Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ఐదవ అధ్యాయం

సూర్య వంశవర్ణన

రుద్రదేవా! ఇక భరతఖండాన్ని ఏలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను.

విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ఠ భాగము నుండి. దక్షప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వతమనువు జనించారు.

మనువునకు తొమ్మండుగురు కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, ధృష్ట, పృషధ్రుడు, నరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు (కరషుడు).

మనువుకు ఇల యను కూతురూ, సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజూ, సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గాయకులయిన పుత్రులూ జనించారు.

గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు వృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్స ప్రీతి, అతనికి పాంశుఖ నిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింశుడు. అతనికి వివింశకుడు కలిగారు.

వివింశకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిష్యంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు.

బంధుమానుని వంశంలో వరుసక్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృంజయుడు, సహదేవుడు. కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు.

వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది.

వైవస్వత మనుపుత్రుడు శర్యాతికి సుకన్యయను కూతురు పుట్టింది. ఆమె చ్యవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి.

వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి ధార్ఘ నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబరిష, విరూప, పృషదక్ష (శ్వ రధీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు.

మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని ముగ్గురు కొడుకులు. వికుక్షి యజ్ఞేయశశకము(కుందేలు)ను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుత్రుడు. ఈ రెండవవాని కొడుకు వేనుడను పేరు గల అనేనసుడు. ఆతని పుత్రుడే విష్ణువు అంశగల పృథుచక్రవర్తి.

ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదశ్వుడు, కువలాశ్వుడు, ధృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు.

మాంధాతకు అతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరిషుడు పురుకుత్సుడు అను ముగ్గురు కొడుకులూ, యాభైమంది కూతుళ్ళూ పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు.

అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యువను పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వశ్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరతుడు (త్రిశంకువు) హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు.

సగరునికి సుమతి అను పత్ని ద్వారా అరవైవేలమంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి, కొట్టిన పాపానికి, వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు.

సగరుని రెండవపత్ని కేశినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు,ఆయనకు భగీరధుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు.

ఆయననుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శ్రుతుడు, నాభాగుడు, అంబరిషుడు, సింధుద్వీపుడు,అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు (మిత్ర సహుడు) కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.

శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు, భరతునికి తార పుష్కరులూ, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులూ, శత్రుఘ్నునికి సుబాహు శూరసేనులూ జనించారు. కుశమహా రాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది.

కుశుడు, అతిధి, నిషధుడు, నలుడు, నభస్సు (సభుడు) పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దలుడు, చలుడు, ఉక్తుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు,సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుకుడు, మహావీర్యుడు, సుధృతి, ధృష్టకేతువు, హర్యశ్వుడు, మరుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడు.

సీరధ్వజునికి సీత యను పేరుగల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. సీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతద్యుమ్నుడు, శుచి, ఊర్జుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజిత్తు, ఆధినేమికుడు, శ్రుతాయువు సుపార్శ్వుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహులాశ్వుడు, కృతి, జనకుడు రాజులైనారు.

ఈ జనక మహారాజు రెండు వంశాలవాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగమార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు.

నూట ఐదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment