Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – డెబ్భై ఆరవ అధ్యాయం

బుధగ్రహ చరిత్ర మూడవ భాగం

మాటాడలేకపోతున్నాడు. హృదయాలు ద్రవిస్తూ , స్పందించే విశిష్ట క్షణాలలో మాటలు అవసరం లేదని ఆ ”వాక్పతి”కి తెలుసు , బృహస్పతి చిరునవ్వుతో బుధుణ్ణి చూశాడు. ఆ చిరునవ్వు ఆయన ముఖానికి ప్రశాంత ప్రకాశాన్ని పులుముతోంది. అనునయంగా తలపంకిస్తూ ఆశ్రమం వైపు చెయ్యి చూపించాడాయన.

బుధుడి ముఖం ఆనందంతో వికసించింది. అప్రయత్నంగా చేతులు జోడించి , ఆశ్రమం వైపు అడుగులు వేశాడతను.

అప్పటిదాకా మౌనంగా ఉండిపోయిన శిష్య బృందం వల్లె వేయడం ప్రారంభించింది.

ఆశ్రమం ద్వారం దాటి లోపలకి అడుగుపెట్టిన బుధుడు ఆగాడు. అతని కళ్ళు ఆతృతగా అంతటా కలయజూశాయి. ఎవ్వరూ లేరు. ఎదురుగా ఉన్న ద్వారం వైపు వెళ్ళబోతూ – తటాలున ఆగాడు బుధుడు.

ఎదురుగా ఉన్న ద్వారబంధం ముందు ఒక స్త్రీ మూర్తి ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో పూలసజ్జ ఉంది. అపరిచిత యువకుడిని ఆశ్రమంలో చూసిన ఆశ్చర్యం ఆమెను ద్వారబంధానికి బంధించింది. ఆమె తార !

చంద్రుడా ? చంద్రుడు మళ్ళీ వచ్చాడా ? ఒకదాన్నొకటి వెంటాడుతూ పుట్టుకొస్తున్న ఆలోచనలు ఆమెను అయోమయానికి గురిచేస్తున్నాయి.

బుధుడు అసంకల్పితంగా ముందుకు – ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు. ఏదో అదృశ్య బంధం అతన్ని ఆమె వైపు లాగుతోంది. అతని అంతరాంతరాల్లోంచి ఏదో పిలుపు సంకల్ప రూపంలో జన్మించి , అదే క్షణంలో ”పరావాక్కుగా పరిణమించింది. ఆ పరావాక్కు ”పశ్శంతి వాక్కుగా పరిణమించింది. ”మధ్యవాక్కుగా ఎదిగింది. మధ్య ”వాక్కు ”వైఖరీవాక్కు”గా మారి , సశబ్దంగా వెలువడింది. బుధుడి అంతరాంతరాల్లోంచి దూసుకుంటూ వెలువడిన ఆ పిలుపు తార కర్ణపుటాలను స్పృశించి , ఆమెకు అలౌకికమైన శ్రవణానందాన్ని అందించింది. ఆ క్షణంలోనే వాత్సల్యతరంగంలా రూపాంతరం చెంది .ఆమె సర్వస్వాన్నీ కుదిపివేసింది.

చంద్రుడు కాదు. చంద్రుడి ప్రతిరూపం ! తన గర్భకలశంలో అంకురించిన అనురాగం ! తాను ప్రసవించిన ప్రణయఫలం ! తన కన్న కొడుకు ! తాను కడుపారా కన్న పాపడు ! బుధుడు !

“అమ్మా…” దగ్గరవుతూ తనను నోరారా పిలుస్తున్న బుధుడి వైపు తార మంత్రముగ్ధలా. అడుగులు వేసింది.

“నాయనా !” తార కంఠం ఉద్వేగంతో వణికింది. తను గర్భం ధరించి , నవమాసాలూ , భరించి , మహనీయ ప్రసవవేదనా మధురానుభూతిని అర్ధం చేసుకుంటూ ప్రసవించిన తన బిడ్డడు – ఇన్నాళ్ళకు , ఇన్నేళ్ళకు మొట్టమొదటిసారిగా తనను ”అమ్మా” అని పిలుస్తున్నాడు. బిడ్డకి జన్మనిచ్చిన ఎన్నో ఏళ్ళకు… ఈనాడు… తాను మొట్ట మొదటిసారిగా ”అమ్మా” అన్న పిలుపును వింటోంది !

తారలో ఇంతకాలం ఘనీభవించి ఉండిపోయిన మాతృప్రోతస్విని ఒక్కసారిగా కరిగి , ప్రవహిస్తోంది. తార నేత్రాలను ఆనంద సరోవరాలుగా చేస్తున్న అశ్రుధారల్ని వెక్కిరిస్తూ. ఆమె నిలువును జలదరింపచేస్తూ , పావన స్తన్యం చిప్పిల్లింది.

బుధుడు తనకు తెలియకుండానే , అమ్మ కౌగిలిలో ఒదిగిపోయాడు. తార తనకు తెలియకుండానే బుధుణ్ణి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. తల్లీ తనయుల తన్మయత్వంతో , ఆశ్రమంలో కాలం స్తంభించింది. తార ఆనందాశ్రువులు బుధుడికి అభ్యంగస్నానం చేయిస్తున్నాయి. తల్లి సున్నితంగా అద్దుతున్న బరువైన ముద్దులతో బుధుడి నుదురు కందిపోతోంది.

“అమ్మా…”

తార ఆవేశాన్నీ , ఉద్రేకాన్నీ నిగ్రహించుకుంటూ కొంచెం దూరంగా జరిగింది. బుధుణ్ణి నఖశిఖ పర్యంతం చూస్తూ ఉండిపోయింది. ఇన్నేళ్ళకు తన ఎదుట నిలుచున్న తన బిడ్డడికీ , తనకూ మధ్య తెరలా ఏర్పడుతున్న కన్నీటిని , ఆనందబాష్పాలను తుడుచుకుంది.

“నాయనా ! తొమ్మిది నెలలు నిన్ను గర్భంలో మోశాను. పది రోజులు ఈ చేతుల్తో మోశాను” తార తన చేతుల్ని చూపుతూ అంది. “పది రోజుల పసిగుడ్డుగా ఉన్న నిన్ను… చిన్నారి పెదవులతో సున్నితంగా చీకుతూ నా స్తన్య భారాన్ని తగ్గిస్తున్న నిన్ను ఈ చేతులతోనే ఇచ్చివేశాను.”

“అమ్మా…” బుధుడి కంఠం బొంగురుపోయింది. కళ్ళు తడిగా మెరిశాయి.

“ఔను నాయనా ! ఏడుస్తూ ఇచ్చివేశాను. ఇచ్చి వేశాక ఏడుస్తూ ఉండిపోయాను. బుధా , నేను నీ దగ్గరకు రాలేననుకున్నాను. నువ్వు నా వద్దకు రావనుకున్నాను. నువ్వెవరో తెలిసిన నేనే నీ కోసం రాలేనప్పుడు , రానప్పుడు , నేనెవరో తెలిసి నువ్వు ఎలా రాగలవు ? అందుకే నువ్వు ఇంక నా కళ్ళకు కనిపించవనుకున్నాను.

“కానీ… కానీ… నువ్వు వచ్చావు. ఇన్ని సంవత్సరాల అనంతరం… ఈ అమ్మను ”అమ్మా !” అని పిలిచావు. తండ్రీ ! నా దౌర్భాగ్యాన్ని మహద్భాగ్యంగా మార్చావు నాన్నా !”

“అమ్మా ! నీ మాటలో , నీ కన్నీటి ఊటలో నాకు లభించే అమృతం కోసం ఇన్నాళ్ళు ఎదురుచూస్తూ కలలు కంటూ గడిపాను. నీ బంగారు దీవెన కోసం వచ్చాను !” బుధుడు చిరునవ్వుతో అన్నాడు.

“బంగారు తండ్రికి బంగారు దీవెనలు ఎందుకివ్వను ?” తార బుధుడి చెంపలను అరచేతుల్తో సున్నితంగా నొక్కుతూ అంది.

“స్వయం పోషణలో , స్వయం సాధనలో జీవించడానికి వెళ్తూ నీ దర్శనం కోసం వచ్చాను…” బుధుడు తన కార్యక్రమాన్ని వివరించాడు.

“తారా !”

బృహస్పతి పిలుపు విని , ఇద్దరూ ద్వారం వైపు చూశారు. తార అశ్రుసిక్తమైన తన ముఖాన్ని తుడుచుకుంది. “స్వామి…”

“బుధుడు ఈరోజు , ఇక్కడే , అమ్మచేతి అమృతం ఆరగిస్తాడు.’

“స్వామీ !” తార కంఠంలో ఆశ్చర్యం , ఆనందం.

బృహస్పతి వెళ్ళబోతూ ఆగి చిరునవ్వుతో చూశాడు. “కడుపారా కన్నావు కద ! కడుపారా అన్నం పెట్టు !”

వెళ్ళిపోతున్న భర్త మీద నుంచి చూపులను బుధుడి వైపు తిప్పింది తార. అతని ముఖంలో ఏదో అవ్యక్తానందం తొణికిసలాడుతోంది. తార కళ్ళు కడిగిన అద్దాల్లా మెరుస్తున్నాయి. బుధుడు , తార చేతిలోంచి ఎప్పుడో జారిపడిన పూల సజ్జను తీసుకొని , నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న పువ్వుల్ని ఏరసాగాడు.

బుధుడు తండ్రి నిర్దేశించిన అరణ్యం వైపు ప్రయాణం సాగిస్తున్నాడు. బృహస్పతి ఆశ్రమంలో తనకు ఎదురైన మధురానుభూతుల్ని మరిచిపోలేకుండా ఉన్నాడు తను.

తన కళ్ళ ముందు ఇంకా ఆ దృశ్యాలే ! తన చెవులలో ఇంకా అక్కడ ఆలకించిన మాటలే !

జన్మించి , బుద్ధి తెలిసిన అనంతరం మొట్టమొదటిసారిగా మాతృవాత్సల్యాన్ని రుచిచూశాడనతను ! పితామహి అనసూయాదేవి , పితామహుడు అత్రిమహర్షీ , తండ్రి చంద్రుడూ , ఇరవై ఏడుగురు తల్లులూ తన మీద ప్రేమానురాగాలు కురిపించారు. వాత్సల్యాన్ని వర్షించారు. కన్నతల్లి తారాదేవి కూడా తన మీద ప్రేమానురాగాలు కురిపించింది. వాత్సల్యాన్ని వర్షించింది.

అన్యులైన వాళ్ళ వాత్సల్యానికీ , అమ్మ అయిన తార వాత్సల్యానికి ఎంత అంతరం తన పితామహి అనసూయాదేవీ , తల్లులైన చంద్రపత్నులూ తన పట్ల వ్యక్తం చేసిన మమకారం… వీవనలతో విసిరిన గాలి !

కన్నతల్లి తార వ్యక్తం చేసిన మమకారం స్వచ్ఛందంగా పచ్చని ప్రకృతిలో స్వచ్ఛంగా వీచే గాలి , మలయమారుతం !

ఔను… వీవనతో విసిరేగాలికీ , మలయమారుతానికీ భేదం ఉంటుంది. బుధుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. రెండింటితోనూ సేద తీరవచ్చు. అయితే ”వీవన పవనం” ఇచ్చే విశ్రాంతి వేరు. మలయమారుతం అందించే విశ్రాంతి వేరు !

తన తల్లికి భర్తా , దేవగురువు అయిన బృహస్పతి ఆచార్యుడి ప్రవర్తనా , ఆయన మాట్లాడిన ఒకటి రెండు మాటలూ , బుధుణ్ణి ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఆయన ఒక్కసారి కూడా తన తండ్రి పేరు పలకలేదు ! అమ్మ కూడా అంతే ! చంద్రుడి క్షేమ సమాచారం కూడా కనుక్కోలేదు. అమ్మ గతాన్ని మరిచిపోయింది

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment