రాహుగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము
ఉన్నట్టుండి సూర్య తాపం తగ్గుముఖం పట్టడం రాహుకేతువులను ఆశ్చర్యానికి గురి చేసింది.
“సోదరా ! వాతావరణం మనకు అనుకూలించినట్టుంది ! సూర్యుడిని కబళించేద్దాం.” కేతువు ఉత్సాహంగా అన్నాడు.
“పద ! ఏం జరిగిందో , ఏం చేయగలమో చూద్దాం !” అన్నాడు రాహువు…
రాహువు , కేతువూ సూర్యుడు ప్రయాణం చేసే క్రాంతి పథం సమీపాన మేఘాల చాటున నక్కి , దాక్కుని , వేచి చూస్తున్నారు.
కాస్సేపట్లో సూర్య రథం వాళ్ళ దగ్గరగా వెళ్తుంది. సూర్యుడి ముందు , అతనికి అడ్డుగా కూర్చుని , రథం తోలుతున్న వికలాంగుడిని చూస్తూ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
సారథిగా ఉన్న ఆ వ్యక్తి వల్ల సూర్యరశ్మిలో ఉష్ణోగ్రత తగ్గుతోందని వాళ్ళకు అర్థమైపోయింది.
“అన్నా ! నువ్వొకర్నీ , నేనొకర్నీ మింగేద్దాం !” కేతువు ఉత్సాహంగా అన్నాడు.
రాహువు అతన్ని వారించాడు. “ఆ సారథి క్షేమంగా ఉండాలి కేతూ ! అతని వల్లే భయంకరమైన వేడి తగ్గింది. లోకాలతో బాటు మనమూ క్షేమంగా ఉండాలంటే , సమయం చూసి సూర్యుడిని కబళించాలంటే , మన గర్భశత్రువు నిప్పులు చెరగకుండా ఉండాలి !”
“ఈ సారి సూర్యుణ్ణి నేను స్వాహా చేయాలన్నా ! ఎప్పుడు ? ఎప్పుడు చేయమంటావో చెప్పు !” కేతువు అడిగాడు , కసిగా.
“ఒక పని చేద్దాం !” రాహువు సాలోచనగా అన్నాడు. “ఒకసారి ఆ సూర్యుడికి కనిపించి , మనం అప్రమత్తంగా ఉన్నామనీ , అవకాశం కోసం నిరీక్షిస్తున్నామనీ చెప్పకనే చెబుదాం !”
అంటూ రాహువు మేఘాల చాటు నుండి వెలికి వచ్చాడు. కేతువు రాహువు వెంట కదిలాడు. సూర్యరథం దగ్గరగా వస్తోంది. ఇద్దరూ ఒక్కసారిగా దిక్కులు అదిరేలా వికటంగా నవ్వడం ప్రారంభించారు.
అరుణుడు అప్రయత్నంగా రథాన్ని ఆపి , తలతిప్పి చూశాడు. భయంకరంగా నోళ్ళు తెరిచి , చెవులు పగిలేలా నవ్వుతున్న రాహుకేతువులు అతనికి కనిపించారు.
అరుణుడు ఆశ్చర్యంతో సూర్యుడి వైపు తల ఎత్తి చూశాడు.
“అరుణా ! రథాన్ని పోనీ ! ఆపకు!” సూర్యుడు అరుణుడి వైపు చూడకుండానే అన్నాడు.
“అగ్రజా… వాళ్ళు…” అరుణుడు రథాన్ని పోనిస్తూ అన్నాడు.
“మన తండ్రిగారి తనయులే ! అంతా వివరంగా చెప్తాను , పద !” సూర్యుడు రాహువునీ , కేతువునీ చూస్తూ అన్నాడు.
కశ్యప ప్రజాపతీ , అదితీ , వినతా , కద్రువా ఆశ్రమ ప్రాంగణంలో నిలుచుని సూర్యుణ్ణి ఆనందంగా చూస్తున్నారు. పరిమితమైన వేడిని ప్రసరిస్తున్న సూర్యుడిని కశ్యపుడు మెచ్చుకున్నాడు. అదితి మాట్లాడుతూ,”స్వామీ ! సూర్యుడు తన అధిక తాపాన్ని తగ్గించుకున్నాడు.”
“లోకహితకారి కదా , నీ పుత్రుడు !” కశ్యప మహర్షి చిరునవ్వు నవ్వాడు.
“అది కాదు. స్వామీ ! వేడిమి తగ్గడంతో మన రాహుకేతువులు మళ్ళీ సూర్యుడి మీదకు విజృంభిస్తారేమో అని నాకు భయంగా ఉంది స్వామీ…” అదితి ఆందోళనతో అంది.
“నారాయణ !” అంటూ నారదమహర్షి వాళ్ళ వైపు నడుస్తున్నాడు. “ఆ భయం అవసరం లేదు , సాధ్వీ ! సూర్యుడు తన ప్రచండ తాపాన్ని ఉపసంహరించలేదు ! శ్రీమహావిష్ణువు ఆనతి ప్రకారం , చతుర్ముఖ బ్రహ్మ సూర్యుడి ముందు సారథిగా ఒక శక్తివంతుడిని కూర్చోబెట్టారు ! ఆ సారథి తాపాన్ని తగ్గిస్తూ సూర్యకాంతిని లోకాలకు అందిస్తున్నాడు !” నారదుడు అదితితో అన్నాడు.
“అలాగా ! చల్లటి వార్త తెచ్చారు ! ఇంతకూ , శక్తిమంతుడైన ఆ మహాత్ముడు ఎవరు మునీంద్రా ?” కశ్యపుడు కుతూహలంగా అడిగాడు.
“ఆ మహాత్ముడు , ఈ మహాత్ముడి కుమారుడే !” నారదుడు కశ్యపప్రజాపతిని చూస్తూ అన్నాడు.
“నిజమా?!”
“ఆ ! ఇదిగో – ఈ వినతాదేవి గర్భాన అర్థ శరీరంతో పుట్టిన అరుణుడు !” నారదుడు నవ్వుతూ అన్నాడు.
అదితీ , ఆమె సోదరీమణులూ , కశ్యపుడూ – అందరూ ఆశ్చర్యంగా చూశారు.
“నిజమా ? నా బిడ్డ సూర్యుడికి , తన అగ్రజుడికి సారథి అయ్యాడా ?” వినత గాద్గదికంగా అడిగింది.
“ఔను తల్లీ ! అంగవికలుడైన నీ అరుణుడు , నిజంగా అదృష్టవంతుడు !” నారదుడు అన్నాడు.
వినత కన్నీళ్ళు తుడుచుకుంది. “నా బిడ్డ పూర్ణశరీరుడు కాకుండా , అడ్డుకుని అన్యాయం చేశాను. నా అరుణుడిని చేతులారా అనూరుడిగా , తొడలు లేని వికలాంగుడిగా చేశాను. ఆ పరమాత్ముడు నా బిడ్డడికి న్యాయం చేశాడు !”
“నువ్వు అదృష్టవంతురాలివి , వినతా ! ఒక కొడుకు విష్ణువుకు వాహనమయ్యాడు ! ఒక కొడుకు సూర్యరథ సారథి అయ్యాడు !” కశ్యపుడు మెప్పుగా అన్నాడు.
“మరొక అద్భుతం తెలుసా , మీకు ? ప్రతీ ఉదయం లోకాలన్నీ సూర్యుడి కన్నా ముందుగా అరుణుడి దర్శనం చేసుకుంటాయి ! సూర్యోదయానికి ముందుగా , నాందిగా అరుణోదయం !” నారదుడు నవ్వుతూ అన్నాడు.
సింహికా , దనూ , సింహిదేవి , చిత్రలేఖా , మేఘహాసుడూ ఒక చోట సమావేశ మయ్యారు. తమ భర్తకూ , అదితీ వినతలకూ నారదమహర్షి చెప్పిందంతా చాటు నుండి విన్న దను వైనతేయుడైన అరుణుడు సూర్యుడి సారథిగా నియమించబడిన విషయం వివరించి చెప్పింది వాళ్ళకు.
“ఆ విష్ణువు – మన బిడ్డల మధ్యే శతృత్వం నింపుతున్నాడు !” సింహిక ఉక్రోషంతో అంది.
“ఔను ! శరీరాలు కోల్పోయిన రాహువూ కేతువూ వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళ సవతి సోదరుడు అరుణుడిని అడ్డుగా ఉంచాడు !” దను అంది.
“అయితే ఇక మా భర్తలు ఆ సూర్యచంద్రుల మీద పగ తీర్చుకోలేరా , అత్తగారూ ?” సింహిక అడిగింది.
“ఎందుకు తీర్చుకోలేం , సింహీ !” అంటూ అక్కడికి వచ్చాడు రాహువు. కేతువు అతడిని అంటిపెట్టుకునే ఉన్నాడు.
“అరుణుడు ఉన్నా , లేకున్నా మా పగ చల్లారదు. మా పంతం సడలిపోదు !” కేతువు సగర్వంగా అన్నాడు.
“ఔను ! తండ్రిగారికీ , పినతండ్రిగారికీ పరమేశ్వరుడి వరాలను ఆయుధాలుగా ఆర్జించి ఇచ్చాను గద !” మేఘహాసుడు గుర్తు చేశాడు.
“మేఘహాసుడు చక్కగా చెప్పాడు. మాది తిరుగులేని శక్తి ! ఇప్పుడు అనూరుడి వల్ల సూర్యుడి ఉష్ణం తగ్గింది. మాటు వేసి , సమయం చూసి , సూర్యుడిని త్వరలో – అతి త్వరలో కబళిస్తాను !” రాహువు కంఠంలో పట్టుదలా , పగా జంటగా ధ్వనించాయి.
“అడ్డుగా ఆ అనూరుడున్నాడు కద !” సింహిదేవి ఉక్రోషంగా అంది. “అతడికి ఏమైనా అయితే , అత్తగారు వినతాదేవి బాధపడుతారు కద ?”
“అనూరుడికి ఏమీ కాదు దేవీ ! పాపం అనూరుడు కాళ్ళు లేని వాడు. అతనికి అపకారం జరగనివ్వను. అతను అడ్డుగా ఉన్నప్పుడే నేను సూర్యుడిని సమీపించగలను !” రాహువు అన్నాడు. “సమీపించాక , ఒక్కసారి నా వదనకుహరంలోకి లాగితే , ఇక సూర్యుడి తాపం మాయమైపోతుంది ! అతడు భానుడైతే , నేను స్వర్భానువును ! పరమశివుడి వరం ఉండనే ఉంది !”
“నాథా ! మీ సోదరులిద్దరూ సూర్యచంద్రులను పంచుకుంటున్నారా , పగ తీర్చుకోవడానికి ?” కేతువు భార్య చిత్రలేఖ ప్రశ్నించింది.
కేతువు వికటంగా నవ్వాడు. “ఆ ఇద్దరి మీదా , మా ఇద్దరికీ పగ ఉంది ! ఇద్దరం రగిలిపోతున్నాం , ప్రతీకార వాంఛతో ! ఇద్దరమూ ఇద్దరినీ కబళిస్తూ , ఎప్పుడు ఎవరు ఎవరిని ముట్టడిస్తారో ఊహించలేని నిస్సహాయ స్థితిలో పడవేస్తాం, ఆదిత్యుడిని!”.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹