Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట తొమ్మిదవ అధ్యాయం

రాహుగ్రహ చరిత్ర ఐదవ భాగము

మేఘహాసుడు తపస్సు తీవ్ర రూపం ధరించింది. అచిరకాలంలో ఫలించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.

“వత్సా ! వరం కోరుకో !” అన్నాడు శివుడు.

“పరమేశ్వరా ! నా తండ్రి రాహువుకూ , ఆయన సోదరుడు కేతువుకూ శరీరాలు పూర్వంలా ఉండేలా అనుగ్రహించు ! వాళ్ళ ప్రస్తుత దురవస్థకు కారకులైన ఆ శక్తులనూ , వాళ్ళకు సరితూగే స్థానాలనూ ఇద్దరికీ ప్రసాదించు !” సూర్యచంద్రులను మించిన మేఘహాసుడు చేతులు జోడించి అర్థించాడు.

“మేఘహాసా ! శ్రీమహావిష్ణువు చక్రాయుధంతో ఖండించబడిన దేహాలు రాహుకేతువులకు మళ్ళీ లభించడం అసంభవం ! అయితే నా అనుగ్రహం వల్ల వాళ్ళిద్దరూ ఇతరుల నేత్రాలకు పూర్ణ శరీరులుగా సర్వసాధారణమైన రూపాలున్నట్టుగా కనిపిస్తారు…”

“ధన్యోస్మి !” మేఘహాసుడు ఆనందంగా అన్నాడు.

“ఇంక నువ్వు కోరిన రెండవ వరం యథాతంగా ప్రసాదిస్తున్నాను !” శివుడు చెయ్యెత్తి దీవించి , అదృశ్యమయ్యాడు.

ఆశ్రమంలోకి నడిచి వస్తున్న రాహువునూ , కేతువును చూస్తూ వాళ్ళ పత్నులు సింహిదేవీ , చిత్రలేఖా ఆశ్చర్యానందాలతో అరిచారు.

“నా బిడ్డ తపస్సు ఫలించింది !” అంటూ ఆనందబాష్పాలు కార్చింది సింహిదేవి.

“మేఘహాసుడు నాకు కూడా బిడ్డడే సోదరీ ! నేనూ , నా భర్తా మేఘహాసుడి రుణం తీర్చుకోలేం !” చిత్రలేఖ కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది.

మేఘహాసుడు తిరిగి వచ్చాడు. పూర్ణ దేహులుగా కనిపిస్తున్న రాహుకేతువులను చూసి మహదానందం చెందాడు.

“తండ్రీ ! పినతండ్రీ ! మీ ఇద్దరికీ పరమశివుడు – సూర్యచంద్రులను మించిన శక్తులను ప్రసాదించాడు ! వాళ్ళతో సమానమైన స్థానాలు కూడా మీకు లభించేలా వరమిచ్చాడు !” మేఘహాసుడు ఉత్సాహంగా వివరించాడు.

“చాలా సంతోషం పుత్రా ! ఆ సూర్యచంద్రుల మీద ప్రతీకారం తీర్చుకుంటాం ! తద్వారా నీ రుణం తీర్చుకుంటాం !” అన్నాడు రాహువు.

సూర్యాస్తమయ సమయం. సంధ్యారాగం పడమటి ఆకాశానికి రంగులు అద్దుతోంది. రాహుకేతువులు నది గట్టు మీద కూర్చున్నారు. రాహువు చూపులు అస్తమిస్తున్న సూర్యుడి మీదే ఉన్నాయి. సూర్యబింబాన్ని చూస్తున్న రాహువు ముఖం ఎర్రగా మారుతోంది. అతనిలో రగులుతున్న ప్రతీకారాగ్నిని ప్రదర్శిస్తున్నట్టు.

“కేతూ… సూర్యుడి మీద పగ తీర్చుకోవాలి ! రేపే !” రాహువు సాలోచనగా అన్నాడు.

“ఏ విధంగా అన్నా ?” కేతువు అడిగాడు.

“పరమశివుడు మనకు అనేక శక్తులు అనుగ్రహించాడు కద ! లోకం కంటికి తాను కనిపించకుండా , తన కంటికి లోకం కనిపించకుండా చేయాలి. అమృతం మ్రింగకుండా అడ్డుకున్నందుకు ఆ సూర్యుణ్ణి మ్రింగాలి !” రాహువు కసిగా అన్నాడు.

“అద్భుతమైన ఆలోచన ! తగిన ప్రతీకారం !” కేతువు ఉత్సాహంగా అన్నాడు. సూర్యుడు అస్తమించాడు. మసక చీకట్లు ఆవరిస్తున్నాయి. రాహుకేతువులు అలాగే కూర్చుండిపోయారు. ఇద్దరిలోనూ ఒకే రకమైన ప్రతీకార వాంఛ పడగలెత్తుతోంది.

“అన్నా ! ఒక సందేహం…మ్రింగివేసి , జీర్ణం చేసుకోవాలా ? జీర్ణమవుతాడా సూర్యుడు ?” కేతువు చాలా సేపటికి ప్రశ్నించాడు.

రాహువు తల అడ్డంగా ఆడించాడు. “మ్రింగి , అరగదీసుకోవడం కాదు ! అది అంత గొప్ప శిక్షకాదు. ఆ సూర్యుడు నిత్య యాతన అనుభవించాలి. పగటి శిక్ష ! సూర్యుడి ప్రతాపం కేవలం పగలే కద ! పగలు కబళించడం , రాత్రికి కక్కివేయడం !”

“బాగుంది ! చాలా బాగుంది !” కేతువు ఉత్సాహంగా అన్నాడు. “సూర్యుడి సంగతి. సరే ! మరి చంద్రుడో ?” అప్పుడే పడమటి దిక్కున తొంగిచూస్తున్న చంద్రుడిని చూస్తూ. అడిగాడు కేతువు.

“సూర్యుడికీ , చంద్రుడికీ ఇద్దరికీ ఒకే శిక్ష ! సూర్యుణ్ణి పగలూ , చంద్రుణ్ణి రాత్రీ కబళిస్తూ కసి తీర్చుకుందాం !”

“అయితే ఇద్దరమూ , ఇద్దరినీ మార్చి మార్చీ కబళిస్తూ మన శక్తిని చూపుదాం !” కేతువు అన్నాడు.

“సూర్యుణ్ణి నేను మ్రింగుతా ! చంద్రుణ్ణి నువ్వు మ్రింగు !” అంటూ పైకి లేచాడు.

“అమృతపానం చేయకుండా అడ్డుకున్న పాపానికి , ఆ సూర్యచంద్రులిద్దరూ శిక్ష అనుభవించాలి ! శాశ్వతంగా !” కేతువు పళ్ళు కొరికాడు.

“మన వదన గహ్వరాలలో ఉక్కిరిబిక్కిరవుతూ !” రాహువు సగర్వంగా అన్నాడు.

నదీజలాలలో నిలుచుని సంధ్యావందనం చేస్తున్న కశ్యప ప్రజాపతి , సూర్యకాంతి క్రమంగా తగ్గుతూ ఉండటాన్ని గమనించి , ఆశ్చర్యపోతూ , సూర్యబింబం వైపు చూశాడు… సూర్యబింబాన్ని ఏదో చీకటి కొద్ది కొద్దిగా కప్పేస్తోంది. ఆయన చూస్తూ ఉండగానే సూర్యబింబం అంతర్థానమై పోయింది. తక్షణం వేడిమీ , వెలుగూ కూడా మాయమై పోయాయి. పట్టపగలు ఆవరించిన అకాల తిమిరం ఆయనను కలవర పెట్టింది. చీకటి రాత్రిలో నడుస్తున్నట్టు , ఆశ్రమం వైపు నడవసాగాడు కశ్యపప్రజాపతి.

అకస్మాత్తుగా సంభవించిన సూర్యుడి అంతర్థానం ఒక్క కశ్యప ప్రజాపతినే కాదు , ముల్లోకాలనూ ఆశ్చర్యాంధకారసాగరంలో ముంచి వేసింది. సూర్యుడి అంతర్ధానంతో లోకాలలో కాలం స్తంభించినట్లైపోయింది. సూర్య కిరణాల స్పర్శతో వికసించిన తామరలు , చీకటి అలుముకోవడంతో ముఖాలు ముడుచుకున్నాయి. ప్రాణులన్నీ దైనిక కార్యక్రమాలు మానివేశాయి.

కశ్యపాశ్రమంలో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. సింహిక , దనూదేవి , సింహిదేవి , చిత్రలేఖల ఆశ్చర్యం కొద్దిసేపట్లో ఆనందంగా మారిపోయింది ! సూర్యుడి అంతర్థానానికి కారణమేమిటో కేతువు పరమానందంగా ఆ నలుగురికీ వివరించాడు !

ఉత్సాహంతో వాళ్ళు చెప్పుకుంటున్న మాటల ద్వారా సూర్యుడిని రాహువు కబళించి వేశాడని అదితికి తెలిసిపోయింది. అదితి వెంటనే కశ్యపుడికి విషయం చెప్పి , రాహువు పట్టు నుంచి సూర్యుణ్ణి విముక్తుణ్ణి చేయమని ప్రార్ధించింది. అదితి కన్నీళ్ళు చూసి కశ్యపప్రజాపతి నిట్టూర్చాడు.

“నీవు కోరుతోంది నా శక్తికి మించిన కార్యం ! నా చేతికి అందని పని ! నాకు తెలుసు అదితీ ! ఇది ఈ ఒక్క రోజుతో ముగిసిపోయే అవాంతరం కాదు , రాహువూ , కేతువూ ఇద్దరూ సూర్యుడి మీద పగ తీర్చుకుంటూనే ఉంటారు !” కశ్యప మహర్షి నిస్సహాయంగా అన్నాడు. “మన రాహుకేతువులది రాక్షసగణం , రాక్షసగుణం ! పగ తీర్చుకుంటూనే ఉంటారు !”

“అయితే లోకాలకు వేడిమీ , వెలుగూ ప్రసాదించే…” అదితి ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కశ్యపుడు ఆమెకు చిరునవ్వుతో అడ్డు తగిలాడు. “లోకాలకు వేడిమినీ , వెలుగునూ ప్రసాదించే సూర్యుణ్ణి నీకు ప్రసాదించిన జగజ్జనకుడున్నాడుగా , అదితీ ! ఆయనే చూసుకుంటాడు అన్నీ !”

రాత్రి సమీపించింది. రాహువు తన ”గ్రహణ బంధం” నుండి సూర్యుణ్ణి విడిచి పెట్టాడు. సగర్వంగా నవ్వుతూ చూశాడు. సూర్యుడు నీరసంగా , మత్తుగా అగుపిస్తున్నాడు.

“ఒక్కసారి మమ్మల్ని విష్ణుచక్రానికి బలిచేశావు ! ఒక్కసారే ! కానీ మా ప్రతీకార కార్యక్రమం అనునిత్యమూ కొనసాగుతూనే ఉంటుంది !” రాహువు గర్వంగా అన్నాడు.

“ఈ రాహుకేతువులు నిన్ను శిక్షిస్తూనే ఉంటారు !”

రాహువు వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు…

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment