వ్రత పరిభాష, నియమాదులకు సంబంధించిన జ్ఞానం
వ్యాసమునీంద్రా! నారాయణ సంప్రీతికరములైన కొన్ని వ్రతాలను ఉపదేశిస్తాను. శాస్త్రములలో వర్ణింపబడిన నియమములను తప్పకుండా పాటించడమే వ్రతం. అదే తపస్సు కూడానూ. కొన్ని సామాన్య నియమాలిలా వుంటాయి.
నిత్యం త్రిసంధ్యలలో స్నానం. భూమిపై శయనం. పవిత్రంగా ఉంటూ రోజూ హవనం చేయడం.పతిత జన సాంగత్యాన్ని వర్ణించడం. వ్రతం కోసం కాంస్యపాత్ర, ఉడద (చిక్కుడు) ధాన్యం, పెసరవంటి పప్పు, ధాన్యాలు, ఉల్లి, ఇతరులు పెట్టే అన్నం, కూరలు, మధుసేవనం (అనగా తేనె వంటి రుచులు, భోగాలు. మద్యపానం ఎప్పుడూ పాపమే) వీటన్నిటినీ విసర్జించాలి.
పువ్వులు, ఇతర అలంకారాలు, కొత్తబట్టలు, ధూపగంధలేపనాది సరదాలు, అంజన ప్రయోగం వ్రతకాలంలో వదిలెయ్యాలి. ఒక మారు కంటే నెక్కువగా నీరు, ఇతరపానీయాలు (కాఫీ, టీలాంటివి ఇప్పుడు) తాంబూలం, పగటినిద్ర, భార్యతోనైనా మైథునం, వీటిలో నేది చేసినా వ్రతభంగమే అవుతుంది. పంచగవ్యాలను త్రాగవచ్చు.
క్షమ, సత్యం, దయ, దానం, శౌచం, ఇంద్రియనిగ్రహం, దేవపూజ, అగ్నిలోహవనం, సంతోషం, నీతి (పురాణంలో అచౌర్యమని వుంది) ఈ పదీ అన్ని వ్రతాలకూ సర్వసామాన్య ధర్మాలు.
క్షమా సత్యం దయాదానం శౌచమింద్రియనిగ్రహః |
దేవ పూజాగ్ని హవనే సంతోషో స్తే యమేవచ ||
సర్వ ప్రతేష్వయం ధర్మః సామాన్యోదశధా స్మృతః ||
ఇరవై నాలుగు గంటలలో ఒకేమారు చీకటిపడి నక్షత్ర దర్శనం జరుగుతుండగా భోజనం చేయడమే నక్తవ్రతమవుతుంది. రాత్రప్పుడు భోంచేయడం కాదు. పంచగవ్య ప్రాశ్నకి కూడా హద్దులూ, మంత్రాలూ వున్నాయి.
గోమూత్రం – గాయత్రి – ఒకపలం
గోమయం – గంధద్వారా – అర్ధాంగుష్ట
ఆవుపాలు – ఆప్యాయస్వ – ఏడు పలంలు
ఆవు పెరుగు – దధీ – మూడు పలంలు
ఆవునెయ్యి – తేజోసి – ఒకపలం
దేవస్య…. అనే మంత్రంతో కుశదర్భలు కడిగిన మంత్రజలంతో పంచగవ్యాలను శుద్ధి చేయాలి. ఒకపలం ఆ జలాన్ని ఆయా మంత్రాలను చదువుతూ ఆయా ద్రవ్యాల బరువును తూచి పెట్టుకొని సేవించాలి. ఆగ్న్యాధానం, ప్రతిష్ఠ, యజ్ఞం, దానం, వ్రతం, వేద వ్రతం, వృషోత్సర్గం, చూడాకరణం, ఉపనయనం, వివాహాది మంగళకరకృత్యాలు, రాజ్యాభిషేకాది అధికార కర్మలు మలమాసంలో చేయరాదు.
అమావాస్యనుండి అమావాస్య దాకా జరిగే కాలాన్ని చాంద్రమాసమంటారు. సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం దాకా వుండే కాలాన్ని ఒక దినం (ప్రస్తుత భాషలో రోజు) అంటారు. ఇలాటి ముప్పదిరోజులొక మాసం. ఒక రాశి నుండి మరొకరాశి లోకి సూర్యుని సంక్రమణకాలాన్ని సౌరకుటుంబం అంటారు. నక్షత్రాలు ఇరవైయేడు. వాటివల్ల లెక్కగట్టే మాసం నక్షత్రమాసం. వివాహకార్యానికి సౌరమాసాన్నీ, యజ్ఞదులకు మాసాన్నీ (సావనమాసం) గ్రహించాలి.
యుగ్మతిథులనగా రెండు తిథులోకేరోజు పడడం. వీటిలో విదియతో తదియ, చవితితో పంచమి, షష్ఠితో సప్తమి, అష్టమితో నవమి, ఏకాదశితో ద్వాదశి, చతుర్దశితో పున్నమి, పాడ్యమితో అమావాస్య యోగించిన రోజులు గొప్పఫలదాయకాలవుతాయి. ఇతర యుగ్మాలు మహాఘోర కాలాలు. వాటికి మన పూర్వజన్మ పుణ్యాన్ని కూడా హరించేటంత దుష్టశక్తి వుంటుంది.
వ్రత ప్రారంభానంతరం స్త్రీలకు రజోదర్శనమైనా వ్రతనష్టం జరగదు. వారు దాన, పూజాదికార్యాలను ఇతరులచేత చేయించాలి. స్నాన- ఉపవాసాదిక కాయిక కార్యాలను స్వయంగా చేస్తే చాలు.
క్రోధ, ప్రమాద, లోభాల వల్ల వ్రత భంగమైనవారు మూడు రోజులుపవసించి శిరోముండనం చేయించుకొని వ్రతాన్ని పూర్తి చేయవచ్చు. శరీరం సహకరించక మధ్యలోనే వ్రతాన్ని ఆపవలసి వచ్చినవారు పుత్రాదులచే దానిని పూర్తిచేయించ వచ్చును. వ్రతం చేస్తూ ప్రతి మూర్ఛపోయినంత మాత్రమున వ్రత భంగమైపోదు. జలాది పరిచర్యల చే మేలుకొని, తేరుకొని మరల కొనసాగించవచ్చును..
తొంబై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹