Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – తొంబై ఐదవ అధ్యాయం

విష్ణుమండల పూజావిధి

“భుక్తి ముక్తిప్రదాయకం, పరమగతి ప్రాప్తిదం

ఐన మరొక శ్రేష్ఠ పూజను విధి విధానయుక్తంగా వర్ణిస్తాను వినండి” అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమండల పూజను వర్ణించసాగాడు.

ముందొక సామాన్య పూజామండలాన్ని నిర్మించి దాని ద్వారం దగ్గర పూజను మొదలుపెట్టాలి. ద్వార ప్రదేశంలోనే ముందుగా ధాత, విధాత, గంగా యమునలనూ తరువాత శ్రీ, దండ, ప్రచండ, వాస్తు పురుషులనూ పూజించాలి.

తరువాత మండల మధ్యభాగంలో ఆధారశక్తి కూర్మదేవ, అనంతులను పూజించాలి. పిమ్మట పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కంద, నాళ, పద్మ, కర్ణిక, కేసరాది భాగాలపై పూజించి, సత్త్వ రజస్తమో గుణాలను కూడా పూజించాలి. తరువాత యథావిహిత స్థానాల్లో సూర్యాదిగ్రహాలనూ, విమలాది శక్తులనూ అర్చించాలి.

తరువాత మండల కోణ భాగాలలో దుర్గ, గణేశ, సరస్వతి, క్షేత్ర పాలుడగు స్వామిలను పూజించాలి. అప్పుడు వాసుదేవుని ఆసనాన్ని దానిపై వుంచిన మూర్తులనూ పూజించి వాసుదేవ, బలభద్రుల స్మరణను కొంతసేపు గావించి ఆపై అనిరుద్ధునీ, నారాయణునీ పూజించాలి.

అపుడు నారాయణుని సంపూర్ణ పూజను అనగా హృదయాది.. సర్వాంగములనూ, శంఖ చక్రగదాది ఆయుధాలనూ అర్చించాలి. అనంతరం శ్రీ, పుష్టి, గరుడ, గురు, పరమగురువులనూ, ఇంద్రాది అష్టదిక్పాలకులనూ (వారి వారి దిశలలోనే) పూజించి మండల పైభాగంలో బ్రహ్మనీ, క్రింది భాగంలో నాగదేవతనీ పూజించాలి.

ఆగమశాస్త్రంలో చెప్పబడిన విధంగా చోటును చూసి ఈశానకోణంలో విష్వక్సేనుని పూజించడంతో మంగళకరమైన మండలపూజ సంపూర్ణమవుతుంది.

ఈ విధంగా విష్ణుమండల పూజను గావించినవారు మహాత్ములవుతారు. వారికి పునర్జన్మ వుండదు.

(ఇందులో పేర్కొనబడిన దేవతలందరినీ మంత్ర సహితంగా ఎలా పూజించాలో ఈ పురాణంలోనే అధ్యాయాలలో చెప్పబడింది).

తొంబై ఐదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment