Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – అరవై ఎనిమిదవ అధ్యాయం

చివరి భాగం

వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం – గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం

వైశ్యులకూ, క్షత్రియులకూ కూడా యజ్ఞానుష్ఠానమూ, అధ్యయనము, దానమూ ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మ కర్మలు.

క్షత్రియునికి ప్రజాపాలనమే ప్రధానధర్మము. వైశ్యవర్థులకు అప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్ర వర్ణం వారు పై మూడు వర్ణాల వారికీ సాయపడాలి. ద్విజులు యజ్ఞాదికర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యం, అస్తేయం,శౌచం,ఇంద్రియ సంయమనం, దమం, క్షమ, సరళత, దానం మానవులందరికి అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల, దుష్టప్రవృత్తులను పరిత్యజించాలి.

ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం ॥

కుసీదకృషి వాణిజ్యం పశుపాల్యం విశః స్మృతం ।

శూద్రస్యద్విజ శుశ్రూషా ద్విజోయజ్ఞాన్ నహాపయేత్ ॥

అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః ।

దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మసాధనం ॥

ఆచరేత్ సదృశీం వృత్తమజిహ్మామశరాం తథా |

మూడేళ్ళకు సరిపడునంత బియ్యమును పండించి దాచగలిగినవాడు సోమరసపానానికి అర్హతను సంపాదించుకుంటాడు. ఒక్క యేడాది అన్నానికి సరిపడు బియ్యం లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్ క్రియను చేయవలసి వుంటుంది. అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, ఆయణ, చాతుర్మాస్యాది కర్మలను అనుష్టించాలి.

ద్విజుడు ప్రతియేటా సోమయాగం, పశుయాగం, చాతుర్మాస్యయాగం, ఆగ్రాయణేష్ఠి (అనగా కొత్తగా ధాన్యపుగింజలు కనబడగానే చేయుయాగం) లను ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ప్రతియేటా చేయలేనివారు రెండుసంవత్సరాలలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీ యిష్టిని చేయాలి.

ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలందుకొని మోక్ష ప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు. స్వాధ్యాయ విరోధియైన అర్థ సంపాదనం చేయరాదు. ఎవరి వద్దా ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకూ వ్రతాలకూ ప్రతి ఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు.

శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలో చండాలునిగా పుడతాడు. యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానంచేసుకున్నవాడు కోడి, గ్రద్ధ, కాకి యోనుల్లో పుడతాడు.

ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకొక సాధనంగా వాడుకోదలచిన బ్రాహ్మణుడు రెండు మూడు రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నిటికంటె శిలోంఛవృత్తి పరమ శ్రేష్ఠము.

అతనిని గుర్తించి రాజుగానీ, శిష్యుడుగానీ, యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమానిగాని ముందుకివచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును అప్పుడయినా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసమే తినాలిగాని భోగద్రవ్యాలను స్వీకరించుట తగదు.

ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలనూ శాస్త్రాదులనూ చదువుకోకూడదో చర్చిద్దాం.

వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమనాడు గాని హస్త నక్షత్రయుక్త పంచమి నాడుగాని లేదా పుష్యమాసంలో రోహిణీ నక్షత్రం వున్నరోజున గానీ గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గృహ్యసూత్రాను సారం ప్రారంభించాలి.

శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి మూడురోజుల పాటు అనధ్యయనమే. అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించినా మూడురోజుల పాటు చదవకూడదు.

సంధ్యా సమయంలో ఉరుములు వినబడినపుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప, ఉల్కాపాత సమయాలలోనూ అధ్యయనాన్ని ఆపివేయాలి. వేద, ఆరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తరువాత పూర్తిగా ఒక పగలూ ఒక రాత్రి సెలవిచ్చెయ్యాలి.

అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ , చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధులలో పాడ్యమి, శ్రాద్ధ భోజనాలు ఈ వేళల్లో చదువుకి సెలవు… పూర్తిగా ఒక రోజు. అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో మూడురాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని పాటించాలి.

ఉత్సవాలకీ, శక్రధ్వజం దిగినపుడూ, ఏడుపులూ పెడబొబ్బలూ దగ్గర్లోనే వినబడు తున్నపుడూ, శవం లేచినపుడూ తాత్కాలిక అనధ్యయనముంటుంది. అపవిత్ర దేశంలో, అపవిత్రావస్థలో, మాటిమాటికీ నింగి మెరుస్తుంటేనూ, మధ్యాహ్నం పన్నెండు గంటలలోపల పలుమార్లు ఉరుములు వినబడినపుడూ జలమధ్యంలో, అర్ధరాత్రి వేదశాస్త్రాలను చదువరాదు. ఎవరైనా విశిష్టవ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనాన్ని ఆపాలి.

పరుగెడుతూ కానీ మద్యం వాసనవస్తున్న వ్యక్తి పక్కనేవున్నపుడుగానీ, గాడిద, ఒంటె, గుఱ్ఱం, నౌక,చెట్టు, పర్వతంమున్నగు వానిపై కూర్చున్నపుడుగానీ ప్రయాణిస్తున్నపుడు గానీ, దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినపుడు గానీ వేదశాస్త్రాలను చదువరాదు.

ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి, ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యుల, రాజుల, పరస్త్రీల నీడలు, రక్తం, మూత్రాది విసర్జకాలు దారిలో వున్నపుడు దాటుకొనిపోరాదు. ఆగిగాని, పక్కకి తొలగిగాని వెళ్ళాలి. మంచిపేరుగల బ్రాహ్మణుని, రాజుని సర్పాన్ని అవమానించకూడదు.

అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను, ఇతరులు కాళ్ళు కడుక్కున్న నీళ్ళను దూరంనుండే చూసి తప్పుకోవాలి.

శ్రుతులలో, స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరినీ నిందించుటగాని కొట్టుటకాని దోషము, పుత్రునీ శిష్యునీ అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసమూ చూడరాదు.

దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు.

నది, సెలయేరు, పుష్కరిణి, చెఱువులలో స్నానంచేయాలి. ఇతరుల సరోవరంలో స్నానంచేయడానికి ముందు అనుమతిని పొంది, అయిదు మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి.

ఇతరుల శయ్యపై పడుకొనరాదు. దేశం ఆపదలో ఉన్నపుడు మనం మాత్రం ప్రసన్నం గా భోంచెయ్యరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి.

కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చెయ్యని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం ఋజువైనవాడు (దోషిగా నిరూపింపబడినవాడు) వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకుడు, నటన – నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకొనే వాడు, ఉగ్రుడు, నిర్దయుడు, పతితుడు, డాబులుకొట్టేవాడు, శాస్త్రవిక్రేత, స్త్రీ వశుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు. నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్యవిక్రేత, బంగారం పనివాడు, వంది – వీరి యింటి భోజనమును చేయరాదు.

పాసిపోయిన, చలిది, నిలువయుండిన, రంగు మారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన రజస్వల ముట్టిన, ”సంఘష్ట. ” పర్యాయాన్న భోజనమును సర్వదా త్యజించ వలెను.

శూద్రాన్నమును భుజించవచ్చును. ఐతే, ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై వుండాలి. మనస్సు, మాట, శరీరం, కర్మ వీటన్నింటినీ పరిశుద్ధంగా వుంచుకొని భగవదర్పణ బుద్ధితో మెలిగే వాడై వుండాలి.

తిలతండులమిశ్రిత పదార్థాలనూ, అప్పాలు, పాయసం, పిండివంటలు – ఇట్టి వాటిని దేవతలకో, అతిథులకో సమర్పించాకనే మనంతినాలి.

నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్రపదార్థాలు తిన్న వారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ దోషంపోదు. మితంగా తింటూ, హితంగా వుంటూ, చిన్న, తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ప్రసాదంగా భావించి ప్రతి కర్మనీ భగవంతునికే సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయననే చేరుకుంటాడు.

అరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment