Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై రెండవ అధ్యాయం

రాజనీతి

(ఇది ఆ రోజులలో రాజుకి పనికివచ్చిన నీతి. ఇపుడు రాజులు లేరు. అయినా రాజాధికారాలుగల వారున్నారు. ప్రభుత్వముంది. కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం)

ప్రజలనుండి పన్నుల రూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండి “పూలు కోసినట్లుండాలి. అంతేకాని వంట చెఱకు కోసం చెట్టు నరకినట్లుండకూడదు.

ఇతర రాజ్యాల నుండి వచ్చిన ద్రవ్యాలను రాజు స్వీకరించాలి. అవి పాడైపోతే, విరిగిన పాలనువలె, త్యజించాలి. పాల కోసం ఆవుని వాడుకోవాలిగాని పొదుగును కోసివేయకూడదు. అలాగే రాజు ధనికులనూ వాడుకోవాలి.

సత్యం మనోరమాః కామాః సత్యం రమ్యా విభూతయః |

కింతువైవనితాపాంగ భంగి లోలంహి జీవితం ||

వ్యాఘ్రవ తిష్ఠతి జరా పరితర్జయంతీ |

రోగాశ్చ శత్రవ ఇవ ప్రభవంతి గాత్రే ||

ఆయుః పరిస్రవతి భిన్నఘటా దివాంభో |

లోకోన చాత్మహితమాచరతీహ కశ్చిత్ ||

అన్నీ సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి. కాని ఐశ్వర్యం, భోగాలు, స్త్రీ, ప్రేమ, పదవి వంటివి సత్యాలూ కావు నిత్యాలూ కావు. అసలు కనిపించని రోగం, ముసలితనం, మృత్యువు మాత్రమే నిత్య సత్యాలు, శాశ్వతాలు. కాబట్టి రాజైనా ప్రజలైనా ధర్మాచరణ రక్తులై జీవించాలి.

పరస్త్రీలలో తల్లినీ, పరద్రవ్యంలో మట్టినీ, సర్వప్రాణులలో తన ఆత్మనీ చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. పదవికోసం ప్రయత్నించేవాడు ఆ పనిని ప్రజలకోసం చేయడు. తన కోసమే చేస్తాడు.

అది క్షంతవ్యమే కాని ఆ పదవి వల్ల వచ్చిన అధికారాన్నీ ఐశ్వర్యాన్నీ ప్రజోపయోగ కరమైన యజ్ఞయాగాదులకు దానాలకూ వినియోగించినవాడే నరకానికి పోకుండా వుంటాడు. (రాజ్యాంతే నరకం, ధ్రువం – అనే నానుడి వానికి వర్తించదు).

రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం. ధనవంతునికీ మిత్ర, బంధు, బాంధవులుంటారు. అతనినే మహాపురుషుడనీ, సమర్థుడనీ కొనియాడతారు. ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు. వాడసలు మగాడే కాడంటారు. మరల ధనం సంపాదించుకు వస్తే నాలికకరచుకొని అతని చుట్టూ చేరతారు.

యస్యార్ధాస్తస్యమిత్రాణి యస్యార్ధ స్తస్య బాంధవాః |

యస్యార్థాః స పుమాఁల్లోకే యస్యార్థాః సచపండితః ||

త్యజంతి మిత్రాణి ధనైర్విహీనం పుత్రాశ్చ దారాశ్చ సుహృజ్జనాశ్చ |

తేచార్ధవంతం పునరాశ్రయంతి హ్యర్టోహి లోకే పురుషస్య బంధుః ||

రాజుకి శాస్త్ర జ్ఞానముండాలి. అదొక కన్ను వంటిదైతే, మరొక కన్ను గూఢచారులు.

ఏ రాజు యొక్క పుత్రులూ, భృత్యులూ, మంత్రులూ, పురోహితులూ, ఇంద్రియాలూ తమ తమ కర్తవ్య పాలనలో బద్ధకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలం రాజుగా మనలేడు. వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్ళయినా ఏలగలడు.

ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఉన్నవానిని దేవతలు కూడా మెచ్చుకొని పై పదవికి పంపిస్తారు.

ఉద్యోగః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమంః |

షడ్విధో యస్య ఉత్సాహస్తస్య దేవో.. పి. శంకతే ||

ఉద్యోగేన కృతే కార్యే సిద్ధిర్యస్య న విద్యతే |

దైవం తస్య ప్రమాణం హి కర్తవ్యం పౌరుషం సదా ||

ఈ ఆరుగలవాడే పురుషుడు. ఈ జన్మలోని పౌరుషమే మరుజన్మలో భాగ్యమవుతుంది.

ఉత్తములనీ, మధ్యములనీ, అధములనీ భృత్యులలో మూడు రకాల వారుంటారు. అది పరీక్షను పెట్టి తేల్చుకోవాలి.

బంగారాన్ని ఎలాగైతే అత్యంత జాగరూకతతో ఘర్షణ, ఛేదన, తాపన, తాడన పరీక్షలను పెట్టి తీసుకుంటామో భృత్యులను రాజు కూడా అలాగే ఎంచుకోవాలి.

వర్ణము, వ్రత, శీల, కర్మములు ఈ ఎంపికలో ప్రధాన పాత్రనువహిస్తాయి. ముఖ్యంగా కోశాధికారిని ఎంచుకొనేటపుడు అభ్యర్థి యొక్క వంశాన్నీ, శీల సద్గుణసంపన్నతలనూ, సత్య ధర్మపరాయణత్వాన్నీ, రూప సంపదనూ, ప్రసన్న చిత్తాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. రత్నాల గూర్చి బాగా తెలిసిన వానినే రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి.

బలపరాక్రమాలే కాక మంచి యుద్ధవ్యూహ రచనాదక్షుని సేనాధ్యక్షునిగా నియమించుకోవాలి. సంకేతమాత్రమున స్వామి అవసరాన్ని పోల్చుకోగలిగేవాడూ, బలవంతుడూ, సుందర శరీరుడూ, పని బద్ధకంలేనివాడూ, జితేద్రియుడూ అయిన వానిని ప్రతీహారిగా పెట్టుకోవాలి.

మేధావీ, వాక్పటుత గలవాడూ, విద్వాంసుడూ, జితేంద్రియుడూ, సర్వశాస్త్ర పరిచయం మరియు విమర్శక దృష్టీ ఉన్నవాడూ, స్వతహాగా సజ్జనుడునగు వానిని లేఖకునిగా పెట్టుకోవాలి.

బుద్ధిమంతునీ, వివేకశీలునీ, శూరునీ, పరేంగితజ్ఞునీ, మాటతీరు గలవానినీ, యథార్ధం చెప్పే ధైర్యమూ చెప్పడంలో నేర్పుగలవానిని, దూతగా నియమించుకోవాలి. సమస్త స్మృతులూ శ్రుతులూ చదివిన పండితుడూ, శాస్త్రాలలో నిష్ణాతుడూ, శౌర్య పరాక్రమసంపన్నుడూ నగు వానిని ధర్మాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి.

వంటవాడు వంశపారంపర్యంగా రావాలి. పాకశాస్త్ర ప్రవీణుడై వుండాలి. నిజాయితీ, సత్యవాక్పరిపాలనా, పవిత్రత, సామర్థ్యమూ గలవాడై వుండాలి. ఎన్ని అర్హతలున్నా దుర్జనుని ఏ పదవికీ తీసుకొనరాదు. అధికారాన్ని ఎవరి చేతిలోనూ పెట్టరాదు.

ఎనభై రెండవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment