శుక్రగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము
బృహస్పతి ఇంద్రుడితో సమావేశమయ్యాడు.
“పదేళ్ళు గడిచిపోయాయి , శుక్రుడు తిరిగి వచ్చేశాడు…” బృహస్పతి ప్రారంభించాడు.
“జయంతి కూడా వచ్చేసింది , గురుదేవా !” ఇంద్రుడు అడ్డు తగిలాడు.
“శుక్రుడికి మృతసంజీవని లభించింది ! దురదృష్టమేమిటంటే , మా పుత్రిక శుక్రుడిని వశపరచుకుంది గానీ , తపోభంగం చేయలేదు.”
“శుక్రుడు వృషపర్వుడి ఆస్థానానికి వచ్చాడు. రాక్షసులందరూ నన్నే తమ గురువుగా. నమ్మారు. మోసగాడనీ , మాయావి అని నిందించి శుక్రుడిని వెళ్ళగొట్టారు. నేను ఆడిన నాటకం ప్రకారం మృతసంజీవని ఈపాటికి నాకు సిద్ధించి ఉండాలని వృషపర్వుడు నిశ్చయించుకున్నాడు. ”మృతసంజీవని ప్రయోగం” ప్రస్తావన వస్తే , నా నాటకం వెల్లడవుతుంది.”
“ఔను ! అది ప్రమాదమే ! ఏం చేద్దాం ?” ఇంద్రుడు ప్రశ్నించాడు.
“ఏమిచేయాలో చేసేశానుగా , మహేంద్రా !” బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
ఇంద్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు.
“శుక్రుడి రూపాన్ని త్యజించేశానుగా !” బృహస్పతి నవ్వాడు. “ఇంక నేను రాక్షసుల నగరానికి వెళ్ళను !”.
శుక్రుడు చాలా రోజుల పాటు సభకు రాకపోయే సరికి వృషపర్వుడికి అనుమానం వచ్చింది. మెల్ల మెల్లగా కపట శుక్రుడి తత్వం బోధపడసాగింది. తమకు ఆయన చెప్పిన పాఠాల సారాంశం దేవతల ప్రశంసే !
పది సంవత్సరాల పాటు తమకు దేవతలు మంచివాళ్ళనీ , వాళ్ళను సేవించడం శ్రేయోదాయకమనీ నూరిపోస్తున్న మాయాశుక్రుడిని పోల్చుకోలేకపోయినందుకు రాక్షసులు సిగ్గుపడ్డారు. తమ యదార్థ గురుదేవులను సభలోంచి , నగరంలోంచి , రాజ్యంలోంచే వెళ్ళగొట్టినందుకు బాధపడ్డారందరూ. శుక్రాచార్యులకు క్షమాపణలు అర్పించి , సగౌరవంగా ఆయనను ఆస్థానానికి తీసుకురావాలని వృషపర్వుడు సభాముఖంగా నిర్ణయించాడు.
ఆశ్రమానికి వచ్చి క్షమాపణలు కోరిన వృషపర్వుడి మీదా , ఇతర రాక్షస ముఖ్యుల మీద శుక్రుడు ఆగ్రహంతో చిందులు వేశాడు. తల్లి పులోమా , తండ్రి భృగువు కల్పించుకొని శాంతింపచేశారు.
“ఇవన్నీ ఆ దేవతలు ఆడుతున్న నాటకాలు ! సాక్షాత్తుగా ఆ మహావిష్ణువు చేతే నా శిరస్సు ఖండింపచేశారు.” అంది పులోమ.
“గురుదేవా ! మా అపరాధాన్ని , అజ్ఞానాన్ని మీరు మన్నించాలి ! మాకు దిశానిర్దేశం చేయాలి. మాత శిరచ్ఛేదనానికి కారకులైన ఆ దేవతల మీద పగ తీర్చుకోవాలి !”. వృషపర్వుడు ప్రాధేయపడుతూ అన్నాడు. “దయచేసి , అసుర గురుపదవిని స్వీకరించండి !” శుక్రుడు అంగీకరించాడు.
నిర్వికల్పానంద కథనం ఆపి , శిష్యుల వైపు చూశాడు. “ఇప్పటిదాకా మీరు విన్న శుక్రాచార్యుల చరిత్ర భాగం ఎలా ఉంది ?”
“ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంది. గురువుగారూ !” శివానందుడు అన్నాడు.
“వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలన్న కుతూహలాన్నీ , ఆతృతనూ కలిగించే కథ అది !” సదానందుడు అన్నాడు.
“ముందు ముందు కూడా అంతే , నాయనా ! శుక్రాచార్యుడి చరిత్ర పూర్తిగా చిత్రాతిచిత్రమైన సన్నివేశాల సమాహారం ! వివాహానంతరం ఆయన జీవితంలో ఆసక్తి కలిగించే సంఘటనలు అనేకం జరిగాయి.”.
“గురువు గారూ ! శుక్రాచార్యులు జయంతిని పంపి వేశారుకదా , ఆ తరువాత ఎవర్ని పెళ్ళి చేసుకున్నారు” చిదానందుడు అడిగాడు.
“ప్రియవ్రతుడు , సురూప దంపతుల పుత్రిక అయిన ”ఊర్జస్వతి” అనే యువతితో ఆయన వివాహం జరిగింది. ఆమెకు ”దేవయాని”, ”అరజ” అనే కుమార్తెలూ , నలుగురు కుమారులూ కలిగారు. యుక్తవయస్కులైన నలుగురు పుత్రులనూ , ఆయన రాక్షసులకు పురోహితులుగా నియమించాడు. కుమార్తెలలో ”అరజ’’ బాల్యం నుండే తాత్విక దృష్టి కలిగిన పిల్ల. యుక్తవయస్సు వచ్చాక , ఆమె వివాహం పట్ల విముఖత చూపి , తండ్రి. అనుమతితో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయసాగింది.”
“ఇక్ష్వాకుడి కుమారుడు ”దండుడు” అనేవాడు ఆరోజుల్లో రాజ్యపాలన చేస్తున్నాడు. అరణ్యానికి వేటకు వెళ్ళిన దండుడు అక్కడ సౌందర్యరాశి అయిన అరజ మీద అత్యాచారం చేశాడు. ఆమె కేక విన్న శుక్రుడు అక్కడికి చేరుకుని , అరజ ద్వారా ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఐదురోజులలోగా అగ్ని వర్షం కురిసి దండుని రాజ్యం సర్వనాశనం అయిపోయి , అరణ్యంగా మారిపోతుందని శపించాడు. ఆయన శాపం నిజమైంది. ఎడతెరపి లేకుండా కురిసిన అగ్ని వర్షంలో దండుని రాజ్యం బూడిదైపోయింది. కాలక్రమాన అక్కడ అరణ్యం ఏర్పడింది. దండరాజు పేరును గుర్తు చేస్తూ , ఆ అరణ్యం దండకారణ్యం అయింది” నిర్వికల్పానంద ఆగాడు.
“అయితే దండకారణ్యం ఏర్పడటానికి కారకుడు శుక్రుడన్నమాట !” సదానందుడు అడిగాడు.
“ఔను ! శాపానుగ్రహ సమర్థుడు కదా , ఆయన ! ”మృతసంజీవని విద్య”ను శుక్రుడు వినియోగించాడో లేదో మీరు వినలేదు , వినండి !” అంటూ ప్రారంభించాడు. నిర్వికల్పానంద.
“శ్రీమహావిష్ణువు చేత తన తల్లికి శిరచ్ఛేదం చేయించిన దేవతల మీద ప్రతీకార వాంఛ రగుల్కొంది శుక్రుడిలో దేవతల మీద దండయాత్రకు రాక్షసులను తరచుగా ప్రేరేపించడం ప్రారంభించాడు. యుద్ధంలో మరణించే రాక్షస వీరుల్ని ”మృతసంజీవని” ప్రయోగంతో పునరుజ్జీవుతుల్ని చేస్తూ , రాక్షసుల ధైర్యాన్ని ఇనుమడింపచేయసాగాడు. హతమార్చబడిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ జీవిస్తూ , యుద్ధంలో రెచ్చిపోతూ ఉండడంతో దేవతలు భయభ్రాంతులైపోయారు. చీటికీ మాటికీ దేవతలతో తలపడటం రాక్షసులకు ఒక క్రీడలా మారిపోయింది. ఇంద్రుడూ , బృహస్పతీ ఆలోచనలో పడ్డారు…”
“గురుదేవా ! ఎంతకాలమీ పరాజయ పరంపర ? సంహరించేకొద్దీ , సజీవులై వస్తూ ఉంటే , ఏం చేయగలం ?” ఇంద్రుడు నిరాశగా అన్నాడు.
“అంతా ఆ మృతసంజీవని” మూలంగా జరుగుతోంది ! రాక్షసులలో మరణించే వారు మళ్ళీ లేస్తున్నారు ! మన వాళ్ళేమో మరణించాక మరణించే ఉండి పోతున్నారు. క్రమంగా దేవతల సంఖ్యాబలం కూడా తగ్గిపోతోంది.” బృహస్పతి నిట్టూర్చాడు.
ఇంద్రుడు కూడా బరువుగా నిట్టూర్పు వదిలాడు. “మీ మనస్సులోని మాటను చెప్పారు ! అది అందరికీ అనుభవమే ! మార్గాంతరం చెప్పండి. ఆ మృతసంజీవనికి విరుగుడు ఆలోచించండి !”
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹