Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – 86 వ అధ్యాయం

గురుగ్రహ చరిత్ర రెండవ భాగము

“పాపిష్టిదానా ! ఎంతకు తెగించావు నువ్వు ? నన్ను ఘోరపాపం చేయమంటున్నావా ? ఎంత ధైర్యం నీకు ?”

పుంజికస్థల చిన్నగా నవ్వింది. “మీరు అమాయకులు స్వామీ ! మీ భార్య తారాదేవి. ఆశపడి అందుకున్న సుఖం మీరు అందుకుంటే పాపమెలా అవుతుంది స్వామీ ! అన్ని సుఖాలూ అక్కడే వదిలిపెట్టి , ఇక్కడ మీ సేవకే అంకితమైపోయి , పందిరిలేని తీగలా ఎండిపోతూ ఉండిపోయాను. నా పరిచర్యలతో బాటు నా శరీరాన్నీ మీకు అర్పిస్తాను. స్వీకరించండి ! చేరదీసి ప్రియురాలిగా ఆదరించండి ! ఈ అప్సరస కోరిక తీర్చండి !”

బృహస్పతి ఆశ్చర్యంతో , ఆగ్రహంతో ఆమె ముఖంలోకి చూశాడు. పుంజికస్థల కళ్ళల్లో కామం ఎర్రగా మండుతూ కనిపిస్తోంది. ఉబ్బినట్టున్న ఎర్రటి పెదవులు కోరికతో అదురుతున్నాయి. తడిగా మెరుస్తూ , బృహస్పతి చూపులు అసహ్యంగా , అప్రయత్నంగా కిందకి జారాయి. ఇంకా పైట వేసుకోని పుంజికస్థల శరీరం మీద ఆవేశం కెరటంలా పొంగుతూనే ఉంది. ఆయన చూపుల్ని అపార్ధం చేసుకున్న పుంజికస్థల ఉద్రేకంగా బృహస్పతి వైపు రాబోయింది.

“ఆగు !” బృహస్పతి కేక కాదు , గుహలో సింహనాదం !

పుంజికస్థల ఉలిక్కిపడి ఆగి , ఆందోళనగా చూసింది.

“పాపాత్మురాలా ! నీది అసహజ కామం ! అక్రమ ఉద్రేకం ! నీతి బాహ్యమైన కోరిక ! ఆరని దాహంతో సరితూగే వానరకామం నీది ! ఆ కామానికి సరిపోయేలా వానర స్త్రీవి అయిపో !” బృహస్పతి శాపం ఆశ్రమంలో ప్రతిధ్వనించింది.

అది పుంజికస్థల చెవుల్లో , గుండెలో ఉండిపోయింది. ఆమె సర్వస్వంలో ప్రతిధ్వనిస్తూ

“వానర స్త్రీ అయిపో !” పుంజికస్థల శరీరం ఒక్కసారిగా జలదరించింది. ఇందాకా కామోద్రేక స్వేదంతో తడిసిన ఆమె తనువు ఇప్పుడు భయ స్వేదంతో తడిసి , చల్లబడిపోయింది. అప్సరస అయిన తను వానరం కావడమా !?

పుంజికస్థల శరీరం వణకసాగింది. అప్రయత్నంగా ఆమె పైటను తీసి తన శరీరాన్ని కప్పుకుంది. ఉన్నట్టుండి ఏడుస్తూ , బృహస్పతి పాదాల ముందు కుప్పకూలి పోయింది. ఆమె చేతులు వణుకుతూ ఆయన పాదాల్ని స్పృశిస్తున్నాయి.

“స్వామీ… స్వామీ… నేను వానరకాంత అయిపోవాలా ? అయ్యో… నా అపరాధాన్ని మన్నించండి. గంధర్వుల శృంగారలీల నాలో కామరోగానికి కారణమైంది స్వామీ ! నన్ను క్షమించి శాపం ఉపసంహరించండి. మీ సేవకురాలిని కాపాడండి” పుంజికస్థల దీనంగా ప్రార్థించింది.

అంతలో ఆవేశం ! అంతలో ఆవేదన ! పుంజికస్థల స్థితి బృహస్పతిలో జాలి పుట్టించింది.

“పుంజికస్థలా ! లే !” బృహస్పతి ముక్తసరిగా అన్నాడు. పుంజికస్థల లేచి , కన్నీళ్ళతో చూసింది. “నా శాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి. దానికి తిరుగులేదు…”

“స్వామీ…”

“అయితే నా శాపం , యథార్ధ దృష్టిలో శాపం కాదు – వరం…”

“స్వామీ…”

“ఔను ! నా శాపం నీకు వరం , పుంజికా ! వానరకాంత జన్మలో నీకు మహావీరుడైన వానరశ్రేష్ఠుడు భర్త అవుతాడు. అతనితో నువ్వు ఇప్పుడు వాంఛించిన మహదానందాన్ని అనుభవిస్తావు. నీకు జితేంద్రియుడూ , మహావీరుడూ , చిరంజీవీ అయిన కుమారుడు జన్మిస్తాడు ! శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో ధరించే అవతార రూపాన్ని సేవించుకొని , లోకాల చేత ఆరాధించబడతాడు. నీ నామధేయాన్ని శాశ్వతం చేస్తాడు.” బృహస్పతి చెయ్యెత్తి అన్నాడు.

పుంజికస్థల కన్నీళ్ళు తుడుచుకుంటూ చూసింది. ఆమె ముఖం మీద చిరునవ్వు మెరిసింది. “ధన్యోస్మి, స్వామీ !”

నువ్వు నిజంగానే ధన్యురాలివి , పుంజికా ! వెళ్ళిరా !”

పుంజికస్థల బృహస్పతి పాదాలకు నమస్కరించి , పైకి లేచి , ప్రశ్నార్థకంగా చూసింది. “స్వామీ… నేను ఎక్కడికి వెళ్ళాలి ?”.

“ఎక్కడికైనా సరే ! స్వేచ్ఛగా , యధేచ్చగా వెళ్ళు ! నీ అంతరంగం నీకు దారి చూపుతుంది. ఆత్మ మార్గదర్శకత్వాన్ని అంగీకరించి , ప్రస్థానం సాగించు , శుభం భూయాత్ !”

పుంజికస్థల మెల్లగా ద్వారం వైపు తిరిగింది. అడుగులో అడుగు వేస్తూ , ఆశ్రమం నుండి వెలుపలికి వెళ్ళింది.బృహస్పతి ఆమెను చిరునవ్వుతో చూస్తున్నారు.

నదీతీరం నుండి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తార పూజాదికాలు నిర్వర్తించకుండా ఉన్న భర్తనూ , చెల్లాచెదరుగా పడిఉన్న పువ్వుల్నీ ఆశ్చర్యంగా చూసింది. పువ్వుల్ని ఎవరు పారబోశారని ఆయనను అడిగింది.

“అవి భక్తి కుసుమాలు కావు , రక్తి కుసుమాలు అంటూ నీ పరిచారిక పుంజిక నా మీద వర్షించింది.” అంటూ బృహస్పతి నవ్వుతూ జరిగిందంతా వివరించాడు.

“అయ్యో పాపం , పుంజికస్థల ! శాపం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో , స్వామీ…” తార జాలిగా అంది.

“శపించడం , ఆగ్రహించడం – ఇలాంటివి ఆలోచించి చేసే ప్రతిక్రియలుకావు. అయితే నేను ఆలోచించే , ముందు చూపుతో పుంజికస్థలను శపించాను.” బృహస్పతి నవ్వుతూ అన్నాడు.

“ముందు చూపా ?” తార ప్రశ్నార్థకంగా చూసింది.

“ముందు చూపే ! గంధర్వ మిథునాన్ని శృంగారకేళిలో చూసి , వొళ్ళు తెలియని విపరీత కామంతో పుంజికస్థల నా మీద విరుచుకు పడింది. ఆమె ఎప్పుడూ నన్ను కామంతో చూడలేదు. మనసులోంచీ , తనువులోంచీ క్రమంగా ఉద్భవించేది సహజ కామం. అది ప్రణయ పరాకాష్ఠ ! ఇతరులు కామవికార ప్రవర్తన చూసినప్పుడు , పుట్టేది అసహజ కామం ! అది ప్రణయ కామం కాదు , ప్రేమా కాదు. పుంజికస్థల వాంఛించింది. విపరీత , అసహజ కామానుభవం ! అదుపాజ్ఞలలో ఉండని అతి కామం అది. అది వానరజాతికి సహజం ! అందుకే ఆమె వానర స్త్రీగా జన్మించేలా శపించాను. ఆ రూపంలో ఆమె విపరీతమైన నిరంతరమైన శారీరక సుఖాన్ని అనుభవిస్తుంది !” బృహస్పతి ఓపికగా వివరించాడు.

“ఇన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు గనుకనే మిమ్మల్ని ఆ దేవతలు గురువుగా స్వీకరించారు ,” తార చిరునవ్వు నవ్వింది.

రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. శయనాగారంలో తార భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇంద్రసభకు వెళ్ళిన భర్త ఇంకా రాలేదు. ఆలస్యమైనా వస్తారు. మాతలి రథం మీద తీసుకువస్తాడు. ఆలోచిస్తూ , ప్రమిదలో వెలుగుతున్న జ్యోతిని కొద్దిగా ఎగసనదోసింది తార. శయనాగారంలో కాంతి రెండింతలైంది.

“తారా !”

భర్త పిలుపు విని తార ద్వారం వైపు చూసింది. ఆయనతో పాటు ఏదో సరికొత్త సువాసన శయనాగారంలో ప్రవేశించి , వ్యాపిస్తోంది.

బృహస్పతి దీపం దగ్గరగా నిలుచున్న తారనే చూస్తూ ఉండిపోయాడు. గాలికి అటుఇటూ చలిస్తున్న దీపకళిక తార శరీరాన్ని కొత్తగా చూపిస్తోంది. ఆమె శరీరం మీద అక్కడక్కడా ఆమె శరీరావయవాల నీడే పడుతోంది , అందంగా ! వెలుగు , నీడా రెండూ స్వాభావికంగా ఆమెను అలంకరిస్తూ , ఆకర్షణను ఇనుమడింపజేస్తున్నాయి. వెలుగు నీడల వింత కలయికలో తార కళ్ళని లాగి పట్టి , శరీరాన్ని కూడా లాగుతున్నట్టుంది !

అందానికి పట్టిన అద్దంలాంటి ముఖం ! అందమైన నుదురు మీద వంకీలు తిరిగి , కళ్ళను రక్షిస్తున్నట్టున్న కనుబొమలు ! వాటి కింద – సమీపంలో ఉన్న జ్యోతిని పరిహాసం చేస్తున్నట్టు – ప్రశాంత కాంతిగోళాల్లాంటి కమనీయ నేత్రాలు. ధ్వనిలేని భాషలో కోరికను వ్యక్తం చేస్తున్నట్టు స్పందిస్తున్న అధరం ! అది , మధురం తనకు తెలుసు.

బృహస్పతి తార సౌందర్యాన్ని నేత్రచషకాలతో త్రాగుతూ ఆమె దగ్గరగా అడుగులు వేశాడు. ఆయన వద్ద నుండి వెలువడుతున్న ఏదో సౌరభం – ఆయన కన్నా ముందుగా పరుగెడుతోంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment