శ్రాద్ధాదికారులు దాని సంక్షిప్తవిధి మహిమ, ఫలాలు
ఋషిగణులారా! ఇపుడు సర్వపాపవినాశినియైన శ్రాద్ధ విధిని వినిపిస్తాను.
ఒక మనిషిపోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలను కుంటారు చాలా మంది. తద్దినం లేదా ఆబ్దికం – ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్ధమనుకుంటారు కూడ. కాని, శ్రాద్ధమనగా శ్రద్ధగా పితృదేవులను తలచుకొని చేయు కర్మయని భావము. ఇది ఏడాది కొకసారే పెట్టాలని లేదు.
అమావాస్య, అష్టకం’, వృద్ధి (పుత్రజన్మమున్నగునవి) కృష్ణపక్షం, ఉత్తరాయణ దక్షిణాయన, ప్రారంభదినాలు, అన్నాది లాభదినాలు, విషువత్ – సంక్రాంతి’, మకర సంక్రాంతి, వ్యతీపాతం, గజచ్ఛాయా – యోగం, చంద్ర సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినపుడు – వీటిలో ఎప్పుడైనా శ్రాద్ధం పెట్టవచ్చును.
మధ్య వయస్కుడై కూడా అన్ని వేదాలనూ అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట (దీనికి పురాణ పదం అగ్ర్య), శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడు, మంత్రాలతో బ్రాహ్మణములతో నున్న వేదభాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త, జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహితవ్రతాచరణలన్నీ పూర్తిచేసి దాని అధ్యేతయైన మహావైదికుడు, ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యేతయైనమేధావి, త్రిసుపర్ణనామంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశభాగా ధ్యేత, వీరిలో నెవరైనా శ్రాద్ధ సంపత్తి” గా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులౌతారు. అనగా వీరికి ఆనాడు. భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి.
అలాగే కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, శిష్య వత్సలుడైన మహోపన్యాసకుడు, విశిష్ట ఋత్విక్కు, ”పంచాగ్ని విద్యను బాగా అధ్యయనం చేసి ”అధ్యేత” అనిపించుకున్నవాడు. బ్రహ్మచారి, మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్ఠుడు కూడ శ్రాద్ధ సంపత్తులనబడతారు.
రోగి అంగహీనుడు, అధికాంగుడు,
- కాణుడు
- పౌనర్భవుడు’,
- అవకీర్ణాది .
ఆచార భ్రష్టులు శ్రాద్ధ యోగ్యులు కారు.శ్రాద్ధాని కొకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమ నియతుడైవుండాలి. (బ్రాహ్మణులను, బ్రాహ్మణులు plural). శ్రాద్ధదినం నాటి పూర్వార్థంలో వారు రావాలి. రాగానే గృహస్థువారిచే అత్యంతాదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండపెట్టాలి. విశ్వేదేవ లేదా ఆభ్యుదయిక శ్రాద్ధానికి ఇద్దరు బ్రాహ్మణులనూ, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులనూ కూర్చుకోవాలి. లేదా విశ్వేదేవపాత్రులుగా తూర్పు ముఖంగా ముగ్గురినీ కూర్చుండబెట్టవచ్చు. శక్తిలేనివారు దానికొకనినీ, దీని కొకనినీ తెచ్చి చేయించు కోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చుండబెట్టవచ్చును. ఆ తరువాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము (చేతులు కడుక్కోవడానికి నీరు) నూ ఆసనానికి కుశలనూ ఇచ్చి వారి అనుమతి తోనే విశ్వేదేవాస… అనే మంత్రంతో విశ్వేదేవతలనా వాహనం చేసి భోజన పాత్రలో యవలను జల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్యపాత్రలో శం నో దేవీ…. అనే మంత్రం ద్వారా నీటినీ యవో సి…. అనే మంత్రం ద్వారా యవలనూ పోసి యా దివ్యా…. మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్యోదకాన్ని ప్రదానం చేసి గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలనూ, వస్త్రాలనూ వారికి దానం చేయాలి. తరువాత జంధ్యమును అపసవ్యం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అశంతస్త్వా… అనే మంత్రంతో (చేతబట్టుకొని పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడైయున్న భూదేవుని అనుమతిని తీసుకొని ఆయంతు నః పితరః…. అనే మంత్రాన్ని పఠించాలి. పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యముంటుంది. (ఇతర కార్యాల్లో యవలనువాడతారు)పితృగణాలకు తిలలతో అర్ధ్యాన్నిచ్చిదానిని బ్రాహ్మణుడందుకోగా క్రిందపడిన జలాలను (వీటినే సంస్రవలంటారు) ”పితృపాత్ర” అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో వుంచాలి. దక్షిణాగ్ర కుశ స్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యః స్థానమసి… అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్య పాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి. అగ్నైకరణకి అనుమతి నివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్ధకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసివుంచాలి. స్తోమతుకలిగినవారు పితరులు భోజనానికై వెండి పాత్రలనుపయోగించాలి. పృథివీ తేపాత్రం…. అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణుః … అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బొటన వ్రేలి నందుకొని పితరులకుద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్నీ మధువాతా…. అనే మంత్రాన్నీ పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చుని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరల ఆ మంత్రాలనే చదువుతుండాలి. మరల బ్రాహ్మణులను మొగమాటపడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రానీకుండా ప్రశాంతమనస్కుడై శ్రద్ధనిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందరపెట్టకుండా, మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. హవిష్యాన్నము (హోమగుండంలో వండబడిన అన్నం) ను వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసే దాకా పురుష సూక్తాన్నీ, పవమాన సూక్తాదులను జపిస్తుండాలి. వారు తృప్తిగా భుజించాక మరల మధువాతా… మంత్రాన్ని పఠించాలి. ”మేము తృప్తిగా సుష్టుగా భోంచేశాము” అని వారి చేత అనిపించుకొని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నంతిన్న పాత్రలనూ వాటి ప్రక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా వుంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మనవూరి సామాన్య మానవులు కారు; పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులూ, తాతలూనూ, వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాల నిచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి. ఉచ్చిష్టానికి సమీపంలోనే పితరాదులకూ మాతా మహాదులకూ పిండ ప్రదానం చేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువగా శ్రాద్ధకర్త అక్షయమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరుపోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాంవాచయి ష్యే అనాలి. వాచ్యతాం అంటూ వారు అనుమతి నివ్వాలి. అపుడు శ్రాద్ధకర్త తన పితృదేవతలనుద్దేశించి స్వధా అనువాక్యాన్ని పలుకగా పితృదేవతల ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవాః ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్ధించాలి
దాతారో నో భి వర్ధంతాం వేదాః సంతతిరేవ చ ॥
శ్రద్ధాచనోమా వ్యగమద్ బహుదేయంచనో స్వైతి ॥
తరువాత వాజే వాజే…. అనే మంత్రాన్నుచ్చరిస్తూ శ్రాద్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన సంస్రవజలాలుండిన పాత్రను సరిచేసి చేత బట్టుకొని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో బాటు కొంత దూరం నడచి వెళ్ళి సాదరంగా సాగనంపాలి. తరువాత శ్రాద్ధ కర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మచర్యాన్నవలంబించాలి.
వివాహాది శుభకార్యాలు చేసేటపుడు పితరులకు నందీ ముఖశ్రాద్ధాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీ ఫలం, యవమిశ్రిత అన్నంలతో పిండదానం చేయాలి.
ఏకోద్దిష్ట శ్రాద్ధం (ఎవరో ఒకే ఒక వ్యక్తి నుద్దేశించి పెట్టేది) విశ్వేదేవరహితం, ఏకాన్న, ఏక పవిత్రకయుక్తం అయివుంటే చాలు. ఈ శ్రాద్ధానికి ఆవాహనం, అగ్నైకరణం కూడా అవసరంలేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చేయాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి.
సపిండీకరణ శ్రాద్ధంలో శ్రాద్ధ కర్త తిలలతో గంధ మిశ్రిత జలాలతో నాలుగు పాత్రలను నింపివుంచాలి. ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు రెండు పాత్రలుండాలి. పితృపాత్రలలో నొకదానిని ప్రేతపాత్రగా ప్రత్యేకంగా వుంచి దానిని అర్ఘ్య ప్రదానానికి వినియోగించాలి. తరువాత శ్రాద్ధకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన మూడు పాత్రలలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్వాది క్రియలను సంపన్నం చేయాలి.
ప్రేత పిండాన్ని యేసమానా… తో మొదలయ్యే రెండు మంత్రాలను చదువుతూ మూడు భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి. దీని తరువాత ఏకోద్దిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి.
ఒక యేడాదికి లోపే పెట్టు సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు, యథాశక్తిగా, దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును.
హావిష్యాన్నంతో శ్రాద్ధం పెడితే నెలరోజులకు సరిపడా అన్నంతిన్న తృప్తినీ, పాయసంతో పెడితే ఒక యేడాది బాటు భోం చేసిన తృప్తినీ పితృగణాల వారు పొందుతారు.
మృతవ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశినాడు శ్రాద్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతమూ ఉత్సాహ, శౌర్య, క్షేత్ర, శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (ఇక్కడ మృత వ్యక్తులనగా శ్రాద్ధకర్తకు ఊహతెలిశాక మృతులైనవారు కావచ్చు.)
విధి పూర్వకంగా అన్ని నియమాలనూ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం పెట్టిన వానికి పుత్ర సంతతి, సర్వజనశ్రేష్ఠత, సౌభాగ్యం, సమృద్ధి ప్రముఖత, మాంగలిక దక్షత (ప్రాముఖ్యము అనే మాటను వాడాలి) అభీష్టకామనలపూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనం, విద్య, వాక్సిద్ధి, పాత్రత, గోసంపద, అశ్వాలకలిమి, దీర్ఘాయువు ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షము లభిస్తుంది.
కృత్తిక నుండి భరణి దాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శ్రాద్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులూ, సర్వసుఖ సాధనాలూ పుష్కలంగా లభిస్తాయి. పిత, పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు. వీరు తమ శ్రాద్ధ కర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు.
డెబ్భై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹