Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ఆరవ అధ్యాయం

చంద్రవంశ వర్ణన

శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. “నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి ఆయననుండి చంద్రుడు ప్రాదుర్భవించారు.

చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా ఆరుగురు పుత్రులు కలిగారు. వారు శ్రుతాత్మక, విశ్వావసు, శతాయు, ఆయు, ధీమాన్, అమావసులు.

అమావసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బలాకాశ్వ, కుశులుద్భవించారు. కుశునికి నలుగురు కొడుకులు వారు కుశాశ్వ కుశనాభ వసు అమూర్తరయులు.

కుశాశ్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయునగు విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్చంది అనేక పుత్రులు కలిగారు. గాధి తన కూతురైన సత్యవతిని ఋచీకుడను బ్రాహ్మణోత్తమునకిచ్చి పెండ్లి చేశాడు. ఋచీక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు.

బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన, రాజి, క్షత్ర వృద్ధ, రంభకులు. క్షత్ర వృద్ధ (వృద్ధి) పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాశ్య, కాశ, గృత్స మదులని ముగ్గురు తనయులు. గృత్సమదుని కొడుకే శౌనకుడు.

కాశ్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. ఆతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరథ, దివోదాస, ప్రతర్దను లుదయించారు. ప్రతర్దనునే శత్రుజిత్తని కూడా అంటారు.

శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, విభు, సువిభు, సుకుమార, ధృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు.

నహుష పుత్రుడైన రాజి లేదా రజికి అయిదువందల మంది కొడుకులు పుట్టారు. కానీ వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుష పుత్రుడైన క్షేత్ర వృద్ధుని వంశం వర్ధిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అదీన జయత్సేన, సంకృతి క్షత్ర ధర్ములు. ఇది నహషుని ఒక వంశం.

నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో అయిదుగురు కుమారులున్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ట ద్వారా యయాతికి ద్రుహ్యు, అను, పురునామకులైన తనయులు జనించారు.

యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహైహయులు జనించారు. హయునికి అనరణ్యుడూ. హైహయునికి ధర్ముడూ పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి (కుంతుడు), సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్దముడు వర్ధిల్లారు.

దుర్దముని కారుగురు కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు, అతని పుత్రుడు శూరసేనుడు.

కృతవీర్యునికి అర్జునుడే కాక, ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాలజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్టి. ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు.

క్రోష్టు వంశంలో క్రమంగా విజజ్జివాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశ బిందువులు జనించారు. ఈ శశబిందునికి లక్షమంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన,పృథుశ్రవాది పదిలక్షలమంది శ్రేష్ఠులైన పుత్రులుదయించారు.

పృథుశ్రవునికి పుత్రుడు, అతని కొడుకు ఉశనుడు, అతని పుత్రుడు శితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జ్యామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జ్యామఘుని కొడుకు పేరు విదర్భుడు.

విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా కథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు.రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి.

కౌశికుని వంశంలో ఋచి, చేది, కుంతి, వృష్టి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాన్ (దేవనత) దేవక్షత్ర, మధు, కురువంశ, అను పురుహోత్ర, అంశు, సత్త్వ శ్రుత, సాత్వతులు రాజులైనారు.

సాత్వతుని కేడుగురు కొడుకులు. వారు భజినుడు, భజమానుడు, అంధకుడు, మహా భోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమానుని కొడుకుల పేర్లు నిమి, వృష్టి, అయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి.

మహాభోజుని వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అశినులలో అనమిత్రుని ముగ్గురు కొడుకులయిన నిఘ్న, ప్రసేన, శిబిలలో శిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి, ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైజేయులంటారు.

అనమిత్రునికి వృష్టి, శ్వఫల్కుడు, చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు. శ్వఫల్కునికి గాందినియను పత్ని ద్వారా పరమ వైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు.

చిత్రకునికి పృథు, విపృథు, సాత్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు (దృష్టకుడు) జన్మించారు. ధృష్టుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు.

ఆహుకునికి ఆహుకియను కూతురూ దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా (వరమున) శ్రీకృష్ణపరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక ఆరుగురు కూతుళ్ళు కూడా కలిగారు. ఆయన తన సప్త కన్యలనూ వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవక పుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన ఇద్దరు కొడుకులు.

ఆహుకపుత్రుడైన ఉగ్రసేనునికి కంస, సునామ, వటాది అనేక పుత్రులు జనించారు. అంధక పుత్రుడైన భజమాను నందనుడు విదూరథుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు..

శూరునికైదుగురు కూతుళ్ళు కూడా పుట్టారు. వారుపృథ, శ్రుతదేవి, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారుముద్దుగా పెంచి పాండురాజుని కిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు.

తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడ పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడ. ఈమెను ”కుంతి” అని పిలిచేవారు.

ఈ కుంతి చెల్లెలు శ్రుతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్త్రుడు, శ్రుతకీర్తి కేకయ రాజుని పెండ్లాడి సతర్దనాది అయిదుగురు కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు, అనువిందులని ఇద్దరు కొడుకులు పుట్టారు. శ్రుతశ్రువ చేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు.

వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణపరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు, బలరామునికి రేవతి ద్వారా సారణ, శరాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉచార్య, భద్రసేన, ఋజు, భద్రదేవులను కంసుడు చంపేశాడు.

శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలమంది. కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు, ప్రద్యుమ్నపత్నికి మహాపరాక్రమశాలియైన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతి బాహువు, మనుమడు చారు (దత్తుడు) రాజ్యాలనేలారు.

యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు రుద్రదేవా! ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి.

యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, ఆరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు.

అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ, సృంజయ, పురంజయ, జనమేజయ, మహాశాల, ఉశీనర, శిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షు, రూషద్రథ,సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజు కైదుగురు కొడుకులు. వారే అంగ వంగ కళింగ, ఆంధ్ర, పౌండ్రులు.

అంగుని వంశంలో అపాన, దివిరథ, ధర్మరథ, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరథ, బృహత్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు.

రుద్రాది దేవతలారా! ఇక పురు వంశ వర్ణన వినండి.

పురువు, జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుద్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, ఋతేయు, రతినారుడు, ప్రతిరథుడు, మేధాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు (ఇతడే శకుంతల కొడుకు) వితథుడు, మన్యువు, నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు,శిని-వీరంతా పౌరవ వంశ వర్ధనులే. (రౌద్రాశ్వుని కేడుగురు కొడుకులు. వారి పేర్లు ఋతేయు, స్థండిలేయు, కక్షియు, కృతేయు, జలేయు, సంతతేయులు వీరంతా రాజశ్రేష్ఠులే)

భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుణి, వ్యూహక్షత్ర, సుహోత్ర, రాజన్యులుద్భవించారు. హస్తి, అజమీఢ, ద్విమీఢులు, సుహోత్రనందనులు. హస్తి కొడుకు పేరు పురుమీధుడు కాగా అజమీధుని కొడుకు కణ్వుడు, మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాణ్వాయన గోత్రమేర్పడింది.

అజమీడుని మరొక పుత్రుడైన బృహదిషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదిషుని వంశంలో క్రమంగా బృహద్ధను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాశ్వ, పృథుసేన, పార, నృప, సృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొకపుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విష్వక్సేనులు కూడా రాజ్యం చేశారు.

ద్విమీధుని వంశంలో క్రమంగా యవీనర, ధృతిమాన, సత్యధృతి, ధృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదూరథులు జనించారు.

అజమీధునికి పత్ని నళిని ద్వారా నీలమహారాజు ఉదయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యశ్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులునికైదుగురు కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరద్వానులు.

వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తి నవలంబించి పరమ వైష్ణవునిగా పేరు గాంచాడు. ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతి దేవకాంతయైన ఊర్వశి ద్వారా కృపాచార్యునీ, కృపినీ కన్నాడు. ఈ కృపినే భారతవీరుడు, గురుదేవుడునైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ.

దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చ్యవన, సుదాస, సౌదాస, సహదేవ,సోమక, జహ్ను, పృషత, ద్రుపద, ధృష్టద్యుమ్న, ధృష్టకేతులు జనించారు. అజమీఢుని పుత్రుడైన ఋక్షుని వంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్ధిల్లారు.

కురురాజుకి ముగ్గురు కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు. సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర చ్యవన, కృతక, ఉపరిచరవసువులు రాజులు కాగా ఉపరిచరవసువునకు బృహద్రథ, ప్రత్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు.

బృహద్రథుని వంశంలో కుశాగ్ర, ఋషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ, జహ్నులు దయించారు. బృహద్రధుని మరొకపుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి. అతని పుత్రులైన శ్రుతవంత, భీమసేన, ఉగ్రసేన, శ్రుతసేన, జనమేజయులుద్భ వించారు.

కురు మహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విదూరథ, సార్వభౌమ, జయసేన, అవధీత, అయుతాయు, అక్రోధన, అతిథి, ఋక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులుదయించగా ఆయనకు దేవాపి, శంతను, బాహ్లికులుదయించారు. బాహ్లికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు.

గంగ ద్వారా శంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్సకల ధర్మ స్వరూపుడు నగు దేవవ్రతుడు (భీష్ముడు) ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజయివుంటే చరిత్ర గతి మంచి వైపు మరలివుండేది. కాని శంతనుడు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు.

సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాసమహర్షి జన్మించియున్నాడు. ఆమెకి శంతనుని ద్వారా చిత్రాంగద, విచిత్ర వీర్యులు జనించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాసమహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్ళలో అంబికకు ధృతరాష్ట్రుడూ, అంబాలిక పాండురాజు జన్మించారు.

ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన దుశ్శాసనాది. నూరుగురు కొడుకులూ, పాండురాజుకి కుంతి, మాద్రియను పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులూ జనించారు. వీరికీ చాలామంది కొడుకులే పుట్టారు గానీ అంతా యుద్ధంలో పోయారు.

అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరిక్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని ”పరిక్షిత్” అన్నారు. అతని కొడుకు జనమేజయుడు..

నూట ఆరవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment