బుధగ్రహ చరిత్ర పదకొండవ భాగము
“ఆచార్యా…” బుధుడు గద్గద కంఠంతో అన్నాడు. వ్యక్తం చేయలేని వ్యధ అతని కళ్ళల్లో స్పష్టంగా , తడిగా కనిపిస్తోంది , వశిష్ఠుడికి.
“నాయనా , బుధా ! దుఃఖాన్ని దూరం చేసుకో ! ఇలతో నీ ఎడబాటు నిరంతరమైనదీ కాదు , శాశ్వతమైనదీ కాదు !”
“ఆచార్యా !”
“చెప్పానుగా , నాయనా ! ఆ అర్ధనారీశ్వరుడు దంపతులకు ఎడబాటు కలిగించడు. నువ్వూ , నేనూ , ఎవ్వరూ కోరుకోకుండానే , అర్ధించకుండానే ఆయన నీ గురించి ఆలోచించాడు. ఉభయతారకమైన ఉపాయంతో , శాపాన్ని పరిహరించాడు. శాపఫలంగా సుద్యుమ్నుడు ఒక నెలరోజులు ”ఇల”గా ఉంటాడు. నాకు కరుణించిన వరం ఫలంగా నెల రోజులు సుద్యుమ్నుడుగానే ఉంటాడు !”
వశిష్ఠుని వివరణ ఏదో అదృశ్య కుంచికలాగా బుధుడి ముఖం మీద కాపురం చేస్తున్న విచారాన్ని తుడిచివేసింది.
“ఆచార్యా… నిజమా ?”
“అవును , బుధా ! ఈ వైవస్వతుడి బిడ్డ , ఒక నెలపాటు అక్కడ పుత్రుడుగా రాజుగా వ్యవహరిస్తాడు. మరుసటి నెల ఇక్కడ నీ పత్నిగా దాంపత్యం నెరపుతాడు. ఇది ఆదిశంకరుని అనుశాసనం !” వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు.
“గురుదేవా ! నా తల్లిదండ్రులు మీ రుణం తీర్చుకోలేరు. నేను కూడా మీ రుణం తీర్చలేను !” సుద్యుమ్నుడు ఆనందంగా అన్నాడు.
“నీ అదృష్టం అద్వితీయం సుద్యుమ్నా !” వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు. “అది ద్విముఖం ! సూర్యపుత్రుడైన వైవస్వతుడి కొడుకుగా , అత్రి పుత్రుడైన చంద్రుడికి కోడలిగా రాణించే మహద్భాగ్యం నీది !”
వశిష్ఠుడు బుధుడి వైపు తిరిగాడు. “నీది కూడా అదృష్టమే నాయనా ! ఒక నెల వియోగం , ఒక నెల సంయోగం ! ఈ వియోగ , సంయోగాలు ఆవృత్తి మీ అనుబంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది. మరొక సూచన ఏమిటంటే – పురూరవుడు భావిసామ్రాట్టు. ఆశ్రమవాసం కన్నా రాజమందిర వాసం అతనికి తగినది ! రాజోచితమైన శిక్షణ పసితనం నుంచే అలవడాలి.”
“పురూరవుడు కూడా లేకుండా నేను ఎలా ఉండగలను ?” బుధుడు నిరుత్సాహంగా అన్నాడు.
“బిడ్డల ఆలనా పాలనా తల్లి పర్యవేక్షణలో జరగాలి. పురూరవుడికి ఇక్కడ తల్లి ఇల. అక్కడ సుద్యుమ్నుడు !” వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు.
“గురుదేవుల సూచన ఆచరణీయం. పురూరవుణ్ణి నాతో తీసుకువెళ్తాను. అప్పుడప్పుడు భటులు ఆశ్రమానికి తీసుకువస్తారు.” సుద్యుమ్నుడు బుధుడితో అన్నాడు.
బుధుడు మాట్లాడకుండా. పురూరవుణ్ణి ఎత్తుకున్నాడు. “నాయనా ! నీకు అర్థమైందా ? అమ్మ… ఇదిగో… సుద్యుమ్నుడు అనే రాకుమారుడిగా మారింది. ఒక మాసం గడిచిన అనంతరం మళ్ళీ సుద్యుమ్నుడు మాయమైపోయి , అమ్మ అమ్మగా వస్తుంది ! ఇప్పుడు చెప్పు. యువరాజు ప్రద్యుమ్నుడిలో ఎవరున్నారు ?”
పురూరవుడు సుద్యుమ్నుడి వైపు చిరునవ్వుతో చూశాడు. “అమ్మ ఉంది. నెల అనంతరం అమ్మలో యువరాజు సుద్యుమ్నుడు ఉంటాడు.”
“అమ్మా , సుద్యుమ్నుడూ ఒక్కరే కాబట్టి , నువ్వు ఆయనతో బాటు రాజధానికి వెళ్ళాలి. మళ్లీ రావాలి” బుధుడు వివరిస్తూ అన్నాడు.
“ఎప్పుడు రావాలి , నాన్నగారూ ?”
“అనుకున్నపుడల్లా నువ్వు ఈ ఆశ్రమానికి రావచ్చు నాయనా ! భటులు నిన్ను రథంలో తీసుకు వస్తారు” సుద్యుమ్నుడు పురూరవుడి తల నిమురుతూ అన్నాడు.
“నాన్నగారూ ! నాన్నగారూ ! నేను రాజధానికి వెళ్ళి , మిమ్మల్ని చూడడానికి రథంలో వస్తాను” పురూరవుడు ఉత్సాహంగా అన్నాడు. సుద్యుమ్నుడి వైపు వాలుతూ. సుద్యుమ్నుడు పురూరవుణ్ణి అందుకున్నాడు.
“పురూరవా ! నీతో ఆడుకోవడానికి రాజధానిలోని మందిరంలో ఇంకా ఇద్దరున్నారు. తెలుసా ?” వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు.
“ఎవరు గురుదేవా ?” పురూరవుడు ఉత్సాహంగా అడిగాడు.
“నీ మాతామహీ , మాతామహుడు ! అంటే నీ అమ్మకు అమ్మగారూ, నాన్నగారూ అన్నమాట !” వశిష్ఠుడు వివరించాడు.
బుధుడు పురూరవుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకొన్నాడు. సుద్యుమ్నుడు పురూరవుణ్ణి దించి , బుధుడి పాదాలను కళ్ళకు అద్దుకున్నాడు. బుధుడు చిరునవ్వుతో దీవించాడు.
“సుద్యుమ్నా ! అక్కడ రాజదంపతులు నీరాక కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. బయలుదేరుదాం !” వశిష్ఠుడు హెచ్చరించాడు.
“ఇదీ బుధ చరిత్ర !” నిర్వికల్పానంద శిష్యులతో అన్నాడు. “ఎలా ఉంది ?”
“కథా , కథనం రెండూ అద్భుతంగా ఉన్నాయి గురువుగారూ !” విమలానందుడు సంతోషంగా అన్నాడు.
“గురువు గారూ ! ఒక సందేహం…” సదానందుడు అన్నాడు.
“ఏమిటి నాయనా , నీ సందేహం ?” నిర్వికల్పానంద నవ్వుతూ అడిగాడు.
“బుధుడు ఇలాదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే బుధపత్ని ”ఇల” అన్నమాటే కద ! అయితే నవగ్రహాల వివరాలు ఉదహరించే సందర్భాలలో , బుధుడి భార్య ‘జ్ఞాని’ అని అంటున్నారే ! బుధుడు ద్వితీయపత్నిని స్వీకరించాడా ?” సదానందుడు ప్రశ్నించాడు.
“మంచి ప్రశ్న అడిగావు ! కానీ , దీనికి ఇదమిత్థంగా సమాధానం చెప్పలేం. ఎందుకంటే , బుధుడు పునర్వివాహం చేసుకున్నట్టు ఏ పురాణమూ పేర్కొనలేదు. అలాగే ఆయన పత్ని ”ఇల” కాదు అని కూడా ఎక్కడా ప్రస్తావించబడలేదు. వైవస్వతుడి కుమారుడు సుద్యుమ్నుడు ”ఇల”గా మారి బుధుడి భార్య అయ్యాడన్నదే సర్వపురాణ సారాంశం ! చంద్రవంశానికి మూలం ఆ ఇద్దరి దాంపత్యమే. ఇలా బుధుల పుత్రుడైన పురూరవుడే చంద్రవంశ కర్తలలో ప్రముఖుడు !”
“అయితే ఆ ”జ్ఞాని” అనే స్త్రీ ఎవరు గురువుగారూ ?” శివానందుడు ప్రశ్నించాడు.
“ఇలా దేవి మరొక నామధేయమే ”జ్ఞాని” అని అనుకోవడం శ్రేయస్కరం అని నా ఉద్దేశం. స్త్రీగా జన్మించి , పురుషుడుగా మారి , శివపార్వతుల శాప ఫలంగా మళ్ళీ స్త్రీగా మారి , శివుడి కటాక్షంతో శాప విముక్తి పొంది , తదనంతర కాలంలో స్త్రీగా , పురుషుడిగా చరిత్ర సృష్టించిన ”ఇలా” దేవినే ”జ్ఞానిదేవి” అనుకోవడం అపరాధం కాదు ! బుధుడు నవగ్రహాలలో ఒకడుగా నియమించబడినప్పుడు ఆయన సతీమణికి నామధేయం ”జ్ఞాని” అనే బిరుదనామం లభించిందేమో !” నిర్వికల్పానంద ఆగాడు.
“అలా అనుకోవడం మంచిదే ! బుధుని ధర్మ పత్నిగా ఇలను గౌరవించినట్లు ఉంటుంది ,” విమలానందుడు సమర్ధింపుగా అన్నాడు.
“సరే… ఇక ఐదవ గ్రహం బృహస్పతి. ఆయన చరిత్ర వినండి” అంటూ ప్రారంభించాడు. నిర్వికల్పానంద.
“ఒక్కసారి బృహస్పతి గురించి సింహావలోకనం చేసుకుందాం. చంద్రుడి వద్ద నుండి భర్త వద్దకు చేరిన తార బృహస్పతిని సేవించుకుంటూ ఉంది. బృహస్పతి ఆమె అపరాధాన్ని క్షమించి చేరదీశాడు. ఆ ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది…”
రేపటి నుండి గురుగ్రహ చరిత్ర ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹