Skip to content Skip to footer

🌹🌹🌹నవగ్రహపురాణం 🌹🌹🌹 – నూట ఏడవ అధ్యాయం

రాహుగ్రహ చరిత్ర మూడవ భాగము

దేవదానవులు అందరూ కలసి , వాసుకిని మందర పర్వతం చుట్టూ తాడులాగా చుట్టారు. దేవతలు వాసుకి పడగ వైపు పట్టుకున్నారు.

“తుచ్ఛమైన పుచ్ఛాన్ని మేమెందుకు పట్టుకోవాలి ? పడగ వైపే పట్టుకుంటాం !” అంటూ రాక్షసులు మొండికేశారు.

దేవతలు వాళ్ళకు వాసుకి పడగ వైపు వదిలేసి , తాము తోక వైపు పట్టుకున్నారు.

మధనం ప్రారంభించగానే , మందరగిరి సముద్రంలో మునిగిపోయింది. వెంటనే శ్రీమహావిష్ణువు లక్షా ఆమడల వెడల్పు వీపుతో , మహాకూర్మంగా అవతరించాడు. సముద్రంలోకి వెళ్ళి క్రింద తన వీపును చేర్చి , అవలీలగా మందర పర్వతాన్ని వాసుకితో సహా పైకి లేపాడు.

సాగర మథనం నిర్విఘ్నంగా ప్రారంభమైంది. దేవతలూ , రాక్షసులూ ఉత్సాహంతో వేగంగా చిలకసాగారు.

ఉన్నట్టుండి , సాగరంలోంచి పొగలు చిమ్ముతూ , నిప్పు రవ్వల్లాగా చిటపటలాడుతూ ”హాలాహలం” అనే ఘోర విషం ఉద్భవించింది. దేవతలూ , దానవులూ హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగెట్టారు.

బ్రహ్మ సూచనను అనుసరించి , దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు. భయంకర హాలాహలాన్ని నియంత్రించి , లోకాలను రక్షించమంటూ మొరపెట్టుకున్నారు.

పరమశివుడు తక్షణమే సాగరతీరంలో సాక్షాత్కరించాడు. నిప్పులు కక్కుతూ. పొగలు చిమ్ముతూ సర్వత్రా వ్యాపిస్తున్న హాలాహల విషాన్ని చూస్తూ సర్పకంకణంతో అలరారుతున్న తన దక్షిణ హస్తాన్ని చాచి , హుంకారం చేశాడు. ఆయన హుంకార శక్తి హాలాహల వ్యాప్తి మీద తక్షణం మహా ప్రభావాన్ని చూపింది.

దిక్కులలో వ్యాపించుకు పోతున్న ఆ దారుణ విషం వెంటనే నల్లటి మేఘంలా ఘనీభవించింది. ఆ వెంటనే నల్లటి ఏనుగులా మారింది. అనంతరం కుంచించుకుపోతూ పంది ఆకారం ధరించింది. క్షణంలో కోకిలలాగా చిన్నదైంది. మరుక్షణం – నేరేడు పండులాగా చిన్న ఉండగా మారి , పరమశివుడి హస్తంలో నిలిచింది.

వైద్యనాధుడూ , ఔషధగుళిక మింగినట్లు గుటుక్కున మ్రింగాడు ! మ్రింగిన విషాన్ని కంఠ భాగంలో బంధించాడు. అప్పుడు ఆ విషగుళిక ఆయన కంఠానికి అలంకరించుకున్న నీలిరంగు రత్నంలా కనిపించింది !

దేవదానవులూ , బ్రహ్మాదులూ అందరూ పరమశివుడు చేసిన అద్భుతాన్ని ఆశ్చర్యంతో చూశారు. “నీలకంఠా ! నీలకంఠ ! శరణు ! శరణు !” అంటూ నినదించారు.

దోషమైన హాలాహల విషాన్ని స్వీకరించి , గుణమైన అమృతాన్ని దేవదానవులకు వదిలిపెట్టి – బిడ్డ అనారోగ్యాన్ని తీసుకుని , ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిలాగా ప్రవర్తించిన పరమశివుడు సాగరమథన కార్యాన్ని మళ్ళీ ప్రారంభించమన్నాడు.

సాగరమథనం పునః ప్రారంభమైంది. దేవదానవుల చేత వాసుకి త్రాడుగా గిరగిరా తిరిగింది తరిగొండ.

బ్రహ్మాండమైన శబ్దంతో , వేగంతో చిలకబడుతున్న పాలకడలిలో నుంచి ప్రప్రథమంగా ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె శరీరం నల్లగా ఉంది. భయంకరమైన ముఖకవళిక , గాజు గోళాల్లా పైకి పొడుచుకు వచ్చిన నేత్రాలు , రోత పుట్టించే నవ్వు ! ఆమెను చూడగానే దేవతలూ , రాక్షసులూ తలలు తిప్పుకున్నారు.

భయనాక ఆకారంతో ఉన్న ఆ వనిత సాగరమథన కార్యానికి నాయకత్వం వహిస్తున్నట్టు తీరాన నిలుచున్న త్రిమూర్తులను సమీపించింది. జుగుప్సాకరమైన ఆమె రూపాన్ని చూడలేక ఆ ముగ్గురూ తలలు తిప్పుకున్నారు. ఎటు తిరిగినా – తన నాలుగు ముఖాలలో ఏదో ఒక ముఖం ఎదురుగా ఆమె ఉండడంతో చతుర్ముఖుడు కలవరపడి పోయాడు.

“నేనెవరు ? ఏం చేయాలి ?” అందామె త్రిమూర్తులను ఉద్దేశించి. పరమేష్ఠీ. పరమేశ్వరుల చూపులను అర్ధం చేసుకున్న శ్రీమహావిష్ణువు ఆమెతో అన్నాడు. “సాగర మథనంలో ప్రప్రథమంగా నువ్వు ఆవిర్భవించావు. నువ్వే జ్యేష్ఠురాలివి. నీ పేరు జ్యేష్టాదేవి ! సకల అవ లక్షణాలూ నీలో ఉన్న కారణంగా నువ్వు ‘అలక్ష్మీ’ అనీ , ‘మూదేవీ’ అని వ్యవహరించబడతావు !”.

“జ్యేష్టాదేవి , అలక్ష్మి , మూదేవి ! అన్నీ చక్కని నామధేయాలే !” అందామె ఉత్సాహంగా , “నా నివాసం ఎక్కడో చెప్పండి !”

“లోకాలలోని అపవిత్రమైన , నిందనీయమైన , నీచమైన స్థానాలే నీ స్థావరాలు ! వెళ్ళు !” అన్నాడు శ్రీమహావిష్ణువు. జ్యేష్టాదేవి కులుకుతూ వెళ్ళిపోయింది. అందరూ తేలికగా ఊపిరులు పీల్చుకున్నారు.

తదనంతరం సాగరం నుండి అష్టదళ పద్మంలో కూర్చుని ఆదిలక్ష్మి అవతరించింది. భువనమోహనమైన ఆమె సౌందర్యాన్ని చూస్తూ , శ్రీమహావిష్ణువు మైమరిచి పోయాడు. దేవదానవులందరూ అసంకల్పితంగా ఆమెకు నమస్కరించారు. ఆమె విశాల నేత్రాలు. శ్రీమహావిష్ణువునే చూస్తున్నాయి. విష్ణువు లక్ష్మిని స్వీకరించాడు.

అనంతరం చంద్రుడు నెలవంక ఆకారంలో ఆవిర్భవించాడు. కంఠంలో ధరించిన హాలాహలం ఉష్ణప్రకోపాన్ని నియంత్రించడానికి శివుడు చంద్రవంకను స్వీకరించి , జటాజూటంలో అలంకరించుకున్నాడు.

ఆ పిమ్మట ఆవిర్భవించిన ”కౌస్తుభం” అనే దివ్య మణిని శ్రీమహావిష్ణువు తన వక్షస్థలం మీద ధరించాడు.

వెంట వెంటనే సాగర గర్భంలోంచి శ్వేతాశ్వమైన ”ఉచ్ఛైశ్రవం”, నాలుగు దంతాల ”ఐరావతం”, ”కామధేనువు”, ”కల్పవృక్షం” , ”పారిజాతం” మొదలైన స్వర్గలోక వైభవ చిహ్నాలు ఉద్భవించాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. తదనంతరం ఉద్భవించిన అప్సరసలు కూడా ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. దుర్వాస మహర్షి శాపంతో నీటి పాలైపోయిన స్వర్గ సంపదలన్నీ మహేంద్రుడికి మళ్ళీ లభించాయి.

దేవదానవులు నూతనోత్సాహంతో మథనం చేయసాగారు. వాళ్ళ శ్రమ ఫలవంతమైందని తెలియజేస్తూన్నట్టు ఒక దివ్య పురుషుడు జన్మించాడు. సాగర గర్భంలోంచి. ఆజానుబాహుడైన ఆ దివ్య పురుషుడి శరీరం నీలమేఘ వర్ణంలో ఉంది. ఆయన నేత్రాలు ఎర్రగా ఉన్నాయి. శిరోజాలు నల్లగా నిగనిగలాడుతున్నాయి. శరీరం నిండా , రకరకాల ఆభరణాలున్నాయి. ఆయన చేతిలో తెల్లటి కలశం ఉంది. ఆయన పేరు ధన్వంతరి. ఆయన చేతిలోని శ్వేత కలశంలో అమృతం !

అమృతకలశాన్ని చేతులలో పట్టుకుని , ధన్వంతరి సముద్రంలో నుంచి తీరానికి వస్తున్నాడు. ఆయనను చూస్తూ దేవతలు హర్షధ్వానాలు చేస్తూ ఉండిపోయారు.

రాక్షసులు పరుగెట్టికెళ్ళి , ధన్వంతరి చేతుల్లోంచి అమృతకలశాన్ని లాక్కున్నారు. కలశంతో పారిపోతున్న ఒక రాక్షసుడిని మరొకడు అడ్డగించి కలశాన్ని లాక్కున్నాడు. ఇలా రాక్షసులు ఒకరి చేతిలోంచి మరొకరు లాక్కుంటూ , గొడవపడసాగారు. కాస్సేపట్లో అసురల మధ్యనే అమృతం కోసం సంకుల సమరం ప్రారంభమైంది. ఆందోళన చెందుతున్న ఇంద్రాది దేవతలకు శ్రీమహావిష్ణువు ధైర్యం చెప్పాడు.

శ్రీమహావిష్ణువు ”మోహిని” అనే సౌందర్యరాశిగా మారిపోయాడు. ఆమె అమిత సౌందర్యం దేవతలకే మతులు పోగొట్టింది ! ఆయన తమ విష్ణువే అనీ , అమృతాన్ని తమకు దక్కించడం కోసం చక్కని చుక్కగా , శృంగార దేవతగా మారాడనీ వాళ్ళు. తాత్కాలికంగా మరిచిపోయారు.

ఇక రాక్షస వీరులైతే మంత్ర ముగ్ధులైపోయారు. అమృత కలశాన్ని మరిచిపోయి ఆ అందాల భరిణ అయిన మోహిని సౌందర్యాన్ని తమ నేత్రచషకాలతో జుర్రుకోవడం ప్రారంభించారు.

విశ్వంలోని అందమైన , సుకుమారమైనవన్నీ మోహిని శరీరావయవాలుగా కనిపిస్తున్నాయి అసురులకు విష్ణుమాయ మోహిని రూపంలో వాళ్ళను పూర్తిగా , దట్టమైన మంచు ప్రకృతి కప్పినట్టు , కప్పివేసింది. అమృతకలశాన్ని పట్టుకున్న ఓ రాక్షస వీరుడు మోహినిని సమీపించాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment