శ్రవణద్వాదశి వ్రతం
(నక్షత్రాల పేర్లనూ, తిథుల పేర్లనూ స్త్రీ లింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు.
ప్రాణులకు భోగమునూ మోక్షాన్నీ కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రం ఈ మూడూ యోగించిన రోజును విజయతిథి అంటారు.
ఈ రోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకూ అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ రోజు ఏకభుక్తం, నక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్నదనం ఏది చేసినా దానికి అనంత పుణ్యం ప్రతికి లభిస్తుంది.
నియమమేమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్యభాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాతిపై నూరిన పదార్థాలు వీటన్నిటినీ – విసర్జించాలి. పెసర వంటి పప్పుధాన్యాలనూ విసర్జించాలి.
భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రం కలిసి ఒకేరోజు పడినపుడు అది గొప్ప మహత్తు గల దినమౌతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్పఫలప్రదము ఆవుతుంది. ఈ రోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసిన వారికి మహనీయ ఫలాలబ్బుతాయి. ఈ రోజు వామన రూపియైన భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణకుంభంపై రెండు తెల్లటి వస్త్రాలను కప్పి దానిపై నుంచి ఛత్ర, పాదరక్ష సమన్వితం చేసి పూజించాలి.
ఈ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామి వారి ఆయా అంగాలను అర్చించాలి.
ఓం నమో వాసుదేవాయ – శిరస్సు
ఓం శ్రీధరాయ నమః ముఖమండలం
ఓం కృష్ణాయ నమః – కంఠం
ఓం శ్రీ పతయే నమః – వక్షఃస్థలం
ఓం సర్వాస్తధారిణే నమః – భుజాలు
ఓం వ్యాపకాయ నమః – కుక్షి ప్రదేశం
ఓం కేశవాయ నమః – ఉదరం
ఓం త్రైలోక్య పతయే నమః – గుహ్యస్థానం
ఓం సర్వభృతే నమః – జంఘలు
ఓం సర్వాత్మనే నమః – చరణాలు
నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. కుంభాలనూ కుడుములనూ కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగరం చెయ్యాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరల స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయననిలా ప్రార్థించాలి.
నమోనమస్తే గోవింద బుధశ్రవణ సంజ్ఞక ||
అమౌఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదోభవ ||
అనంతరం ప్రీయతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశలను దానం చేయాలి.
ఈ పూజకు నదీతటం ప్రశస్త స్థలం.
నూట మూడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹