శనిగ్రహ చరిత్ర రెండవ భాగము
శనైశ్చరుడు అరణ్య మధ్యంలో , ఒక ఏకాంత స్థలంలో తపస్సు ప్రారంభిచాడు. తాను రూపొందించుకున్న అష్టాక్షరీ మంత్రాలతో వరుసగా బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఏకదీక్షతో స్మరించడంతో అతని తపస్సు ఓ ప్రత్యేకతను పొందింది.
“ఓం చతుర్ముఖాయ నమః !
ఓం మహా విష్ణవే నమః !
ఓం మహేశ్వరాయ నమః !”
నానాటికీ శనైశ్చరుడి తపస్సు తీవ్రమౌతోంది. అతని ధ్యాన తరంగాలు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను చేరుతున్నాయి. తండ్రిని అర్ధంగా పిలుస్తున్న శిశువు పిలుపులా ఆ నామ మంత్రోచ్చారణ తమకు వినిపిస్తున్నప్పటికీ త్రిమూర్తులు కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది.
“ఓం చతుర్ముఖాయ నమః !”
అని శని ధ్యానించగానే , ప్రచోదితమైన బ్రహ్మ శని ముందు సాక్షాత్కరించడానికి ఉద్యుక్తుడవుతాడు. కానీ , మరుక్షణం
‘ఓం మహావిష్ణవే నమః !
అంటూ జపిస్తాడు శని శ్రీమహావిష్ణువును ప్రచోదనం చేస్తూ ! అంతే ! “శని విష్ణుమూర్తి కోసం పరితపిస్తున్నాడు !” అనుకుంటాడు బ్రహ్మ !
విష్ణువు తీరూ అంతే ! తాను లేవడానికి ఉద్యుక్తుడయ్యేంతలో
“ఓం మహేశ్వరాయ నమః !”
అంటాడు శని. దానితో విష్ణువు విరమించుకుంటున్నాడు.
మహేశ్వరుడు ప్రతిస్పందించేసరికి శని చేసే
“ఓం చతుర్ముఖాయ నమః !”
అనే బ్రహ్మ ధ్యానం శివుణ్ణి ఆపివేస్తోంది.
త్రిమూర్తులలో ఎవ్వరూ రాలేని స్థితిలో శని తపస్సు తీవ్ర రూపం ధరించింది. దాని ప్రతాపానికి అరణ్యాలు దహించుకు పోసాగాయి. సముద్రాలలో అలజడి ఎక్కువైంది.
ఇంద్రుడు ఆందోళనలో పడిపోయాడు. లోకాలలో ఏర్పడుతున్న అవాంతర పరిస్థితులకు కారణం తెలుసుకునే ప్రయత్నంలో గురువు బృహస్పతిని సంప్రదించాడు. సరిగ్గా ఆ సమయానికి అమరావతికి చేరాడు నారదుడు. శనైశ్చరుడి తపస్సు గురించి వివరించాడు.
“త్రిమూర్తులను ఏక సమయంలో మెప్పించే విచిత్ర ప్రయత్నంలో తపస్సు చేస్తున్నాడు. శనైశ్చరుడు. ప్రస్తుత ఉపద్రావాలకు అతని తపస్సే కారణం !” అని వివరించాడు. నారదుడు.
“ఆ శనిది విపరీత వాంఛ ! అది ఎలాగూ తీరదు ! అప్సరసలను పంపించి , అతగాడి తపస్సును గాడి తప్పిస్తాను !” అన్నాడు ఇంద్రుడు.
“సమయోచితమైన నిర్ణయం !” బృహస్పతి మెప్పుగా , ఆమోదించాడు.
ఇంద్రుడు ఇద్దరు అప్సరసలను శనైశ్చరుడి తపస్సు భగ్నం చేయడానికి పంపించాడు.
అప్సరసలు సమ్మోహనకరమైన అలంకారాలతో శని ముందు ప్రత్యక్షమయ్యారు. శనిని చూడగానే వాళ్ళ గుండెలు దడదడలాడాయి.
నల్లటి , బలహీనమైన ఆకారం… అర్థ నిమీలితంగా ఉన్న కళ్ళు. భయం గొలిపే ముఖ కవళిక. శరీరంలోంచి వెలికి చిమ్ముతున్న ఎర్రటి కాంతి వలయం , పరిసరాల్లో ఏదో వ్యక్తం కాని భయాన్ని నింపుతున్న అతని ఉనికి… ఆయన కళ్ళు తెరిస్తే కాలిపోతామన్న భయం ! ఉన్నట్టుండి అప్సరసల శరీరాలు వణకడం ప్రారంభించాయి. అరమూసిన శనైశ్చరుడి కళ్ళు విచ్చుకుంటే తమకు ప్రమాదం అనిపించింది వాళ్ళకి. ఇద్దరూ ముఖాలు చూసుకుని అదృశ్యమైపోయారు.
అప్సరసలు చెప్పింది విని , ఇంద్రుడు బృహస్పతి వైపు చూశాడు. “శనికి ప్రసన్నం కమ్మని త్రిమూర్తులను అర్థించడమొక్కటే మార్గం !” బృహస్పతి అన్నాడు.
“మీరు కూడా దయచేయండి !” అంటూ లేచాడు ఇంద్రుడు.
దేవేంద్రుడూ , బృహస్పతి చెప్పింది విని , బ్రహ్మ తలపంకించాడు. “శ్రీమహావిష్ణువునూ , పరమశివుణ్ణి ఆశ్రయించండి ! వారి అభిప్రాయం తెలుసుకోండి ! శని తపస్సు చాలా తీవ్రంగా ఉంది ! నేను ప్రత్యక్షమయ్యేలోగా శ్రీహరిని ధ్యానిస్తాడు. దానితో నేను కర్తవ్య విముఖుడు కావలసివస్తోంది.”
“ఆ మహానుభావుడు చేస్తున్న తపో విధానాన్ని మరిచిపోయి , ఒక్కసారి , అతని ముందు సాక్షాత్కరించమని నా మనవి !” ఇంద్రుడు చేతులు జోడించాడు.
“సరే… లోకహితం కోసం… అలాగే చేస్తాను ! మీరు వెళ్ళండి !” అన్నాడు బ్రహ్మ.
శ్రీహరినీ , శివుణ్ణి ఆ విధంగానే అభ్యర్థించి , శని తపస్సు కలిగిస్తున్న ఉపద్రవం నుండి లోకాలను కాపాడమన్నాడు ఇంద్రుడు.
శనైశ్చరుడి తపస్సు వల్ల ఉద్భవిస్తున్న భయానకమైన వేడిమి లోకాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఉన్నట్టుండి బ్రహ్మ అతని ముందు సాక్షాత్కరించాడు.
“శనైశ్చరా ! నీ తపస్సుకు మెచ్చాను , వచ్చాను !” అన్నాడు బ్రహ్మ.
శని కళ్ళు తెరిచి చూశాడు. చేతులు జోడించాడు. “శ్రీమహావిష్ణువూ , పరమశివుడూ ఏరి ?” అన్నాడు.
“నేను వచ్చాను ! వరం కోరుకో !” బ్రహ్మ అన్నాడు.
“క్షమించండి ! త్రిమూర్తులు ఒక్కసారి దయచేస్తే గానీ వరాలు కోరను. తపస్సు చాలించను !” అంటూ శని రెప్పల్ని కళ్ళమీదికి కొద్దిగా వాల్చాడు.
బ్రహ్మ అంతర్థానమైపోయాడు.
శ్రీమహావిష్ణువు శనైశ్చరుడి ముందు సాక్షాత్కరించాడు. “శనైశ్చరా ! తపస్సు చాలించి , వరాలు కోరుకో , నాయనా !” అన్నాడు.
శని కళ్ళు తెరిచి , విష్ణువుకు నమస్కరించాడు. “బ్రహ్మా , శివుడూ రాలేదే ?” అన్నాడు నిర్లక్ష్యంగా.
“వస్తారు. ఒక్కొక్కరుగా ! నువ్వు కోరుదలచుకున్నదేదో కోరుకో. అనుగ్రహించి వెళ్తాను !”.
“త్రిమూర్తులను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలన్న నిర్ణయంతో సాధన చేస్తున్నాను. నా నిర్ణయాన్ని సడలించలేను. క్షమించి వెళ్ళండి ! వస్తే , ఆ ఇద్దరితో కలిసి రండి !” శని నిష్కర్షగా అని , కళ్ళు అరమూశాడు.
“శనైశ్చరా ! ఇటు చూడు !” శ్రీమహావిష్ణువు ఆప్యాయంగా పిలిచాడు.
శని అర్ధనిమీలిత నేత్రాలతో మునుపటి స్థితిలో ఉండిపోయాడు. అతని పెదవులు కదులుతున్నాయి.
“ఓం చతుర్ముఖాయ నమః!
ఓం మహావిష్ణవే నమః!
ఓం మహేశ్వరాయ నమః!”
“శనైశ్చరా !” మూడు కంఠాలు గంభీరంగా పిలిచాయి. త్రిమూర్తుల కంఠాలు పరిసరాల్లో ప్రతిధ్వనించాయి.
శని కళ్ళు విచ్చుకున్నాయి. అతడు వెంటనే లేచి , త్రిమూర్తులకు చేతులు జోడించాడు , వినయంగా.
“త్రిమూర్తులను ఏకకాలంలో ప్రత్యక్షం చేసుకొని ధన్యుణ్ణయ్యాను !” అన్నాడు శని.
“సూర్యపుత్రా ! నువ్వు హరవాదివి ! మొండితనంతో మమ్మల్ని రప్పించావు సుమా !” శ్రీమహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.
“క్షమించండి ! మా సోదరుడు యముడు మీలో ఇద్దరు కరుణించారంటూ గొప్పగా చెప్పుకున్నాడు. నన్ను చిన్నబుచ్చాడు. నాలో స్పర్ధ ఉద్భవించింది. ముగ్గుర్నీ సాక్షాత్కరింప జేసుకోవాలనుకున్నాను…”
“ఏం కావాలో కోరుకో !” బ్రహ్మ అన్నాడు.
“ప్రాణులందరూ నన్ను చూసీ , నా పేరు వినీ భయభక్తులతో సేవించేలా , నేను ప్రసన్నుడైతే ఏ ప్రాణికైనా ఆయుష్షు పెరిగేలా అనుగ్రహించండి !” శని ప్రార్థించాడు.
“తథాస్తు !” అన్నారు త్రిమూర్తులు.
“మా యముడి స్థాయికి తగ్గని పదవి ప్రసాదించండి !” శని అడిగాడు.
“అలాంటి గొప్ప పదవి అచిరకాలంలో నీకు లభిస్తుంది !”
“స్వయంగా మేమే నిన్ను ఆ పదవిలో నియమించి , అభిషేకిస్తాం , శనైశ్చరా !” పరమేశ్వరుడు వివరించాడు.
“ధన్యోస్మి !” శని చేతులు జోడించాడు. త్రిమూర్తులు అంతర్ధానమయ్యారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹