ప్రాయశ్చిత్తాలు – కృష్ణ, పరాక, చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు
విహితస్యాననుష్ఠానాన్నింది తస్యచసేవనాత్ |
అనిగ్రహాచ్చేంద్రియాణాం నరః పతన మృచ్ఛతి ||
చేయవలసిన పనులను చేయకపోవడం, చేయకూడని పనులను చేసేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం ఈ మూడిటిలో ప్రతీది మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి వుంటుంది. కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలిసోతెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే.
అలా చేసుకున్న వారి అంతరాత్మా ప్రసన్నమవుతుంది. లోకం వారిని ప్రసన్నతా దృక్కులతో చూడడమూ జరుగుతుంది. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలు నశిస్తాయి. పశ్చాత్తాపం నరకాన్ని దూరం చేస్తుంది.
అలాకాకుండా ”నేను ప్రాయశ్చిత్తం చేసుకోను. నాకు పశ్చాత్తపింపవలసిన అగత్యం లేదు” అని మొండికేసిన వాని కోసం, ఇదిగో, ఈ క్రింద చెప్పబడిన నరకాలన్నీ సిద్ధంగా వుంటాయి.
మహారౌరవం, దాని కన్నను మహాభయంకరములైన తామిస్ర, లోహశంకు, పూతిగంధ, హంసాభ, లోహితోద, సంజీవన, నదీపథ, మహా నిలయ, కాకోల, అంధతమిస్ర, తాపన నరకాలే అవి.
బ్రాహ్మణ హంతకుడు, తాగుబోతు, బ్రాహ్మణుని బంగారాన్ని దొంగిలించినవాడు, గురుపత్నిని కామించినవాడు, వీరితో తిరిగేవారు ఈ మహాపాపులంతా అవీచి, కుంభీపాకమను పేర్లుగల నరకాలలో పడతారు. అవే అత్యంత భయంకర నరకాలు.
గురువునీ వేదాన్నీ నిందించడం కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాతకమే. నిషిద్ధ పదార్థాలను తినుట, కుటిలతతో నిండిన ప్రవర్తన, రజస్వలయగు స్త్రీని పెదవులపై చుంబించుట, మద్యపానం ఒకేరకమైన పాపాలు. అశ్వ, రత్న, స్వర్ణ చౌర్యాలు సమానపాపాలు. మిత్రపత్ని, తనదికాని ఉత్తమ జాతి స్త్రీ, చండాలి, సోదరి, కోడలు వంటి స్త్రీలతో రమించుట కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాపాలే. అలాగే పిన్ని, అత్త, ఆచార్యపుత్రి, ఆచార్యపత్నీ కూతురు వరుస స్త్రీలతోడి రమింపు కూడ గురుపత్నీ గమనంతో సమానమైన మహాపాతకాలే.
ఇలాంటి మహాపాపులకు ముందుగా లింగభేదనం చేసి కొంతకాలమాగి అప్పుడు వారిని వధించాలి. ఇటువంటి పాపంలో పాలు పంచుకుని ఇష్టపూర్వకంగా వ్యభిచరించిన స్త్రీనికూడ క్రమక్రమంగా వధించాలి.
గోహత్య, వ్రాత్యత (వడుగు చేసుకోక పోవడం) బ్రాహ్మణ స్వర్ణ లేదా తత్సమానద్రవ్యా పహరణ, అప్పునెగ్గొట్టుట, దేవపితృఋషి ఋణాలను తీర్చకుండుట, అధికారి అయివుండీ అగ్నికార్యం చేయకుండుట, అమ్మకూడని లవణాదులను అమ్ముకొనుట, పెద్దన్నకు పెళ్ళికాకుండానే తాను చేసుకొనుట, అధ్యయనాధ్యాపనములకు డబ్బును వాడుట, తమ్మునికి వివాహం చేసి తాను పెండ్లిని మానుకొనుట, పరస్త్రీ గమనము, చక్రవడ్డీలను గుంజుకొనుట, లవణం తయారీ, స్త్రీ వధ, శూద్రవధ, నిందితధనంతో జీవనం గడుపుట,నాస్తికత, వ్రతలోపం, కొడుకును అమ్ముకొనుట, మాతాపితలను పరిత్యజించుట, చెఱవులనూ తోటలనూ అమ్ముకొనుట, కన్యపై అపవాదు వేసి దూషించుట, తనకోసం మాత్రమే భోజనమును వండుకొనుట, మద్యపానం చేసే స్త్రీతో సంబంధం పెట్టుకొనుట, స్వాధ్యాయ, అగ్ని, పుత్ర బంధు ఈ నాల్గింటినీ పరిత్యజించుట, అసత్ శాస్త్రాలను చదువుట, భార్యనూ తననూ అమ్ముకొనుట ఇవన్నీ ఉపపాతకాలు.
మునులారా! ఇక వీటికి ప్రాయశ్చిత్తాలను వినండి. తెలియక బ్రహ్మహత్య చేసినవాడు ఒక కపాలాన్ని చేత బట్టుకొని మరొక కపాలాన్ని కర్రకు గుచ్చి ధ్వజాన్ని వలె మోస్తూ భిక్షాటన చేస్తూ యమ నియమాలు పాటిస్తూ పన్నెండేళ్ళపాటు తిరుగుతునే వుండాలి. తెలిసి చేసినవాడు (బ్రహ్మ హత్యయని) లోమభ్యః స్వాహా ఇత్యాది మంత్రాలతో తన శరీరాంగాలకు ప్రతీకలుగా విభిన్న శాస్త్ర విహిత ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేసి చివరగా తన శరీరాన్ని కూడా నిర్దిష్ట విధానం ద్వారా అగ్నికి ఆహుతి చేయాలి.
బ్రాహ్మణుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించినా కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ప్రాణత్యాగ మక్కరలేని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. అవి ఇంచు మించు ప్రాణం పోయడమంత కష్టం.
అత్యధికంగా కష్టపెడుతున్న, దుస్సహమైన, బహుకాల వ్యాపితమైన రోగంతో గాని అంతకన్న ప్రాణములనార్పివేసేటంత భయంవల్ల గాని చెప్పలేనంత బాధపడుతున్న బ్రాహ్మణుని గాని గోవుని గాని, చేరదీసి ఆదరించి సేవచేసి సంరక్షణ చూసి, సంపూర్ణారోగ్య వంతులను గావించినచో కూడా బ్రహ్మ హత్యాపాతకం పోతుంది.
బ్రాహ్మణుల కడుపున పుట్టాడన్న మాటే గాని ఏ గుణము వీడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలులేకుండా వున్న వానిని పొరపాటున చంపినా కూడా అది బ్రహ్మ హత్యే అవుతుంది దానికి ప్రాయశ్చిత్తం ఇది.
అడవిలోనికి పోయి మంత్రాలతో ఐతరేయ బ్రాహ్మణాది అంగాలతో సహా వేదాన్ని పూర్తిగా మూడుమార్లు పారాయణ చేయాలి లేదా వేదవిద్యకై తన జీవితాన్ని ధారపోస్తూ తన ధనాన్నంతటినీ యోగ్య పాత్రులకు సమర్పించి వేయాలి. సోమయాగం చేసిన లేదా చేస్తున్న క్షత్రియుని గానీ వైశ్యునిగానీ చంపినా బ్రహ్మ హత్యకు విధింపబడిన ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి.
ప్రాయశ్చిత్త కర్మలో మరొక విశేషమేమనగా హత్యాప్రయత్నం చేయడమే. తప్పు అవతలి వ్యక్తి మరణించినా, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి బతికి బయటపడినా హత్యకి చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మను చేసుకోకతప్పదు. అంటే అవతలి వాడు. చావకపోయినా హత్యా ప్రయత్నంచేసిన వానికి హత్యాపాపమే అంటుకుంటుంది.
మదిరాపానానికి ప్రాయశ్చిత్తం అగ్నివలె వేడెక్కి పొగలు గక్కుతున్న మద్యాన్ని గానీ, సలసలమరుగుతున్న గోమూత్ర, గోదుగ్ధ, గోఘృతాలలో నొకదానిని గాని ఆపకుండా ఆగకుండా భగవన్నామస్మరణ చేస్తూ త్రాగుట. నీరనుకొని మద్యం పొరపాటున తాగేసినవారు జడలు పెంచుకొని మలిన వస్త్రాలను కట్టుకొని మరుగుతున్న నేతిని త్రాగుతూ బ్రహ్మహత్యకు గల ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. తరువాత తన వర్ణానికి తగిన సంస్కారాన్ని చేసుకోవాలి.
వీర్య పానం, సురాపానం, మూత్రపానం, చేసే బ్రాహ్మణి సద్గతి నందకపోగా క్రమంగా గద్ద, కుక్క, పంది యోనుల్లో పుడుతుంది. బ్రాహ్మణుని బంగారాన్ని అపహరించిన వానికి ప్రాయశ్చిత్త కర్మ మేమనగా వాడొక రోకలిని మోసుకొని రాజ సభలోకి (న్యాయస్థానం అప్పట్లో అదే) పోయి తాను చేసిన పాపాన్ని ప్రకటించి రాజు విధించినన్ని దెబ్బలు ఆ రోకటి తోనే తినాలి.
ఈ శిక్షాక్రమంలో వాడు మరణించినా, శిక్షానంతరం జీవించినా పవిత్రుడే అవుతాడు. (తెలుగిళ్ళలో ఒక మాటుంది. రాజదండనవుంటే ఇక యమదండ వుండదని.) ఇలా చేయనివారు తమ తప్పునొప్పుకొని తమయెత్తు బంగారాన్ని ఆ బ్రాహ్మణునికి సమర్పించుకున్నా ఆ పాపం పోతుంది.
గురుపత్నితో రమించినవాడు ఎఱ్ఱగా కాలుతున్న ఇనుప స్త్రీ విగ్రహాన్ని కౌగలించుకొని ప్రాణత్యాగం చేయాలి లేదా తన లింగాన్నీ, అండకోశాల్ని తానే కత్తిరించుకొని నైరృత్య దిశవైపు విసిరేయాలి). ఈ మహా పాపానికి ఇంకా రెండు రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. పశ్చాత్తపించిన వాడు మూడు సంవత్సరాల పాటు ప్రాజాపాత్య, కృచ్ఛవ్రత పాలనను చేయాలి లేదా మూడు మాసాల పాటు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఏకదీక్షగా వేదసంహితను పఠిస్తూ వుండాలి. దీక్షపూర్తయితే పాపం పోతుంది.
గోవధ చేసిన పాపి పంచగవ్యాలను మాత్రమే స్వీకరిస్తూ ఒక నెలపాటు మునివలె ఏ వికారాలూ లేకుండా గోశాలలోనే జీవిస్తూ గోసేవ చేయాలి. మాసాంతంలో యథాశక్తిగా గోదానం చెయ్యాలి.
ఉపపాతక శుద్ధి చాంద్రాయణ వ్రతం వల్ల సిద్ధిస్తుంది. ఒక మాసం దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ ”పరాక” నామక వ్రతం చేసినా అదే ఫలముంటుంది.
క్షత్రియవధను చేసినవాడు ఒక ఎద్దునూ వేయి ఆవులనూ దానంచేయాలి లేదా బ్రహ్మహత్యకు నిర్దేశింపబడిన ప్రాయశ్చిత్తాన్ని మూడేళ్ళ పాటు చేసుకోవాలి. వైశ్యుని వధించిన వాడు వంద గోవులను దానం చేయాలి లేదా బ్రహ్మ హత్యాపాతక ప్రాయశ్చిత్త ప్రతాన్ని ఒక యేడాది పాటు చేయాలి. శూద్రుని హత్యచేసినవాడు గాని స్త్రీ ని వధించిన వాడు గాని బ్రహ్మహత్యా పాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఆరునెలల పాటైనా ఆచరించాలి లేదా సత్పాత్రునికి పది సవత్సపయస్వినీ గోవులను దానమైనా ఇవ్వాలి. ఇవన్నీ తెలియకగాని అజ్ఞానవశానగాని అప్రయత్నంగా గాని, చేసిన హత్యలకు ప్రాయశ్చిత్తాలు.
పిల్లి, ముంగిస, ఉడుము, కప్ప, సాధారణ పశువులు – వీటిని చంపడం కూడా పాపమే. ఈ పాపము చేసినవాడు మూడు రాత్రులు గడిచే దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పాదకృచ్ఛవ్రత పాలనము చేయాలి. ఏనుగును వధించినవాడు అయిదు నీలవృషభాలను పేరుగల విశిష్టలక్షణాలున్న ఎద్దులను సత్పాత్రునికి దానం చెయ్యాలి. చిలుకనుగాని రెండేళ్ళ వయసున్న దూడని గానీ క్రౌంచపక్షిని గాని వధించిన వాడు మూడేళ్ళ వయసున్న దూడను దానం చేయాలి. గాడిద, మేక, గొజ్జెలలో నొక దానిని చంపినవాడొక ఎద్దును దానంచేయాలి. వృక్ష, గుల్మ, లతాదులను నరికి వేసిన ద్విజుడు నూరుమార్లు గాయత్రిని జపించాలి.
తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టంలేకున్నా మధు, మాంసాలను సేవించినవాడు కృచ్ఛవ్రతాన్నీ అన్యశేష వ్రతాల్నీ ఆచరిస్తే ఆ పాపం శాంతిస్తుంది. గురువుగారు చెప్పిన పనిని చేస్తూ గాని మార్గంలోగాని శిష్యుడు మృతి చెందితే ఆ పాపం గురువును ముట్టు కుంటుంది. గురువు దానికి ప్రాయశ్చిత్తంగా మూడు కృచ్ఛవ్రతాలనా చరించాలి.
గురువు గారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికి మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నుని, సంతృప్తుని (సంతుష్టుని) చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారిలేదు.
నిర్దోషులనూ, అమాయకులనూ పాపులని దూషించి దొంగఋజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి. వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై, ఒక నెలపాటు మంచి నీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమోచన మంత్రమును జపించుట.
అసత్ ప్రతి గ్రహం అనగా అపసవ్య దానమును పుచ్చుకొనుట కూడా పాపమే. దీనికి ఒక మాస పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకొనే వ్రతమును చేస్తూ పశువులసాలలో నివాసముంటూ సదా గాయత్రిమంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది.
ఇంకా ఉంది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹