృవంశంలోనూ అయిదేసి తరాల దాకా విచారించి సదాచార, అధ్యయన, పుత్రపౌత్ర సమృద్ధి దృష్టిలో పెట్టుకొని వారి ఖ్యాతిని చూడాలి గాని ధనాన్ని బట్టి కాదు. ఇటువంటి కన్యను కల్యాణమాడదలచుకొనే వరుడు కూడా సమానవర్ణుడూ, ఆమెకి తగినవాడునై వుండాలి.
వర్ణసంకరం పనికిరాదు. ఏ వర్ణం వారు ఆ వర్ణం వారినే పెండ్లి చేసుకోవాలి. కొంతమంది విద్వాంసులు అగ్రవర్ణులు శూద్రకన్యలను పెళ్ళి చేసుకోవచ్చని వచిస్తారు. కాని నేనుదానికంగీకరించను. ఎందుకంటే ”ఆత్మా వైజాయతే పుత్రః” అనీ ”అంగాంగాత్స భవసి” అని వేదం ఘోషిస్తోంది.
ద్విజుడే శూద్రునిగా పుట్టి, ఆ శూద్రుడు ఈ ద్విజుని వలె, అంత జ్ఞానం సంపాదించకుండానే, గౌరవాదరాలు పొందాలనుకొని, సమాజం దానికడ్డుపడడంతో దానిపై, ద్విజజాతిపై కక్షగట్టి… ఇలా సమాజానికీ సవాలుగా నిలుస్తాడు.
బ్రాహ్మణుడు తన వర్ణం నుండి ఒక కన్యను వివాహం చేసుకున్న పిమ్మట ఇతర వర్ణాల కన్యలను పెండ్లాడవచ్చనీ, క్షత్రియులు క్షత్రియ కన్యను పెండ్లాడిన పిమ్మట వైశ్య, శూద్ర కన్యలను వివాహమాడవచ్చుననీ, వైశ్యులు వైశ్య కన్యతో వివాహమైన పిమ్మట శూద్రకన్యను చేసుకోవచ్చుననీ, శూద్రుడు మాత్రం శూద్ర కన్యను మాత్రమే పెండ్లాడాలనీ పెద్దలంటారు.
(అదిసామాజిక అవసరమైనపుడే అంగీకార్యమయ్యేది) కన్యకి కనీసం ఒక అన్నదమ్ముడైనా వుండాలి. అంతేకాని, పుత్రికా ధర్మం గల కన్య ప్రశస్తం కాదు. ఈ కన్య యొక్క పుత్రుడే ఆమె తండ్రికి పిండం పెట్టవలసి వస్తే ఆమెను పుత్రికా ధర్మం గల కన్య అంటారు. వివాహాలలో ఎనిమిది రకాలున్నాయి.
అవి బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, ఆసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ విధాలు, ఉత్తమ వంశానికి చెందిన, మంచి శీలస్వభావాలున్న వరుని మామయే స్వయంగా తన ఇంటికి పిలిచి, అలంకరించి, పూజించి కన్యాదానం చేయడం బ్రాహ్మ వివాహం. యజ్ఞం చేస్తూ ఋత్విజుని అలంకృతుని చేసి పూజించి కన్యనివ్వడం దైవ వివాహం. వరుని నుండి ధర్మార్ధంగా ఒకటి రెండు జతల ఆవులను ఎద్దులను స్వీకరించి శాస్త్రోక్తంగా పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యడం ఆర్ష వివాహం.
వధూవరులనొకచోట చేర్చి ”మీరిద్దరూ కలసి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించండి” అని చెప్పి పూజ చేసి కన్యను దానం చేయడం ప్రాజాపత్యం.
కన్యకూ, ఆమె తండ్రికీ, ఆతని బంధువులకూ యథాశక్తి ధనాదులనిచ్చి స్వచ్ఛందంగా వరుడే కన్యను గ్రహించడం ఆసురవివాహం.
కన్యాబ్రహ్మచారీ పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకొనేది గాంధర్వం. కన్యను అపహరించి గొనిపోయి వరుడు తన స్వగృహంలో శాస్త్రోక్తంగా చేసుకొనేది రాక్షస వివాహం.
అన్నిటికన్నా అధమమైనది నిదురిస్తున్న, కామంపట్టిన లేదా మతిలేని కన్యను ఎవరూ చూడకుండా పట్టుకుపోయి వరుడే చేసుకొనేది. దీనికి పైశాచ వివాహమని పేరు.
మొదటి నాలుగు రకాల వివాహాలూ బ్రాహ్మణ వర్ణంలోనూ తరువాతి రెండు విధాల పెళ్ళిళ్ళూ క్షత్రియ వర్ణంలోనూ తఱచుగా అవలంబింపబడుతూ వుంటాయి.
సవర్ణ వివాహాలలో గృహ్యసూత్రానుసారం కన్య వరుని పాణిగ్రహణం చేయాలి. కృతత్రేతా ద్వాపరయుగాల్లో క్షత్రియ కన్య బ్రాహ్మణ వరునిగానీ వైశ్యవరుడు శూద్రకన్యను గానీ ఇదివఱకే చెప్పినట్టు వివాహం చేసుకోవడం ఆచారంగా కొన్నిచోట్ల ప్రత్యేక సందర్భాలలో జరిగేది. కలియుగంలో ఈ పద్ధతి ఎక్కడా, ఎటువంటి సందర్భాలలోనూ లేదు. వర్ణసంకరం జరుగరాదు.
కన్యాదానాన్ని గావించే అధికారం కన్యయొక్క తండ్రికీ, తాతకీ, సోదరునికీ సకుల్యునికీ” లేదా తల్లికీ వుంటుంది. తండ్రిదే ఈ ధర్మం, ఈ భాగ్యం. ఆయన లేకపోయినా, ఉండీ మతిస్థిమితం లేనివాడై పోయినా తాతకీ, అలా అదే క్రమంలో తరువాత చెప్పబడిన వారికీ ఈ అవకాశమివ్వ బడుతుంది.
కన్యాదానం చేయవలసినవాడు చేయకపోతే వానికి ఆ కన్య ఋతుమతియైనపుడల్లా ఒకటొకటిగా భ్రూణహత్యల పాపం చుట్టుకుంటుంది. కన్యాదాతలు లేనపుడు కన్యయే తనకు తానుగా తనను తాను దానము చేసుకొనే వెసులుబాటు కూడా అంగీకార్యమే.
కన్యను ఒకమారే దానంచెయ్యాలి. అలా చేసిన తరువాత ఆమె భర్తపై దౌర్జన్యం చేసి గాని మరొక విధంగా గాని ఆమెనపహరించి మరొకరికి దానమిచ్చువాడు చౌరకర్మతో సమాన పాపమునకు దండనార్హుడవుతాడు. ఆమె దోషమేమాత్రమూ లేకుండా పత్నిని పరిత్యజించు పతి దండనీయుడు. అత్యంత దుష్టురాలు (మహాపాతకి)గు పత్నిని పరిత్యజించవచ్చును.
ఒక కన్యను ఒక వరునికిచ్చుటకు వాగ్దానము చేయబడిన పిమ్మట వివాహానికి ముందే వరుడు మరణిస్తే ఆమెను జీవితాంతం వితంతువుగా గొడ్రాలిగా నుంచి వేయుట ధర్మము కాదు. ఆమెకు పుత్రవతి కావలెననే కోరిక వుంటే మరిది కాని, వరుని సపిండ, సగోత్రులలో నామెకు ఈడైనవాడెవరైనా కాని పెద్దల ఆజ్ఞ మేరకు ఆమెకు పుత్రుని సామాన్య పద్ధతిలోనే ప్రసాదించాలి. ఈ విధంగా ఈ పద్ధతిలో నామెకు కలిగిన పుత్రుడు ఆ మృతి చెందిన వరుని యొక్క క్షేత్రజ్ఞ పుత్రునిగానే పరిగణింపబడతాడు.
వివాహిత స్త్రీ వ్యభిచారానికి అలవాటు పడిపోతే, ఆమెను మంచి దారిలో పెట్టడానికి ఆమె పతి, అతని బంధువులూ శాయశక్తులా ప్రయత్నించాలి. చివరి ప్రయత్నంగా ఆమె అసహ్యక జీవనంపై ఆమెకే వైరాగ్యం కలిగేలాగ, ఆమెను ఇంటిలోనే వుంచి గృహిణిగా ఆమెకు గల అధికారాలన్నిటినీ తొలగించాలి. అలంకరించుకోనీయకుండా మలినగానే వుంచాలి. ఏదో ప్రాణరక్షణకు సరిపడునంతగానే తిండిపెట్టి కటిక నేలపై పడుకోబెట్టాలి.
స్త్రీకి వివాహానికి పూర్వమే చంద్రుడు శుచినీ, గంధర్వులు సౌందర్యాన్నీ మధురవాణినీ,అగ్నిదేవుడు అన్ని రకాల పవిత్రతనీ ప్రసాదిస్తారు.
కాబట్టి ఈ దేవతలను పూజలందే భారతదేశం వంటి దేశాల్లో స్వభావసిద్ధంగా స్త్రీలందరూ పవిత్రులే అయివుంటారు. అయినా కూడా పూర్వకర్మల వల్ల తేడాలు రావచ్చు. అందుచే స్త్రీకి దోషమంటదనే నిశ్చయానికి రావడం సరికాదు. ఒక స్త్రీ తన పతికానివానిని మనసులో వాంఛిస్తే అదీ ఒక రకమైన వ్యభిచారమే అవుతుంది.
అలాగే పరపురుషునితో సంపర్కాన్ని సంకల్పించినా వ్యభిచారమే కాగలదు. ఈ మానసిక వ్యభిచార దోషము ఆమె ఋతుకాలిక రజోదర్శనము కాగానే పోతుంది కాని మరల అటువంటి ఆలోచనలు చేయరాదు. నిజంగానే పరపురుషునితో సంగమించినా, తద్వారా గర్భధారణ చేసినా ఆ స్త్రీని పరిత్యజించవలెను. ఇలాగే గర్భవం, పతివధ, బ్రహ్మహత్య, శిష్యులతో సంగమం వంటి పనులలో నేది చేసినా ఆమెను మహాపాతకిగా అభిశంసించి పరిత్యజించాలి.
మదిరాపానం చేసేది, దీర్ఘరోగిణి, శాశ్వతద్వేషి, సంధ్య, అర్ధనాశిని, అప్రియవాదిని, నిష్టురభాషిణి లేదా పతికి హాని చెయ్యడం కోసమే జీవించునట్లుండేది యగు భార్యను ఆమె భర్త పరిత్యజించవచ్చును; మరొక వివాహం చేసుకోవచ్చును. అయితే తాను మొదట వివాహం చేసుకొని ఇపుడు పరిత్యజించిన స్త్రీని దాన, మాన, సత్కారాదుల ద్వారా భరణ సమన్వితను చేస్తుండాలి. అలా చేయనివాడు మహాపాపిగా నిందితుడు.
అన్యోన్యంగా దంపతులుంటే ఆ గృహానికి ధర్మార్థ కామవృద్ధి త్రివర్గవృద్ధి పుష్కలంగా వుంటుంది. భర్త పోయిన పిమ్మట ఇంకొక పురుషుని ఆశ్రయించకుండా అతని జ్ఞాపకాల బలిమితోనే జీవించే స్త్రీనీ, ఎట్టి విపత్కర పరిస్థితులెదురైనా భర్తను వదలిపోకుండా వుండే స్త్రీనీ లోకం నెత్తినబెట్టుకొని పూజిస్తుంది.
ఈ లోకంలో యశంతోబాటు ఈ పాతివ్రత్యమహిమ వల్ల పరలోకంలో పార్వతీదేవి సాహచర్యం చేసే భాగ్యమబ్బుతుంది. భార్యను పరిత్యజించినవాడామె సుఖంగా, ప్రసన్నంగా బతికేలా చూసుకోవాలి.
తన సంపత్తిలో మూడవవంతు ఆమెకిచ్చెయ్యాలి. స్త్రీకి తన భర్త యొక్క ఆజ్ఞను పాలించుటయే పరమధర్మము. స్త్రీకి ఋతు లేదా రజోదర్శనమైన తొలి దినం నుండి పదహారవ రాత్రివఱకూ సంతానప్రాప్తికి అవకాశముంటుంది. పుత్రప్రాప్తి కోసమై పురుషుడు ఆ రాత్రులలో మాత్రమే ఆమెతో సంగమించాలి. ఇలా సంతానం కోసం మాత్రమే సంగమించి మిగతా కాలాల్లో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే బ్రహ్మచర్య వ్రతం. అంతేగాని బ్రహ్మచర్యమంటే పెండ్లిని మానుకొనుట, స్త్రీవైపే చూడకపోవుట కాదు.
పర్వతిథులలోనూ’ ఋతుకాలం మొదటి నాలుగు రాత్రులందూ, దినము అనగా ఎప్పుడైనా పగటివేళా సంగమం నిషిద్ధం. మఘ, మూల నక్షత్రాలలో సంగమం వర్జ్యం.
ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తేనే సుందరుడు, సబలుడు, సద్గుణవంతుడు, ఆరోగ్యవంతుడునైన కొడుకు పుడతాడు. స్త్రీ పట్ల అన్ని బాధ్యతలూ అనగా తిండి, బట్ట, ఇల్లు మున్నగునవే కాక ఆమె కామవాంఛను పూర్తిగా తీర్చి ఆమెను సంతృప్తి పఱచవలసిన బాధ్యత కూడా ఆమెను చేపట్టిన వానిపై వుంటుంది. పైగా ఈ బాధ్యతకు సంబంధించి ఇంద్రుడు స్త్రీలకొక వరాన్నిచ్చాడు.అదేమనగా స్త్రీ యొక్క కామవాసనను అనిషిద్ధ రాత్రులందు ఆమె పతి తప్పనిసరిగా తీర్చాలి. లేకుంటే వాడు పాపమును మూటకట్టు కుంటాడు.
స్త్రీని ఇంటియిల్లాలిగా గృహలక్ష్మిగా సంభావించి మెట్టినింటి వారంతా అనగా భర్త, వాని సోదరులు, వాని తల్లిదండ్రులు, ఇష్టబంధువులు ఆమెను మధురాహారముతో చీని చీనాంబరాలతో అలంకార విశేషాలతో ఎల్లప్పుడూ ప్రసన్నంగా సుఖంగా వుండేలా చూడాలి. ఇది సామాజిక బాధ్యత కూడా.
స్త్రీకి గల బాధ్యతలు బాగా ఎక్కువ. ముఖ్యంగా పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎంతో బాధ్యతా యుతంగా వుండాలి. పుత్రసంతానమైనా స్వర్గప్రాప్తియైనా స్త్రీకి ”భర్తకు తనపై గల” ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తాయి కాబట్టి ప్రతి ఆడదీ తన పత్యారాధన ఫలితంగా, స్నేహఫలంగా పతి ప్రేమను పొందాలి.
సాధారణ స్త్రీకి శాస్త్రాలను గాని గ్రంథాలను గాని పఠించే అర్హత లేదు కాని భర్త ద్వారా వాటన్నిటినీ ఆమె వినవచ్చును. విధి నిషేధ పూర్వకంగా భర్త చెప్పే ధర్మాచరణను సాంతమూ చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి నందవచ్చును. భర్త అనంతరం కొడుకే ఆమెకు ధర్మశాస్త్రగురువు కాగలడు.
గృహస్థధర్మానికి మూలం పతివ్రతయగు గృహిణి. ఆమె పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకొని వుండాలి. అతడెపుడేది కోరుకుంటాడో దానిని అప్పటికి అతడు అడగకుండానే అమర్చిపెట్టాలి. సర్వకాల సర్వావస్థలలోనూ అతని మేలునే కోరుతూ తన ప్రతిపనీ ఆ ఆశయం వైపే మళ్ళేలా చూడాలి, చేయాలి.
భర్త యొక్క తల్లిదండ్రులనూ, అక్కచెల్లెళ్లనూ, అన్ననూ, పినతండ్రినీ, గురువునీ, వృద్ధ స్త్రీలనూ గౌరవించడం ఆదరించడం పత్నియొక్క ధర్మం. తనకన్నా చిన్నన్నవారైన భర్తృ వర్గీయులతో స్నేహంగా వుంటూనే ఇంటి పనులు చేయించుకోవాలి. లేకుంటే సోమరులవుతారు.
పతి యొక్క బంధువుల మధ్యలో తాము కూర్చునియున్నపుడామె యొక్క మాటలు, చేతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి; ఈ సంగతి అందరికీ తెలియాలి. ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి. ఇంటికోడలు తనకు వరసైన పురుషులతో హాస్యాలాడకూడదు.
పర పురుషునితో ఏకాంతం అసలు ఉండనేకూడదు. పరపురుషుల చేతిలో ఏ వస్తువునూ ఉంచకూడదు, వారి చేతి నుండి తన చేతితో అందుకొనరాదు. భర్త అక్కడే వున్నా కూడా పరపురుషులు మధ్య కూర్చొనరాదు.
ఇంటిలోని సామగ్రి అంతా ఆమె అధీనంలోనే వుంటుంది. దానిని అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరానికి తగినంతగా వాడుతుండాలి. కార్యకుశల, ప్రసన్న, మితవ్యయి అయివుండి రోజులో ఒకసారైనా అత్తమామలకు పాదాభివందనం చేసే స్త్రీని భర్త ప్రేమిస్తాడు. సమాజం గౌరవిస్తుంది.
ప్రోషిత పతికగానున్నపుడు అనగా తన భర్త పరదేశానికి వెళ్ళినపుడు తన సఖీజంతో ఆనందంగా ఆటలాడడం, పొరుగు వారిళ్ళలో కూర్చుని వాగడం, అతిగా అలంకరించుకోవడం, ఉత్సవాలలో పాల్గొనడం, హాసాలూ పరిహాసాలూ వంటివి చేయరాదు.
ఇల్లాలి మనుగడ పతితోనే. వీలైనంతవరకు ఆమె గడపవలసిన సమయమూ అతనితోనే. ఆమె అధికారాలు పరిమితమే అయినా గృహస్థధర్మానికీ తద్ద్వారా సమాజానికీ ఆమె అవసరం అపరిమితం. అందుకే సదాచారిణియైన స్త్రీ మరణించినపుడు అగ్నిహోత్రం లోని అగ్నితో ఆమె దహన సంస్కారాలను చేస్తారు. పతిహితైషిణియైన పత్నికి ఈ లోకంలో కీర్తి సమ్మానాలూ పరలోకంలో స్వర్గమూ సంప్రాప్తిస్తాయి.
అరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹