మొదటి భాగము
వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం – గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం
బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధవసిక్త అనే సంకరజాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ఠ. బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారశవనిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకరమన్నారు
పురుష – స్త్రీ – సంకరజాతి పేరు
క్షత్రియ – వైశ్య – మాహిష్య
క్షత్రియ – శూద్ర – మేల్చ
వైశ్య – శూద్ర – కరణ
క్షత్రియ – బ్రాహ్మణ – సూత
వైశ్య – బ్రాహ్మణ – వైదేహక
శూద్ర – బ్రాహ్మణ – చండాల
వైశ్య – క్షత్రియ – మాగధ
శూద్ర – క్షత్రియ – క్షత్తా
శూద్ర – వైశ్య – ఆయోగవ”
మాహిష్య – కరణ – రథకార
సంకరం వల్ల చెడిన వర్ణం మరల పాతదశకు రావాలంటే ఆరు తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికీ శూద్రునికీ పుట్టిన సంతానాన్నీ నిషాదులన్నాము కదా.
ఆ నిషాదుని కొక కూతురు పుట్టి,దానినొక బ్రాహ్మణుడు పెండ్లాడి, వారికొక కూతురు పుట్టి, దానినీ బ్రాహ్మణుడేమనువాడి… అలా నిషాద, బ్రాహ్మణ వివాహం ఆరు తరాల బాటు కొనసాగితే ఏడవతరం నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్ళి చేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఏడవతరం వారవుతారు కదా! వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి.
అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన అంబష్ట జాతిలో అయిదవతరానికి పుట్టినవారు అనగా ఆరవతరంవారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. అలాగే మూర్ధవసిక్త జాతిలో అయిదవ తరంవారు శుద్ధబ్రాహ్మణులు ఆవుతారు. ఇదే విధంగా ఉగ్రా, మాహిష్యా జాతులలోనూ ఏడవ ఆరవ తరాలలో శుద్ధ క్షత్రియులుద్భవిస్తారు.
అదే విధంగా కరణనామక సంకరజాతిలో ఆరవతరంలో శుద్ధ వైశ్యులుద్భవిస్తారు. అనగా సంకరదోషం పితృవర్ణ బీజం ఆరేడుతరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే గాని కడుక్కుపోదు.
వర్ణసంకరమంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేదని కాదు. వృత్తి విషయంలో కూడా జరుగుతుంది. యాజన, అధ్యయన, అధ్యాపనాలను చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక, బతుకు గడవక క్షత్రియ, వైశ్య లేదా శూద్రవృత్తి నవలంబించవచ్చు.
ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పనిని చేసినా అది కర్మ వ్యత్యయమవుతుంది. అదీ వర్ణ సంకరంవంటిదే. అయితే పరిస్థితులు మెరుగు పడగానే ఎవరి అసలు పనిలోకి వాళ్ళు వెళ్ళకుండా తమ వర్ణం కన్నా హీనవర్ణానిక చెందిన కర్మను నిర్వహిస్తూ వుండి పోతే వారు వర్ణసంకరులుగానే పరిగణించబడతారు.
వారు క్రమంగా ఏడవ, ఆరవ, అయిదవతరంల దాకా ఆ హీనవృత్తిలో వుండిపోవలసినదే. ఇక సంకరజాతులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి సంకర, సంకీర్ణ,సంకర, వర్ణ సంకీర్ణ సంకర విభాగాలు.
అనులోమజులు, ప్రతిలోమజులు అనగా నిదివఱకు చెప్పబడిన మూర్ధవసిక్త నుండి ఆవయోగ జాతి దాకా గల పన్నెండు రకాలవారూ సంకరజాతి విభాగానికి చెందినవారు.
ఈ సంకరజాతిలో మరల సంకరం జరుగగా పుట్టినవారు అనగా మాహిష్య-కరణ సంయోగం వల్ల పుట్టిన రథకార జాతి వంటి వారు సంకీర్ణ సంకరజాతి వారవుతారు.
మరింత లోతైన సంకరం జరిగిన చోట వర్ణ సంకరజాతి వారు పుడతారు. ఉదాహరణకి మూర్ఖవసిక్త స్త్రీకి క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టినవారు, అంబష్ట స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగినవారు అలాగే పాఠశవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్న పిల్లలూ ఈ జాతిలోకి వస్తారు. వీరిని అధరప్రతిలోమజులంటారు.
ఇటువంటి సంకరజాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజం ద్వారా కలిగినవారు, మాహిష్య, ఉగ్రజాత్యాది స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు, కరణజాతి స్త్రీయందు అగ్రవర్ణుని ద్వారా కలిగినవారు ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజులంటారు. వీరినే అధర – అసత్, ఉత్తర – అసత్ వర్ణ సంకీర్ణ జాతుల వారని వ్యవహరిస్తారు.
ఇక గృహస్థధర్మాన్ని గూర్చి మాట్లాడుకుందాం.
గృహస్థు ప్రతిదినం స్మార్త కర్మా, వైశ్వదేవాది అగ్నికార్యాలూ సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నిని కానీ సంపద్విభాగసమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి. శ్రితకర్మానుష్టానానికి అగ్నిహోత్రం వైతానాగ్ని (ఆహవనీయ మున్నగు అగ్నులలో నేదో ఒకటి) తో సంపన్నం చేయాలి. శరీర చింతలను (విసర్జనాలను) ఉదయసాయం కాలాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి.
గంధలేప నివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన, స్నానాదికములను గావించి ప్రతి ద్విజుడూ ప్రాతఃకాల సంధ్యా పాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను, అనగా ఉదుత్యం జాతవేదసం… మున్నగు వాటిని జపించాలి.
తరువాత వేదార్థాలనూ అనగా – నిరుక్త వ్యాకరణాదులనూ ఇతర శాస్త్రాలనూ – అధ్యయనం చేయాలి. యోగ క్షేమాది సిద్ధికై ఈశ్వరో పాసనను కూడా చేయాలి.
గృహస్థధర్మంలో మరొక ముఖ్యమైన అంశంతర్పణాలు. ప్రతి గృహస్థూప్రతిరోజూ దేవతలకూ పితరులకూ స్నానానంతరం తర్పణాలివ్వాలి. పూజకూడా చేయాలి. వేదపురాణేతిహాసాలలో కొంతమేర, యథాశక్తి, పారాయణం చేయాలి. జపంచేసుకొని భూత, పితర,దేవ, బ్రహ్మ, మనుష్య జాతులకు బలికర్మ”ను గావించాలి.
తరువాత స్వధా, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలనుద్దేశించి అగ్నిలోహవనాలిచ్చి కుక్కలు, చండాలురు, కాకులు మున్నగు ప్రాణులకై వండిన అన్నాన్ని భూమిపై వేయాలి.
పితృగణాలకూ మనుష్యులకూ అన్నంతో బాటు జలదానం కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడునంత వండుట సరికాదు.
పక్వాన్న మెల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో వుండాలి. స్వవాసిని, (పెళ్ళయినా కూడా ఏవో కారణాలవల్ల ఆనాటికి పుట్టింట్లో వున్న స్త్రీ) వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి యిల్లాలు,ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి. భోజనానికి ముందూ వెనకా అవపోసన పట్టాలి.
ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూతపెట్టి వుంచినదాన్ని తినాలి. అతిథికోసం భోజనం ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగావుండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నంతినకుండా పోరాదు. బ్రహ్మచారులకూ సన్యాసులకూ (వారులభిస్తే వాళ్ళు దొరకడమే అదృష్టం) రోజూ భిక్షవేయాలి.
స్నాతకులనూ, ఆచార్యులనీ, రాజునీ ప్రతియేటా పూజించాలి. అలాగే మిత్రులూ, అల్లుళ్ళూ, ఋత్విజులూ ప్రతి వర్షమూ ఆతిథ్య పూజలకు అర్హులు. బాటసారిని అతిథియనీ వేదపారంగతుని శ్రోత్రియుడనీ అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకొనేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి.
ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు, ఒకరియింటి పక్వాన్నాన్ని స్వీకరించాలి. గృహస్థు మితంగాభుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతిచాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరిపొలిమేరదాకా దిగబెట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి.
తనకు ఇష్టులైన మిత్రులతో విద్వత్సంపన్నులతో గోష్ఠులు సలుపుతుండాలి. సాయంకాలం మరల సంధ్యవార్చి అగ్నిహోత్రం పనిచూసుకొని భోంచేయాలి. భోజనం తరువాత బుద్ధిమంతులైన భృత్యులతో ఇంటి వ్యవహారాలనూ, రాబోయే కార్యాలనూ ముచ్చటించాలి.
భూతయజ్ఞం, స్వధా పితృయజ్ఞం, హోమ దేవయజ్ఞం, స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞం, అతిథి సత్కారం మనుష్యయజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ బలికర్మగా వ్యవహరిస్తారు.
ఇంకా ఉంది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹