Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై మూడవ అధ్యాయం

రెండవ భాగము | నీతిసారం – మూడవ భాగము

వృక్షాలు ఏ పూజలు చేశాయని, ఏ ప్రార్థనలు సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి? మానవులకు కూడా పూర్వ జన్మ పుణ్య, పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి.

పూజలు, ప్రార్థనలు మనిషికి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు. శీలం, వంశం, విద్య, జ్ఞానం, గుణం, శుద్ధత – ఇవేవీ పూర్వకర్మమును మార్చలేవు. పూర్వజన్మతపః ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగసౌందర్యాన్నీ, అన్ని సంపదలనూ ఇస్తుంది.

ప్రాణియొక్క మృత్యువు ఆ మృత్యుకారణమున్న చోటే వుంటుంది. లక్ష్మి ఎక్కడుంటుంది? సంపదలున్నచోటే కదా! మన కర్మ చేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలానున్న చోటికి వెళ్తాము. గోశాలలో ఎన్ని గోవులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది వున్నా నీ పూర్వకర్మఫలం నిన్నే చేరుకుంటుంది.

తత్రమృత్యుర్యత్ర హంతా తత్ర శ్రీర్యత్ర సంపదః ||

తత్ర తత్ర స్వయం యాతి ప్రేర్యమాణః స్వకర్మభిః ||

భూత పూర్వం కృతం కర్మ కర్తార మనుతిష్ఠతి ||

యథాధేను సహస్రేషు వత్సా విందతి మాతరం ||

మూర్ఖ ప్రాణులకు తెలియదు. చెప్పినా వినరు. తమకు కలిగిన దుఃఖాలకు కనబడని దేవుని నిందిస్తారు. మనుజులపై కక్ష పెట్టుకుంటారు. ఫలితంగా మరిన్ని పాపాలుచేసి వచ్చే జన్మలో కూడా ఇలాగే తగలడతారు. తన సుఖదుఃఖాలతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసినవాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి.

ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ తనుచేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటివాడు.

నీచః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి |

ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి” ||

రాగద్వేషాలనంటి పెట్టుకొని బతికే జీవికి ఎక్కడా సుఖముండదు. సంతోషమున్న చోటనే సుఖముంటుంది. స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో, తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయముంటుంది. ఇదే మమకారం. దీనిని విసర్జించినవాడే సుఖపడగలడు. ఈ శరీరమే సుఖదుఃఖాల నిలయం. అవి శరీరంతోనే పుడతాయి.

పరాధీనతయే దుఃఖం, స్వాధీనతయే సుఖం. మనిషికి సుఖదుఃఖాలు ఒకదాని వెంటనొకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే వుంటాయి; పోతూనే వుంటాయి. అనాసక్త భావంతో అన్ని పనులూ చేసుకొనే వాడొక్కడే నిత్యసుఖి.

సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం |

ఏ తద్విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః ||

సుఖస్యానంతరం దుఃఖం దుఃఖ స్యానంతరం సుఖం |

సుఖం దుఃఖం మనుష్యాణాం చక్రవత్ పరివర్తతే ||

యద్దతింతదతిక్రాంతం యది స్యాత్ తచ్చదూరతః |

వర్తమానేన వర్తేత నస శోకేన బాధ్యతే ||

మునులారా! ఎవరూ ఎవరికీ పుట్టుకతోనే మిత్రులుగానీ శత్రువులు గానీ కారు, కారణంవల్లనే ఆ బంధాలేర్పడుతున్నాయి.

ఈ ”మిత్ర” శబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే. ఈ శబ్దం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడూ విశ్వాసాన్ని చూపించేవాడూ మిత్రుడొక్కడే. స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో!

ఇంతకన్న పవిత్రమైన శబ్దం ”హరి”. ఈ శబ్దాన్నుచ్చరించేవాడు బట్టలు వేసుకొని. బొత్తములు పెట్టుకొని బయటికి బయలుదేరినంత సుఖంగా మోక్షపదవినందడానికి లోకం నుండి పైకి వెళతాడు.

సకృదుచ్చరితం యేన హరిరిత్యక్షర ద్వయం ||

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి ||

అన్ని విధాలా తన తోటివాడేయైన మిత్రుని మీద ఉన్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద భార్యాపుత్రుల మీద కూడా వుండదు. మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలచు కున్నవారు ఒకరితో నొకరు జూదమాడకూడదు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు, ఒకరి భార్యకి కొకరు దూరంగా వుండాలి.

మధుర పదార్థాల ద్వారా చిన్నపిల్లలనూ వినమ్రభావంతో సజ్జన పురుషులనూ, ధనం ఇస్తానని చెప్పి స్త్రీనీ, తపస్సు చేసి దేవతలనూ, చక్కని, కమ్మని మాట తీరును చూపించి (అనగా సద్వ్యవహార విశేషాన) సమస్తలోకాన్నీ వశపఱచుకోగలిగినవాడే నిజమైన కపటం ద్వారా మిత్రులనూ, పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్నీ, ఇతరులను పీడించి ధనాన్నీ, పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యనూ, కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీనీ వశం చేసుకోదలచినవాడు వివేకవంతుడు కాడు. ఇవేవీ తెలివైన పనులు కావు. ఆ కపటం, ఆ భయం, ఆ ధనం, ఆ బలం పోగానే ఆయా సంపదలూ పోతాయి.

పండ్లకోసం చెట్టును పెకలించేవాడు దుర్బుద్ధి. ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలేగాని చెట్టుని నాశనం చేయడం అవివేకం.

నమ్మకూడని వానిని నమ్ముకోకూడదు. లోకంలో అందరి నమ్మకాన్ని వమ్ము. చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు? ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు.

న విశ్వసే దవిశ్వస్తే మిత్రస్యాపి న విశ్వసేత్ |

కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ ||

మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది కావున ఎవరినీ నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు కానీ అన్ని ప్రాణులనూ విశ్వసించడం, అన్నింటి పట్లా సాత్వికభావాన్నే కలిగియుండడం, తమదైన సాత్విక స్వభావాన్ని ఎల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషుల లక్షణాలు.

దరిద్రునికి ”గోష్ఠి” అనేది విషంతో సమానం. (గోష్ఠి అంటే నేటి పార్టీలిచ్చుట) అలాగే వృద్ధునికి నవ యువతీ సంగమం, మిడిమిడి జ్ఞానంతో ఆపేసిన చదువు, అజీర్ణంగా నున్నపుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే.

మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి ఆరు కారణాలుంటాయి. ఎక్కువగా నీరు త్రాగుట, అతిగా తినుట, ధాతు క్షీణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చి వేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ- వీటిలో ఒక్కటి. చాలు… శరీరం లోకి రోగం ప్రవేశించడానికి.

తెల్లవారకుండానే వేసే ధూపం, అతిగా రతి, శ్మశానం పొగలను పీల్చుట, అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట, రజస్వలతో సంభాషణ – ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి వుంటాయి. ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో ఆరున్నాయి: ఎండిన మాంసం, వృద్ధ స్త్రీ, బాలసూర్యుడు, రాత్రి పెరుగు సేవనం, ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర. అప్పుడే తయారైన నెయ్యి, ద్రాక్షపండ్లు, వయసులో నున్న స్త్రీ, పాలు, వేడినీరు, చెట్టు నీడ – వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది. నూతినీరు, మట్టి చెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగానూ వేసవిలో చల్లగానూ వుంటాయి. తైలమర్దనం, సుందర భోజనం పొందగానే శక్తి కలుగుతుంది. మార్గాయాసం, మైథునం, జ్వరం తాత్కాలికంగా మనిషిని నీరసపెడతాయి.

బట్టలు ధరించేవారు, పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు, అధికంగా తినేవారు, కఠోరంగా మాట్లాడేవారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు – సాక్షాత్తూ విష్ణు సమానులైనా సరే వారికడ లక్ష్మి నిలువదు.

కుచైలినం దంతమలోపధారిణం బహ్వాశినం నిష్టుర వాక్య భాషిణం |

సూర్యోదయే హ్యస్త మయే… పిశాయినం విముంచతి శ్రీరపి చక్రపాణిం. ||

తన గోళ్ళతో గడ్డిని చీల్చువాడు, నేలపై వ్రాసే వాడు, కాళ్ళు కడుక్కోనివాడు, దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు, నగ్నంగా శయనించువాడు, భోజన పరిహాసాలతిగా చేయువాడు, తన అంగాలపై ఆసనంపై మద్దెల కొట్టుకొనువాడు, కేశసంస్కారం చేసుకోనివాడు, ప్రాతస్సాయం సంధ్యలలో నిదురించువాడు, కుచైలుడు ఇలాంటి శ్రీవారి కడకూడా లక్ష్మి నిలువదు.

తలంటి విరళంగా పోసుకోవడం, పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం, వేశ్యను సంపూర్ణంగా వర్ణించడం, శరీరమంతా శుభ్రంగా వుంచుకోవడం, అల్పంగానే తినడం, నగ్నతలేకుండా శయనించడం ఈ పనులన్నీ చేయువాని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది.

బాలసూర్యుని తేజం, రగులుతున్న చితి యొక్క పొగ, వృద్ధ (తనకంటే పెద్ద) స్త్రీ సాంగత్యం, చీపురు నుండి వచ్చే దుమ్ము – ఇవన్నీ ఆయుఃక్షీణాలు.

ఏనుగు, గుఱ్ఱం, రథం, గోవు, ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కాని గాడిద, ఒంటె, గొట్టె, మేక నడిచినపుడు రేగే ధూళి అశుభకరం. ముఖ్యంగా ఆవు, ధాన్యము, పుత్రుని అంగముల నుండి వచ్చు ధూళి కల్యాణకారి, మహాపాతక వినాశిని.

దేన్నయినా చేటతో విసురుతున్నపుడు వచ్చే గాలి, గోటి నీరు, స్నానం చేశాక గుడ్డ దులిపినపుడు చిలికే జలం, తల వెంట్రుకల నుండి జారే నీరు, చీపురు ధూళి బహు చెడ్డవి. ఇవి ఆర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు. బ్రాహ్మణునికీ, అగ్నికీ, గుఱ్ఱానికీ ఎద్దుకీ, ఇద్దరు బ్రాహ్మణులకీ, ఆలుమగలకి, యజమాని దంపతులకీ మధ్య నుండి వెళ్ళరాదు.

విశ్వసించకూడని వారిని అసలు విశ్వసించనేకూడదు. నమ్మదగినవారిని కూడడా అతిగా పూర్తిగా నమ్మకూడదు. దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పుట్టుకొస్తుంది. అది మన సుఖాలన్నింటినీ నాశనం చేస్తుంది. శత్రువుతో సంధి చేసుకోవచ్చు గానీ వానిపై విశ్వాసముంచుట చిటారుకొమ్మ మీద నిద్రపోవడం వంటిదే.

నవిశ్వసే దవిశ్వస్త్రం విశ్వస్తం నాతి విశ్వసేత్ |

విశ్వాసాద్భయముత్పన్నం మూలాదపి నికృంతతి ||

వైరిణా సహసంధాయ విశ్వస్తో యది తిష్ఠతి |

సవృక్షాగ్రే ప్రసుప్తోహి పతితః ప్రతిబుద్ధ్యతే ||
పడిపోయాకే తెలుస్తుంది పడిపోయానని. అత్యంత కాఠిన్యమూ, అలవి మీరిన మెత్తదనమూ రెండూ తప్పే, బలహీన కాండములు గల మొక్కలను శ్రమలేకుండా నరకవచ్చు. మహావృక్షాలు ఒకపట్టాన లొంగవు.

మనం ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి; వాటంతట అవే పోతాయి కూడ. సుఖాలు కూడా అంతే. సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు. దుష్టులకు దుఃఖాలు తప్పవు. కాబట్టి సజ్జనులుగానే జీవించాలి.

రహస్యం నాలుగు చెవుల మధ్యనే వుండాలి. ఆరో చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు. భవిష్యద్ వ్యూహాలూ రెండు చెవుల మధ్యనే అనగా ఒక మనిషి బుట్టలోనే వున్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు.

షట్కర్డ్లో భిద్యతే మంత్రశ్చతుః కర్ణశ్చ ధార్యతే |

ద్వికర్ణ స్యతు మంత్రస్య బ్రహ్మాప్యంతం నబుధ్యతే ||

పాలీయని, చూలు కట్టని ఆవు, విద్వాంసుడు, ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి? చంద్రుడొక్కడే అయినా ఆకాశమంతా వెలుగొందునట్లు మహా పురుషుడైన కొడుకు వల్ల వంశమంతా వన్నెకెక్కుతుంది. తారలెన్ని వున్నా చంద్రుడే శోభస్కరుడు కుపుత్రులు వందమంది కంటె గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు, చాలు.

ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన ధీమతా ||

కులం పురుష సింహేన చంద్రేణ గగనం యథా ||

ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధితా ||

వనంసువాసితం సర్వం సుపుత్రేణ కులం యథా ||

ఏకోహి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ||

చంద్రోహంతి తమాం స్యే కో నచ జ్యోతిః సహస్రకం ||

పిల్లలను అయిదేళ్ళ వయసొచ్చేదాకా ప్రేమ కురిపిస్తూ పెంచాలి. అక్కడి నుండి పదేళ్ళు వచ్చేదాకా అవసరమైతే దండించియైనా క్రమశిక్షణ నేర్పాలి. పదారేళ్ళదాకా విద్యాబుద్ధులు నేర్పి ఆ తరువాత వారిని మిత్రుల వలె సంభావించాలి..

కొందరి ముఖాలు పులిముఖాల వలెనున్నా వారు సాత్వికులు కావచ్చు. కొందరి ముఖాలు లేడి ముఖాల వలె అమాయకంగా వున్నా వారు క్రూరులూ కావచ్చు. అందుచేత పైపై చూపులతో ఎవరినీ విశ్వసించరాదు.

క్షమించే లక్షణం వున్నవారిలో అది దోషం కూడా కావచ్చు. ఎందుకంటే జనులు వారు అసమర్థులనుకుంటారు..

ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోప పద్యతే |

యదేనం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః ||

ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణభంగురాలేనని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాబట్టి అనుభవించవచ్చు గాని ఆరాటపడరాదు. విద్వాంసుడెపుడూ ఆకర్షణకు లోను కాడు.

అన్న పితృసమానుడే. నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు. తమ్ముళ్ళందరినీ పైకి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళునిలబడేలా చేసే అన్న నాన్నే కాదు. దేవుడితో సమానుడవుతాడు.

కాబట్టి అన్నను దేవునివలె చూసుకొనేవాడే నిజమైన మనిషి, తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు. వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు. గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగునే బంధించ గలుగుతున్నది కదా!

ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం సద్గతి నివ్వదు. దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు. దేవతల, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించినా, వారిని తిరస్కారంగా చూసినా వంశం వృద్ధికాదు. బ్రహ్మహత్య, మద్యపానం వంటి మహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తముంది కాని సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొంది వారికే కీడు చేసే కృతఘ్నులకు నిష్కృతి లేదు.

పొరపాటున కూడా దుష్టునీ, శత్రవునీ ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పరవాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు.

యౌవనంలో కూడా శాంతంగా ఉండగలవాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడూ, శక్తులన్నీ ఉడిగిపోయినవాడూ శాంతుడు కాక చేసేదేముంటుంది?

నవే వయసి యఃశాంతః సశాంత ఇతి మేమతిః ||

ధాతుషుక్షీయమాణేషు శమః కస్య న జాయతే ||

సంపదలన్నీ భగవంతుడివీ, ఆయన ప్రసాదించిన ప్రకృతివీనీ. ”ఈ సంపదంతా నాది” అని ఏ మనిషి భ్రమపడరాదు..

ఎనభై మూడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment