Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై ఏడవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర తొమ్మిదవ భాగము

“మృతసంజీవనికి విరుగుడా ?” బృహస్పతి ఆశ్చర్యంగా అన్నాడు. “అది పరమశివుని వరప్రసాదం , మహేంద్రా ! దానికి తిరుగూ లేదు. విరుగుడూ ఉండదు !”

“అయితే స్వర్గ రాజ్యాన్ని ఆ రాక్షసులకు అప్పగించి , అడవుల దారి పట్టటమే !” ఇంద్రుడి కంఠంలో విచారం ధ్వనించింది.

“ప్రతి వ్యాధికీ ఒక ఔషధం ఉన్నట్టే. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. దేవరాజా ! ఆలోచించాలి !” దేవగురువు చిరునవ్వుతో అన్నాడు.”ఆలోచించండి !” ఇంద్రుడు విసుగ్గా అన్నాడు.

“మార్గాంతరం ఒక్కటే ఉంది !” బృహస్పతి సాలోచనగా అన్నాడు. “మృతసంజీవని లాంటి విద్యను మనమూ సంపాదించడమే !”

ఇంద్రుడు కళ్ళు చిట్లించాడు. “మృతసంజీవనినే సాధిస్తే ? కత్తికి కత్తితో , గదకు గదతో సమాధానం చెప్పినట్లుంటుంది !”.

బృహస్పతి ఆమోద సూచకంగా తలపంకించాడు. “దివ్యమైన ఆలోచన !”

“అయితే సురగురువులాగా , దేవగురువు తపస్సుతో మెప్పించి , మృతసంజీవని సంపాదించడమేగా మన కర్తవ్యం , గురుదేవా ?” ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.

“తపస్సు మాత్రమే మన చేతిలో ఉంటుంది. పరమేశ్వరుడి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఊహించలేం. పరమేశ్వరుడి దృష్టిలో శుక్రుడు వేరు , మనం వేరు ! శుక్రుడిని శంకర దంపతులు పుత్రుడిగా భావిస్తారు కదా !” బృహస్పతి సాలోచనగా అన్నాడు.

“మరి , ”దివ్యమైన ఆలోచన !” అన్నారు కదా ! దివ్యమైన ఆలోచనకు దివ్యమైన ఆచరణ విధానం చెప్పండి !” ఇంద్రుడు అసహనంగా అన్నాడు.

“మృతసంజీవనీ విద్య ప్రస్తుతం ఇద్దరికి తెలుసు ! ఒకరు పరమశివుడు , ఇంకొకరు శుక్రుడు !” బృహస్పతి ఇంద్రుణ్ణి సూటిగా చూస్తూ అన్నాడు. “శివుడి కన్నా శుక్రుడి నుండే సంపాదించడం సులభం !”

ఇంద్రుడు ఏదో చెప్పబోయాడు. బృహస్పతి అతడిని చెయ్యెత్తి వారించాడు. “శుక్రుడు శత్రువులకు ఆ విద్యను ఎందుకు దానం చేస్తాడన్నది నీ సందేహం. నాకు తెలుసు ! శ్రద్ధాభక్తులతో శుశ్రూష చేసే శిష్యులకు గురువు సకల విద్యలూ బోధిస్తాడు. శుక్రుడు మంచి గురువు !” అన్నాడు బృహస్పతి.

“అయితే మనవాళ్ళలో ఎవరో ఒకరు శుక్రాచార్యుడిని ఆశ్రయించాలన్న మాట…”

“ఎవరో ఒకరు కాదు ! వినయ విధేయతలూ , శ్రద్ధా భక్తులూ , సునిశితమైన బుద్ధి బలం – ముఖ్యంగా కార్యదీక్షా ఉన్న యువకుడిని ఆ కార్యానికి నియోగించాలి. మహేంద్రా !” బృహస్పతి సూచించాడు.

దేవేంద్రుడు చిన్నగా నవ్వాడు. “మీరు పేర్కొన్న అన్ని లక్షణాలూ ఉన్న యువకుడు , నా ఎరుకలో ఒక్కడే ఉన్నాడు. గురుదేవా !”.

“ఎవరు ?”

“మీ సుపుత్రుడు కచుడు !”

“కచుడా ?”

“ఔను ! శుక్రుడికి శుశ్రూష చేసి , మృతసంజీవనిని సంపాదించగలిగిన చతురత కలిగిన యువకుడు కచుడే !”

“దేవ గురువుగా నేను చేయవలసిన సహాయం నా కుమారుడు చేయడం నాకు ఆనందం కలిగించే విషయమే ! నా పుత్రుడు విజయం సాధించగలిగితే ఆ ఘనత నాదే అవుతుంది కదా ! గురుభక్తికి కచుడు పెట్టింది పేరు. రేపే కచుడిని శుక్రుడి ఆశ్రమానికి పంపుదాం !” బృహస్పతి అన్నాడు..

“ధన్యుణ్ణి , గురుదేవా ! కుమార కచుడి వద్దకు మనం ఇప్పుడే వెళ్ళాలి. దేవతల పక్షాన కుమారుడిని నేను స్వయంగా అభ్యర్థిస్తాను !” ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.

అది వృషపర్వుడి పట్టణంలోని శుక్రాచార్యుడి ఆశ్రమ ప్రాంగణం. దట్టంగా నీడను పరిచిన చెట్టుక్రింద గుంపుగా కూర్చున్న అసుర విద్యార్థులకు శుక్రుడు. పాఠప్రవచనం చేస్తున్నాడు. ఆయన కుమార్తె దేవయాని నీళ్ళు తాగేపాత్రతో తండ్రి సమీపానికి వచ్చింది. తండ్రి వెనుక , చెట్టు భోదికి దగ్గరగా నిలుచున్న దేవయాని , చూపులు , ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుడి మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి. ఆశ్రమ ప్రాంతంలో గానీ , వృషపర్వుడి మందిర ప్రాంతంలో గానీ ఎప్పుడూ చూడలేదు తను , ఆ యువకుడిని. అందం , ఆకర్షణా రెండు ఆభరణాల్లా ఉన్నాయతనికి. యువకుడు తిన్నగా శుక్రుడి ముందుకు వచ్చి నిలిచాడు. వినయంతో చేతులు జోడించాడు.

“గురుదేవా ! దేవ గురువు బృహస్పతి ఆచార్యుల పుత్రుణ్ణి నేను. నా పేరు కచుడు. విద్యాభ్యాసం కోసం మీ చరణ సన్నిధికి వచ్చాను. మీ సేవకు అంకితమవుతాను. నన్ను శిష్యుడిగా అంగీకరించి , విద్యా దానం చేయండి !”

శుక్రుడు కచుడిని ఆశ్చర్యంతో ఎగాదిగా చూశాడు. ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నాయి.

“నువ్వు… బృహస్పతి పుత్రుడివా ?!” శుక్రుడు నమ్మలేనట్టు అన్నాడు. “యధార్ధమేకద!”

“చిత్తం ! నేను తారా బృహస్పతుల తనయుణ్ణి ! విద్యార్జన కోసం స్వయంగా మా తండ్రి గారే నన్ను తమ సన్నిధికి పంపించారు ! అనుగ్రహించండి !” కచుడు వినయంగా. అన్నాడు.

“బృహస్పతి వద్ద లేని విద్య వుందా , నాయనా ?” శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు.

“తన ఆధ్వర్యంలో కన్నా , తమ ఆధ్వర్యంలో అభ్యసించడం సహస్రాధికంగా ఫలదాయకం అన్నారు – మా జనకులు !” కచుడు చిరునవ్వు నవ్వాడు.

“అబ్బ…ఎంత చక్కగా ఉంది ఆ చిరునవ్వు !” అనుకుంది , తండ్రికి నీళ్ళు ఇవ్వడం మరిచిపోయి కచుడినే తదేకంగా చూస్తున్న దేవయాని. కచుడు ! దేవగురువు బృహస్పతి కుమారుడు ! అంటే శత్రుపుత్రుడు ! తన తండ్రి చేరదీస్తాడా ? తృణీకరించి తొలగి పొమ్మంటారా ! తన తండ్రి కచుడిని శిష్యుడిగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది దేవయానిలో కచుడి పట్ల సానుకూలమైన ఆలోచనలు ప్రవాహ వేగంతో సాగుతున్నాయి. అదే సమయంలో , అసుర విద్యార్థులు కచుడిని కోపంగా చూస్తున్నారు. దేవగురువు పుత్రుడు ! విద్యార్థిగా నటిస్తూ , రాక్షసుల రహస్యాలు కనిపెట్టే ప్రయత్నంలో వచ్చాడు !. సందేహం లేదు ! గురువు గారు పొగడ్తకు లొంగిపోయి శిష్యుడిగా స్వీకరిస్తారేమో ! అసుర యువకులలో కచుడి పట్ల ప్రతికూల ఆలోచనలు సాగుతున్నాయి.

“నాన్నా ! విద్యను అర్థిస్తూ వచ్చిన వారు ఎవరైనప్పటికీ…” దేవయాని ఏదో చెప్పబోయింది. “నిరాకరించడం ధర్మం కాదమ్మా !” శుక్రుడు దేవయాని వైపు చూడకుండా , కచుడి వైపే చూస్తూ అన్నాడు.

“గురుదేవా !” ఒక అసుర శిష్యుడు ఆశ్చర్యంతో అన్నాడు. “దేవగురువు కుమారుణ్ని చేరదీస్తారా ?”

“ఔను , నాయనా ! అది మనకు గౌరవ కారణమూ , గర్వకారణమూ !” శుక్రుడు అసుర శిష్యుడితో అన్నాడు. “అర్థించిన వ్యక్తిని అనాదరించకూడదు ! ఈ సువర్ణసూత్రాన్ని కూడా మీరు పాఠంలాగే గుర్తుంచుకోవాలి !”

“నాన్నా ! జలపానం చేయండి !” దేవయాని ఆనందంగా తండ్రికి నీళ్ళ పాత్ర అందించింది. శుక్రుడు పాత్రను కచుడివైపు చూపాడు.

“కచా , ఉదకం స్వీకరించు ! నిన్ను ఆదరిస్తే , నీ తండ్రి బృహస్పత్యాచార్యులను ఆదరించినట్టే !” అన్నాడు చిరునవ్వుతో. దేవయాని కచుడిని మరోసారి చూసి , ఆశ్రమం వైపు పరుగెట్టింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment