Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఎనభై ఏడవ అధ్యాయం

గురుగ్రహ చరిత్ర మూడవ భాగము

బృహస్పతి చేయి అంగవస్త్రం చాటు నుంచి ఇవతలకి వచ్చింది. ఆ చేతిలో ఏదో పుష్పం… నవరత్నాలతో పొదిగినట్టు రకరకాల రంగుల్లో మెరుస్తోందది. “ఇది ఇంద్రపత్ని శచీదేవి గురుపత్ని తారాదేవికి కానుకగా పంపింది !”

బృహస్పతి నవ్వుతూ పుష్పాన్ని అందించాడు. తార అందుకోలేదు. ఆమె మెల్లగా ముందుకు వంగింది. సున్నితంగా ఆ దివ్యపుష్పాన్ని ఆఘ్రాణించింది. తల పైకెత్తి , పరవశంగా చూసింది. ఆమె ఎర్రటి తడి పెదవుల్ని చిరునవ్వు అందంగా విడదీసింది. తార మెల్లగా , వీపుని భర్త వైపు తిప్పింది. పుష్పాన్ని శిరోజాలలో అలంకరించమన్న సూచనను అందిస్తూ.

బృహస్పతి పువ్వును తార శిరోజాలలో అలంకరించాడు. శిరోజాల నేపథ్యంలో దివ్య కుసుమం ధగధగలాడుతోంది. తార శిరోజాల ఆశ్రయం పొందేక పుష్ప సౌరభం హెచ్చినట్టనిపిస్తోంది బృహస్పతికి , తల వాల్చి సువాసనను గాఢంగా ఆఘ్రాణించాడు. రెండు చేతుల్నీ తార భుజాల మీద వేశాడు. సున్నితంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు.

తార ఆయన ముఖంలోకి తన్మయత్వంతో చూస్తోంది. ఆమె కళ్ళు తారల్లా మెరుస్తున్నాయి.

“తారా ! వాతాయనం మూసివేశావెందుకు ?” బృహస్పతి ఉన్నట్టుండి అడిగాడు.

తార కనురెప్పలు కిందికి వాలాయి.

“ఎందుకు తారా ?” బృహస్పతి మళ్ళీ అన్నాడు. “తెరిచి ఉంచితే చల్లటి మలయమారుతం వీవనలు వీస్తుంది కదా!

“… వాతాయనం లోంచి అతను… కనిపిస్తూ , చూస్తున్నాడు…” తార కంఠం బలహీనంగా ధ్వనించింది.

“ఎవరు ? ఎవరతను ?” బృహస్పతి ఆశ్చర్యంతో అడిగాడు.

“… అతనే… ఆ బుధుడి తండ్రి…” తార బలవంతం మీద ఆగి , ఆగి… పలికింది.

“తారా!”

“నాకు… అది… ఇష్టం లేదు…” తార నెమ్మదిగా అంది.

“తారా ! బృహస్పతి కదిలిపోతూ అన్నాడు. ఆయన చేతులు ఆమెను అనురాగలతికల్లా అల్లుకున్నాయి. మెరిసే కళ్ళతో తన ముఖంలోకి చూస్తున్న తార ముఖంలోకి ఆప్యాయంగా చూశాడాయన.

“నీ నిబద్ధత నన్ను అలరిస్తోంది… వరం కోరుకో !” బృహస్పతి ఉద్వేగంతో అన్నాడు… “కోరుకో , తారా !”

తార ఆయన వక్షస్థలం మీద రెండు చేతుల్నీ బోర్లించింది. “స్వామీ… నాకు… నాకు…. సౌందర్యవంతుడూ , మేధావీ అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి !”

బృహస్పతి చిన్నగా నవ్వాడు. “ఆ వరం నీ ఒక్కదానిదే అనుకుంటున్నావా ? కాదు , అది మన ఇద్దరిదీ !”

“స్వామీ…”

“వరం అనుగ్రహిస్తున్నాను. మనోహరాకారంతో , మహా మేధస్సుతో పుత్రుడు జన్మిస్తాడు నీకు !” బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. ఆయన మాటలను మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నట్టు ఆయన చేతులు తార చుట్టూ బిగుసుకున్నాయి.

తార పారవశ్యంతో తన తలని ఆయన మెడ కింద దాచుకుంది. ఎక్కడి నుంచో చొరబడిన మలయమారుత వీచిక ప్రమిదలో దీపకళికను కబళించింది.

బృహస్పతి తారకు ఇచ్చిన వరం వృధా కాలేదు. తార గర్భవతి అయ్యింది.

తార చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆమె దగ్గరగా రకరకాల ఆహారాలున్న వెదురు బుట్ట ఉంది. ఆమె ముందు , నేల మీద ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులూ , పక్షులూ వరసగా కూర్చున్నాయి. గర్భంతో ఉన్న కుందేళ్ళు ! తల్లి కాబోతున్న లేడి ! నేడో రేపో ఈనబోతున్న దుప్పి , గర్భిణి పావురాలు , గర్భాలతో బొద్దుగా ఉన్న చిలుకలు ! అన్నింటికీ వాటి ఆహారం అందిస్తోంది తార.

“ఏమిటి ? గర్భవతులంతా సమావేశమయ్యారు ?” దగ్గరగా వచ్చిన బృహస్పతి నవ్వుతూ అన్నాడు..

“ఇవన్నీ… నేను గర్భవతినని ఎలా తెలుసుకున్నాయో అర్ధం కావడం లేదు , స్వామీ ! ప్రతీ పూటా , ఉదయమూ , సాయంత్రమూ క్రమం తప్పకుండా నన్ను చూడడానికి వస్తున్నాయి. నేరుగా ఆశ్రమంలోకే ! అందుకే నేనే వచ్చేస్తున్నాను , వాటికి ఇష్టమైన ఆహారపదార్ధాలతో !” తార నవ్వుతూ అంది.

“బాగుంది ! నీ స్థితిలో ఉన్న ఈ గర్భవతులందరూ సహ అనుభూతులతో నీతో జతకట్టారు !” బృహస్పతి చిరునవ్వు నవ్వాడు.

తార చిన్నగా నవ్వింది, చిలుకకు జామపండు అందిస్తూ.

“నిండుగర్భిణులు కలిసి కూర్చున్న ఈ దృశ్యం నిండుగా , చూడముచ్చటగా ఉంది. సుమా !” బృహస్పతి అన్నాడు..

“త్వరలో పుట్టబోయే మా అందరి శిశువులూ ఇలాగే ఒకచోట చేరితే ఇంకెంత ముచ్చటగా , ఇంకెంత ముద్దుగా ఉంటుందో !” తార ఉత్సాహంగా అంది.

తార అన్నట్టుగానే అచిరకాలంలో ఆశ్రమానికి చిన్ని చిన్ని శిశువులు వచ్చాయి ! ఆ పక్షుల , జంతువుల పిల్లలతో జట్టుకట్టి ఆడుకోవడానికి అన్నట్టు తారకు బాలుడు జన్మించాడు.

ఎర్రటి దేహవర్ణం. ఒత్తుగా , నల్లగా ఉన్న జుత్తు. దేనికోసమో అన్వేషిస్తున్నట్టు తదేకంగా , లోతుగా చూసే చారడేసి కళ్ళు , నిర్విరామంగా , బోసినవ్వులు ఒలకబోసే ఎర్రటి పెదవులు… ఎక్కడినుంచో తెచ్చుకున్న అమూల్యమైన వస్తువులను దాచుకున్నట్లుగా బిగుసుకునే వున్న పిడికిళ్ళు ! అమ్మ పెట్టే ముద్దులను అందుకోడానికా అన్నట్టు కొద్దిగా ఉబ్బిన బుగలు !

“స్వామీ ! నా బిడ్డడు ఎంత అందగాడో చూశారా ?” తార ఆనందంగా అంది బృహస్పతితో.

“తల్లిని పోలిన తనయుడు ! ముద్దులు మూటకట్టుతున్న నీ పుత్రుడు ముందు ముందు చూడచక్కని సుందరాంగుడవుతాడు !” బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు , తామరరేకుల్లా ఎర్రగా ఉన్న బాలుడి అరికాళ్ళను సున్నితంగా స్పృశిస్తూ.

“దేవరాజా ! నా పుత్రుడికి ”కచుడు” అనే నామధేయం నిర్ణయించాను !” నామకరణ మహోత్సవానికి సతీసమేతంగా , పరివార సమేతంగా విచ్చేసిన ఇంద్రుడితో అన్నాడు. బృహస్పతి.

“మీ నిర్ణయం అర్థరహితంగా ఉండదు. శుభం !” ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు.

బాలుడికి నామకరణం జరిగింది. ఇంద్రుడూ , శచీదేవీ కానుకలు ఇచ్చి దీవించారు.

“గురుదేవా ! మీ సుపుత్రుడు మా దేవలోకవాసుల తలదన్నే అందగాడవుతాడు ! గురుపుత్రుణ్ణి మా శ్రేయోభిలాషిగా , దేవగురువుకి తగిన వారసుడిగా తీర్చిదిద్దండి ! ఇది మా అభిమతం.”.

“తథాస్తు !” బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. కాలం గడుస్తోంది. కచుడు మాతృస్తన్యంతో పుష్టిగా ఎదుగుతున్నాడు. తార ఊహించినట్టుగానే ఆశ్రమంలో జంతువులు , పక్షుల సంతానం కచుడితో ఆడుకోవడం ప్రారంభించాయి. కచుడి కిలకిల నవ్వులతో , అతని స్నేహితుల’ అరుపులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

బృహస్పతి కచుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment