రాహుగ్రహ చరిత్ర ఏడవ భాగము
“గురువు గారూ ! అరుణుడి జన్మ వృత్తాంతం మీరు మాకు వివరించలేదే !” చిదానందుడు అన్నాడు.
“ఇప్పటి దాకా ఆ పాత్రతో మన కథకు అవసరం కలగలేదు కదా ! అందుకని ఆయన గాథను అలా వదిలేశాను ! ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను , వినండి !” అన్నాడు నిర్వికల్పానంద.
“కశ్యప ప్రజాపతి పత్నులు వినతా , కద్రువా సంతాన వరం కోరిన విషయం మనం చెప్పుకున్నాం. కద్రువ వేయి మంది నాగ కుమారులను కోరితే , వినత మహా బలవంతులైన ఇద్దరు కుమారుల్ని కోరింది. కశ్యపుడు అనుగ్రహించాడు.
“కాల క్రమాన కద్రువ గర్భంలోంచి వేయి గ్రుడ్లు ఉద్భవించాయి. వినతకు రెండు అండాలు కలిగాయి. ఆ అండాలను నేతి కుండలలో నిలువ చేసి , రక్షిస్తూ ఉండమన్నాడు కశ్యప మహర్షి. కొంత కాలానికి కద్రువ భద్రపరచిన అండాలలోంచి వాసుకీ , శేషుడు , ఐరావతుడు , తక్షకుడు మొదలైన సర్పకుమారులు వెలికి వచ్చారు. వినత అండాలు అలాగే ఉండిపోయాయి !
“చెల్లెలికి కుమారులు కలిగి , తనకు కలగక పోవడంతో వినత విచారంతో క్రుంగిపోయింది. ఆత్రుతను చంపుకోలేకపోయింది. నేతి కుండలోంచి ఒక గ్రుడ్డును వెలికి తీసి , పడవేసింది. అందులోంచి తొడల నుండి క్రింది శరీర భాగం లేని వాడూ , పై శరీర భాగం మాత్రమే ఎదిగినవాడూ అయిన పుత్రుడు వెలువడ్డాడు. ఆ పుత్రుడే అరుణుడు ! ఊరువులు (తొడలు) లేనందు ”అనూరుడు” అని కూడా వ్యవహరించబడ్డాడు.
“పరిపూర్ణ దేహం వృద్ధి చెందక ముందే తాను ఉన్న గ్రుడ్డును విచ్ఛిన్నం చేసిన తల్లి వినత మీద అరుణుడు ఆగ్రహించాడు. తనను అంగవికలుడిగా చేసినందుకు సవతి కద్రువకు దాసిగా పడి ఉండమంటూ ఆమెను శపించాడు. రెండవ అండాన్ని అలాగే వదలమనీ , అందులోంచి మహాబలవంతుడైన తన తమ్ముడు జన్మిస్తాడనీ , ఆమెకు దాస్య విముక్తి కలిగిస్తాడనీ చెప్పి , విరక్తితో తల్లిని వదిలి అరుణుడు ఆకాశమార్గాన ఎటో వెళ్ళిపోయాడు !” నిర్వికల్పానంద అరుణుడి జన్మగాథ ముగించాడు.
“గురువు గారూ ! అనూరుడైన అరుణుడు వివాహం చేసుకోలేదా ?” విమలానందుడు అడిగాడు.
“శ్యేని” అనే స్త్రీని అరుణుడు భార్యగా స్వీకరించాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా కలిగారు. ఆ కుమారుల నామధేయాలు మీకు తెలుసు ? ఒకరు ”సంపాతి”, మరొకరు ”జటాయువు”! ఇద్దరూ రామాయణంలో పాత్రలే !”
“గురువు గారూ , వినత దాచిన రెండవ అండం ఏమైంది ?” సదానందుడు అడిగాడు.
అరుణుడు చెప్పిన ప్రకారం , వినత రెండవ అండాన్ని పూర్తిగా ఎదగనిచ్చింది. అందులోంచి బంగారు రంగులో ఉన్న పక్షి వెలికి వచ్చింది. ఆయనే గరుడుడు. తల్లికి దాస్య విముక్తి కలిగించాక ఆ గరుత్మంతుడు శ్రీమహావిష్ణువు వాహనంగా స్థిరపడ్డాడు” నిర్వికల్పానంద చెప్పాడు.
“ఇప్పుడు , మళ్ళీ మనం రాహు గాథలోకి వెళ్ళాలన్నమాట ! వినతాసుతుడైన అరుణుడిని సూర్యుడి ముందు స్థాపించమన్న శ్రీమహావిష్ణువు ఆదేశాన్ని పాటించిన బ్రహ్మ అరుణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు…”
తన ముందు సాక్షాత్కరించిన బ్రహ్మకు అరుణుడు పాదాభివందనం చేశాడు.
“సుఖీభవ !” అన్నాడు బ్రహ్మ దేవుడు దీవిస్తూ. “ఈ వికలాంగుడికి సుఖమెక్కడిది , స్వామీ ?” అరుణుడు దీనంగా నవ్వాడు.
“నీకు సుఖాన్నీ , గౌరవాన్నీ , ఆనందాన్నీ ఇచ్చే పదవి ఇవ్వడానికే వచ్చాను , అరుణా !” బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు.అరుణుడు కుతూహలంగా చూశాడు.
“నిన్ను సూర్యుడి ముందు , ఆయన రథం మీద కూర్చుండబెట్టమని శ్రీమహావిష్ణు దేవుడు నన్ను ఆజ్ఞాపించారు ! నేను నిన్ను సూర్య రథసారధిగా నియమిస్తున్నాను !” అరుణుడు ఆశ్చర్యంగా అన్నాడు. “కారణం తెలుసుకోవచ్చునా , నేను ?”
“స్వామీ !” రాహువు సూర్యుడిని కబళించడం ప్రారంభించాడు. అతగాడిని అడ్డుకోవడానికి సూర్యుడు తన వేడిమిని భయంకర స్థాయికి పెంచుకున్నాడు. ఫలితంగా లోకాలూ , లోకస్థులూ అల్లాడిపోతున్నారు. సూర్య తాపాన్ని నిరోధించే శక్తి నీ శరీరానికి ఉంది ! అందుకే కోరుతున్నాను !
మీ కోరికను… ”శిరోధార్యంగా ఒక వరంగా స్వీకరిస్తున్నాను ! ఆ సూర్యుడెవరు ? మా అదితి పెద్దమ్మ పుత్రుడే కద ! అన్నగారి రథానికి సారథి కావడం నా అదృష్టం కద ! మీ దయకు ధన్యవాదాలు !” అరుణుడు నమస్కరించాడు.
అరుణపత్ని శ్యేని వాళ్ళను సమీపించి , బ్రహ్మ దేవుడికి వినయంగా నమస్కరించింది.
“స్వామీ ! నా నాథుడిని మీరు కనికరించవచ్చు కదా ! ఆయనను సంపూర్ణ శరీరుడుగా చేసి , అంగవైకల్యాన్ని దూరం చేయవచ్చు కదా !” శ్యేని అభ్యర్థిస్తూ అంది.
బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. “సాధ్వీ ! నీ కోరిక న్యాయసమ్మతమైందే ! అన్నీ ఉన్న వ్యక్తి సాధించే విజయం విజయం కాదు ! అంగవైకల్యం శాపం కాదనీ , అది సాధనకు అడ్డం రాదనీ , వికలాంగుడు కూడా విశిష్ట స్థానాన్ని అందుకోగలడనీ నీ భర్త అరుణుడు తన వ్యక్తిత్వంతో లోకాలకు చాటుతాడు ! అతడు ఇచ్చే స్ఫూర్తి ప్రాణులకు అవసరం !”
“మీ సంకల్పమే మా భాగ్యం !” అంది శ్యేని. “అరుణా ! ఇదిగో నా చేతిని పట్టుకో , నాయనా !” అన్నాడు బ్రహ్మ. అరుణుడు ఆయన చేతిని పట్టుకున్నాడు. మరుక్షణం ఇద్దరూ అదృశ్యమయ్యారు.
సూర్యుడు మందిరంలోంచి ఇవతలకి వచ్చాడు. రథం వైపు నడుస్తూ తన వేడిమిని పెంచసాగాడు. రథం వద్ద ఆగిన సూర్యుడు తన ముందు ప్రత్యక్షమైన ఇద్దర్నీ ఆశ్చర్యంగా చూశాడు. సృష్టికర్త బ్రహ్మ , ఆయన చేతిని పట్టుకున్న అసంపూర్ణ శరీరుడైన వ్యక్తి ! సూర్యుడు బ్రహ్మకు అభివాదం చేశాడు. బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు.
“సూర్యా ! ఇతను అరుణుడు… నీకు తమ్ముడే…” బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు.
“తమ్ముడా !” సూర్యుడు ఆశ్చర్యంగా అరుణిడిని చూస్తూ అన్నాడు.
“ఔను సోదరా ! నేను మీ పినతల్లి వినతాదేవి కుమారుణ్ణి ! నన్ను ”అరుణుడు” అనీ , ”అనూరుడు” అనీ అంటారు…” అంటూ అరుణుడు సూర్యుడికి నమస్కరించాడు.సూర్యుడు అరుణుడిని దగ్గరకు తీసుకున్నాడు.
“సూర్యా , సింహికేయుడైన రాహువుతో , కేతువుతో నీకు గ్రహణ ప్రమాదం ఉంది. అత్యధికమైన వేడిమితో నువ్వు నీకు రక్షణ కవచం కల్పించుకున్నావు. అయితే నీ మహాతాపం లోకాలను తల్లడిల్లజేస్తోంది. నీ విశేషతాపాన్ని నియంత్రించి , అవసరమైనంత వేడిమిని లోకాలకు అందేలా చేసే శక్తి , ఇదిగో , నీ సోదరుడైన అరుణుడికి ఉంది. అరుణుడిని నీ ముందు , నీ సారథిగా కూర్చోబెట్టుతున్నాను. అరుణుడిని సారథిగా స్వీకరించు !” బ్రహ్మ వివరించాడు.
సూర్యుడు చేతులు జోడించాడు. “మహా ప్రసాదం !” బ్రహ్మ సూచనతో సూర్యుడు అరుణుడిని తన రథం మీద సారథిగా కూర్చోబెట్టుకున్నాడు. అరుణుడు అడ్డుగా ఉన్న కారణంతో – సూర్య కాంతిలో అధికోష్ణం పరిమితమైపోయింది. బ్రహ్మ చిరునవ్వుతో ఇద్దర్నీ దీవిస్తున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹