గురుగ్రహ చరిత్ర నాల్గవ భాగము
తార మళ్ళీ గర్భవతి అయ్యింది. తనకు మళ్ళీ మరొక అందగాడు కొడుకుగా జన్మిస్తాడంది ఆమె , బృహస్పతితో బృహస్పతి చిరునవ్వు నవ్వాడు.
“ఎప్పుడు ఎవరి గర్భాన ఎవరు జన్మించాలో విధాత నిర్ణయిస్తాడు ! సంతానాన్ని పొందే మనలాంటి దంపతులు కేవలం నిమిత్తమాత్రులం !”
భర్త మాటలు తారలో ఏదో అవ్యక్తమైన అనుమానాన్ని పుట్టించాయి. ఆయన మాటలు అంతరార్థంతో కూడి ఉన్నాయేమో అనిపించిందామెకు.
బృహస్పతి మాటల అంతరార్థం నవమాసాల అనంతరం ఆమెకు బోధపడిండి ! తార ఒక సుముహూర్తంలో మగశిశువును ప్రసవించింది. శిశువును చూడగానే ఆమె శరీరం ఒక్కసారిగా జలదరించింది.
శిశువు శరీరం పూర్తిగా రోమాలతో నిండి ఉంది. ముఖం ఎర్రగా వానర ముఖంలా. ఉంది. ఆ శిశువు వానరుడే అని చెప్తున్నట్లు పృష్ఠ భాగంలో తోక కదలాడుతోంది ! పొత్తిళ్ళలో పడుకోబెట్టిన శిశువును చూస్తూ , తార దుఃఖసాగరంలో మునిగిపోయింది. వానరపుత్రుడు పుట్టడం ఆ విధి తనకు విధించిన శిక్షలా భావించిందామె.
బృహస్పతి తారను ఓదార్చాడు. తార పుత్రుడైన ఆ వానర కుమారుడు కారణ జన్ముడన్నాడాయన.
“నీ కొడుకు వికారంగా ఉన్నాడని విచారించాల్సిన అవసరం లేదు. తన జాతిలో తను అందగాడే ! నీ శరీర సౌందర్యంతో మరొక ప్రాణి శరీర సౌందర్యాన్ని పోల్చి చూడకూడదు సుమా ! నాతి అందం నాతిది. కోతి అందం కోతిది !”
“స్వామీ…”
“నీ కుమారుడు నిజంగానే కారణజన్ముడు. మన పోషణలో పెరగడు. వనచరుడుగా వనాలలో స్వేచ్ఛగా , స్వచ్ఛంగా ఎదుగుతాడు. మన వానర కుమారుడు దీర్ఘశరీరుడవుతాడు. దీర్ఘశరీరుడే కాదు. నీ పుత్రుడు దీర్ఘాయుష్కుడూ అవుతాడు !” బృహస్పతి చెప్పుకుపోతున్నాడు.
“నా బిడ్డ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు ?” తార అడిగింది.
“విను !” బృహస్పతి ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు.
“మన వానరపుత్రుడికి నీ పేరు శాశ్వతం అయ్యేలా – ”తారుడు” అనే పేరు నిర్ణయిస్తున్నాను. భవిష్యత్తులో శ్రీమహావిష్ణువు ధరించే అవతార రూపాన్ని సేవిస్తూ తన భుజబలంతో ప్రసిద్ధి చెందుతాడు ! మరొక అంశం కూడా ఉంది. వానర స్త్రీగా అంజన పొందపోయే కుమారుడూ , ఈ తారాకుమారుడూ కలిసి ఆ అవతార పురుషుణ్ణి సేవిస్తారు !”.
“అలాగా ! నా తారుడు అంత అదృష్టవంతుడా స్వామీ ?” తార దుఃఖాన్ని పూర్తిగా మరిచిపోయి అంది.
“ఔను ! మహాదీర్ఘమైన , బలిష్టమైన దేహాన్ని నేను తారుడికి ప్రసాదిస్తాను. ఆ రెండింటితో బాటు మహా మేధస్సు కూడా మన తారుడికి లభిస్తుంది !” బృహస్పతి తారుడి శరీరాన్ని నిమురుతూ అన్నాడు.
కచుడు పరుగు పరుగున వచ్చాడు. తారుణ్ణి చూసి , ప్రశ్నార్థకంగా అమ్మ వైపు చూశాడు.
“నీ తమ్ముడు , నాయనా ! వీడి పేరు తారుడు !” తార కచుడితో అంది.
కచుడి కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి. “తమ్ముడా ? తారుడా ? ఎంత బాగున్నాడో ? తమ్ముడితో నేను ఆడుకుంటాను !” కచుడు ఉత్సాహంగా అన్నాడు.
“చూశావా , తారా ! మనకు కనిపించని అందం తారుడిలో కచుడికి కనిపిస్తోంది. సౌందర్యం సృష్టిలో మాత్రమే కాదు , దృష్టిలో కూడా ఉంటుంది సుమా !” బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
తారుడు రోజురోజుకీ పొడవుగా , దృఢంగా పెరుగుతున్నాడు. అతని పెరుగుదల ఆశ్చర్యం కలిగించే రీతిలో సాగుతోంది.
తారు వృక్షవిహారానికి ఆశ్రమంలో చెట్లు చాలడం లేదు ! ఇరుకైన ప్రదేశంలో ఉన్న భావం తారుడి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. బృహస్పతి అది గమనించాడు.
“తారుడికి మన ఆశ్రమ ప్రాంగణం ఇరుకుగా ఉంది. వాడు విశాలారణ్యాలకు వెళ్ళడం మంచిది. అక్కడ లభించే స్వేచ్ఛ తారుడికి ఇక్కడ ఉండదు !” అన్నాడు తారతో.
తార మౌనంగా తల పంకించింది.
బృహస్పతీ , తారా , కచుడూ తారుడికి వీడ్కోలు పలికారు. తారుడు ఆనందంతో గంతులు వేస్తూ అరణ్యమార్గాన పరుగు ప్రారంభించాడు.
“అమ్మా ! తమ్ముడిలాగా నేనెప్పుడు పెద్దగా అవుతాను ?” కచుడు కుతూహలంగా అడిగాడు.
“గురుగ్రహం బృహస్పతి చరిత్ర అంత విస్తృతంగా లేదు గురువుగారూ !” విమలానందుడు , గురుచరిత్ర కథనం ముగిశాక అన్నాడు.
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “అవగాహనా సౌలభ్యం కోసం , ఎంత అవసరమో , అంతే వినిపించాను మీకు ! దేవగురువైన బృహస్పతి చరిత్రా , అసురగురువైన ఉశనుడి చరిత్రా అక్కడక్కడా కలిసిపోతూ ఉంటాయి. ఆ కారణంగా , ఉశనుడి కథాంశాలతో పాటు గురుగ్రహానికి సంబంధించిన అంశాలూ మనకు తెలుస్తాయి. నవగ్రహాలలో ఎవరి చరిత్ర వారికి ఉంది. మనం గుర్తించాల్సింది చరిత్ర పరిమాణం కాదు. ప్రభావం.”
“మీ కథనం , విధానం అనుక్షణం మాలో ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంది , గురువుగారూ !” చిదానందుడు అన్నాడు.
“మంచిది ! కథనం విసుగు కలిగించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఆరవగ్రహమైన శుక్రుడి చరిత్ర చెప్పుకుందాం ! పులోమా , భృగు దంపతుల కుమారుడైన ఉశనుడు రాక్షసుల ఆచార్య పదవిని స్వీకరించాడనీ , రాక్షసరాజు వృషపర్వుడి ఆస్థానంలో ఉంటూ , రాక్షసులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడనీ చెప్పుకున్నాం. ఒకరోజు వృషపర్వుడు కొలువు కూటంలో ఉన్నాడు. ఉశనుడు కూడా ఉన్నాడు. ఆనాడు సభలో జరిగిన సంఘటన ఉశనుడు ”శుక్రుడు”గా మారడానికి ”బీజావాసం” చేసింది…” అంటూ శుక్ర గ్రహ చరిత్రను వినిపించడం ప్రారంభించాడు నిర్వికల్పానంద.
రేపటి నుండి శుక్రగ్రహ చరిత్ర ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹