Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై నాల్గవ అధ్యాయం

రెండవ భాగం | నీతిసారం – ఐదవ భాగం

లోభం ఎలాగూ మంచిదికాదు. ఒక్కొక్కప్పుడు చిన్నపొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా వుండడం మంచిదేకాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి.

ఋణశేషం అగ్నిశేషం వ్యాధిశేషం ఉంచినకొద్దీ ఋణాగ్ని వ్యాధులు పెరిగిపోతునే వుంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి.

ఋణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవచ |

పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్చేషం న కారయేత్ ||

మనతో కలిసి వుండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగిలెయ్యాలి. మాయావియైన శత్రునివలె.

పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం |

వర్జయేత్ తాదృశం మిత్రం మాయామయ మరింతథా||

సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికిరాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. (అటునుంచి ఇటుకాదు)

దుర్జనస్యహి సంగేన సుజనో పి వినశ్యతి |

ప్రసన్నమపి పానీయం కర్దమైః కలుషీకృతం ||

ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమయింది అని అనుకోవాలి. అంతేగాక సాధ్యమయినంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలినదానిని తినుటయే ఉత్తమ భోజనకర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. డంభరహితంగా, అనగా డాబు దర్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం.

తద్భుజ్యతేయ ద్విజ భుక్తశేషం సబుద్ధిమాన్ యోన కరోతిపాపం ||

తత్ సౌహృదం యత్రియతే పరోక్ష దంభైర్వినాయః క్రియతే స ధర్మః ||

వృద్ధజనులు లేని సభ సభేకాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు. సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మమూ కాదు, కపటంతో నిండిన సత్యం సత్యమూ కాదు. కపటసత్యమనగా ఒక మనిషి చేసిన మంచిపనిని మన వాదనా పటిమతో కపట వ్యూహరచనా శక్తితో చెడ్డపనిగా నిరూపించి మనము లాభము పొందునట్టిది.

ఇక్కడ మనం చెప్తున్నది సత్యమేకాని వక్రించి చెప్తాం. (ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలమంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని ”బోర్డు” పెట్టుకొని కూర్చొనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు.

ఆయన బ్రాహ్మణుడు కాదు కదా! పరశురాముడు కర్ణుని, అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింపబడడం సత్యమే. ఆతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపటసత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో వున్నాయి.

విశ్వనాథ పావని శాస్త్రిగారి ”ఆచార్య దాక్షిణ్యం” అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలి బూడిదై పోతాయి.

నసాసభాయత్ర న సంతివృద్ధాః వృద్ధానతే యేన వదంతి ధర్మం |

ధర్మః సనోయత్ర న సత్యమస్తి నైతత్ సత్యం యచ్ఛలే నానువిద్ధం ||

మనుష్యులలో బ్రాహ్మణులు (అంటే కులం కాదు వర్ణధర్మం మాత్రమే) తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు.

మనస్సుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం, శుభం. ఇతరుల సేవకై సమర్పింపబడేదే నిజమైన జీవనం. ధనం అందరికీ ఉపయోగపడినపుడే దానికి సార్థక్యముంటుంది. సమర భూమిలో శత్రువుకెదురుగా నిలబడిచేసే గర్జనయే వాస్తవిక గర్జన. మదోన్మత్తత లేని స్త్రీయే శ్రేష్ఠవనిత. జితేంద్రియుడే నిజమైన పురుషుడు.

ఎంత గొప్ప రాజ్యైశ్వరాలైనా బ్రాహ్మణుని శాపం తగిలితే నశించిపోతాయి. ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైన పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది. అశిక్షిత గ్రామంలో నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది. అలాగే దుష్ట స్త్రీల వంశం మిగలకుండా పోతుంది.

సంగ్రహానికి క్షయమూ, ఉత్కర్షకి పతనమూ, సంయోగానికి వియోగమూ, జీవనానికి మృత్యువూ అంతాన్ని తెస్తాయి. మరణ మృదంగాన్ని వాయిస్తాయి. రాజులేని రాజ్యంలోగాని అనేక రాజులున్న రాజ్యంలోగాని నివాసముండకూడదు.

అలాగే ఆడపెత్తనం, బాలురకే అధికారం వున్న ఆవాసాలూ త్యాజ్యాలే..

పితారక్షతి కౌమారే
భర్తా రక్షతి యౌవనే ||

పుత్రస్తు స్థవిరే కాలే నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి ||

డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు, బంధువులు మిగలరు. స్త్రీ వ్యసనం కానీ, ఇతర వాంఛలు కానీ విపరీతంగా నున్న వానికి సిగ్గూ, భయమూ వుండవు. చింతామగ్నునికి అనగా నిత్యం బాధలూ వాటి ఆలోచనలే గల వానికి సుఖమూ, నిద్రా రావు. ఎంత తిన్నా ఆకలి తీరని వానికి బలం, తేజం నిలబడవు.

అర్థాతురాణాం న సుహృన్న బంధుః

కామాతురాణాం న భయం న లజ్జా ||

చింతాతురాణాం న సుఖం న నిద్రా

క్షుధాతురాణాం న బలం న తేజః ||

తన బాధలూ, వాటికి సంబంధించిన ఆలోచనలూ ఉన్నవానికే కాదు దుష్టునికీ ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీతాసక్తి గలవానికి కూడా నిద్ర పట్టదు. పరకాంతాసక్తునికీ నిద్రపట్టదు. దోషికి నిద్రపట్టదు. ఋణము, రోగమూ లేనివాడూ, ఆడదాని జోలికే పోనివాడూ మాత్రమే నిద్రనొక భోగంలాగ అనుభవించ గలరు.

కమలానికి జలంలో నిలబడివున్నంత కాలమే వరుణ, సూర్యదేవుల స్నేహం లభిస్తుంది. పడిపోతే ఏమీలేదు. ఎవరూ లేరు. మనిషైనా పదవిలో నున్నపుడే అంతా మిత్రత్వాన్ని పాటిస్తారు.

దిగిపోయిన తరువాత ఎవరూ పట్టించుకోరు. ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మిగలవు. పైగా పదవిలో నున్నపుడు ఆయన చేసిన పనులకి ఇప్పుడు శత్రువులు బయట పడుతుంటారు. కేశములూ, దంతములూ గోళ్ళూ శరీరంపై నున్నంతకాలమే గదా, వాటికి విలువ!

స్థానా స్థితాని పూజ్యంతే పూజ్యంతే చ పదేస్థితాః ।

స్థానభ్రష్టాన పూజ్యంతే కేశాదంతా నఖా నరాః ॥

తమ తమ నెలవులు దప్పిన తమ వారే శత్రులగుట తథ్యము కదా!

వర్ణం, వంశం, దేశం, స్నేహం, భోజనం వాటంతటవే తెలుస్తాయి. ఎవరూ ఎవరినీ అడగనక్కరలేదు. ఆచారాన్ని చూసి వర్ణ, వంశాలనూ, భాష, భాషణల తీరును బట్టి దేశాన్ని, మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్ధతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని, శరీరపుష్టిని గమనించి భోజనాన్నీ పోల్చివేయవచ్చు. ఆచారాదులే చెప్తాయి.

సముద్రంలో వాన, బాగా కడుపు నిండిన వానిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం, అఖిల ఐశ్వర్యవంతునికి దానమిచ్చుట, నీచునికి చేసే ఉపకారాలు వ్యర్ధము.

దూరస్థో పి సమీపస్తో యోయస్య హృదయేస్థితః ।

హృదయా దపి నిషాంతః సమీప స్థోపి దూరతః ॥

గుండెలో గూడు కట్టుకొని కూర్చున్న ప్రాణి ఎంతదూరంలో వున్నా మనకు దగ్గరలో నున్నట్లే అనిపిస్తుంటుంది. హృదయంలోంచి తొలగించబడినవారు కాని హృదయం దాకా రాలేనివారు గాని పొరుగింట్లోనే వున్నా పరాయిదేశంలో నున్నట్లే లెక్క.

ముఖంలో వికృతి, గొంతుపూడుకుపోత, దైన్యభావం, చెమటతో తడిసి ముద్దైన శరీరం, అత్యంత భయంకర చిహ్నాలు. అవి సామాన్యమానవుని ఆకృతి పై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి.

కాని, బిచ్చమెత్తుకొని బతికేవాని ఆకారం నిరంతరం ఇలాగే మనిషి కుంచించుకుపోవడం, క్రిమిదోషంతో సదా పీడితుడై ఉండడం, వాయు వికారగ్రస్తుడై ఉండడం, రాజ్యం లేదా గృహం నుండి తగిలేయబడడం, పర్వత శిఖరంపై నివసించడం ఇవన్నీ కూడా ముష్టి వానిగా బతకడం కన్నా మంచివే. యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం.

జగత్పతిర్హి యాచిత్వా

విష్ణుర్వామనతాం యతః ।

కోన్యోధిక తరస్తస్య

యోర్జీ యాతి న లాఘవం ||

జగత్పతీ, కొండంత దేవుడునైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినపుడు అంతటి ఐశ్వర్యవంతుడూ కుంచించుకుపోయి వామనుడై పోయాడంటే ఇక కడమ వారిని గూర్చి చెప్పాలా?

ఇక విద్య యొక్క గొప్పదనాన్ని గూర్చి వినండి.

విద్యానామ కురూపరూప మధికం విద్యాతి గుప్తం ధనం |

విద్యాసాధుకరీ జనప్రియకరీ విద్యా గురూణాం గురుః ||

విద్యా బంధుజనార్తి నాశనకరీ విద్యా పరం దైవతం |

విద్యా రాజసుపూజితాహి మనుజో విద్యా విహీనః పశుః ||

కురూపికి కూడా విద్య వుంటే కళ, కాంతి వస్తాయి. రూపాన్నంటే తల్లిదండ్రులివ్వలేక పోవచ్చుగానీ అవకాశముండీ పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువులకిందే లెక్క విద్యరూపాన్నిస్తుంది. దాచుకున్న సొమ్ములాగా అక్కరకొస్తుంది.

ఎవరి చేతిలోనైతే తాను వుంటుందో వానిని సాధు స్వభావిగా మారుస్తుంది. లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది. గురువులకు కూడా గురువైనది విద్య. అది విద్యావంతుని యొక్క బంధ బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలదు.

విద్యయే పరమ దేవత. రాజుల చేత కూడ సామాన్యుడైన విద్యావంతుడు పూజింపబడతాడు. విద్యగల వాడే మనిషి అది లేనినాడు పశువు. ఎట్టి ద్రవ్యమైనను దొంగలనుండి సంపూర్ణంగా సురక్షితమనలేము. కాని, విద్య దొంగలచేతికి దొరకని దైవం, ద్రవ్యం.

(అనంతర కాలంలో తెలుగులో వెలసిన విద్యా పద్యాలకు ముఖ్యంగా విద్యలేనివాడు వింతపశువు. విద్య – నిగూఢ గుప్తమగు విత్తము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే – వంటి సుప్రసిద్ధ భావాలకు గరుడపురాణమే మూలము)

ఎనభై నాల్గవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment