Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట పద్నాల్గవ అధ్యాయం

రాహుగ్రహ చరిత్ర పదవ భాగము

ఆహా ! త్రిమూర్తులకు మాట ఇచ్చిన విధంగా ఏడాదిలో తక్కువ పర్యాయాలు మాత్రం , తక్కువ సమయ వ్యవధానంతో సూర్య చంద్రులను గ్రహణం చేస్తూనే ఉన్నాడుగా !” నిర్వికల్పానంద సమాధానం చెప్పాడు.

“అమావాస్య నాటి పగలు సూర్యుడినీ , పూర్ణిమ నాటి రాత్రి చంద్రుడినీ గ్రహణం చేయాలని రాహుకేతువులిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ వివరాలు కేతువు చరిత్రలో చెప్పుకుందాం ! కేతువు రాహువుతో పాటు కశ్యపాశ్రమంలో పెరిగిన వాడనీ , క్షీరసాగర మథన సమయంలో రాహువులాగే , దేవతగా నటించి , శిరచ్ఛేదం చేయించుకున్నాడనీ చెప్పుకున్నాం… కేతువు గురించి మిగిలిన విషయాలు తెలుసుకుందాం…” నిర్వికల్పానంద ఉపోద్ఘాతంలాగా అన్నాడు.

“గురువు గారూ , కేతు గ్రహ చరిత్ర ఆకర్ణించే ముందు , ఆయన గురించిన కొన్ని ప్రాథమిక సందేహాలు తీర్చుకుంటే మంచిదనిపిస్తోంది” విమలానందుడు అన్నాడు.

“మంచిది… మంచిదే ! ఏమిటా ప్రాథమిక సందేహాలు , విమలానందా ?”

“కేతువు మృత్యువు నిశ్వాసంలోంచి పుట్టాడనీ , కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో పెరిగాడనీ మీరు చెప్పారు…”

“అందుకు కారణం కూడా అప్పుడే చెప్పానుగా , నాయనా !” నిర్వికల్పానంద అడ్డుతగుల్తూ అన్నాడు. “కారణం చెప్పుకుని , సమన్వయం చేసుకున్నాం కూడా !”

“నిజమే ! కానీ గురువు గారూ , క్షీరసాగర మథన సమయంలో రాహువు ఒక్కడే ఉన్నాడనీ , ఆయనొక్కడే దేవతగా వేషం మార్చి ఫలితంగా శిరచ్ఛేద శిక్ష అనుభవించాడనీ కొన్ని గ్రంథాల్లో ఉంది ! రాహువు తల రాహువుగానూ , ఆయన శరీరం కేతువుగానూ మారాయనీ ఆ గ్రంథాల ద్వారా తెలుస్తోంది…”

“నీ సందేహం చక్కగా అర్థమైంది నాయనా ! ఇంకొంచెం వివరించి , నీ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తా !” నిర్వికల్పానంద అన్నాడు.

“నవగ్రహ దేవతలలో ఒక్కడైన కేతువు ప్రస్తుతం ఆలయాలలో ఏ రూపంతో దర్శనమిస్తున్నాడు ? – అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక అవగాహనకు రావడం శ్రేయస్కరం. అలా చేస్తే ఆస్తికుల మనోభావాలనూ , నవగ్రహ ఆరాధకుల విశ్వాసాన్ని గౌరవించిన ఫలితం దక్కుతుంది.

ఇతర అష్టగ్రహాలలాగే , నవగ్రహమైన కేతువుకు ప్రత్యేకమైన , పరిపూర్ణమైన రూపం ఉంది ! ”రాహుకేతువులు ఛాయాగ్రహాలు” అని అనుకున్నప్పటికీ ఆ ఇద్దరికీ ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిత్వాలున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

కేతు గ్రహ రూపం ప్రత్యేకం. ఆరాధన ప్రత్యేకం , స్తోత్రం ప్రత్యేకం. కాంతి ప్రక్రియ ప్రత్యేకం. ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు ఆది నుండీ ఆ గ్రహ దేవతకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనుకోవడం అశాస్త్రీయం కాదు ! కొన్ని పురాణాలలో కేతువు ప్రత్యేకంగా ఆవిర్భవించినట్టుగా వివరించబడింది. విష్ణుధర్మోత్తర పురాణం , కేతువు రాహువులో భాగం కాదనీ , ప్రత్యేకంగా ఆవిర్భవించాడనీ చెప్తోంది. సాగర మథనం సమయంలో రాహువు , కేతువూ ఇద్దరూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారని స్కాందపురాణం చెప్తోంది. రంగనాథ రామాయణం కూడా ఆ వచనాన్నే బలపరుస్తూ – రాహుకేతువులు ఇద్దరూ ప్రత్యేక వ్యక్తిత్వాలున్న వాళ్ళనీ పేర్కొంది.

మానినీ రూపమై మధుమర్దనుండు తానమృతము బంచి తగనిచ్చువేళ రాహుకేతువులను రాక్షసులప్పు డూహించి పంక్తిలో నొగి గూరుచుండి..

అంటూ సాగే కథాంశంలో విష్ణువు చక్రాన్ని ప్రయోగించి ”శిరములు ఖండించి” వేశాడు అని వివరంగా ఉంది.

ఆలయాలలో ఇద్దరూ ఇద్దరుగా కొలువుదీరి అర్చనలు అందుకుంటున్న రాహుకేతువుల ఆవిర్భావంలోనూ , అభివృద్ధిలోనూ కూడా రెండు ప్రత్యేక గ్రహాలే అని మనం గ్రహించడం వాంఛనీయమే !” నిర్వికల్పానంద వివరించాడు.

“ఇప్పుడు మీరు సాధించిన సమన్వయం తార్కికంగా , తృప్తికరంగా ఉంది, గురువు గారూ !” శివానందుడు అన్నాడు.

“కాబట్టి ఆ సమన్వయాన్ని అనుసరించే ఇప్పటి దాకా మనం కేతుగాథ చెప్పుకున్నాం. ఇక ముందు కూడా అలాగే చెప్పుకుందాం ! రాహువు త్రిమూర్తులతో ఒడంబడిక చేసుకోవడం కశ్యపాశ్రమంలో అందరికీ నచ్చింది , ఒక్క కేతువుకు తప్ప…”

రేపటి నుండి కేతుగ్రహ చరిత్ర ప్రారంభం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment