Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – డెబ్భై ఏడవ అధ్యాయం – 2

ప్రాయశ్చిత్తాలు – కృష్ణ, పరక,చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు

వ్రాత్యుని కుపనయనం చేసి యజ్ఞం చేయించిన వాని కంటుకొనే పాపం మూడు కృచ్ఛ వ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారకహోమం (మంత్రం ద్వారా అపకారం) వల్ల వచ్చే పాపానికీ ఇదే ప్రాయశ్చిత్తం వేదప్లావి ఒక సంవత్సరం పాటు యవలనే తిని బతకాలి.

శరణని వచ్చి ఆశ్రయించిన వానికి దక్షత వుండీ కూడా శరణివ్వని వాడి పాపానికీ ఇదే తగిన ప్రాయశ్చిత్తం.

గాడిదపైగాని ఒంటిపైగాని ప్రయాణించేవాడు మూడు ప్రాణాయామాలు చేయాలి. తెలియక, అనగా అవి పాపములని తెలియక, చేసిన నగ్నస్నానము, నగ్నశయనము, పగటిపూట రతి అనే పాపాలు కూడా మూడు ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి. గురుజను ”లను నీవు” అని సంబోధించరాదు.

అట్టి పాపము ఆ గురు జనుల ప్రసన్నతవల్ల పోతుంది. బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్ళడమే పాపం. దానికి కృచ్ఛ వ్రతమే ప్రాయశ్చిత్తం. క్రోధంలో ఒళ్ళు మరచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెనుపాపము అతి కృచ్ఛవ్రతమున గాని తీరదు.

విఖ్యాతమైన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టి కూడా చేయవచ్చు. విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి. దీని భావమేమనగా ఒక వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం.

ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం. అప్పుడా వ్యక్తి పరిషత్తులోనొకనిని కలుసుకొని తనకి తెలియకుండానే తనవల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటకతప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే ఆయన చెప్పేది గుప్త రూపంలో నున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలావుంటాయి.

బ్రహ్మహత్య చేసిన పాపి మూడు రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాదులలో పీకల దాకా మునిగి అఘమర్షణ మంత్రాన్ని జపించాలి. మూడు రాత్రులు దాటాక వచ్చే పగటిపూట ఒక పాలిచ్చే ఆవును సత్పాత్రునికి దానమివ్వాలి.

ఈ విధంగా తపించి, జపిస్తే అజ్ఞానవశాన తన చేత జరిగిన బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది. బ్రహ్మహత్య కర్త ఒక పగలూ ఒక రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జల మధ్యంలో అలా నిలబడే వుండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోమభ్య స్వాహా మున్నగు ఎనిమిది మంత్రాలనూ ఘోషిస్తూ ఒక్కొక్క దానితో అయిదేసి ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి.

మద్యపానం తెలియక చేసి తెలిశాక పశ్చాత్తాపము నొందినవాడు జలమధ్యంలో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ మూడు రోజులు ఉపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను (కుష్మాండీబుచా) నేతిలో ముంచి అగ్నికి ఆహుతులనిస్తే ఆత్మశుద్ధి కలుగుతుంది. గురుపత్నీ గమనం చేసిన పాపి ఇలాగే చేస్తూ రుద్రదేవమంత్రానికి బదులు సహస్ర శీర్షా… మంత్రాన్ని జపించాలి.

మిగిలిన పాపాలకు నూరుమార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యా పాసన, బ్రాహ్మణునిచే పదకొండాహుతులనిప్పించి రుద్రానువాకములు జపించుట మున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు. బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దినమంతా సూర్యరశ్మి పడే చోట జలంలోవుండి రాత్రంతా కూడా అక్కడే వుండి వేయిమార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి.

వేదాభ్యాసం చేసే శాంతి పరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది. యమ నియమాలున్న వానికి పాపపుటాలోచనలే రావు. బ్రహ్మచర్యం, దయ, క్షమ, భగవద్ధ్యానం, సత్యం, నిష్కాపట్యం, అహింస, అస్తేయం, మాధుర్యం దమం అనే పదీ యమములు.

స్నానం, మౌనం, ఉపవాసం, యజ్ఞం, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహం, తపస్సు, అక్రోధం, గురుభక్తి, పవిత్రత ఈ పదీ నియమాలు. (మౌనం అంటే శాశ్వతంగా మూగబోవడమని కాదు; కొంతకాలం పాటు కొన్ని వ్రతాలలో భాగంగా మాట్లాడకుండా వుండడం)

ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, గోమయం పంచగవ్యాలు. వీటిని కుశోదకంతో కలిపి దానినే అన్నానికి బదులు తినడం కృచ్ఛవ్రతమవుతుంది. ఒకరోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి రెండవరోజు రాత్రంతా. పంచగవ్యాలనే స్వీకరిస్తూ వుంటే దానిని కృచ్ఛసొంతపన వ్రతమంటారు.

తొలిరోజు ఆవుపాలు, మరునాడు ఆవు పెరుగు, మూడవనాడు ఆవునెయ్యి, నాల్గవదినం గో మూత్రం, ఐదవ రోజు గోమయం, ఆరో రోజు కుశోదకం మాత్రమే స్వీకరించి ఏడవరోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమ పవిత్రమైన ”మహాసొంతపన” వ్రతమనబడుతుంది.

పలాశ, గూలర, కమల, బిల్వ పత్రాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి. అలా నాలుగు రోజులు నాలుగాకులు నీరు తరువాత అయిదవ రోజున కుశోదకం మాత్రం త్రాగాలి. అంటే ఈ అయిదు రోజులూ ఇంకేదీ తినకుండా తాగకుండా కృశించాలి. ఈ వ్రతాన్ని పర్ణకృచ్ఛవ్రతమంటారు. తొలిరోజు వేడి ఆవుపాలనూ, మలిరోజు వేడి నేతినీ, మూడవరోజు వేడినీటినీ మాత్రమే ప్రాశ్నచేసి (అనగా నోట్లో వేసుకొని) నాలుగవ రోజు పూర్తిగా ఉపవాసముండి పోవాలి.

ఈ వ్రతాన్ని మహాతప్రకృచ్ఛవ్రతం అంటారు. ఈ కృచ్ఛవ్రతాలు పరమశుద్ధికరాలు, పవిత్రాలు.

కృచ్ఛవ్రతాలలో మరొకటి పాదకృచ్ఛవ్రతం. మొదటి రోజు ఏకభుక్తం (మధ్యాహ్నం పన్నెండుకి భోజనంచేసి మరేమీ తినకుండా రాత్రి శయనించడం) రెండవ రోజు నక్తవ్రతం (అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం) మూడవ రోజు అయాచితం (ఎవరినీ యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చి పెడితే, అదీ ఒకపూట తినడం) నాలుగవ రోజు కటిక ఉపవాసం.

ఇదంతా కలిపి పాదకృచ్ఛవ్రతం అవుతుంది. ఇదే వ్రతాన్ని ఒకే నెలలో మూడుమార్లు చేస్తే దానిని ప్రాజాపత్య వ్రతమంటారు. ఈ వ్రతంలో కూడా భోజనం చేయునపుడు ఒకమారు చేతినిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని నాలుగు రోజులుండగలిగితే దానిని అతికృచ్ఛవ్రతమంటారు. పన్నెండు రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాకవ్రతమంటారు. ఇరవై ఒక్క రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని అతి కృచ్ఛవ్రతపాలనం చేయడాన్ని కృచ్ఛాతి కృచ్ఛవ్రతమని వ్యవహరిస్తారు.

ఆరు రోజుల కృచ్ఛవ్రతమొకటుంది. నూనెను బాగా పిండి చేసిన పిమ్మట మిగిలిన నూల పిప్పిని తొలిరోజూ, గంజిని రెండవరోజూ, మజ్జిగను మాత్రమే మూడవదినము, కేవలం జలాన్ని నాలుగవనాడూ పేలపిండిని అయిదవరోజూ ఆహారంగా స్వీకరించి ఆరవరోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్యకృచ్ఛవ్రతమంటారు.

ఈ వ్రతాన్నే కొంచెం అతిశయింపజేసి ఒకరోజు తినే పదార్థాన్ని మూడు రోజులపాటు తింటూ మొత్తం పదిహేను రోజులు చేసి పదహారవనాడు పూర్ణోపవాసం చేస్తే దాన్ని తులాపురుష (సంజ్ఞక) చాంద్రాయణ వ్రతమనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం.

అమావాస్యనాడు ఒక నెమలిగుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని పెంచుకుంటూ పూర్ణిమనాడు సంపూర్ణ భోజనం చేసి, మరునాటి నుండి అదే కొలతలో తగ్గించుకుంటూ పోయి అమావాస్యనాడు మరల నెమలిగుడ్డంత ద్రవ్యాన్నే తిని చేసే వ్రతానికి చాంద్రాయణ వ్రతమని పేరు. మొత్తం నెలలో రెండు వందల నలభై గ్రాసాల హవిషాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని వుండి పోవడానికి విశేష వ్రతమని పేరు.

పైన చెప్పిన వ్రతాలను అనుష్టిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సంజ్ఞక విశేష మంత్రాలను జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్నీ గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త, ఆధ్యాత్మిక, ప్రశాంత జీవనాన్ని గడపాలి.

కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వల్ల నశిస్తాయి. ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా, పుణ్యుడు మరింత పుణ్య సముపార్జన కోసం చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే వాని పుణ్యము పండి దేహాంతంలో చంద్రలోకాన్ని చేరుకుంటాడు.అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచ్ఛవ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడౌతాడు.

డెబ్భై ఏడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment