బుధగ్రహ చరిత్ర ఐదవ భాగము
అదే సమయంలో … వేట శబ్దాలు వినవస్తున్న అటు వైపు అరణ్యంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. మృగయా వినోదం వేటగాళ్ళకు విషాదంగా మారింది.
వైవస్వత చక్రవర్తి కుమారుడు , యువరాజు సుద్యుమ్నుడు సైన్యంతో అరణ్యంలో తన నిత్యవినోదమైన వేటను సాగిస్తున్నాడు. తన బాణానికి అందినట్టే అంది. చిటికెలో తప్పించుకుపోతున్న లేడిని సుద్యుమ్నుడు గుర్రం మీద వెంటాడుతున్నాడు.
ప్రాణ భయంతో లేడి వాయు వేగంతో దూసుకు పోతోంది. సుద్యుమ్నుడి అశ్వం తన యజమాని హృదయాన్ని అర్థం చేసుకున్నట్టు , లేడి వెళ్ళిన దారిలో పరుగెడుతోంది. నలుగురైదుగురు అశ్వికభటులు మాత్రం సుద్యుమ్నుడి వెంట తమ గుర్రాలను పరుగెత్తించగలిగారు.
అందాల జింక గాలిలో అంగలు వేస్తూ పరుగెడుతోంది. సుద్యుమ్నుడి అశ్వం , భటుల అశ్వాలూ నురగలు కక్కుతూ పరుగులు తీస్తున్నాయి.
హఠాత్తుగా కీకారణ్యం మధ్యలో ఒక సుందరమైన ఉద్యానవనం ప్రత్యక్షమైంది. యువరాజు సుద్యుమ్నుడూ , అశ్వికభటులూ ఆగారు. చుట్టూ చూశారు. లేడి జాడలేదు. ఉద్యానవనంలోకి జొరబడి ఉంటుందన్న అనుమానంతో సుద్యుమ్నుడు తన గుర్రాన్ని అదలిస్తూ – ఎదురుగా ఉన్న వనంలోకి ప్రవేశించాడు. అతని వెనుకనే అశ్వికులూ…
ఎల్ల దాటి , ఉద్యానవనంలో ప్రవేశించిన క్షణంలో , అకస్మాత్తుగా జరిగిపోయింది. ఆ మహాద్భుతం ! యువరాజు సుద్యుమ్నుడూ , భటులూ క్షణంలో స్త్రీలుగా మారిపోయారు ! వాళ్ళు ధరించిన వస్త్రాలు కూడా స్త్రీల వస్త్రాలుగా మారిపోయాయి. సుద్యుమ్నుడి జవనాశ్వంతో పాటు భటులు ఎక్కిన పోతు గుర్రాలూ ఆడ గుర్రాలుగా మారిపోయాయి !
నిర్ఘాంతపోయిన వాళ్ళందరూ గుర్రాల మీద నుంచి దిగారు. ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయిన వాళ్ళందరూ తమను తాము స్త్రీలుగా గుర్తించి , ఆందోళనలో పడిపోయారు.
గుర్రాలన్నీ ఉద్యానవనం దాటి అరణ్యంలోకి యధేచ్చగా వెళ్ళిపోతున్నాయి. ఆడవాళ్ళుగా మారిపోయిన భటులు మంత్రముగ్ధుల్లాగా ఆ అశ్వాల వెంట వెళ్ళసాగారు.
ఆశ్చర్యం నుంచి చాలా సేపటికి గానీ యువరాజు సుద్యుమ్నుడు కోలుకోలేక పోయాడు. నివ్వెరపాటు నుండి తేరుకున్న సుద్యుమ్నుడు స్త్రీ లక్షణాలు కుప్ప పోసినట్టున్న తన శరీరాన్ని తడిమి చూసుకున్నాడు. గుర్రాల సకిలింతలూ , వాటితో పాటు స్త్రీల కంఠ స్వరాలూ వినవస్తున్నాయి. భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సుద్యుమ్నుడు. గొంతెత్తి భటులను పిలిచాడు. అతను విన్న అతని కంఠస్వరం మరోసారి సుద్యుమ్నుడిని ఆశ్చర్య జలపాతంలో పడద్రోసింది. తనది పురుషకంఠం కాదు , స్త్రీ కంఠం ! కోమలమైన స్త్రీ కంఠం !
జరిగిన అద్భుతం ఎలా జరిగిందో , ఎందుకు జరిగిందో ఊహించే శక్తి లేని సుద్యుమ్నుడు ఎదురుగా ఆకాశానికి పట్టిన అద్దంలా కనిపిస్తున్న చిన్న కొలను వైపు అడుగులు వేశాడు. తన నడకలో మునుపటి ఠీవీ , గాంభీర్యం కొరవడ్డాయనీ , వాటి స్థానంలో కులుకూ , వయ్యారం , సౌకుమార్యం వచ్చి చేరాయని అర్ధమవుతోంది సుద్యుమ్నుడికి.
సుద్యుమ్నుడు నీటి అంచున నిలుచుని కొలను లోనికి తొంగి చూశాడు.
నీటిలోంచి అద్భుత సౌందర్యవతి అయిన యువతి అతని వైపు చూస్తోంది. తన ప్రతిబింబం ! సుద్యుమ్నుడు సాలోచనగా తన ఎద మీద ఉన్న పయ్యెదను తొలగించి , నీటిలో చూశాడు. అతని గుండె దడదడ కొట్టుకుంది. కొన్ని నిమిషాల క్రితం దాకా విశాలంగా ఉన్న తన వక్షస్థలం ఇప్పుడు ఉన్నత వక్షస్థలంగా మారిపోయింది ! తన ప్రస్తుత వక్షభాగం కొలనిలోని జంట తామర మొగ్గలను గుర్తు చేస్తోంది ! సుద్యుమ్నుడు. మంత్రముగ్ధుడిలాగా నీటిలో ప్రత్యక్షమవుతున్న తన నీడని – ”ఆడనీడని” చూస్తూ. ఉండిపోయాడు. అణువణువూ పరిశీలిస్తూ ఉండిపోయాడు. తాను ధరించిన పురుష సంబంధమైన ఆభరణాలన్నీ కూడా స్త్రీ అలంకారులుగా మారిపోయి ఉన్నాయి ! ఎంత విచిత్రం !
నీటిలో నీడ తనకు కనువిందు చేస్తున్న సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న సుద్యుమ్నుడు , అప్రయత్నంగా పైట వేసుకున్నాడు. నీడలో కనిపిస్తున్న తనని చూస్తూ “ఇలా !” అంటూ సంబోధించాడు, అసంకల్పితంగా !
”ఇల” దారితప్పినట్టు అడవిలో తిరుగుతూ ఉండిపోయింది. తను ఇప్పుడు ఏం చేయాలి ? ఈ స్త్రీ రూపంలో రాజధానికి వెళ్తే , పౌరులు తనను యువరాజు సుద్యుమ్నుడుగా గుర్తించలేరు ! పరివారం గుర్తించరు. తండ్రి వైవస్వతుడు గుర్తించడు. తల్లి శ్రద్ధాదేవి కూడా గుర్తించదు ! తాను స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడినని చెప్పడం చాలా ప్రమాదం. పిచ్చిపట్టిందనుకుంటారు ! పురుషులు తనను క్షేమంగా ఉండనివ్వరు ? ఏం చేయాలి ? తాను ఏం చేయాలి ? ఈ అరణ్యంలో ఒంటరిగా ఉండాలంటే భయం కలుగుతోంది. ఈ రూపంలో ఇప్పుడు లేడి కూనను చూసినా భయం కలుగుతోంది , పురుష రూపంలో సింహాలను ఎదిరించిన తనకు !
ఏదో శ్రవణానందం కలిగించే శబ్దం ఇల ఆలోచనలను తెంచివేసింది. ఏదో సంగీత వాద్యం… ఆ వాద్య సంగీత ధ్వని తనకు దగ్గరగా వస్తోంది. తనకు అభిముఖంగా వస్తున్న వ్యక్తిని ఇల ఆశ్చర్యంతో చూసింది. నారదమహర్షి ! ఆయన అంగుళీ స్పర్శతో వీణ రాగాలను ఒలుకుతోంది. నారదుడు ఆగి చూశాడు. వీణ మౌనం ధరించింది.
“నారాయణ ! ఎవరమ్మా నీవు ? అందాలరాశివి ! అరణ్యంలో ఇలా సంచరించవచ్చా ?” నారదుడు మందలిస్తున్నట్టు అన్నాడు. ఇలా సిగ్గుపడుతూ పైట సర్దుకుంది. నారదుడి వైపు నిష్కారణ భయంతో చూసింది.
“నిన్నే !” నారదుడు నవ్వుతూ అన్నాడు. “మూగ సుందరివి కాదు కదా ! మాటలు వస్తాయి కదూ ! ఎవరు నీవు ?”
“… నా పేరు…నా పేరు ఇల” ఇల అసంకల్పితంగా అంది.
“ఇల ! అందానికి తగిన ఇంపైన నామధేయం !” నారదుడు మెచ్చుకున్నాడు. “ఎవరు నీవు ? ఇక్కడికి ఎందుకు వచ్చావు ? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు ? నీలాంటి సుందరకాంత ఏకాంతంగా సంచరించడం బహు ప్రమాదం సుమా !”
ఇల మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. నారద మహర్షి రాజధానికి వచ్చిన సందర్భాల్లో తనను తన పురుష రూపాన్ని – చాలా సార్లు చూసి ఉన్నాడు. అయితే ఈ స్త్రీ రూపంలో పోల్చుకోలేకుండా ఉన్నాడు. ఆ దేవముని పోల్చుకోలేకపోతే ఇతరులు ఎవరు తనను పోల్చుకోగలరు ? తనకు దాపురించిన కష్టాన్ని వివరిస్తే , నారదమహర్షి ఏదైనా ఉపాయం ఉపదేశిస్తారేమో !
“నా పేరు ఇల కాదు…” మెల్లగా అంది.
“నారాయణ ! కానప్పుడు కలగని చెప్పావా తల్లీ ? సరే నీ పేరేదో ఇప్పుడు చెప్పు ?” నారదుడు నవ్వుతూ అన్నాడు.
“నేను…నేను…స్త్రీని కాను…”
నారదుడు ఎగాదిగా చూశాడు. “నారాయణ ! స్త్రీవి కావా ? ఈ నారదుడు ఎంత బ్రహ్మచారి అయినా , చూడగానే స్త్రీలను పోల్చుకోగలడు !”
“నారదమహర్షీ ! మీకు వైవస్వత మహరాజుగారి పుత్రుడు సుద్యుమ్నుడు గుర్తున్నాడా ?” ఇల ప్రశ్నించింది.
“చక్కగా గుర్తున్నాడు ! ఏం ? అతగాడేమైన నిన్ను వలపించి , వంచించాడా ?” నారదుడు నవ్వుతూ అడిగాడు.
“మీరు మరిచిపోయారు. నేను స్త్రీని కాదని చెప్పాను. నేను స్త్రీగా మారిపోయి కొన్ని ఘడియలైంది. “
ఇలా వివరించడం ప్రారంభించింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹