Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట పదిహేనవ అధ్యాయం

కేతుగ్రహ చరిత్ర మొదటి భాగము

కేతువు ఆశ్రమం వెనుక తోటలో అసహనంగా తిరుగుతున్నాడు. సహజంగా మండుతున్న మంట రంగులో ఉండే అతని ముఖం ఇంకా అసహజంగా ఎర్రబడి భీతి గొలుపుతోంది. ఎర్రటి ముఖంలోంచి మరింత ఎర్రగా ఉన్న కళ్ళు కణకణలాడే నిప్పుకణాల్ని తలపిస్తున్నాయి.

త్రిమూర్తులతో జరిగిన ఒడంబడిక గురించి రాహువు విజయోత్సాహంతో చిలవలు పలవులుగా వర్ణించి చెప్పిన మాటలు కేతువు చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి. రాహువు ఆ త్రిమూర్తుల తియ్యటి మాటలకు పరవశించి పోయినట్టున్నాడు. లేకపోతే తమ తలలు తరిగివేయబడడానికి కారకులైన సూర్యచంద్రుల మీద రగిలిన పగను చల్లబరచుకుంటాడా ? తనతో శృతి కలుపుతూ చేసిన ప్రతిజ్ఞను మరిచిపోతాడా !

ఇంత జరిగాక ఎవరి దారి వారిది ! ఎవరి ప్రతిజ్ఞ వారిది ! ఎవరి పగ వారిది ! ఎవరి ప్రతీకారం వారిది ! అమృత మథన సమయంలో రాహువుకే కాదు ; కేతువుకే కాదు – సకల రాక్షస కులానికీ అన్యాయం జరిగింది. అందుకు ఆ దేవతలు తగిన శిక్షను అనుభవించాలి. రాహువు లేకుండా ఒంటరిగా ఈ కేతువే ఆ శిక్ష విధిస్తాడు. ఆ సూర్యచంద్రుల ద్వారా దేవతలందరికీ శిక్ష విధిస్తాడు !

పగలు సూర్యుడు ! రాత్రి చంద్రుడు కేతు గ్రహణంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతారు ! సూర్యుడు నెలలో ముప్ఫై పగళ్ళు శిక్ష అనుభవిస్తే , చంద్రుడు నెలలో పక్షం రాత్రులు – సగం రాత్రులు మాత్రమే శిక్ష అనుభవిస్తాడు. మిగిలిన పక్షం రోజులూ క్షీణించిపోయే వ్యాధితో ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు !

కేతువు తన ఆలోచనలకు తానే మురిసిపోతూ , అసంకల్పితంగా బిగ్గరగా నవ్వాడు !

“స్వామీ…” భార్య చిత్రలేఖ పిలుపు కేతువు అట్టహాసానికి అడ్డుపడింది.

నవ్వు ఆపి , అతను తిరిగి చూశాడు. చిత్రలేఖా , తల్లి దనూదేవి అతని వైపు వస్తున్నారు.

“కేతూ ! ఏమిటి నాయనా , నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ?” దనూదేవి అడిగింది.

“మీ కుమారుడు ఆనందం పట్టలేకుండా ఉన్నారు , అత్తగారూ , ఎందుకో !” చిత్రలేఖ నవ్వుతూ అంది.

అయితే కేతువు ముఖాన్నీ , కళ్ళనీ చూశాక నవ్వుకు కారణం ఆనందం కాదని వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది !

“వరాలు మూటగట్టుకుని , ప్రతిజ్ఞల్నీ , అవమానాలనూ విస్మరిస్తే – ఆనందం ఎక్కడుంటుందమ్మా ! నీ కొడుకు కడుపు రగిలిపోతోందమ్మా !”

“నాకు తెలుసు పుత్రా ! మీ తలలూ , తనువులూ వేరైపోయేలా , దేహాలు లేకుండా కేవలం తలలతో కృశించిపోయేలా జరగడానికి కారకులైన ఆ సూర్యచంద్రులను విస్మరించడం దారుణమైన చర్య. వాళ్ళకు శిక్ష విధించబడాలి ! మీకు పూర్వ వైభవం దక్కాలి !” దనూదేవి ఓదార్పుగా అంది.

“రాహువు బావగారు చేసుకున్న ఒడంబడిక ఉభయతారకంగా ఉంది , స్వామీ !”

“చిత్రలేఖా !” కేతువు గర్జించాడు. చిత్రలేఖా , దనూదేవి అదిరిపడి చూశారు.

“మన రాహువు ప్రలోభానికి లొంగిపోయాడు ! ప్రతిజ్ఞలను మరిచిపోయాడు !” కేతువు కంఠంలో ఆవేశం.

దనూదేవి కేతువును తదేకంగా చూసింది. “సరే… ఇప్పుడు నువ్వు ఏం చేయదలుచు కున్నావు ?”

“నా ప్రతీకార జ్వాలకు అనుదినమూ ఆ అదితేయుజ్జీ , ఆత్రేయుజ్జీ ఆహుతి చేస్తూనే ఉంటాను !” కేతువు భయంకరంగా అవుపిస్తున్న పళ్ళు కొరుక్కుంటూ అన్నాడు. చిత్రలేఖ ఆందోళనగా అత్తగారి వైపు చూసింది.

“దాని వల్ల ఏం జరుగుతుంది కేతూ ?” దనూదేవి ప్రశ్నించింది.

“ఏం జరుగుతుంది ? పగలు సూర్యుడు మాయం ! శుక్లపక్ష రాత్రులలో చంద్రుడు అంతర్ధానం !”

“బాగుంది ! దాని వల్ల లోకాలకు ఎంత నష్టమో , ఎంత కష్టమో ఆలోచించావా , పుత్రా ?”

“అమ్మా ! లోకాలతో నాకు అవసరం లేదు ! మా తలలు తెగి పడినప్పుడు ఏ లోకాలు ఏడ్చాయి ?”

“నువ్వు సూర్యుడిని కబళిస్తే , లోకాలన్నీ సూర్యరశ్మి లేకపోవడంతో చీకట్లో మునిగిపోతాయి. ప్రాణులకు ఆహారం ఉండదు…”

“ఆ పర్యవసానాలతో ఈ కేతువుకు పనిలేదమ్మా !”

“ఇంక – చంద్రుని కబళించడం వల్ల వెన్నెల వెలుగు ఉండదు. ఓషధులు చచ్చిపోతాయి. రోగులూ చచ్చిపోతారు !” దనూదేవి వినిపించుకోనట్టు అంది.

“అహ్హహ్హ ! నా ప్రతీకారానికి ఆ విధమైన , విశ్వవ్యాప్తమైన ప్రతిస్పందన కలగడం నాకు ఎంత సంతోషాన్నిస్తుందో నీకు తెలీదు !” కేతువు క్రూరంగా నవ్వాడు మళ్ళీ.

దనూదేవి చిన్నగా నవ్వింది. “పగలు సూర్యరశ్మి , రాత్రివేళల్లో చంద్రకాంతీ లోకానికే కాదు , మరి కొందరికీ కావాలి కదా , నాయనా ?”

“నాకు , నీ తండ్రిగారికీ , నా సోదరీమణులకు , నీ భార్యకు , నీ రాక్షసకులానికీ , చివరకు – నీకు ! నీకు కూడా ఎండా , వెన్నెలా అవసరం కేతూ ! ఆ సత్యాన్ని విస్మరించావా ?” దనూదేవి ప్రశ్న కేతువుకు చెంప పెట్టులా తాకింది.నోరు పూర్తిగా తెరిచి , చూస్తూండిపోయాడతను.

“అత్తగారు చెప్తోంది సత్యమే నాథా ! ఒక్క రోజు సూర్యరశ్మి లేకపోయేసరికి మన ఆశ్రమంలో అంతా నీరసించిపోయారు !” చిత్రలేఖ అనునయంగా అంది.

“నాయనా , కేతూ ! నువ్వు విస్మరించిన ఒక కఠిన సత్యం చెబుతాను , విను !” దనూదేవి సానుభూతి ధ్వనించే కంఠంతో అంది. “సూర్యచంద్రుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు ఆరోగ్యంగా జీవించాలి. నువ్వు జీవించడానికీ , ఆరోగ్యంగా జీవించడానికీ , నీకు సూర్యరశ్మి, చంద్రకాంతీ రెండూ అవసరమే !”

“అమ్మా…” కేతువు ఆశ్చర్యంగా అన్నాడు.

“ఒకరిని కష్టానికి గురిచేయాలంటే , నువ్వు సుఖంగా ఉండాలి కదా , పుత్రా !” దసూదేవి చిరునవ్వుతో అంది. “నిరంతరమూ సూర్యచంద్రుల కాంతి లేకుండా చేయడం నీకూ మంచిది కాదు !”

“నా ప్రతీకారం తీరేదెలా అమ్మా !” కేతువు అసహనంగా అడిగాడు.

“రాహువును ఆదర్శంగా తీసుకో !”

కేతువు తల్లి వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఔను ! ఒకరిని లోయలోకి కూలద్రోయాలంటే తను పర్వతం మీద సురక్షితంగా ఉండాలి. కేతువు తల ఆమోద సూచకంగా కిందికీ పైకీ ఆడింది.

“నీ ఆలోచన చక్కగా ఉందమ్మా ! అన్న రాహువును ఆదర్శంగా తీసుకొంటాను. ఆయన ఇంత వరకూ చంద్రుడి జోలికి వెళ్ళలేదు. నా కోసం వదిలినట్టున్నాడు. ఈ రాత్రికే చంద్రుణ్ణి కబళిస్తాను !” కేతువు ఉత్సాహంగా అన్నాడు.

దనూదేవి చిన్నగా నవ్వింది. “ఏ కార్యం చేయడానికైనా సరే , ఆవేశానికి తోడుగా ఆలోచన ఉండాలి , కేతూ ! ఇప్పుడు చంద్రుడు అరకొరగా ఉన్నాడు. త్వరలో పూర్ణచంద్రుడవుతాడు. పౌర్ణమినాటి రాత్రి అతగాడు ఆనందంతో , అహంకారంతో విర్రవీగుతాడు. పీడించబడే వ్యక్తికి ఆవేదన ఎక్కువగా కలగాలంటే , ఆనందం అధికంగా ఉన్న సమయంలో ముట్టడించి , కష్టపెట్టాలి. చంద్రుడి మీద నీ ప్రతీకారం పౌర్ణమి నాడు తీర్చుకో పుత్రా !”

“అమ్మా ! నీ మేథస్సు అద్భుతం! అలాగే చేస్తాను ! పౌర్ణమికి ఇంకా వ్యవధి ఉంది ! ఈలోగా ఆ సూర్యుడి మీద నా దృష్టి ఉన్నట్టు స్పష్టం చేస్తాను !” కేతువు నవ్వుతూ అన్నాడు.

“సూర్యుడిని కబళిస్తావా ?” దనూదేవి అడిగింది.

“అని , అనుకోకమ్మా !”

కేతువు నవ్వాడు. “భవిష్యత్తులో రాహుకేతువులు సూర్యచంద్రులతో వంతులు వేసుకుని , ఆడుకుంటారు కద !”

“వెళ్ళే ముందు , రాహువు ఆశీస్సులు తీసుకో , నాయనా !” దనూదేవి ప్రేమగా అంది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment