Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ఒకటవ అధ్యాయం

బుధాష్టమి – వ్రతం, కథ

బుధవారం, అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయనూ, బియ్యాన్నీ, దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి.

బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం

ఓం బుం బుధాయనమః.

ఈ దేవ పూజానంతరం కమల గట్టాది ఆహుతులను ఈయడానికి ఓం బుం బుధాయస్వాహా అనే మంత్రాన్ని ప్రయోగించాలి.

జలాశయ మధ్యాన్నే పూర్ణమండలంగా భావించుకొని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకొని దాని మధ్యలో పద్మదళాన్నీ దానిపై శ్యామవర్ణుడూ ధనుర్బాణయుక్తుడునగు బుధునీ కల్పించుకొని ఆయన అంగాలను పూజించాలి.

అప్పుడు పరమపుణ్యదాయినియైన ఈ వ్రతకథను జలాశయ తీరంలో కూడా పూజచేసి కూర్చుని వినాలి.

ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో ”వీరుడు” అను పేరు గల శ్రేష్ఠ బ్రాహ్మణుడొకాయన ఉండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురిపేరు విజయ. ఆతనికొక ఎద్దు కూడా వుండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటుండేవాడు.

గ్రీష్మ ఋతువులో నొకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో నుండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకొనిపోయారు.

కౌశికుడు దుఃఖితుడు, అన్వేషకుడునై అతీర ప్రాంతకాంతారంలో తిరుగసాగాడు. దైవవశాన వీరుని పత్నీ కూతురూ కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలిదప్పులకు లోనై వనం నుండి బయటికి వచ్చి కలువకాడలు తినే ఉద్దేశ్యంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది.

ఇద్దరూ కాస్తముందుకి వెళ్ళేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకూ తన సోదరికీ ఆహారాన్ని అర్థించాడు. వారీ బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఈ పదార్థాలన్నీ వ్రతానికుద్దేశింప బడినవి.మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి. మీ కోరికలు తీరుతాయి అన్నారు.

ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దునీ విజయకి మంచి భర్తనీ కోరుకుని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడినుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు.

వీరునికి మొదటినుండీ తన కూతుర్ని పరమ ధర్మపరుడైన వానికి, యమధర్మ రాజంతవానికి, ఇచ్చి పెళ్ళి చెయ్యాలని వుండేది. పాపమతడా కోరిక తీరకుండానే మరణించాడు.

తరువాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మరల బుధాష్టమి వ్రతాన్ని గావించాడు. దైవమనుకూలించడంతో అచిరకాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు.

తన తండ్రి కోరికనే తానూ కోరికొరి మరల బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకొని ఆమెతో ”దేవీ నీవు నా గృహస్వామినివై నన్ననుగ్రహించు” అని ఆహ్వానించాడు.

అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి వుంటుంది. ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడ. అయినా ఒకనాడేమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోనికి చూచింది.

వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లియమపాశబద్ధురాలై నానాహింసలనూ అనుభవిస్తూ గోచరించింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది.

వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి పాశమునుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది.

అష్టమి తిథినాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోంచేస్తూ ఇలా ఒక యేడాది పాటు అన్ని అష్టమి దినాలలోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ ప్రతి ఇంద్రపదానికర్హుడౌతాడు.

ఈ వ్రతానికి సద్గతి వ్రతమని పేరు. పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్రవ్రతమని పేరు.

ఒక నెలలో రెండు అష్టములూ బుధవారాలనాడే పడితే ఆ ప్రతికిక ఎదురేలేదు. అతని సంపత్తి ఏనాటికీ తగ్గదు. ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి రెండు వేళ్ళను విడదీసి, మిగిలిన పిడికిలితో ఎనిమిది మార్లుబియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను వండుకొని తినాలి.

వ్రతసమాప్తి సమయంలో దానితో పాటు చింతపండునూ, కరేలువను ఆకు కూరనూ మామిడాకుల దోనెలో పెట్టుకొని తిని వ్రత కథను శ్రద్దగా విన్నవారి కన్ని కోరికలూ తీరతాయి..

నూట ఒకటవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment