Skip to content Skip to footer

🌹🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం🌹🌹🌹 – అరవై తొమ్మిదవ అధ్యాయం

ద్రవ్యశుద్ధి

యాజ్ఞవల్క్య మహర్షి ప్రపచనం ఇంకా కొనసాగుతోంది. ”శ్రేష్ఠమునులారా! ఇపుడు ద్రవ్య శుద్ధిని గూర్చి వినిపిస్తాను.

బంగారం, వెండి, అబ్జ (ముక్తాఫల, శుక్తి, శంఖాదులు) కూరలు, త్రాళ్ళు, గొట్టె చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞ పాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం లేనివై యుండి అపవిత్ర స్పర్శకులోనైతే నీటితో బాగా కడిగితే చాలు, శుద్ధములైపోతాయి.

ధాన్యాదులపై కాస్త నీళ్ళు చిలకరిస్తే చాలు. యజ్ఞంలో వాడవలసిన స్రుక్, స్రువాలు (కర్రచెంచాలు) వేడి నీటితో కడిగితే శుద్ధి జరుగుతుంది.

ఉన్ని, పట్టు బట్టలను వేడినీటితో వెచ్చని గోమూత్రంతో కడిగి శుద్ధిచేయాలి. యజ్ఞపాత్రలను చేతితో బాగా మర్దించి కడగాలి. కఱ్ఱతో, దుప్పి కొమ్ము లేదా పంటితో నిర్మింపబడిన పాత్రలను మట్టితో తోమి నీటితో కడగాలి. స్త్రీ ముఖానికీ, బ్రహ్మచారి భిక్షా పాత్రకీ, బజారులో అమ్మదలచుకున్న అన్నాదులకి శుద్ధి అవసరంలేదు అవి ఎల్లపుడూ పవిత్రాలే.

మట్టి పాత్రను పవిత్రం చేయడానికి అగ్నిలో పెడితేచాలు. చండాలుడు దానిని స్పృశించకుండా చూసుకోవాలి. ఆవువాసన చూసిన అన్నమూ, తలవెంట్రుకలూ కీటకాలూ పడిన అన్నమూ నీటితో, భస్మంతో, మట్టితో శుద్ధి అవుతుంది. నేలను శుద్ధిచేయాలంటే తుడిచి, కడిగి, తుడవాలి, తగరం, సీసం, రాగి, గాజు పాత్రలను ఉప్పు, నిమ్మరసం. దశల వారిగా నీటిలో కలిపి కడగడం ద్వారా శుద్ధి చేయాలి.కంచు, ఇనుము పాత్రలను భస్మంతో తోమి నీటితో కడగాలి. అజ్ఞాతవస్తువులు పవిత్రాలే.

అమేధ్యములచే – అనగా శరీరము నుండి పుట్టినవైన మల, వసా, శుక్ర, శ్లేష్మాదులచే అశుద్ధములైన పాత్రలను మట్టితో బాగా తోమి నీటితో కడగడం ద్వారా శుద్ధిచేయాలి. ప్రకృతి ద్వారా భూమిపై ఏర్పాటు చేయబడి గోవుచే త్రాగబడు నీరు శుద్ధమైనదే కావున దానిని శుద్ధి కార్యక్రమానికి వాడవచ్చును.

సూర్మరశ్మి, అగ్ని, ధూళి, చెట్టు నీడ, ఆవు, గుఱ్ఱము, నేల, వాయువు, మంచు బిందువులు ఎప్పుడూ పవిత్రాలే. మనిషి స్నానం చేశాక, నీరు త్రాగాక, తుమ్మినాక, పడుకొని లేచాక, భోజనం తరువాత, నడిచి వచ్చాక, బట్టలు మార్చాక ఆచమనం చేస్తే శుద్ధి అవుతుంది.

ఆవులింత, ఉమ్ము, నిద్ర, వస్త్రధారణ, కన్నీరు – ఈ పంచకార్యాలకూ ఆచమనం చేయనక్కరలేదు. దేవుని స్మరించి కుడిచెవిని ముట్టుకుంటే చాలు. బ్రాహ్మణుని చెవిపై అగ్ని మున్నగు దేవతలు ఎల్లపుడూ ప్రకాశిస్తుంటారు.

అరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment