Skip to content Skip to footer

సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై మూడవ అధ్యాయం

మొదటి భాగం | నీతిసారం – రెండవ భాగం

రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా వుండాలి. ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి. పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి.

సద్భిరా సీత సతతం సద్భిః కుర్వీత సంగతిం |

సర్వివాదం మైత్రీం నా సద్భిః కించి రాచరేత్ ||

పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞః సత్యవాదిః |

బంధనస్తో… పి తిష్టేశ్చ నతు రాజ్యేఖలైః సవా ||

నిరంతరం మంచివారితోనే వుండాలి. వివాదం, మైత్రీ కూడా వారితోనే చేయాలి. మంచివారితో కలసి అడవులలోనైనా సుఖించవచ్చు గాని చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్నా అంగీకరించరాదు.

ఏ పనినీ సగంలో ఆపడం, విడువడం మంచి లక్షణం కాదు. పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి. చేసేదాకా అన్ని కర్మలూ ఆ పనివైపే సాగాలి. రాజులైనా ప్రజలైనా ఆశపోతూలూ, తొందరపాటు మనుష్యులూ కారాదు. పుట్ట, తేనెతుట్టె, చంద్రుని వెన్నెల ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ము కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగివుండాలి.

అర్జితస్య క్షయం దృష్ట్వా సంప్రదత్తస్య సంచయం |

అందం దివసం కురాద్ధానాధ్యన కర్మసు ||

దానం చేస్తే ధనం తరిగిపోతుందని, కష్టపడి ధనం సంపాదించి దానాలకీ, అధ్యయనాలకీ ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమై పోతామని కొందరు భయపడుతుంటారు. గానీ దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు.

ఇంద్రియ నిగ్రహం గలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడు. ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికీ తీసిపోడు. వానికి ఇల్లే తపోవనం. కర్మే భగవంతుడు.

సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది. అభ్యాసం విద్యనీ, కడిగి తోమి కడుగుట పాత్రనీ శీలం వ్యక్తి యొక్క వంశాన్నీ రక్షిస్తాయి.

సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాయోగేన రక్ష్యతే ||

మృజయా రక్ష్యతే పాత్రం కులం శీలేన రక్ష్యతే ||

బంధువులనో ఆత్మీయులనో ధనం అడుక్కు తిని బతకడం కంటే నూతిలోపడి కాని, పాముల చేత కరిపించుకొని గాని చావడమే మేలు. దానికి ధైర్యం చాలకపోతే ఏ వింధ్యాటవిలోనో నివసించుట మంచిది.

సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు. పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి. ఆర్జిత పుణ్యమున్న వాని సంపద వృద్ధి చెందుతుంది. బ్రాహ్మణునికి విద్యా, పృథ్వికి రాజు, ఆకాశానికి చంద్రుడూ, సమస్త చరాచరాలకూ శీలమూ ఆభూషణాలు.

విప్రాణాం భూషణం విద్యా పృథివ్యా భూషణం నృపః |

నభసో భూషణం చంద్రః శీలం సర్వస్వ భూషణం ||

ఇతిహాస ప్రసిద్ధులు ధర్మవీరులునైన రాజపుత్రులు ధర్మజాది పంచపాండవులు. వీరంతా చంద్రసమాన కాంతిమంతులు, సాటిలేని పరాక్రమశీలురు, సూర్యప్రతాపులు. పైగా స్వయంగా విష్ణువేయైన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టులు.

అయినా అంతటి వారూ భిక్షాటన చేసుకున్నారే గాని ధర్మాన్ని తప్పలేదు, కర్మాన్ని వదులుకోలేదు. ఇదీ శీలమంటే. దుష్టగ్రహాలెంత బాధించినా ధర్మాన్ని త్యజించరాదు.

ధర్మానికి లోబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే శ్రమకోర్చి సృష్టి, స్థితి లయలను క్రమం తప్పకుండా చేస్తూ, వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు. మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసినదే.

బ్రహ్మాయేన కులాలవన్నియ మితో బ్రహ్మాండ భాండోదరే ||

విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే ||

రుద్రోయేన కపాల పాణి పుటకే భిక్షాటనం కారితః ||

సూర్యోభ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే ||

దానం, దానివల్ల కలిగే కష్టసుఖాలూ కూడా కర్మాధీనాలే. విష్ణువంతటివాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు. అంతవఱకూ ముల్లోకాలనూ ఏకచ్ఛత్రాధిపత్యంగా యేన బలిచక్రవర్తి మూడడుగుల దానమిచ్చి ముల్లోకాలనూ కోల్పోయాడు. ఇదంతా భగవంతుని క్రీడ. ఆ ఆడించేవానికి నమస్కారము.

దాతా బలి రాచకకో మురారిర్దానం మహీం |

విప్రముఖస్య మధ్యే ||

దత్త్వాఫలం బంధనమేవ లబ్ధం నమో స్తుతే |

దైవయ థేష్టకారిణే ||

పాపానికి శిక్ష తప్పదు. ఈ శిక్ష, పాపి యొక్క పాపాన్నే తప్ప వంశప్రతిష్టనూ చూడదు, తల్లిదండ్రులనూ చూసి భయపడదు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల సంతానమైనా పాపం చేస్తే దండన తప్పదు. (మన్మథుడు దండింపబడినాడు కదా!)

కొంతమంది ”నేను ఏ పాపమూ చేయలేదు. అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు”. అనీ ”మా వూరి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కేలేదు. అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు. దేవుడేం చేస్తున్నాడో మరి” అనీ వాపోతారు. పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది.

త్రికూట పర్వతం పెట్టనికోటై, సముద్రమే పరిఖగా వుండి, రాక్షసగణంచే రక్షితుడై, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడై, స్వయంగా విశుద్ధాచరణా కోటిలింగార్చనా సముపేతుడై, అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలసి రాకపోవడంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది?

ఏ క్షణాన, ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది. మరోటి, మరోలా జరగదు.

యస్మిన్వయం యత్కాలో యద్దివాయచ్చ వా నిశి |

యన్ముహూర్తే క్షణేవాపి తత్తథా న తదన్యథా ||

భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు, భూగర్భంలోనైనా ప్రవేశింపవచ్చు, దశదిశలనూ మోయగలగ వచ్చు కాని అప్రదత్త వస్తువును పొందలేము.

పురాధీతా చయా విద్యా పురాదత్తశ్చ యద్ధనం |

పురాకృతానికర్మాణి హ్యగ్రే ధావతి ధావతి ||

మనకబ్బిన విద్యా, మనను చేరిన ధనమూ కూడా పూర్వజన్మకృత పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనను అనుసరిస్తూనే వుంటాయి.

అన్ని శుభలక్షణాలూ వుండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీతవంటి భార్య భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారూ, శ్రీరాముడూ పదునాలుగేళ్ళ పాటు సుఖపడలేదు. ఇక సామాన్యుల గతి ఏమి? ఇదీ పురాకృతమనగా.

కర్మాణ్యత్ర ప్రధానాని సమ్యగృక్షే శుభగ్రహే ||

పనిష్ఠకృత లగ్నే… పి జానకీ దుఃఖభాజనం ||

స్థూల జంఘాయదారామః శబ్ద గామీ చలక్ష్మణః |

ఘన కేశీయదాసీతా త్రయస్తే దుఃఖభాజనం ||

నపితుః కర్మణా పుత్రః పితా వా పుత్ర కర్మణా |

స్వయంకృతే న గచ్ఛంతి స్వయం బద్ధాః స్వకర్మణా ||

మునులారా! ఇందులో ఇంకో విశేషంకూడా వుంది. తండ్రి పాప పుణ్యాలలో కొడుకుకి గానీ కొడుకు పాపపుణ్యాలలో తండ్రికి గానీ వాటా వుండదు. ఈ దేశంలో వుంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడతాయనుకోవడం భ్రమ. మనిషి ఎక్కడ పుట్టినా. ఆ పాపం దుఃఖ రోగరూపంలో కట్టి కుడుపుతుంది.

ప్రాప్తవ్యమర్థం లభతేమనుష్యో దేవో… పి తం వారయితుం న శక్తః |

అతో న శోచామి న విస్మయో మే యదస్మదీయం నతు తత్పరేషాం ||
సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి… అంతదాకానే కదా! అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే వుంటుంది. మనం కర్మను దాటిపోలేము.

నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. ధర్మమార్గంలో సంపాదించిన ధనమే ధనం. అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మిగలదు. గానీ ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది.

సత్యపాలనం, మనఃశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, జలప్రక్షాళన – ఇవి పంచశుచి మార్గాలు. సత్యపాలన శుచి గలవానికి స్వర్గప్రాప్తి సులభమే. సత్యమునే మాట్లాడువాడు. అశ్వమేధ యాగం చేసినవానికన్నా గొప్పవాడు.

సత్యం శౌచం మనఃశౌచం శౌచమింద్రియ నిగ్రహః |

సర్వభూతేదయా శౌచం జలశౌచంచ పంచమం ||

యస్య సత్యం హి శౌచం చ తస్య స్వర్గాన దుర్లభః |

సత్యం హి వచనం యస్య స్యో శ్వమేధాద్విశిష్యతే ||

దుష్టస్వభావులు, ఆత్మవంచకులు, వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే. చేసేవారు. ఎన్నిమార్లు పుట్టమన్నునంటించి మరీ శరీరాన్ని తోముకున్నా పవిత్రులు కానేరరు. చేతులు, పాదాలు, మనస్సు మకిలి లేకుండా వున్నవారు, ధర్మపాలకులు, ఆధ్యాత్మ విద్యా సంపన్నులు, సత్కీర్తి నార్జించినవారు తీర్థాలలో మునగక పోయినా పవిత్రులుగానే వుంటారు. తీర్థఫలాన్నీ అందుతారు.

యస్యహస్తాచ పాదౌచ మనశ్చైవ సుసంయతం ||

విద్యాతపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే ||

సన్మానానికి పొంగిపోకుండా, అవమానానికి కోపించకుండా, ఎదుటివాడు కోపం తెప్పించడానికెంత ప్రయత్నించినా పరుషవాక్కు లాడకుండా వుండేవానినే సాధు పురుషుడంటారు.

నప్రహృష్యతి సమ్మానైర్నావమానైః ప్రకుప్యతి |

నక్రుద్ధః పరుషం బ్రూయాతత్ సాధోస్తు లక్షణం ||

మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అది ఫలించకపోతే బాధపడరాదు. కోపం తెచ్చుకోరాదు. విద్వాంసుడూ మధురభాషీయైన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకై ప్రయత్నించినా అతని దారిద్య్రం తీరకపోవచ్చు. బుద్ధి, పౌరుషం, బలం, మంత్రశక్తి వుండి కూడా అలభ్య- అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి, ఒక వ్యక్తి భంగపడవచ్చు. నిరాశచెందరాదు.

అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినపుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. బాగా పెరిగిన చెట్టు పై కొన్నివందల పక్షులు రాత్రంతా కాపుర ముంటాయి.

తెల్లారగానే పోతాయి. ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుఃఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు. ఈ మాత్రం ఇంగితం మనిషికెందుకుండదో?

శౌనకాచార్యా! పుట్టడానికి పూర్వం మనకేమీలేదు. గాలిలో ఎగురుతూ వచ్చాం. అలాగే పోయిన తరువాత కూడా మనకేమీ వుండదు. మనకున్నవన్నీ మధ్యలో వచ్చి పోయేవేగా!

అవ్యక్తా దీని భూతాని వ్యక్తమధ్యారి శౌనక ||

అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా ||

పోయేకాలం వచ్చినవాడు సూదిగుచ్చుకున్నా పోతాడు. అది రానివాడు అంటే ఇంకా ఆయువున్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కూరీసినా బతికేస్తాడు. కాబట్టి చావుకి భయపడనక్కరలేదు. అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది. వుంటుంది. ప్రాప్తించిన దానికి సంతోషించరు కానీ అప్రాప్య వస్తువుకై అంగలారుస్తారు, అలమటిస్తారు. ఇది అనవసరం. ప్రయత్నం మంచిదే; దుఃఖం కాదు.

ఇంకా ఉంది

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment